బెడిసిన ‘జాతీయ’ వ్యూహం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  •  బీజేపీ అజెండాకు ఎదురుదెబ్బ.. ఫలించని మోదీ-అమిత్‌ షా వ్యూహం
  • 22 ఏళ్లుగా కమలదళం నిరీక్షణ.. మళ్లీ నిరాశే

న్యూఢిల్లీ : ‘‘మేం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తెచ్చాం. ఇందుకు పార్లమెంట్‌ను గౌరవించాలి, అభినందించాలి. ఎన్నార్సీ దిశగా ఇది మరో అడుగు.. అని కొందరంటున్నారు. 2014 నుంచి నేటిదాకా మేం ఎన్నార్సీ గురించి మాట్లాడలేదు. పార్లమెంట్లో ఏ బిల్లూ ప్రవేశపెట్టలేదు. కేబినెట్లో చర్చించలేదు. దేశంలో ఎలాంటి నిర్బంధ కేంద్రాలూ (డిటెన్షన్‌ సెంటర్స్‌) పెట్టలేదు.. విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి’’.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో డిసెంబరు 22న అసెంబ్లీ ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో ప్రధాని అన్న మాటలివి. అంటే లోక్‌సభ ఎన్నికల్లో మాదిరే బీజేపీ మార్కు జాతీయవాద అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకున్నారు. ఇక అమిత్‌ షాదీ అదే బాట. మెట్రో నగరమైన ఢిల్లీలో 80 శాతం దాకా హిందువులుండడంతో హిందూత్వ అజెండానే బీజేపీ తన బాణంగా చేసుకుంది. ఆఖరికి అయోధ్య రామాలయ ట్రస్ట్‌ ఏర్పాటు ప్రకటనా ఈ ప్రచార సమయంలోనే వెలువడింది. కానీ, ఈ అజెండా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మితిమీరిన హిందూత్వ ప్రచారం బెడిసికొట్టిందని ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయుష్మాన్‌ భారత్‌, ఉచిత కరెంటు, ఇతర సౌకర్యాలు ప్రకటించాలని బీజేపీ తొలుత భావించినా వాటిని మేనిఫెస్టోలో పెట్టలేదు. ఆఖరికి సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఇవన్నీ తమ కొంపముంచాయని, అమిత్‌ షా వీటిపై దృష్టి పెట్టలేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

22 ఏళ్లుగా ఎదురుచూపులే..
ఢిల్లీ గద్దెను బీజేపీ 1998లో కోల్పోయింది. నాడు షీలా దీక్షిత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌.. సుష్మా స్వరాజ్‌ నేతృత్వంలోని కమలదళాన్ని మట్టికరిపించింది. అప్పటి నుంచి నేటి దాకా అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆవిర్భవించాక కమలనాథులకు పరిస్థితి మరింత జటిలమైపోయింది. షీలా హయాంలో మొదలైన అభివృద్ధిని కేజ్రీవాల్‌ మరింత ముందుకు తీసుకెళ్లారు.

కేజ్రీకి అడుగడుగునా అడ్డంకులు!
ఢిల్లీది ఓ విచిత్రమైన పరిస్థితి. అక్కడ శాంతి భద్రతలు సహా అనేకానేక అంశాలపై కేంద్రానికే అధికారాలుంటాయి. దీన్ని అదునుగా తీసుకుని గత ఐదేళ్లలో మోదీ సర్కారు కేజ్రీ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టింది. అన్ని అధికారాలూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతిలో ఉండడంతో గవర్నరే అసలు సీఎంగా వ్యవహరించారు. ఇక చీఫ్‌ సెక్రటరీ, ఐఏఎ్‌సలు అంతా సహాయనిరాకరణ చేశారు. ఆఖరికి గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు వ్యతిరేకంగా గవర్నర్‌ బంగ్లాలోనే కేజ్రీవాల్‌ రాత్రంతా ధర్నా చేశారు. అయినా మోదీ సర్కారు కేజ్రీ ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూనే వచ్చింది. దీన్ని ప్లస్‌ పాయింట్‌గా మల్చుకొని కేజ్రీ ప్రజల మనసులకు చేరువయ్యారు.

దాదాపు రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ ప్రయోగించింది. కేంద్రం ఆప్‌ నేతలపై సీబీఐ, ఈడీ అవినీతి కేసులు పెట్టింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఆప్‌ నేతలు ఏం కోరినా మొండిచేయి చూపుతూ వచ్చాయి.

ద్వేష రాజకీయం
ప్రచార పర్వంలో బీజేపీ నేతలు కేజ్రీవాల్‌పై విషం చిమ్మడం కమలనాథుల ఓటమికి మరో పెద్ద కారణం. కేజ్రీవాల్‌ ఓ టెర్రరిస్టు అని పర్వేష్‌ వర్మ అనే ఎంపీ వ్యాఖ్యానించడం, దానిని ఢిల్లీ ఇన్‌చార్జి అయిన పార్టీ ప్రతినిధి ప్రకాశ్‌ జావడేకర్‌ సమర్థించడం ఇందులో ఒకటి. పర్వేష్‌ వర్మ పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ లోక్‌సభ సీటు పరిధిలోకి వచ్చే 10 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ బీజేపీ అభ్యర్థులు భారీ తేడాతో ఓడిపోయారంటే ద్వేష రాజకీయాలను ప్రజలు ఆమోదించడం లేదని స్పష్టమవుతోంది. ఆందోళనకారులను కాల్చిపారెయ్యాలంటూ ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్య కూడా ప్రతికూలంగా మారింది. యోగి ఆదిత్యనాథ్‌ చేసిన ‘టుక్‌డే టుక్‌డే గ్యాంగ్‌’ వ్యాఖ్య కూడా ఇదే కోవలోనిది. వేర్పాటువాదులతో విపక్షనేతలను పోలుస్తూ బీజేపీ తరుచూ అనే మాట ఇది.

వికటించిన వ్యూహం
ఢిల్లీ ఓటర్లలో అనేకులు స్థానికులు కారు. తూర్పు భారత రాష్ట్రాల నుంచి బతుకుతెరువు నిమిత్తం వచ్చినవారు. వారి ఓట్లకు గాలం వేయడానికి బీజేపీ.. భోజ్‌పురి నటుడు, గాయకుడు మనోజ్‌ తివారీని ప్రధాన ప్రచారకుడిగా చేసింది. బయటకు ప్రకటించకపోయినా ఆయనే సీఎం అభ్యర్థి అనే సంకేతాలు ఇచ్చింది. కానీ, ఓటర్లు అంగీకరించలేదు.

రెండేళ్లలో ఆరో రాష్ట్రంలో బీజేపీ ఓటమి
గడిచిన రెండేళ్లలో కమలనాథులు ఏకంగా ఆరు రాష్ట్రాల్లో అధికారానికి దూరమయ్యారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌ల్లో పార్టీ ఓడిపోయింది. హరియాణాలో కూడా ఓడిపోయే దాకా వచ్చినా దుష్యంత్‌ చౌటాలా సాయంతో అధికారం నిలబెట్టుకోగలిగింది. ఢిల్లీలో తగిలిన దెబ్బ మోదీ-షాల మేజిక్‌, మంత్రాంగాలకు మరో ఝలక్‌గా చెబుతున్నారు. ఒకప్పుడు ఏకంగా 20 రాష్ట్రాల్లో చక్రం తిప్పిన కాషాయ సేన ఇపుడు ఒకటొకటిగా పెద్ద రాష్ట్రాలను కోల్పోతూ వస్తోంది.  ఇక మిగిలినవి- బిహార్‌, గుజరాత్‌. వచ్చే ఏడాది జరిగే బెంగాల్‌ ఎన్నికల్లో ఫలితాలపై సందిగ్ధత నెలకొంది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates