మాకు గొర్రె.. మీకు మేత…!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

యూనిట్‌కు ఒకటి చొప్పున ఇవ్వాలని వీడీసీ వేధింపులు
లేకపోతే పొలిమేరల్లోకి మంద రావొద్దంటూ హుకుం
అతిక్రమిస్తే రూ.2 వేల నుంచి 3వేల దాకా జరిమానా
కొన్నిచోట్ల బలవంతంగా గొర్రెను ఎత్తుకెళ్తున్న పెద్దలు 
మంత్రి ఇలాకాలో దిక్కుతోచని స్థితిలో గొల్లకుర్మలు

విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ (వీడీసీ).. గ్రామాభివృద్ధికి ఎలా తోడ్పడుతుందో తెలియదుగానీ బలహీనవర్గాలపై మాత్రం పెత్తనం కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా వీరి కన్ను గొల్లకుర్మలపై పడింది. సబ్సిడీ గొర్రెల్లో యూనిట్‌కు ఒకటి చొప్పున వీడీసీకి ఇవ్వాలని వేధింపులు పెరిగాయి. లేకుంటే గ్రామ పొలిమేరల్లోని భూముల్లో మందను తిరగనివ్వబోమని కమిటీ పెద్దలు హెచ్చరిస్తున్నారు. అతిక్రమిస్తే రూ.2వేల నుంచి రూ.3వేల వరకు జరిమానా చెల్లించాలని ఆదేశిస్తున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఈ పరిస్థితి తలెత్తడంతో గొల్లకుర్మలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. మొదటి విడత గొర్రెల పంపిణీలో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలోని ఉమ్మడి బాల్కొండ మండలానికి మొత్తం 541 యూనిట్లు మంజూరయ్యాయి. బాల్కొండ నుంచి కొత్తగా ముప్కాల్‌, మెండోరా మండలాలు ఏర్పడ్డాయి. బాల్కొండ, ముప్కాల్‌, మెండోరా వీడీసీలు.. యూనిట్‌కు ఒకటి చొప్పున గొర్రెను విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీకి ఇవ్వాలని వేధిస్తున్నాయని గొల్లకుర్మలు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామాల్లో బాల్కొండకు 65 యూనిట్లు, ముప్కాల్‌కు 42, మెండోరాకు 25 యూనిట్ల చొప్పున మంజూరయ్యాయి. మండల కేంద్రాల్లోని వీడీసీలను చూసి ఇతర గ్రామాల వారూ గొల్లకుర్మలను గొర్రెలు ఇవ్వాలని ఆదేశించడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని బాధితులు వాపోతున్నారు.

ప్రతియేటా ముట్టజెప్పాల్సిందే…
గ్రామంలో మంద తిరుగుతున్నందుకు ప్రతి గ్రామంలో యేడాదికి మూడు నుంచి నాలుగు గొర్రెలను గొల్లకుర్మలంతా కలిసి వీడీసీకి ఇస్తుంటారు. ఇటీవల సబ్సిడీపై 20 గొర్రెలు, ఒక పొట్టేలు ప్రభుత్వం ఇవ్వడంతో వాటిపైనా వీడీసీ కన్ను పడింది. యూనిట్‌కు ఒకటి చొప్పున గొర్రెనివ్వాలని గొల్లకుర్మలకు హకుం జారీ చేశారు. అయితే గొర్లు వచ్చిన కొత్తలో ఇవ్వాలని పట్టుబట్టారనీ, తర్వాత వరుస ఎన్నికలు రావడంతో అడగలేదనీ బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ, జడ్పీ ఎన్నికలన్నీ ముగియడంతో గొర్లు అడగడం మళ్లీ షురూ చేశారని వాపోతున్నారు. ఇవ్వని పక్షంలో గ్రామ శివార్లలోకి మందను రానివ్వబోమని వారిని బెదిరిస్తున్నట్టు తెలిసింది. వీడీసీ ఆదేశాన్ని అతిక్రమిస్తే రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు జరిమానా విధిస్తున్నట్టు బాధితులు తెలిపారు. కొన్నిచోట్ల బలవంతంగా వారిముందే గొర్రెను తీసుకెళ్తున్నారని సమాచారం. అయితే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ, శాసన వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలోనే వేధింపులు జరగడం చర్చనీయాంశమవుతున్నది. దీనిపై కొన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదనీ, మంత్రి స్పందించి న్యాయం చేయాలనీ గొల్లకుర్మలు కోరుతున్నారు.

(Courtacy Nava Telangana)

RELATED ARTICLES

Latest Updates