మృతుల సంఖ్య42

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– 123 ఎఫ్‌ఐఆర్‌లు, 630 అరెస్టులు
ఢిల్లీ హింసాత్మక ఘటనలపై పోలీసుల వెల్లడి

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 42కు చేరింది. జీటీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో నలుగురు వ్యక్తులు శుక్రవారం మృతిచెందారు. హింసాత్మక ఘటనలు ప్రారంభమైన నాటి నుంచి గురు టెగ్‌ బహదూర్‌ (జీటీబీ) ఆస్పత్రిలో 38 మంది, లోక్‌ నాయక్‌ జై ప్రకాశ్‌ ఆస్పత్రిలో ముగ్గురు, జగ్‌ ప్రవేశ్‌చంద్ర ఆస్పత్రిలో ఒకరు మృతిచెందారు.. ఈ ఘర్షణల్లో దాదాపు 250మందికిపైగా గాయపడ్డారు. జఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌, చాంద్‌బాగ్‌, భజన్‌పుర తదితర ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. కాగా, ఈ మొత్తం ఘటనలకు సంబంధించి 123 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసినట్టు, 630 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితులకు నష్టపరిహారానికి సంబంధించి మొబైల్‌ యాప్‌ను ప్రారంభించినట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిశ్‌ శిశోడియా ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవటానికి ప్రజలకు ఇది సహాయపడుతుందని తెలిపారు. ఎన్జీఓల సహాయంతో ఈ ఫారాలను నింపటం, వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాలని ప్రజలకు శిశోడియా విజ్ఞప్తి చేశారు. నష్టపరిహారానికి సంబంధించి వాగ్దానం చేసిన నిధులను సాధ్యమైనం త త్వరలో విడుదల చేయనున్నట్టు చెప్పారు.

సహాయమందించండి : ఢిల్లీ సీఎం

మరోవైపు అల్లర్లలో గాయపడిన, మృతుల కుటుంబాలవారికి సహాయం చేసేందుకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తిచేశారు. సహాయం కోసం ముందుకువచ్చేవారు ఈశాన్య ఢిల్లీ మేజిస్ట్రేట్‌ను సంప్రదించవచ్చునని తెలిపారు.

నేేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
ఈశాన్యప్రాంతంలో ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలలను శనివారం నుంచి తెరవాలని విద్యాశాఖ డైరెక్టరేట్‌ నిర్ణయించారు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న దృష్ట్యా పాఠశాలలను తెరవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఫిబ్రవరి 29 వరకూ పాఠశాలలను మూసివేస్తున్నట్టు తొలుత ప్రకటించారు.
పరిస్థితులు సద్దుమణగటంతో ఒక రోజు ముందే పాఠశాలలను తెరవాలని నిర్ణయించినట్టు చెప్పారు.

సహాయం కోసం పోలీసులకు
7,500 ఫోన్‌కాల్స్‌

ఈశాన్య ఢిల్లీలో హింస చెలరేగిన మూడదో రోజు మంగళవారం నాడు సహాయం కోసం పోలీసు కంట్రోల్‌ రూమ్‌ (పీసీఆర్‌)కు 7,500 ఫోన్‌ కాల్సువచ్చాయి. కాగా, సోమవారం 3,500 ఫోన్‌ కాల్సు వచ్చినట్టు ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. ఘర్షణలు మొదలైన ఆదివారం రోజు సహాయం కోరుతూ 700 కాల్స్‌ వచ్చినట్టు చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై హిందూత్వశక్తులు రెచ్చిపోయి ఘర్షణ వాతావరణం సృష్టించగా దేశరాజధాని ఒక్కసారిగా భగ్గుమన్న విషయం తెలిసిందే.

రాహుల్‌
, ప్రియాంకా గాంధీలపై చర్యలు చేపట్టాలి : పిటిషన్‌
ఢిల్లీ అల్లర్లకు సంబంధించి విపక్ష నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీలపై చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్‌లపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఈ పిటిషన్‌ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభు త్వంతో పాటు ఢిల్లీ పోలీ సులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఏఏ వ్యతి రేక నిరసనల వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు చేపట్టాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పైనా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హరిగౌతమ్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ సి హరిశంకర్‌లతో కూడిన హైకోర్టు బెంచ్‌ ఢిల్లీ ప్రభుత్వం, హౌం శాఖలకు నోటీసులు జారీ చేసింది.

ప్రతిపక్షాలే ప్రేరేపించాయి : అమిత్‌షా

ప్రతిపక్షాలు అలర్లను ప్రేరేపించాయనీ, పౌరసత్వ సవరణ చట్టంపై తప్పుడు ప్రచారం చేశాయనీ కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ఈశాన్య ఢల్లీీలో అల్లర్లు చెలరేగి 42 మంది ప్రాణాలు కోల్పోయిన మారణకాండ తర్వాత హౌం మంత్రి ఈ వ్యాఖ్యాలు చేయటం గమనార్హం. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన సభనుద్దేశించి అమిత్‌షా శుక్రవారం ప్రసంగించారు. సీఏఏతో ముస్లింలు పౌరసత్వం కోల్పోతారని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తు న్నాయి. సీఏఏ పౌరసత్వం ఇస్తుందనీ, ఎవరి పౌరసత్వం తొలగించదని అన్నారు. తప్పుడు ప్రచారం చేసి, అల్లర్లను ప్రతిపక్షాలు ప్రేరేపిస్తున్నాయని చెప్పారు.

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయవిచారణ చేపట్టాలి : సీపీఐ(ఎం)

పోలీసుల తీరువల్లే పెరిగిన మృతుల సంఖ్య
ఢిల్లీ మతఘర్షణలను అరికట్టడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరగాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. హింసాత్మక ఘటనలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నా కేంద్రం ఏమీపట్టనట్టు వ్యవవహరించిందని, ఢిల్లీ శాంతిభద్రతల బాధ్యత కేంద్రానిదేనన్న విషయాన్ని విస్మరించారని పొలిట్‌బ్యూరో ఆరోపించింది. షాహీన్‌బాగ్‌, జేఎన్‌యూ, జామియా మిలియా వర్సిటీలో ఘటనల వెనుకున్న పోలీస్‌ అధికారులకు ‘సిట్‌’ విచారణ బాధ్యతలు అప్పజెప్పారని, ఇలాంటి వ్యక్తుల నేతృత్వంలో నడిచే విచారణ ద్వారా ఢిల్లీ మతఘర్షణలపై వాస్తవాలు బయటకు రావని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. ఢిల్లీ మతఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఏమన్నారంటే, హింసాత్మక ఘటనలను అరికట్టడంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉంది. సరైన భద్రతా చర్యలు లేకపోవటం వల్లే మృతుల సంఖ్య 42 దాటిపోయింది. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు అరచేతపట్టుకొని వేలాదిమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనల వల్ల ఎంతోమంది తమ జీవనోపాధిని కోల్పోయారు. ఢిల్లీలో ఓవైపు ఇంత జరగుతుంటే, ‘జరిగిందేదో జరిగిపోయింది’ అంటూ బాధితులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ చేసిన వ్యాఖ్యలు దారుణం. ఢిల్లీ ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరగాలి. లేదంటే వాస్తవాలు బయటకు రావు.

సంఘీభావ సహాయ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం

ఢిల్లీ మత హింసలో బాధితులుగా మారిన ప్రజలకు పునరావాసం కల్పించేందుకు విరాళాలు సేకరించాలని అన్ని రాష్ట్రాల పార్టీ కమిటీలకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది. అందుకోసం ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావ సహాయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. మత హింస వల్ల ఢిల్లీ ప్రజల జీవితాల్లో విషాదం అలుముకున్నదని, దుకాణాలు, ఇండ్లు, ఆస్తులు కోల్పోయారని పొలిట్‌బ్యూరో తెలిపింది. హింస జరిగిన ఈశాన్య ఢిల్లీలో నివాసముంటున్న ఇరు మతాలవారిలో ఎక్కువభాగం అసంఘటితరంగ కార్మికులు, దిగువ మధ్యతరగతివారేనని పేర్కొన్నది. మత హింస వల్ల వేలాదిమంది బాధితులుగా మారారని తెలిపింది. మతాలకు అతీతంగా లౌకిక దృష్టితో బాధితులందరికీ సహాయం అందించాలని సూచించింది. దాతృత్వ భావనతో వెంటనే విరాళాలు అందించాల్సిందిగా పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది.

ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా శ్రీవాస్తవ

ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ)గా ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ అమూల్య పట్నాయక్‌ శనివారం పదవీవిరమణ చేయనున్నారు. గత నెలలోనే అమూల్య పట్నాయక్‌ పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని నేల రోజులపాటు పొడిగించారు. రాజధానిలో ఇటీవల చెలరేగిన ఘర్షణలు, ఈశాన్య ఢిల్లీలో మారణకాండను అదుపుచేయటంలో అమూల్య విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కొత్తగా నియమితులైన శ్రీవాస్తవ 1985 ఐపీఎస్‌ బ్యాక్‌ అధికారి. జమ్మూకాశ్మీర్‌ జోన్‌లో ప్రత్యేక డీజీగా విధులు నిర్వర్తించారు. ఢిల్లీలో ఇండియన్‌ ముజాహిద్దీన్‌, ప్రత్యేక సెల్‌ సహా పలు విభాగాల్లో పనిచేసిన అనుభవం ఆయనకుంది. సీఆర్‌పీఎఫ్‌ నుంచి స్పెషల్‌ కమిషనర్‌ (శాంతిభద్రతలు)గా హౌంమంత్రిత్వ శాఖ శ్రీవాస్తవను తీసుకొచ్చిన కొద్దిరోజులకే ఆయనకు ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌ బాధ్యతలను అప్పగించారు.

స్వరా భాస్కర్‌, హర్ష్‌ మందర్‌లపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు పిటిషన్‌
కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు
స్వరాభాస్కర్‌, హర్ష్‌ మందర్‌, ఆర్‌జె సయేమా, ఆప్‌ ఎమ్మెల్యే అమనతు ల్లాఖాన్‌లపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలుచేసేలా ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వీరిపై ఎన్‌ఐఏ దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ న్యాయవాది సంజీవ్‌కుమార్‌ దాఖలుచేసిన పిటిషన్‌లో కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారించిన ప్రధాన న్యాయమూర్తి డిఎన్‌ పాటిల్‌, జస్టిస్‌ హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు కోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 13కు వాయిదావేసింది. ‘అర్బన్‌ నక్సల్‌కు చెందిన ఈ గ్రూప్‌ దేశాన్ని అప్రతిష్టపాల్జేస్తున్నారనీ, విఫలమైన దేశంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారనీ సంజీవ్‌కుమార్‌ తన పిటిషన్‌లో ఆరోపించారు. అలాగే ఢిల్లీలో పోలీసుల దృష్టిని వేరే ప్రాంతాలకు మరల్చటం ద్వారా రోడ్ల దిగ్బంధనాన్ని మరింత పెంచే ఎత్తుగడల్లో భాగంగానే అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి బీజపీ నేతలు కపిల్‌ మిశ్రా, అనురాగ్‌ ఠాకూర్‌, పర్వేశ్‌ మిశ్రాలపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలని కోరిన పిటిషనర్‌, ఎన్‌ఐఏ దర్యాప్తు మాత్రం కోరకపోవటం గమనార్హం.

మసీదుల వద్ద పటిష్టమైన నిఘా
ఈశాన్య ఢిల్లీలోని హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాలలో శుక్రవారం నాటి ప్రార్ధనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, పారా మిలటరీ బలగాలు మసీదుల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా ఆ ప్రాంతాల వారితోచర్చలు జరిపారు. కొన్ని ప్రాంతాలలో సాధారణ పరిస్థితులు నెలకొన్న సంకేతాలు కనిపించాయి. దుకాణాలు తెరిచి ఉన్నాయి. ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక సంఘటనలు చెలరేగిన ప్రాంతాలలో సోమవారం నుంచి 7000 మంది పారామిలటరీ బలగాలను మోహరించారు. క్షేత్ర స్థాయిలో వందల సంఖ్యలో ఢిల్లీ పోలీసులు మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షించారు. హింసాత్మక సంఘటనలకు సంబంధించిన వివరాలను తమకు తెలియచేయాలనీ, సంబంధిత వీడియోలను తమతో పంచుకోవాలనీ పోలీసులు ప్రజలకు, జర్నలిస్ట్‌లకు విజ్ఞప్తి చేశారు.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates