అల్లర్లలో పలువురు అదృశ్యం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– మార్చురీలో 22 ఏండ్ల మోనిస్‌ మృతదేహం
– ఆచూకీ లభించని ఫిరోజ్‌

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో కాషాయ మూకల విధ్వంస కర దాడుల నేపథ్యంలో పలువురు ఆచూకీ తెలియడం లేదు. దీంతో, పలు కుటుంబాలు తమ కుటుంబసభ్యుల ఆచూకీ కోసం ఆస్పత్రుల చుట్టూ కలియతిరుగుతున్నాయి. కొందరు మార్చురీల్లో మృతదేహాలుగా మారడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 22 ఏండ్ల మోనిస్‌ను జీటీబీ ఆస్పత్రి మార్చురిలో గుర్తించడంతో ఆ కుటుంబం కన్నీటిపర్యంతమైంది. ముస్తఫాబాద్‌లో కూలిగా పనిచేస్తున్న మోనిస్‌ ఫిబ్రవరి 25 నుండి కనిపించడంలేదు. అతని సోదరుడు ఇబ్రహీం మాట్లాడుతూ.. మోనిస్‌ బద్లీలోని తన తల్లిని చూడటానికి వెళ్లాడని, తిరిగి ముస్తఫాబాద్‌కు చేరుకున్నాడని అన్నారు. ఘర్షణలు జరుగుతుండటంతో యమునా విహార్‌ సమీపంలో చిక్కుకుపోయానని ఆ రోజు మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఫోన్‌ చేసి చెప్పాడని, కాసేపట్లో ఇంటికి చేరుకుంటానని అన్నాడని ఇబ్రహీం తెలిపారు. అతను ఇంటికి చేరుకోలేదని, ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ అయిందని చెప్పారు. సఫ్తార్‌గంజ్‌, ఎయిమ్స్‌తోపాటు పలు ఆస్పత్రుల్లో వెతికామని తెలిపారు. కొంతమంది అధికారులను కలిశామని, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఇబ్రహీం ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఆస్పత్రి మార్చురీలో మృతదేహంగా కనిపించాడని కన్నీటి పర్యంతమయ్యాడు.

మరో కుటుంబానికి చెందిన 35ఏండ్ల మొహమ్మద్‌ ఫిరోజ్‌ ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. తన పనులు ముగిం చుకుని లోనిలోని తన ఇంటికి తిరిగి వస్తుండగా ఫిరోజ్‌పై దాడి చేశారని ఆయన భార్య షబానా తెలిపారు. దాడి సమ యంలో ఆయన ఫోన్‌ నాశనమైందని అన్నారు. అనంతరం ఒక కుటుంబం ఆశ్రయం కల్పించినట్టు వారి పోన్‌ నుండి సమాచారమిచ్చారని, అదే ఆయనతో చివరి సంభాషణ అని అన్నారు. ఆ తరువాత నుంచి ఎటువంటి సమాచారమూ లేదని, ఆయనకు ఆశ్రయం కల్పించిన ఒకరి నివాసానికి అల్లరిమూకలు నిప్పు పెట్టారని తెలిసిందని, ఫిరోజ్‌ గురించి ఎలాంటి సమాచారమూ లేదని ఆమె విలపించారు.

కానిస్టేబుల్‌ ఇంటిని పునర్నిర్మించనున్న బీఎస్‌ఎఫ్‌
ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాల దాడుల్లో మల్కాన్‌గిరిలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మహ్మద్‌ అనీస్‌ కుటుంబానికి చెందిన మూడంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయిందని, మే నెలలో జరగనున్న పెండ్లికోసం సమకూర్చుకున్న డబ్బు, నగలు కూడా అగ్నికి ఆహుతయ్యాయని బీఎస్‌ఎఫ్‌ డీఐజీ పుష్పేందర్‌ రథోర్‌ తెలిపారు. అతని ఇంటిని పునర్నిర్మిస్తామని సరిహద్దు భద్రతా దళం తెలిపింది. అనీస్‌ను, ఆయన కుటుంబాన్ని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీజీఐ) శనివారం పరామర్శించారని హోం శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ ఘటన గురించి కానిస్టేబుల్‌ తమకు తెలియజేయలేదని, మీడియా రిపోర్ట్స్‌ ద్వారా తెలుసుకున్నామని బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ వివేక్‌ జోహ్రీ తెలిపారు. పునర్నిర్మాణంలో తన కుటుంబానికి అందుబాటులో ఉండేలా అనీస్‌ను ఢిల్లీకి బదిలీ చేస్తామని వెల్లడించారు.

పాఠశాల విధ్వంసం.. అక్కడి నుంచే దాడులు…
తూర్పుఢిల్లీలో మూడు పాఠశాలలను కాషాయ మూకలు ధ్వంసం చేశాయి. శివ్‌ విహార్‌ ప్రాంతంలోని డీఆర్పీ పాఠశాలను ఆశ్రయంగా చేసుకుని వారు దాడులకు పాల్పడినట్టు వెల్లడైంది. పథకం ప్రకారం పాఠశాలలోకి ప్రవేశించారని డీఆర్పీ కాన్వెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ హెడ్‌ ధర్మేష్‌ శర్మ తెలిపారు. వెయ్యి మంది చిన్నారులు చదువుతున్న పాఠశాలకు పక్కనే ఉన్న భవనంపై నుంచి తాళ్లను వేలాడదీసి.. పాఠశాల ప్రాంగణంలో ప్రవేశించి, బ్లాక్‌ బోర్డులను ధ్వంసం చేశారని, ఫర్నీచర్‌ను తగులబెట్టడమే కాక.. లైబ్రరీలోని పుస్తకాలకూ నిప్పంటించారని తెలిపారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను మూక దాడులకు ముందే వారి నివాసాలకు తరలించామని చెప్పారు. వారు అంటించిన కార్చిచ్చు .. 24 గంటల పాటు కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక దళం ఆచూకీ లేదని.. పోలీసులు స్పందించేందుకు మూడు రోజులు పట్ట్టిందని అన్నారు. ఈ పాఠశాలకు ముందు రాజధాని పబ్లిక్‌ స్కూల్‌ను కూడా ధ్వంసం చేశారు. వారిని అడ్డుకునేందుకు స్కూల్‌ గార్డ్‌ మనోజ్‌, డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ ప్రయత్నించడంతో కుటుంబాలతో సహా పాఠశాల్లో 60 గంటలపాటు బంధించారు. తమను, కుటుంబాలను చిత్రహింసలకు గురిచేశారని, బుధవారం పోలీసులు వచ్చి తమను రక్షించారని సిబ్బంది తెలిపారు. తమ పాఠశాలను ధ్వంసం చేసి.. నిప్పంటించారని, పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీీ… వారు రాలేదని రాజధాని పాఠశాల యజమాని తెలిపారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates