‘కారుణ్యం’ కరువు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఎత్తు, వయసు పేరుతో తిరస్కరణ
– నష్టపోతున్న ‘ఆర్టీసి’ అభ్యర్థులు

-అమరావతి బ్యూరో
తమ కుటుంబంలో పెద్ద దిక్కు ఆర్టీసిలో పనిచేస్తూ మరణించారు. దు:ఖం వారిని వెంటాడినా కుటుంబంలో ఎవరో ఒకరికి మృతుని ఉద్యోగం వస్తుందనే నమ్మకం వారిని నిలబెట్టింది. బ్రెడ్‌ విన్నర్‌(కారుణ్య నియామకం) స్కీం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆర్టీసి యాజమాన్యం పదేళ్ల పాటు ఆ దరఖాస్తులను పట్టించుకోలేదు. కార్మిక సంఘాల పోరాటాలతో యాజమాన్యం కారుణ్య నియామకాలకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. దీంతో వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే కారుణ్య నియామకానికి యాజమాన్యం పెట్టిన ఎత్తు, వయసు నిబంధనలు వారి పాలిట శాపంగా మారాయి. ఇదీ ఆర్టీసిలో కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో సగం మంది పరిస్థితి… ఆర్టీసిలో కారుణ్య నియామకాల కోసం మొత్తం 1068 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వీరిలో 323 మందికి తొలి విడతలో ధ్రువపత్రాలను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. వారిలో 143 మందిని కండక్టర్లుగాను, ముగ్గురికి డ్రైవర్లుగాను ఉద్యోగాలు ఇచ్చారు. మిగిలిన 179 మంది దరఖాస్తులను ఎత్తు, వయసు నిబంధనలతో పాటు మెడికల్‌ అన్‌ఫిట్‌ కారణాలతో తిరస్కరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 153 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న వారు, 45 సంవత్సరాల లోపు ఉన్న వారు మాత్రమే అర్హులన్న నిబంధనతో సగానికి సగం మంది అభ్యర్థులు ఉద్యోగాలను నష్టపోయారు. వారిలోనూ దాదాపు 50 శాతం మంది మహిళలే ఉన్నారు. ఆర్టీసిలో ప్రస్తుతం రెండో విడతగా కారుణ్య నియామకాలను చేపట్టనున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో మిగిలిన 745 మంది అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన చేపట్టనున్నారు. ఎత్తు, వయసు నిబంధన వల్ల ఇందులో కూడా సగం మంది ఆర్టీసిలో ఉద్యోగానికి అనర్హులు కానున్నారు. తాము దరఖాస్తు చేసుకున్న సమయంలో వయసు రీత్యా అర్హులమేనని, కారుణ్య నియామకాల్లో యాజమాన్యం జాప్యం చేయడం వల్ల ఇప్పుడు వయసు పెరిగి అనర్హులమయ్యామని కొందరు అభ్యర్థులు చెబుతున్నారు. యాజమాన్యం చేసిన జాప్యానికి తమను బలిచేయడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయి ఇళ్లు గడవని పరిస్థితిలో ఉన్నామని, యాజమాన్యం తమపై కరుణ చూపి కారుణ్య నియా మకాల్లో నిబంధనలను సడలించాలని కోరుతున్నారు. తమకు ఉద్యోగాలివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు సడలించాలి
కారుణ్య నియామకాల్లో ఎత్తు, వయసు నిబంధనలు సడలించాలి. ఇప్పటికే ఈ విషయంపై యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించాం. యాజమాన్యం సానుకూలంగా స్పందించాలి. దరఖాస్తు చేసుకున్న అందరికీ ఉద్యోగాలు కల్పించాలి.
– పలిశెట్టి దామోదరరావు, ఇయు ప్రధాన కార్యదర్శి

అందరికీ ఉద్యోగాలివ్వాలి
యాజమాన్యం గతంలో ఇచ్చిన హామీ మేరకు కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ సంస్థలో ఉద్యోగాలు ఇవ్వాలి. ఎత్తు, వయసు పేరుతో దరఖాస్తులను తిరస్కరించడం సమంజసం కాదు. నిబంధనలను సడలించిన తరువాత అన్ని దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలి.
– సిహెచ్‌ సుందరయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రధాన కార్యదర్శి

Courtesy Prajasakti

RELATED ARTICLES

Latest Updates