మామిడి పళ్ళ హతుడి వాంగ్మూలం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Endulri Sudhakar : 8500192771

(29.05.2019 నాడు రెండు మామిడి పండ్లు దొంగిలించాడని తూర్పు గోదావరి జిల్లా సింగనపల్లి గ్రామంలో అగ్రవర్ణాల చేత చంపబడిన దళిత యువకుడు బక్కి శ్రీను సంఘటనని సామజిక మాధ్యమం ద్వారా లోకానికి చాటి చెప్పండి జై భీమ్)

అయ్యలారా!!!!!
ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన
పెద్ద పదవుల ప్రధాన ముఖ్య నేతలారా!
నా ఆత్మ ఘోష వినండి.
నేను ఈ దేశంలో మీలాగే పౌరుణ్ణి
ఓటు దారుణ్ణి
ఒక దళితుణ్ణి
నా మృత్యుఘోష ఆలకించండి

అడవి దొంగ వీరప్పన్ లా
గంధపు చెక్కల చౌర్యం చేయలేదు
విజయ మాలవ్యా లాగా
వేల కోట్లు ఎగ్గొట్టి
బ్యాంకుల్ని దివాళా తీయించలేదు
ఏడుకొండల వాడి కళ్లుగప్పి
స్వామివారి సొమ్ము కైoకర్యం చేయలేదు
లక్ష కోట్లు మాయం చెయ్యలేదు
నేను చేసిందల్లా
రెండు మామిడి పండ్లు ఏరుకొచ్చాను
తోటమాలి కంటబడకుండా
రెండే రెండు ఆమ్ర ఫలాలు
అందరిలాగా ఆశపడి తీసుకొచ్చాను
ఏ యమదూతల దృష్టి పడకూడదనుకున్నానో
ఏ బలిసిన యజమానులకు దొరకకూడదనుకున్నానో
వాళ్లకే దొరికిపోయాను
నేనూ ఆ ఊరి వాణ్ణే
ఆ వాడ వాణ్ణే
బాగా తెలిసిన వాణ్ణే
అయితేనేం నేను దళితుణ్ణి
నేను నాగరికుల మధ్య ఉంటున్నానో
నరకంలో జీవిస్తున్నానో
నాకు చచ్చే దాకా తెలియలేదు
బంగారం దొంగిలించినట్టో
నగదు మాయం చేసినట్టో
నన్ను పట్టుకోవాలని
ఎంత కాలంగా
నా మీద కసి పెంచుకున్నారో
నా కులం మీద
పీకలదాకా ద్వేషం దాచుకున్నారో
నన్ను మేక పిల్లలా చిక్కించుకుని
నా మెడలు విరిచారు
పిడి గుద్దులతో నా ఒళ్లంతా నెత్తుటి ముద్దను చేశారు
వూరు వూరంతా
నన్ను గొడ్డును బాదినట్లు బాదారు
నా కనుగుడ్లు చిదిమేశారు
నా ఎముకలు విరిచేసారు
నా మర్మాంగాన్ని
మాంసం కొట్టుగా మార్చేశారు
నా వృషణాలను కర్రలతో కుమ్మికుమ్మి రక్తసిక్తం చేశారు
అయినా నేను ప్రాణాలతోనే ఉన్నాను
నా నెత్తుటి కళ్ళల్లో
నా చిన్నారి కొడుకులు మెదులుతున్నారు
వాళ్ళ కోసం రాలిపడిన
ఆ రెండు మామిడి పళ్ళు ప్రేమగా తెచ్చాను
దెబ్బలకు కమిలిన నా గుండె చెవులకు
నా భార్య గావు కేకలు వినబడుతున్నాయి
ఆమెతో కలిసి
రెండు మామిడి ముక్కలు
తియ్యగా తిందామనుకున్నాను
చివరికి ఆ రెండు మామిడి పళ్ళే
నా నిండు ప్రాణాలను తీస్తాయనుకోలేదు
పంచాయితీ ఆఫీసులోనే
అత్యంత పాశవికంగా ఉరి తీస్తాయనుకోలేదు
ఈ అంటరానితనాలు
ఈ బీభత్స హింసాత్మక దుర్మరణాలు
కేవలం మాకేనా?
రాలి పడిన మామిడి పళ్లకు కూడానా?
రేపు నన్ను సమాధి చేస్తారు కదా
అక్కడో మామిడి మొక్క నాటండి
“ఈ చెట్టు పండ్లు అందరికోసం
ఫలాలకు కులాలు లేవని”
ఒక శిలాఫలకం పెట్టించండి.
నా ఆత్మకు గౌరవం ప్రకటించండి.

RELATED ARTICLES

Latest Updates