ఆప్‌ను దిద్దిన అతిషి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆమె పేరులో మార్క్స్‌ ఉన్నాడు.
ఆమె పేరులో లెనిన్‌ ఉన్నాడు.
దిల్లీలో ఆప్‌ సాధించిన
విజయంలో తనకూ వాటా ఉంది.

ఆ పార్టీ మేనిఫెస్టోలో ఆమె ప్రమేయం ఉంది. అయిదేళ్లు దేశమంతా చర్చించుకున్న ఆప్‌ సర్కార్‌ సంస్కరణల్లో తన ఆలోచనలూ ఉన్నాయ్‌. దిల్లీ ఎన్నికల్లో దద్దరిల్లే విజయం సొంతం చేసుకున్న ఆ ఇంతి పేరు అతిషి మార్‌లెన.

దిల్లీలో మొదలైన అతిషి మార్‌లెన ప్రయాణం.. మళ్లీ అక్కడికే విజయవంతంగా చేరింది. అతిషి తల్లిదండ్రులు త్రిప్తవహి, విజయ్‌సింగ్‌. ఈ ఇద్దరూ దిల్లీ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు. ఆధునిక భావాలున్న వాళ్లు. ఆ ఇద్దరి గారాలపట్టి అతిషి. పేరు చివర ఉన్న మార్‌లెనలో ఇద్దరు మహామహులున్నారు. వాళ్లు కారల్‌మార్క్స్‌, లెనిన్‌. ఈ ఇద్దరి నుంచి స్ఫూర్తి పొందిన అతిషి తల్లిదండ్రులు తమ బంగారుకొండ పేరు చివరన మార్‌లెన అని తగిలించారు. పెరిగి పెద్దయ్యాక ప్రశ్నించడం మొదలుపెట్టింది అతిషి. నిలదీయడం అలవాటు చేసుకుంది. నిజం చెప్పడం అలవర్చుకుంది. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడటం అలవాటు చేసుకుంది. నలుగురిలో తను ప్రత్యేకం అని ఎన్నోసార్లు నిరూపించుకుంది. తన పేరు నుంచే తాను స్ఫూర్తి పొందింది. పేరు చివరన ఉన్న నాలుగు అక్షరాలను.. ఇంటిపేరుగా మార్చుకుంది.

సిద్ధాంతాలు నచ్చడంతో..
ఆలోచనల్లో ఎంత చలాకీగా ఉండేదో.. చదువులోనూ అంతే ప్రతిభ కనబర్చేది అతిషి. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో చరిత్ర ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ చేసింది. 2001లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకం అందుకుంది. తర్వాత ఉపకార వేతనంతో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ మాగ్డలెన్‌ కాలేజీలో రోడ్స్‌ స్కాలర్‌గా ఎంపికైంది. చదువు పూర్తయ్యాక కొన్నాళ్లు ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో ఉన్న రిషీ వ్యాలీ పాఠశాలలో చరిత్ర, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లను బోధించింది. తర్వాత మధ్యప్రదేశ్‌ భోపాల్‌ సమీపంలో ఓ గ్రామానికి వెళ్లింది. అక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తూనే, విద్యాబోధన చేపట్టింది. తను నమ్మిన సిద్ధాంతాలను బలంగా పాటిస్తుంది అతిషి. ఇంతలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తెరపైకి వచ్చింది. ఆ పార్టీ సిద్ధాంతాల్లో తను నమ్మిన విలువలు కనిపించాయి. ఆ పార్టీకి దగ్గరైంది. తన విధానాలను ఆ పార్టీ నినాదాలుగా మార్చడంలో సఫలీకృతురాలైంది.
బడి సంస్కరణలు ఆమెవే..
2013లో ఆప్‌ విధానాల రూపకల్పనలో అతిషి భాగస్వామి అయ్యింది. పార్టీ కార్యక్రమాల్లో గొంతుకయింది. పొలిట్‌బ్యూరోలో సభ్యురాలైంది. రాజకీయంగా ఎదుగుతున్నా.. తన అవసరం ఎక్కడుందనిపిస్తే అక్కడికి వెళ్లిపోయేదామె. 2015లో మధ్యప్రదేశ్‌లో జరిగిన ‘జల సత్యాగ్రహ’ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. 2015లో దిల్లీలో ఆప్‌ అధికారంలోకి వచ్చాక అతిషి కీలక బాధ్యతలు చేపట్టింది. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు విద్యకు సంబంధించిన అంశాలపై సలహాదారుగా నియమితులైంది. మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగింది. ఈ కాలంలోనే దిల్లీ గల్లీల్లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. 8,000 సరికొత్త తరగతి గదుల నిర్మాణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం జరగడం మొదలైంది. నర్సరీ స్థాయి నుంచి ‘హ్యాపీనెస్‌ కరికులం’ అమలు మొదలైంది. నైతిక విలువలు నేర్పించడం ప్రారంభమైంది. అతిషి సంస్కరణలు ఫలించాయి.. దిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు పుంజుకున్నాయి. ఉత్తీర్ణత శాతం ఊహించనంతగా పెరిగింది. ఉప ముఖ్యమంత్రి సిసోడియా దిల్లీ విద్యా సంస్కరణల రూపకర్తగా అతిషిని ప్రకటించడం విశేషం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు దిల్లీ పార్లమెంటు స్థానంలో బరిలో దిగి మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ చేతిలో ఓడిపోయింది. ఓటమిని పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసింది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టో రూపకల్పన భుజానికెత్తుకుంది. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలకు వెళ్లడం అంటే సవాలే! విద్యాధికులు, మేధావులు అధికంగా ఉండే రాజధానిలో ఎన్నికలు. ప్రజలకు మేలు చేసే పథకాలు ఉండాలి. ప్రత్యర్థులను ఆలోచింపజేసే విధానాలు ప్రవేశపెట్టాలి. అన్నింటినీ కూర్ఛి. ఆప్‌ తాజా మేనిఫెస్టో రూపకల్పన చేసింది. కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగింది. విజయ దుందుభి మోగించి.. అతిషి మార్‌లెన.. మార్వలెస్‌ అనిపించుకుంది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates