అమెరికా అల్లిన 24 అబద్దాలు – చైనా చెప్పిన 24 నిజాలు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అగ్రరాజ్యం అమెరికా. దాని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా లేదా ప్రపంచ చరిత్రలో ఒక దేశాధిపతిగా ట్రంప్‌ మాట్లాడినన్ని అబద్దాలు మరొకరు మాట్లాడి ఉండరు. ఎన్ని అబద్దాలు చెబితే అంత బలం వస్తుందన్న నమ్మకం ఉన్న వ్యక్తిగా ఇప్పటికే విశ్లేషకులు తేల్చివేశారు. నోరు తెరిచి నాలుగు అంశాలు చెబితే వాటిలో మూడు పాక్షిక లేదా పూర్తి అబద్దాలే. అలాంటి వ్యక్తి, ఆయన యంత్రాంగం కరోనా వైరస్‌ గురించి అనేక కట్టుకథలు సృష్టించటం, వాటిని మీడియా ద్వారా ప్రచారంలో పెట్టటం తెలిసిందే. అనేక మంది తాము తటస్ధులం అని చెప్పుకుంటారు. ట్రంప్‌ అబద్దాల కోరని అంగీకరిస్తారు, అదే సమయంలో ఆ నోటి నుంచి లేదా సిఐఏ ఇతర కట్టుకథల ఫ్యాక్టరీల నుంచి వెలువడే అబద్దాల ఉత్పత్తులను ఉపయోగించుకొని ఏక పక్షంగా మరో దేశం మీద దాడి చేస్తారు. వీరిలో ఒక రకం తమకు తెలియకుండానే ప్రచార సమ్మోహన అస్త్రానికి పడిపోయిన వారు, రెండవ తరగతి అన్నీ తెలిసి కూడా రాళ్లేసే రకం. గతంలో ప్రచ్చన్న యుద్దం పేరుతో సోవియట్‌ యూనియన్‌, తూర్పుఐరోపా సోషలిస్టు వ్యవస్ధలకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం గురించి తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్‌ సందర్భంగా అదే రకమైన ఏకపక్ష దాడి ప్రారంభమైంది. అమెరికా పాటపాడితే కొన్ని దేశాలు గొంతు కలుపుతున్నాయి, మరికొన్ని పక్కవాద్యాలు వాయిస్తున్నాయి.

తెలుగు మీడియా ఇచ్చే అంతర్జాతీయ వార్తలన్నీ అమెరికా, ఐరోపా దేశాల అదుపులో ఉండే వార్తా సంస్ధల నుంచి తీసుకుంటున్నవే. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి రాసేవారు, చూపే వారు పోటీపడుతున్నారు. ఎంత సంచలనాత్మకంగా ఉంటే అంతకిక్కు, అంత రేటింగ్‌ ఉంటుంది మరి. దిగువ అంశాలు చైనా వార్తా సంస్ధ గ్జిన్హువా విడుదల చేసిన సమాచారం ఆధారంగా రాస్తున్నవే. నిడివి పెద్దది కాకుండా చూడటం కోసం సంక్షిప్తీకరించి ఇస్తున్నాను. దీనిలో 24 అంశాలపై తమ మీద వేస్తున్న అభాండాలు, చేస్తున్న అబద్ద ప్రచారం ఏమిటో చెబుతూనే దానికి సమాధానాలు ఇచ్చారు. అయినా దీన్ని ఏకపక్ష ప్రచారం అని ఎవరైనా అనుకుంటే అది వారి విజ్ఞతకే వదలి వేద్దాం. చైనా తాను చెప్పిన సమాధానాలకు, వివరణలకు, విమర్శలకు ఆధారాలతో సహా ఇచ్చింది. పాఠకుల సౌకర్యం, విశ్వసించని వారి నిర్ధారణ కోసం ఆ లింక్‌ను కూడా దిగువ ఇస్తున్నాను.

ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలియనంత కాలం జనం మోసపోతూనే ఉంటారని సోవియట్ అధినేత వి.ఐ. లెనిన్‌ చెప్పారు. ఆయన పుట్టక ముందే అమెరికా అధ్యక్షుడిగా పని చేస్తూ హత్యకు గురైన అబ్రహాం లింకన్‌ మరో విధంగా చెప్పారు. ఎవరైనా జనం మొత్తాన్ని కొంతకాలం, కొంత మందిని కొంతకాలమే వెర్రి వెంగళప్పలను చేయగలరు గానీ అందరినీ, ఎల్లవేళలా చేయలేరు అన్నారు. వెలుగు వచ్చేకొద్దీ చీకటి పారిపోతుంది, అబద్దాలు కూడా కూడా నిజం రానంతవరకే అది పెత్తనం చేస్తాయని పెద్దలు ఏనాడో చెప్పారు. ఇక ఆరోపణలు, వాటి మీద చైనా వార్తా సంస్ధ సమాధానాల సారాంశం చూద్దాం.

1.ఆరోపణ: కోవిడ్‌-19 అనేది చైనా లేదా ఊహాన్‌ వైరస్‌.
వాస్తవం : ఒక వ్యాధి పేరులో ప్రతికూల ప్రభావం చూపే అంటే అనవసరమైన భయాలు కలిగించే విధంగా ఒక ప్రాంతం, దేశం, ఆహారం, సంస్కృతి, జనాభా, పరిశ్రమ, వృత్తి లేదా జంతుజాతి పేరు ఉండకూడదని 2015 మే ఎనిమిదవ తేదీ ఐక్యరాజ్యసమితి సంస్ధలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. అంతకు ముందే కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ 2012లో తలెత్తిన ”మెర్స్‌” మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) పేరు మీద తలెత్తిన పరిస్ధితిని సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణ్యంగానే 2020 ఫిబ్రవరి 11న నోవెల్‌ కరోనా వైరస్‌ కారణంగా తలెత్తే న్యూమోనియా వ్యాధికి కరోనా వైరస్‌ డిసీజ్‌ 2019(కోవిడ్‌-19) అని పేరు పెట్టారు. అయితే బ్రిటీష్‌ సైన్స్‌ పత్రిక ఏప్రిల్‌ నెలలో ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించి రాసిన సంపాదకీయాలలో కోవిడ్‌-19ను చైనా మరియు ఊహాన్‌తో జతచేసి ప్రస్తావించి తదుపరి క్షమాపణ చెప్పింది. బిబిసి, న్యూయార్క్‌ టైమ్స్‌, అమెరికన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ(ఏబిసి) వంటివి ఆసియా వాసులతో సంబంధాన్ని అంటగట్టి వార్తలను ప్రచారం, ప్రసారం చేయటంతో పశ్చిమ దేశాలలో ఆసియా వ్యతిరేకత, జాత్యంహాకార ధోరణులతో ఆసియా ఖండ పౌరులను వేధించిన ఉదంతాలు జరిగాయి.

2. ఆరోపణ: వైరస్‌ ఊహాన్‌లోనే పుట్టింది.
వాస్తవం : వైరస్‌ తొలిసారి ఊహాన్‌లో బయటపడినంత మాత్రాన అది అక్కడే పుట్టిందని అర్ధం కాదు, శాస్త్రవేత్తలు దాన్ని ఇంకా గుర్తించలేదు. ఉదాహరణకు ఎయిడ్స్‌ వ్యాధిని తొలుత అమెరికాలో గుర్తించారు. అది అక్కడ పుట్టింది కాకపోవచ్చు. అలాగే స్పానిష్‌ ఫ్లూ స్పెయిన్‌లో పుట్టలేదు అనేందుకు అనేక ఆధారాలు దొరికాయి. ఎక్కడ నుంచి తలెత్తిందన్నది శాస్త్ర అంశం. జనవరి 24న బ్రిటీష్‌ వైద్య పత్రిక లాన్‌సెట్‌లో ప్రచురితమైన విశ్లేషణలో డిసెంబరు 16 నుంచి జనవరి రెండవ తేదీ వరకు ఊహాన్‌ నగరంలో నిర్ధారణ అయిన 41కరోనా కేసులలో 27 మందికి ఊహాన్‌ సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో సోకినట్లు తేలింది, మిగిలిన వారికి వేరే ప్రాంతాలలో సోకింది. తొలి రోగిని డిసెంబరు ఒకటవ తేదీన గుర్తించారు. అతనికీ మార్కెట్‌కు ఎలాంటి సంబంధం లేదు, కుటుంబ సభ్యులకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తలేదు. అతని నుంచి ఇతరులకు వ్యాపించిందనే ఆధారాలు దొరకలేదు. వైరస్‌ ఎక్కడ ఉద్బవించింది అనే అంశంలో అమెరికా నుంచి తమ సంస్ధకు ఎలాంటి సమాచారం లేదా నిర్ధిష్ట రుజువులు అందలేదని మే ఒకటవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ అత్యవసర కార్యక్రమాల డైరెక్టర్‌ డాక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ చెప్పారు. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని బెలెవిలే మేయర్‌ మైఖేల్‌ మెల్‌హామ్‌ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఇదే వైరస్‌తోనే తాను 2019నవంబరులో కూడా అస్వస్తతకు గురై ఉండవచ్చని చెప్పారు. అంటే అది అమెరికాలో బయటపడిన తొలి కేసు జనవరి 20కి రెండునెలల ముందునాటి సంగతి. మే ఆరవ తేదీన యుఎస్‌ఏ టుడే వెల్లడించిన సమాచారం ప్రకారం ఫ్లోరిడాలో జనవరి ప్రారంభంలోనే 171 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి, అయితే వారెవరూ చైనాకు ప్రయణించిన వారు కాదు.

మే మూడవ తేదీన యాంటీమైక్రోబియల్‌ ఏజంట్స్‌ అనే అంతర్జాతీయ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో 2019 డిసెంబరు చివరి నుంచే సారస్‌-కోవ్‌-2 వైరస్‌ ఫ్రాన్స్‌లో వ్యాప్తి చెందినట్లు పేర్కొన్నారు. డిసెంబరు రెండు నుంచి జనవరి 16వరకు ఫ్లూ లక్షణాలతో ఐసియులో చికిత్స పొందిన 14 మందికి ఏప్రిల్‌ ఆరు-తొమ్మిదవ తేదీల మధ్య ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్ష చేశారు.వారిలో 42ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ బయటపడింది. అయితే అతనేమీ ఇటీవలి కాలంలో చైనా లేదా మరో విదేశీ ప్రయాణం చేయలేదు.

3. ఆరోపణ: వైరస్‌ను ఊహాన్‌ వైరాలజీ సంస్ధలో తయారు చేశారు
వాస్తవం : అందుబాటులో ఉన్న రుజువులన్నీ సహజంగానే పుట్టినట్లు చూపుతున్నాయి. కృత్రిమంగా తయారు చేసింది కాదు. జనవరి 30వ తేదీ లాన్‌సెట్‌ వైద్య పత్రిక వ్యాసం ప్రకారం మిగతా వైరస్‌లతో పోల్చితే గుడ్లగూబల నుంచే వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీన ఎనిమిది దేశాలకు చెందిన 27 మంది ప్రముఖ నిపుణులు చేసిన ప్రకటనలో కరోనా వైరస్‌ మిగతా వాటి మాదిరే వన్య ప్రాణుల నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. మార్చి 17న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలకు చెందిన ఐదుగురు ప్రముఖ నిపుణులు వైరస్‌ను ప్రయోగశాలలో తయారు చేయలేదని, పని గట్టుకొని వ్యాపింప చేయలేదని తెలిపారు. మార్చి 26న అమెరికా జాతీయ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ కోలిన్స్‌ రాసిన వ్యాసంలో సహజంగానే కరోనా వైరస్‌ పుట్టిందని, ఎవరూ తయారు చేయలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 21న ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రతినిధి ఫడేలా చాయిబ్‌ మాట్లాడుతూ వైరస్‌ జంతువుల నుంచే వచ్చిందని అయితేగబ్బిలాల నుంచి మానవులకు ఎలా వచ్చిందన్నది ఇప్పటికీ అంతుబట్టలేదన్నారు. ఏప్రిల్‌ 30న అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్‌ కార్యాలయం తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన ప్రకారం కరోనా వైరస్‌ కృత్రిమంగా తయారు చేసింది లేదా జన్యుమార్పిడి చేసింది కాదనే శాస్త్రవేత్తల అభిప్రాయంతో గూఢచార సమాజం ఏకీభవిస్తున్నదని పేర్కొన్నారు. మే ఒకటవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ అత్యవసర కార్యక్రమ డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ మాట్లాడుతూ వైరస్‌ జన్యుక్రమం గురించి అనేక మంది శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం సహజంగా ఉద్భవించిందే అన్నారు. మే ఐదవ తేదీన అదే సంస్ధ ప్రతినిధి డాక్టర్‌ గువ్‌డెన్‌ గాలెయా కూడా అదే చెప్పారు. ఫ్రెంచి పత్రి వాలెర్‌ యాక్ట్యువల్‌ తమ దేశ గూఢచార వర్గాలను ఉటంకిస్తూ వైరస్‌ ఊహాన్‌లోని పి4లాబ్‌ నుంచి వెలువడలేదని పేర్కొన్నది.

4 ఆరోపణ : ఊహాన్‌ వైరాలజీ సంస్ధ నుంచి ప్రమాదవశాత్తూ వైరస్‌ లీకైంది.
వాస్తవం : ఊహాన్‌ నేషనల్‌ బయోసేఫ్టీ లాబరేటరీ(పి4) చైనా-ఫ్రెంచి ప్రభుత్వాల సహకారం కింద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైంది. దీనిలో పనిచేసే తొలి బృందం సిబ్బందికి ఫ్రాన్స్‌, అమెరికాలోనే శిక్షణ ఇచ్చారు. ఇక్కడి సౌకర్యాలు, పరికరాలను మూడవ పక్షం ప్రతిఏటా తనిఖీ చేస్తుంది. తనిఖీలో అన్నీ సక్రమంగా ఉన్నట్లు నిర్ధారితమైన తరువాతే పని చేయటాన్ని అనుమతిస్తారు. ఆ లాబ్‌కు కృత్రిమ వైరస్‌ తయారు చేసే సామర్ధ్యం లేదు, వైరస్‌ లీకై సిబ్బందికి సోకిన రుజువులేదు. ఈ లాబ్‌ కార్యకలాపాల గురించి, కరోనా వైరస్‌ గురించి తెలుసుకొనేందుకు యావత్‌ ప్రపంచం నుంచి ఆరులక్షల మంది వెబ్‌సైట్‌ను దర్శించగా 2.1కోట్ల డౌన్లోడ్‌లు నమోదయ్యాయి. ఎలర్జీ మరియు అంటువ్యాధుల అమెరికా జాతీయ సంస్ధ డైరెక్టర్‌ ఆంథోనీ ఫౌసీ మే4న మాట్లాడుతూ చైనా లాబ్‌లో వైరస్‌ తయారు కాలేదని, ప్రకృతిలోనే పుట్టి జంతువుల్లోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని అన్నారు. జంతువుల నుంచి సోకిన వైరస్‌ను లాబ్‌కు తెచ్చినపుడు ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి లీకైందన్న కథనాన్ని తాను నమ్మటం లేదన్నారు. వైరస్‌ కృత్రిమ సృష్టి అని ఎలాంటి రుజువులు లేవని బ్రిటీష్‌ ఆరోగ్య మంత్రి మాట్‌ హనాక్‌ అక్కడి పత్రిక ఇండిపెండెంట్‌ ఇంటర్వ్యూలో చెప్పారు.

5. ఆరోపణ: ఊహాన్‌లో వైరస్‌ను అరికట్టిన చైనా తమ జాతీయులను మిలన్‌, న్యూయార్క్‌ ఇతర నగరాల్లో వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు పంపింది.
వాస్తవం : స్వల్ప వ్యవధిలోనే చైనా కఠిన చర్యలు తీసుకుంది. చైనా నుంచి బయటకు చాలా తక్కువగా వ్యాప్తి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనవరి 23 నుంచి ఏప్రిల్‌ ఎనిమిది వరకు ఊహాన్‌ నగరం లాక్‌డౌన్‌లో ఉంది. ఈ సమయంలో నగర వాసులు బయటకు వెళ్లలేదు. జనవరి 23న అమెరికాలో ఒక కేసు నమోదైంది. ఫిబ్రవరి రెండున అమెరికా తన సరిహద్దులను మూసివేసింది. అంతకు ముందు కేవలం ఎనిమిది కేసులు మాత్రమే అమెరికాలో నమోదయ్యాయి. మార్చి 13న అమెరికా జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది. ఆరోజుకు 1,896 కేసులు నిర్ధారణ అయ్యాయి. చైనాలో లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన ఏప్రిల్‌ 8వ తేదీనాటికి అమెరికాలో కేసులు నాలుగు లక్షలకు పెరిగాయి. ఒకటి నుంచి పది లక్షలకు పెరగటానికి అమెరికాలో వందరోజుల కంటే తక్కువే పట్టింది. తమ రాష్ట్రానికి చైనా నుంచి వైరస్‌ రాలేదని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిడీ పరిశోధన వెల్లడించినట్లు న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కుమో చెప్పారు. న్యూయార్క్‌ కరోనా వైరస్‌ ఆసియా నుంచి వచ్చింది కాదని అమెరికా పరిశోధనను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తను ప్రచురించింది. తమ దేశానికి అమెరికా సందర్శకులు వైరస్‌ను తీసుకు వచ్చినట్లు కెనడా సమాచారం వెల్లడించింది. గుర్తు తెలియని వనరు నుంచి ఫ్రాన్స్‌లో స్ధానికంగానే వైరస్‌ వ్యాపించిందని, చైనా, రష్యాల నుంచి రాలేదని ఫ్రెంచి పరిశోధనా సంస్ధ పాస్టర్‌ వెల్లడించింది.

6.ఆరోపణ: చైనీయులు గబ్బిలాలను తింటూ వైరస్‌ను వ్యాపింప చేశారు.
వాస్తవం : చైనీయుల ఆహారంలో ఎన్నడూ గబ్బిలాలు లేవు. ఒక చైనా మహిళ గుడ్ల గూబ చారు తాగుతున్నట్లు చూపే వీడియో ఇంటర్నెట్‌లో తిరుగుతోంది. ఒక చిన్న పసిఫిక్‌ దీవిలో విహార యాత్రల ప్రచారంలో భాగంగా ఆమె బృందం తీసిన వీడియో అది, దాన్ని 2016లోనే ఆన్‌లైన్‌లోనే పోస్టు చేశారు. గబ్బిలాల చారు అక్కడి ప్రత్యేకత.

7. ఆరోపణ: చైనా వన్య ప్రాణుల మార్కెట్లను తెరిచింది.
వాస్తవం : చైనాలో వన్య ప్రాణుల మార్కెట్లనేవి లేవు. వాటిని వేటాడటం, అమ్మకాలను చైనా నిషేధించింది. కోళ్లు, చేపల వంటి సముద్ర ఉత్పత్తులను మాత్రమే ప్రాణాలతో విక్రయించే మార్కెట్లు ఉన్నాయి. ఇలాంటివి ఒక్క చైనాలోనే కాదు అనేక దేశాలలో ఉన్నాయి. అలాంటి అమ్మకాలను నిషేధించే అంతర్జాతీయ చట్టాలు లేవు. రైతు బజార్లనే ఊహాన్‌లో తెరిచారు. ఊహాన్‌, హుబెరు, హునాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్లు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయి.

8. ఆరోపణ: వైరస్‌ వ్యాప్తి గురించి తొలి రోజుల్లో దాచి పెట్టింది, వెల్లడించటం ఆలస్యం చేసింది. దాంతో వ్యాప్తి పెరిగింది.
వాస్తవం : ఆకస్మికంగా గుర్తు తెలియని వైరస్‌ దాడి జరిగినపుడు అవగాహన, అధ్యయనం చేసేందుకు సమయం పడుతుంది. డిసెంబరు 27న న్యూమోనియాతో రోగులు ఉన్నట్లు గుర్తించారు. అదే రోజు వెల్లడించారు. మూడు రోజుల తరువాత కారణం తెలియని న్యూమోనియా గురించి ప్రకటించారు.డిసెంబరు 31న దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలిపారు. జనవరి మూడు నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు, అమెరికా ఇతర దేశాలకు క్రమం తప్పకుండా సమాచారాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి మూడు వరకు 30సార్లు అమెరికాకు సమాచారం తెలియచేశారు. జనవరి ఏడవ తేదీ నాటికి జన్యుక్రమాన్ని గుర్తించారు. పదకొండవ తేదీన ఆ సమాచారాన్ని ఇతర దేశాలకు అందచేశారు. వెంటనే నివారణ కిట్ల తయారీకి ఉపక్రమించారు. ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో సమాచారాన్ని వెల్లడిస్తున్నారు. చైనాలో వైరస్‌ గురించి ప్రకటన చేసిన 70రోజుల తరువాత అమెరికా అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది

9.వైరస్‌ వ్యాప్తిని గోప్యంగా ఉంచిందని బయట పెట్టిన డాక్టర్‌ లీ వెనలియాంగ్‌ను అరెస్టు చేశారు.
వాస్తవం : వెనలియాంగ్‌ స్వంత సంస్ధ అక్రమాలను బయట పెట్టే వ్యక్తి కాదు, అతన్ని అరెస్టు చేయలేదు. అంటు వ్యా ధులను నిర్ధారించటానికి కఠినమైన నిబంధనలు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఇది సాధారణ అంశం. అంటువ్యాధుల నిర్ధారణ గురించి వెల్లడించటానికి ఒక చట్టం, పద్దతులు ఉన్నాయి. డాక్టర్‌ ఝాంగ్‌ జిక్సియాన్‌ ఒక శ్వాసనిపుణుడు, కోవిడ్‌-19 గురించి తొలిసారి నివేదించాడు, అతనికి అవార్డును ఇచ్చారు. జిక్సియాంగ్‌ నివేదించిన మూడు రోజుల తరువాత డిసెంబరు 30న, అధికారికంగా విడుదల చేయటానికి ఒక రోజు ముందు డాక్టర్‌ లీ వెనలియాంగ్‌ అనే కంటి వైద్యుడు తన సహచరులకు ఉరు ఛాట్‌ గ్రూప్‌లో ఏడు నిర్ధారితమైన సారస్‌ కేసులు ఉన్నాయని, అయితే ఈ విషయాన్ని ప్రచారం చేయవద్దని పోస్టు పెట్టాడు. అయితే అది ఇంటర్నెట్‌లో బయటకు వచ్చి భయాన్ని కలిగించింది. జనవరి మూడవ తేదీన ఊహాన్‌ పోలీసులు అతన్ని స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపి నిర్ధారణ కాని సమాచారాన్ని వెల్లడించకూడదని, ప్రచారాన్ని ఆపాలని చెప్పి అధికారయుతంగా మందలిస్తూ ఒక లేఖను ఇచ్చి పంపారు. తరువాత అతనికి వైరస్‌ సోకింది, జనవరి 31న నిర్ధారణ అయింది. ఫిబ్రవరి ఏడవ తేదీన అతను మరణించాడు. అతనికి సంబంధించిన అంశాల మీద దర్యాప్తు జరపాలని ఒక బృందాన్ని నియమించారు. మార్చి 19న దర్యాప్తు నివేదికను వెల్లడించారు.అతని విషయంలో చట్టపరమైన అంశాలను తప్పుగా అన్వయించారని, మందలింపు లేఖను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. డాక్టర్‌ లీ మంచి వైద్యుడు, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు, ప్రభుత్వ వ్యతిరేకి కాదు, మార్చి ఐదున కరోనా వ్యతిరేక పోరులో మరణించిన ఆదర్శ జాతీయ ఆరోగ్య కార్యకర్తగా లీని ప్రకటించి ఒక అమర జీవిగా ఏప్రిల్‌ రెండున గౌరవించారు. ప్రభుత్వ వ్యతిరేకిగా లీని చిత్రించటం అతన్ని, అతని కుటుంబాన్ని అగౌరవ పరచటమే.

10 .మనుషుల నుంచి మనుషులకు వైరస్‌ వ్యాపిస్తుందని వెల్లడించటంలో చైనా చాలా ఆలస్యం చేసింది. దాంతో తగిన సమాచారం లేక అమెరికా, ఇతర దేశాలు వెంటనే స్పందించటంలో విఫలమయ్యాయి.
వాస్తవం : చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి వర్తమానాలు సకాలంలోనే గట్టిగానే వెళ్లాయి, అమెరికాకు తొలి నుంచీ అన్నీ తెలుసు. ఒక కొత్త వైరస్‌ ఒక మనిషి నుంచి మరొక మనిషికి సోకుతుందా లేదా అని తెలుసుకొనేందుకు కఠినమైన శాస్త్రీయ క్రమం ఉంటుంది. జనవరి తొమ్మిదిన నోవెల్‌ కరోనా వైరస్‌ అని చైనా నిపుణులు ప్రకటించారు. ఇరవయ్యవ తేదీన ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతుందని నిర్ధారించారు. అప్పటికి అమెరికాలో నిర్దారిత కేసులు లేవు. ఇరవై మూడవ తేదీన కోటీ 20లక్షల మంది జనాభా ఉన్న ఊహాన్‌ నగరాన్ని లాక్‌డౌన్‌ చేసి ప్రపంచానికి గట్టి హెచ్చరికను పంపింది. ఆరోజుకు అమెరికాలో ఒకే ఒక్క కేసు నమోదైంది.అంతకు ముందు రోజు ప్రపంచ ఆరోగ్య సంస్ధ మానవుల్లో వ్యాప్తి గురించి వెల్లడించింది, 27వ తేదీ ప్రమాద తీవ్రతను పెంచింది, 30వ తేదీన మహమ్మారిగా మారినట్లు వెల్లడించింది. ఊహాన్‌లోని తన రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కు పిలిపించి, జనవరి 25వ తేదీ నుంచి కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన తొలి దేశం అమెరికా. ఫిబ్రవరి రెండున తన సరిహద్దులను మూసివేస్తూ చైనా పౌరులు అంతకు ముందు 14రోజులు చైనాలో ఉన్న ఇతర దేశీయులకు ప్రవేశం లేదని నిషేధించింది. ఆరోజున అమెరికాలో కేవలం ఎనిమిది కేసులే ఉన్నాయి. మార్చి తొలి వారం వరకు అమెరికా తీవ్ర సమస్యగా పరిగణించలేదు. అమెరికా సమస్యలకు చైనా కారణమని చెప్పటం పెద్ద అబద్దం అని అమెరికా ప్రముఖ ఆర్ధికవేత్త జెఫ్రీ సాచ్స్‌ పేర్కొన్నారు. తాము డిసెంబరులోనే ప్రపంచ ఆరోగ్య సంస్ధను హెచ్చరించామని చైనా రాష్ట్రమైన తైవాన్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే డిసెంబరు 31న తమకు తైవాన్‌ నుంచి వచ్చిన ఇమెయిల్‌లో ప్రత్యేక లక్షణాలు గల న్యూమోనియా కేసుల గురించి వచ్చిన వార్తలను ఉటంకిస్తూ తమకు దాని గురించి మరింత సమాచారం కావాలని అడిగారు తప్ప దానిలో హెచ్చరికలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ద వివరణ ఇచ్చింది.

11 .ఆరోపణ: చైనాలో కేసులు, మరణాల గురించి వాస్తవాలు చెప్పటం లేదు, ప్రకటించిన దాని కంటే 50రెట్లు ఎక్కువ.
వాస్తవం : కరోనా సమాచారం విషయంలో చైనా పారదర్శకంగా ఉంది. జనవరి 21 నుంచి ప్రతి రోజూ అధికారికంగా సమాచారాన్ని వెల్లడించింది.జాతీయ, ప్రాంతీయ స్ధాయిలో మూడువేలకు పైగా పత్రికా గోష్టులు నిర్వహించారు. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకున్నకారణంగానే కేసులు, మరణాలు తగ్గాయి. వ్యాధి గ్రస్తులను ఇతరుల నుంచి పూర్తిగా వేరుచేశారు. ఈ చర్యల కారణంగా ఏడు లక్షల కేసులను నివారించినట్లు సైన్సు పత్రిక అంచనా వేసింది.

12 .ఆరోపణ: ఊహాన్‌లో వైరస్‌ కేసుల సంఖ్యను తరువాత సవరించటం కేసులను తొక్కిపెట్టారన్నదానికి నిదర్శనం.
వాస్తవం : సమాచార సమీక్ష, సవరణ అంతర్జాతీయంగా సాధారణంగా జరిగేదే. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి. ఒక్కసారిగా ఆసుపత్రులు రోగులతో నిండిపోవటంతో అనేక మంది ఆసుపత్రులకు రాకుండానే ఇండ్ల దగ్గరే మరణించారు. ఆసుపత్రులన్నీ నిండిపోవటంతో ఆరోగ్య కార్యకర్తలు కేసులన్నీ నమోదు చేయలేని స్ధితి ఏర్పడింది లేదా ఆలస్యం అయింది. తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ప్రయివేటు ఆసుపత్రులు, సంచార వైద్యశాలలు, కొన్ని సంస్ధలలో చికిత్స పొందిన వారు, మరణించిన వారిని జాబితాలకు అందచేయలేదు. కొన్ని కేసులు ఒకటికి రెండుసార్లు నమోదు కావటం, కొన్ని అసంపూర్ణంగా ఉండటం వంటి కారణాల వలన సమాచారాన్ని సరి చేసి సవరించారు. ఇది అంతర్జాతీయంగా జరుగున్నదే. ఉదాహరణకు బ్రిటన్‌లో ఆసుపత్రుల వెలుపల మరణించిన వారిని లెక్కించలేదు, తరువాత దాన్ని సరిచేశారు. స్పెయిన్‌ ప్రభుత్వం కూడా తమ సమాచారాన్ని సవరిస్తామని ప్రకటించింది.

13. ఆరోపణ: కరోనా వైరస్‌ గురించి చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేస్తోంది.
వాస్తవం : తప్పుడు సమాచార బాధితురాలు చైనా. అమెరికా రాజకీయవేత్తలు, పండితులు, మీడియా చైనా వ్యతిరేక ప్రచారం చేస్తోంది.

14 .ఆరోపణ: చైనా రాజకీయ వ్యవస్ధ సమస్యలకు మూలం.
వాస్తవం : సామాజిక వ్యవస్ధ లేదా భావజాలానికి వైరస్‌కు సంబంధం లేదు. వైరస్‌ను అరికట్టటంలో చైనా పౌరులు విజయం సాధించారు. నూటనలభై కోట్ల మందిని ఐక్యపరచటంలో రాజకీయ వ్యవస్ధ విజయం సాధించింది. ఒక అభివృద్ది చెందుతున్న దేశంగా చైనా సమస్యలను అధిగమించాల్సి ఉంది. వెయ్యి పడకల ఆసుపత్రిని పది రోజుల్లో, 1600 పడకల ఆసుపత్రిని 15 రోజుల్లో నిర్మించేందుకు చైనా రాజకీయ వ్యవస్ద పెద్ద ఎత్తున మానవ, వస్తుసామగ్రిని సమీకరించగలిగింది. రోజు లేదా ఒకటిన్నర రోజుల వ్యవధిలో 13వేల మంది రోగులను చేర్చేందుకు వీలుగా మరో 16 సంచార వైద్యశాలలను ఏర్పాటు చేసింది. వైరస్‌ నుంచి జనాన్ని రక్షించేందుకు గాను 13,800 గృహ సముదాయాలకు ఊహాన్‌ నగరంలో 44,500 మంది స్ధానిక పార్టీ కార్యకర్తలను సమీకరించి, భౌతిక దూరం పాటింపు, తదితర చర్యలను గట్టిగా అమలు జరిపింది. సింగపూర్‌లోని బ్లాక్‌బాక్స్‌ పరిశోధనా సంస్ద జరిపిన సర్వేలో 23దేశాల్లో తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించగా చైనాకు నూటికి 85మార్కులు వచ్చి అగ్రస్ధానంలో నిలిచింది. సంక్షోభం నుంచి దేశం బయటపడగలదని 85శాతం మంది చైనీయులు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అదే అమెరికాలో 11, ఐరోపా యూనియన్‌లో 15,భారత్‌లో పదిశాతం మాత్రమే ఉన్నారు.

15. ఆరోపణ : నిజాలను బయట పెట్టకుండా అమెరికా విలేకర్లను చైనా నుంచి బహిష్కరించారు.
వాస్తవం : చాలా కాలంగా అమెరికా తీసుకుంటున్న చర్యలకు ప్రతిచర్య తప్ప మరొకటి కాదు. ఇటీవలి కాలంలో అమెరికా పరోక్ష చర్యల ద్వారా మీడియా సిబ్బందిని పరిమితం చేసి 60 మంది చైనా జర్నలిస్టులను బహిష్కరించింది. వీసాల విషయంలో కూడా అమెరికా అనుచితంగా వ్యవహరిస్తోంది.

16. ఆరోపణ: ప్రపంచ ఆరోగ్య సంస్దకు చైనా లంచాలు ఇచ్చి అదుపు చేస్తోంది.
వాస్తవం : చైనా ఎన్నడూ ఆ సంస్ధను అదుపు చేసేందుకు ప్రయత్నించలేదు.సంస్ధలో 194 దేశాలకు సభ్యత్వం ఉండగా ప్రధాన కార్యాలయంలో పని చేసే 21 మంది నాయకత్వ బృందంలో 11 మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌కు చెందిన వారే కాగా చైనా నుంచి ఒకే ఒక్కరు ఉన్నారు. వారందరూ నిపుణులే. 2018,19 సంవత్సరాలలో అమెరికా, జపాన్‌ తరువాతనే చైనా అతి పెద్ద దాతగా ఉంది. సభ్యత్వం, విరాళాన్ని పరిగణనలోకి తీసుకుంటే చైనా తొమ్మిదవ స్దానంలో ఉంది.చైనా వాణిజ్య సంస్ధలు, ప్రభుత్వేతర సంస్ధలు ఇచ్చిన మొత్తాలను మినహాయిస్తే చైనా స్ధానం ఇంకా దిగజారుతుంది.

17. ఆరోపణ: మనుషల నుంచి మనుషులకు సోకుతుందని డిసెంబరు 31వ తేదీనే తైవాన్‌ సమాచారమిచ్చినా ప్రపంచ ఆరోగ్య సంస్ద తీవ్రంగా పరిగణించలేదు.
వాస్తవం : తైవాన్‌ రాష్ట్రం ఆరోగ్య సంస్దకు ఎలాంటి హెచ్చరికను పంపలేదు.వ్యాధి గురించి ఊహాన్‌ మున్సిపల్‌ అధికారులు వెల్లడించిన తరువాత అదనపు సమాచారం కావాలని ఆరోగ్య సంస్దను తైవాన్‌ కోరింది. అదే విధంగా చైనా జాతీయారోగ్య సంస్ధకూ లేఖ రాసింది.తైవాన్‌తో ఆరోగ్యం, వైద్యానికి సంబంధించి ఉన్న ఒప్పందం మేరకు వెంటనే సమచారాన్ని పంపారు. అదే రోజు తైవాన్‌ ఆరోగ్య సంస్ధకు ఇమెయిల్‌ పంపింది.

18. ఆరోపణ: ప్రపంచ ఆరోగ్య సంస్ధలో చేరేందుకు తైవాన్‌ ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంది. తద్వారా అక్కడి పౌరుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చింది.
వాస్తవం : చైనాలో అంతర్భాగమైన తైవాన్‌కు ఆరోగ్య సంస్దలో చేరేందుకు హక్కు లేదు. సర్వసత్తాక దేశాలకు మాత్రమే దానిలో చేరే హక్కు ఉంది. సాంకేతిక సహకారం వాటి మధ్య నిరాఘాటంగా కొనసాగుతోంది. తైవాన్‌ నిపుణులు అనేక సమావేశాలకు హాజరయ్యారు. తైవాన్‌ నుంచి ఊహాన్‌కు సైతం నిపుణులు వచ్చారు.

19. ఆరోపణ: ప్రపంచ వ్యాపితంగా వైరస్‌ వ్యాపించటానికి చైనాయే కారణం కనుక, ఆ విషయాలపై దర్యాప్తు జరపాలి, పరిహారం చెల్లించాలి.
వాస్తవం : చైనాయే బాధ్యురాలని, పరిహారం కోరేందుకు చట్టపరంగా ఎలాంటి అవకాశాలు లేవు. స్ధానిక రాజకీయ అజెండా కారణంగా అమెరికా రాజకీయవేత్తలు చైనా మీద నెపం వేస్తున్నారు. చైనా కూడా బాధిత దేశమే. ఒక చోట తొలుత వెల్లడైనంత మాత్రాన ఆ దేశం నష్టపరిహారం చెల్లించాలని ఎక్కడా లేదు.1980దశకంలో ఎయిడ్స్‌ తొలుత అమెరికాలో బయటపడింది, అప్పటి నుంచి పరిహారం చెల్లించాలని దాన్ని ఎవరూ అడగలేదు. ప్రజారోగ్యం గురించి అమెరికాతో చైనాకు ఎలాంటి ఒప్పందమూ లేదు.

20. ఆరోపణ: వైరస్‌ నుంచి లబ్దిపొందేందుకు వైద్య సరఫరాలను చైనా దాచిపెట్టింది. అమెరికాలో వెంటిలేటర్ల వంటి వాటికి కొరత ఏర్పడటానికి ఇదే కారణం.
వాస్తవం : దేశీయంగా వైరస్‌ను ఎదుర్కొంటూనే ఇతర దేశాలకు సాయపడేందుకు చైనా తన శక్తికొద్దీ ప్రయత్నించింది. ఇప్పటికి 150దేశాలకు వైద్య సరఫరాలు చేసింది. మార్చి ఒకటి నుంచి ఏప్రిల్‌ 30వరకు 71.2బిలియన్ల వైద్య పరికరాలను ప్రపంచ దేశాలకు సరఫరా చేసింది. మార్చి ఒకటి మే అయిదవ తేదీల మధ్య అమెరికాకు చైనా నుంచి 6.6బిలియన్ల ముఖతొడుగులు,344 మిలియన్‌ జతల సర్జికల్‌ తొడుగులు, 44.09 మిలియన్ల రక్షణ సూట్లు, 6.75 మిలియన్ల కళ్లద్దాలు, ఏడున్నర వేల వెంటిలేటర్లను సరఫరా చేశారు. ఇవిగాక అమెరికాలోని 30 రాష్ట్రాలు, 55 నగరాలకు అనేక లక్షల కిట్లు, తొడుగులు మొదలైన వాటిని విరాళంగా పంపారు.

21. ఆరోపణ: ఇతర దేశాలకు మహమ్మారి వ్యతిరేక సాయంలో కూడా చైనా రాజకీయ, ప్రచార కండూతితో వ్యవహరించింది.
వాస్తవం : వైరస్‌ను ఎదుర్కోవటంలో ఇతర దేశాలు చైనాకు చేసిన సాయానికి ప్రతిగానే చైనా కూడా సాయం చేసింది. చైనా నిపుణులు 120 వీడియో కాన్ఫరెన్సుద్వారా 160దేశాల వారితో అనుభవాలను పంచుకున్నారు. పందొమ్మిది దేశాలకు 21 చైనా బృందాలు వెళ్లాయి.

22. ఆరోపణ: డోనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి ఎన్నిక అవకుండా అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంటోంది.
వాస్తవం : చైనా ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనే సూత్రానికి కట్టుబడి ఉంది. అమెరికాలోని కొందరు రాజకీయవేత్తలే అక్కడి ఎన్నికల్లో చైనా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చైనా మీద దాడిని ఎక్కుపెట్టాలని రిపబ్లికన్‌ పార్టీ సెనెటోరియల్‌ కమిటీ 57పేజీల పత్రాన్ని ప్రచార విభాగానికి అందచేసినట్లు పొలిటికో పత్రిక వెల్లడించింది. కరోనా వైరస్‌కు చైనాయే కారణమని, దాన్ని దాచిపెట్టిందని, డెమోక్రాట్లు చైనా పట్ల సానుకూలంగా ఉన్నారని, తాము ఎన్నికైన తరువాత వైరస్‌ను వ్యాప్తి చేసినందుకు చైనా మీద ఆంక్షలు విధిస్తామని ప్రచారం చేయాలని దానిలో పేర్కొన్నారు.

23. ఆరోపణ : కిట్స్‌, మాస్కులు, వెంటిలేటర్ల ఎగుమతుల గురించి ఎగుమతిదారులు కస్టమ్స్‌ వివరాలు వెల్లడించాలని చైనా కోరింది, ఎగుమతులపై నిషేధం విధించేందుకు అలా చేశారు.
వాస్తవం : నాణ్యతా ప్రమాణాల మెరుగుదల కోసమే ఆ సమాచారాన్ని అడిగారు. ఈ చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. నాణ్యత లేని ఉత్పత్తులను నిరోధించటానికి, కనుగొనేందుకు తోడ్పడింది. త్వరగా కస్టమ్స్‌ అనుమతులు ఇవ్వటానికి వీలు కలిగించింది. ఎగుమతుల మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు.

24. ఆరోపణ: ఆఫ్రికన్ల విషయంలో గువాంగ్‌డోంగ్‌లో వివక్ష ప్రదర్శించారు.
వాస్తవం : చైనీయులు, విదేశీయులెవరైనా ఎలాంటి వివక్ష చూపలేదు. స్ధానికంగా ఎన్ని ఇబ్బందులు పడినా హుబెరు రాష్ట్రంలోని మూడువేల మంది ఆఫ్రికన్‌ విద్యార్ధుల సంక్షేమానికి చర్యలు తీసుకుంది. ఒక విద్యార్ధికి వైరస్‌ సోకితే వెంటనే చికిత్స అందించారు. ఏప్రిల్‌13న గ్వాంగ్‌డోంగ్‌లో విదేశాల నుంచి వచ్చిన వారిలో 26 మందికి వైరస్‌ ఉంది, వారిలో 19 మంది ఆఫ్రికన్లు ఉన్నారు.ఎవరినీ లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకోలేదు. ఊహాన్‌ వీధుల్లో కెనియన్‌ దంపతుల మీద దాడి జరిగినట్లు బిబిసి ఏప్రిల్‌ 17న బిబిసి ప్రసారం చేసింది. నిజానికి అది అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జరిగింది.

ఎం కోటేశ్వరరావు
(పూర్వ ప్రజాశక్తి పాత్రికేయులు – అంతర్ఙాతీయ వార్తల కాలమిస్టు)

From Peddimsetti Ramakrishna Fb Wall

RELATED ARTICLES

Latest Updates