న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తికి  ప్రమాద ఘంటికలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
కొండూరి వీరయ్య

ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో హిందూత్వ వాదుల రెచ్చగొట్టుడు వ్యవహార శైలితో జరిగిన మారణహోమానికి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన స్పందనలు జరిగిన దుర్ఘటన కంటే ఆందోళన కరంగా ఉన్నాయి.  గత రెండు రోజులలో కేంద్ర ప్రభుత్వం నుండి ఈ దుర్ఘటన పై మూడు రకాల స్పందనలు వ్యక్తమయ్యాయి. మొదటిది ఢిల్లీ మారణకాండను నివారించటంలో విఫలమైన పోలీసు యంత్రాంగాన్ని మందలించిన ఢిల్లీ హైకోర్టు జడ్జి మురళీధర్ ను రాత్రికి రాత్రే పంజాబ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేయటం.

ఇక రెండవ స్పందన ఢిల్లీ మారణకాండ కానీ,  పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఆందోళనలు కానీ విదేశీ పెట్టుబడులను ప్రభావితం చేయలేవని ఆర్థిక వ్యవస్థ ఇటువంటి సంఘటనల కారణంగా నష్టపోయేది ఏమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించటం.  మూడవ స్పందన యధాప్రకారం ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి సంబంధించినది అంటే కేంద్ర హోం శాఖకు సంబంధించిన విషయం.  జస్టిస్ మురళీధర్ విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకత్వం పై కేసులు నమోదు చేయాలని ఆదేశించగా ఢిల్లీ పోలీసు యంత్రాంగం మాత్రం అబ్బే మా చెవులకు మా కళ్ళకు అటువంటి విద్వేష పూరిత ప్రసంగాలు వినిపించలేదు కనిపించలేదు అంటూ గాంధీ గారి కోతులకు దీటుగా సమాధానమివటం. ఈ మూడు స్పందనలను కలిపి చూసినా విడివిడిగా చూసినా అర్ధమయ్యేది ఒకటే ఈ ప్రభుత్వం దానికి నాయకత్వం వహిస్తున్న సంఘ పరివార్ కానీ దాని పారమెంటరీ నాయకత్వం కానీ ప్రజాందోళన ప్రజాగ్రహాన్ని గాని ప్రజల ఆవేదనను గానీ ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేవు అన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

ముందుగా జస్టిస్ మురళీధర్ ఆకస్మిక బదిలీని లోతుగా పరిశీలిద్దాం.  పాలక ప్రభుత్వానికి అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా లేదా భిన్నంగా గొంతెత్తి ఏ అధికారినైనా ప్రభుత్వం సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నది మురళీధర్ బదిలీ ఈ సంఘటన తెలియజేస్తుంది.  మరోలా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగా విధి నిర్వహణకు సిద్ధమైన అధికారులకు న్యాయమూర్తులకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఈ బదిలీ హెచ్చరికగా పనిచేస్తుంది.  గతంలో అమిత్ షా పై ఉన్న హత్య కేసును విచారిస్తున్న సి.బి.ఐ స్పెషల్ కోర్టు జడ్జి లోయా ఆకస్మిక అనుమానాస్పద మరణం సంఘటన పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఈ పద్ధతుల్లో రాజ్యాంగ పాలనకు కాపలాదారు వ్యవహరించాల్సిన న్యాయ వ్యవస్థను సైతం నయానో భయానో లొంగ తీసుకోవడం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న భారత దేశ ప్రజాతంత్ర వ్యవస్థక  ప్రమాద ఘంటికలు మోగిస్తుంది.  మురళీధర్ తన సుదీర్ఘ విధి నిర్వహణలో ఈ స్థాయికి రావటం వెనుక ఆయన ఇచ్చిన ఎన్నో చారిత్రాత్మకమైన తీర్పులు, న్యాయ వాది గా చూపించిన నిబద్ధత ఉన్నాయి.  ఉదాహరణకు భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఉదంతంలో మురళీధర్ తో పాటు ఎంతోమంది న్యాయవాదులు చెప్పుకోదగ్గ కృషి చేసినందునే దుర్ఘటన బాధితులకు కొంచెం అయినా అన్యాయం జరిగింది. మురళీధర్ విధి నిర్వహణలో తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి ఎంతో కృషి చేసినట్లుగానే భారత న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడానికి న్యాయ వ్యవస్థతో తమ జీవితాలు ముడివేసుకున్న ఎంతోమంది న్యాయమూర్తులు న్యాయవాదులు రాజ్యాంగ నిపుణులు కృషి చేశారు.  తోడ్పడ్డారు. కార్యనిర్వాహక వ్యవస్థకు న్యాయవ్యవస్థకు, పార్లమెంటుకు మధ్య జరిగిన సుదీర్ఘ. పోరాటం ఫలితమే ఇది.  ఇటువంటి స్వయంప్రతిపత్తిని నిరంతరం కాలరాయడానికి పాలక పక్షాలు ప్రయత్నిస్తూనే వచ్చాయి.

బీజేపీ హయాంలో ఈ ప్రయత్నం మరింత తీవ్రస్థాయిలో జరుగుతుందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు.  మాజీ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఓ సందర్భంలో ప్రధాన మంత్రి మోడీ వేదికపై ఉండగానే న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి విషయంలో దాదాపు కళ్ళ నీళ్ళు పెట్టుకున్న సందర్భం పాఠకులకు గుర్తు ఉండే ఉంటుంది.

న్యాయమూర్తిగా  జస్టిస్ మురళీధర్ తన పద్నాలుగేళ్ల కాలంలో ఇచ్చిన ఎన్నో విలువైన తీర్పులు భారతదేశంలో పౌర హక్కులకు సంబంధించి కొత్త బా టలు వేశాయి. సమాచార హక్కు చట్టాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో సహా న్యాయ వ్యవస్థ లోని అన్ని స్థాయిలలో న్యాయమూర్తులకు వర్తింపజేస్తూ ఇచ్చిన తీర్పు ఇందులో ఒకటి మాత్రమే.  దీంతోపాటు విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు, మానసిక సంతులనం కోల్పోయిన వారు,  లైంగిక అత్యాచార పీడితులు వంటి అనేక విషయాల్లో మురళీధర్ తీసుకున్న వైఖరి మానవ హక్కుల న్యాయమూర్తిగా ఆయన్ను అందరి కంటే భిన్నంగా నిలబెట్టింది.  బహుశా అందువల్లనే ఏమో ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ మురళీధర్ ఆకస్మిక బదిలీ నిరసిస్తూ ఆందోళనకు దిగింది.  విధులు బహిష్కరించింది.

ఆశ్చర్యం ఏంటంటే ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల్లో మురళీధర్ సీనియారిటీ లో మూడో స్థానంలో ఉన్నారు.  అటువంటి వ్యక్తులు బదిలీ అయితే సాధారణంగా మరో హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి హోదాలోనే బదిలీ అవుతారు.  ఈ సంప్రదాయానికి భిన్నంగా మురళీధర్ పంజాబ్ హర్యానా హైకోర్టు కేవలం న్యాయమూర్తి గా బదిలీ చేయడం దీనికోసం సుప్రీంకోర్టు కొలీజియం (అంటే న్యాయమూర్తుల నియామకాలు బదిలీలు పర్యవేక్షించే బృందం) అప్పటికప్పుడు సమావేశమవటం గమనిస్తే సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి  లొంగి పోతుందా అన్న సందేహం తలెత్తుతోంది. ఆందోళన కలుగుతోంది..

ఆర్థిక మంత్రి సీతారామన్ విషయానికొస్తే ధిల్లీ మారణకాండ పట్ల కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం మానవత్వంతో వ్యవహరించేందుకు సిద్ధంగా లేదని చెపేందుకు ఓ ఉదాహరణ మాత్రమే. దేశవ్యాప్తంగా ప్రజలు ఢిల్లీ మారణకాండ గురించి, దానికి దారితీసిన పాలన యంత్రాగ వైఫల్యాల గురించి చర్చించుకుంటుంటే కేంద్ర మంత్రులు మాత్రం పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీయార్, ఎన్నారసీల విషయంలో వెనకడుగు వేసేది లేదని ప్రకటిస్తున్నారు.  అమెరికా అధ్యక్షుడు స్వల్ప కాలిక పర్యటన హడావిడిలో దేశం మునిగి ఉండగా జరిగిన ఈ దారుణ మారణ కాండ మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షునికి ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ హౌస్ కు సమీపంలో జరిగిన మారణకాండ ప్రపంచవ్యాప్తంగా భారత దేశానికి తలవంపులు తెచ్చే దిగా ఉంది.  అయినా నా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం వెరవకుండా  అంతా సజావుగానే ఉన్నట్లు చెప్పుకోవటానికి ప్రయత్నించడం గమనిస్తే ఏలికల మానసిక స్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఇటువంటి చర్యల ద్వారా మొదట్లోనే చెప్పుకున్నట్టు ప్రభుత్వం ప్రజాందోళన తగ్గేది లేదని చెప్పకనే చెప్పింది. ఇది  పౌరసమాజాన్ని రాజ్యాంగ విలువలను పరిహసించటం తప్ప మరోటి కాదు. జవాబుదారీతనం లేకుండా వ్యవహరించటమే ఆరెస్సెస్ వ్యూహంలో ఆడినుండీ కనిపిస్తున్న లక్షణం.

చివరిగా ఢిల్లీ పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు గురించి పరిశీలిస్తే మన ఆందోళన పెరుగుతుందే తప్ప తరగడం లేదు 2 నెలల క్రితం జామియా యూనివర్సిటీలో విద్యార్థులపై లైబ్రరీ లోకి దూరి మరీ లాఠీచార్జి చేసి కాల్పులు జరపటం వంటి ఘటనలు జరిగిన తర్వాత నిజంగా కేంద్ర ప్రభుత్వం ఒక్క శాతం అయినా చిత్తశుద్ధితో స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈశాన్య ఢిల్లీ  ఈ రకంగా అగ్నికీలల్లో కనిపించేది కాదు.  అంతేకాదు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం దాడి చేసిన వారి ఆచూకి తెలుసుకోవడం, అరెస్ట్ చేయడం ద్వారా విద్యార్థి లోకానికి భరోసా ఇవ్వటంలో ఢిల్లీ పోలీసు యంత్రాంగం సంపూర్ణంగా విఫలమైంది.  ఈ వైఫల్యానికి కేంద్రంగా మరెవరో కాదు. కేంద్ర హోంశాఖ మాత్రమే.

ఈ మొత్తం పరిణామాలను ప్రత్యేకించి గత మూడు నెలలుగా సాగుతున్న పరిణామాలను పాల వైఫల్యాన్ని,  శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగం దారుణంగా విఫలం కావడాన్ని మరో కోణంలో చూసినప్పుడు ఇది ఇది కేవలం బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తుడల్లో ఓ ఎత్తుగడగా కూడా భావించవచ్చు.. ఇటువంటి చెదురుమదురు ఘటనలు ఎంతో కొంత మంది ప్రాణాలు తీసి అయినా సరే జరిపిస్తే ప్రజల్లో శాశ్వతమైన విభజన తలెత్తుతుంది.  బిజెపి పదేపదే అధికారంలోకి రావడానికి భయం ప్రధానమైన వ్యూహాత్మక ఆయుధం గా పని చేసింది. ఇదే వ్యూహాన్ని నేడు జాతీయ స్థాయిలో అమలు చేయటానికి బిజెపి, సంఘపరివారం పూనుకుంటున్నాయి.  మతోన్మాద శక్తులు వీరంగం వేస్తున్నపుడు పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం కేవలం 2019,  2020లో ఢిల్లీ కి మాత్రమే పరిమితమైన సంఘటన గా భావించరాదు. ఈ వ్యూహం బిజెపి అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ అమలు జరిగిన వ్యూహమే. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ప్రస్తావించుకుందాము..

గోద్రా సాకుతో గుజరాత్ ను సంఘపరివారం అగ్ని గుండంగా మార్చినవుడు కూడా  పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు.  1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ఆర్ ఎస్ ఎస్ వి హెచ్ పి బజరంగ్ దళ్ పూర్తి సన్నాహాలు చేసుకున్నప్పటికీ బిజెపి మీ నేతృత్వంలోని నాటి ఉత్తర ప్రదేశ్ పోలీస్ యంత్రాంగం, పారామిలటరీ దళాలు కళ్లప్పగించి చూసాయి. చివరకు మతోన్మాద మొక్కలు బాబ్రీ మసీదును పట్టపగలే కూలుస్తున్నప్పటికీ సాయుధులైన పోలీసులు, పారామిలీటరీ దళాలు ఆ విపత్తును నిలువరించే ప్రయత్నం చేయలేదు. పత్రికల్లో నాడు వచ్చిన ఫోటోలు గమనిస్తే  సాయుధులైన పారామిలటరీ దళాలు బారికేడ్లలో బందీ అయ్యారా అనిపిస్తోంది.  దేశానికి తలవంపులు తెచ్చే దుర్ఘటనను నిలువరించడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయక పోవడం వెనుక నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఆదేశాలు ఉన్నాయని నానావతి కమిషన్ విచారణలో స్పష్టంగా తేలింది.  2002లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నేటి ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశాల మేరకే మత కలహాలను ముస్లింలను ఊచకోత ఆపేందుకు రంగంలోకి దిగ లేదని నాటి అనేకమంది ఉన్నతాధికారుల వాంగ్మూలలు వెల్లడిస్తున్నాయి.  2016లో మధ్యప్రదేశ్ లో రైతాంగంపై పోలీసులు కాల్పులు జరిపి అమాయకులైన రైతులను బలి  తీసినప్పటికీ వారి పై నాటి బిజెపి ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు.  తాజాగా 2019 డిసెంబర్లో 2020 జనవరిలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై తుపాకుల వర్షం కురిపించడానికి ఆదేశాలు ఇచ్చింది.. ఈ కోవకు చెందిన సంఘటనలే గత రెండు నెలల కాలంలో అటు జామియా లో గాని ఇటు జేఎన్యూలో గాని,  మొన్న ఢిల్లీలో గాని జరిగిన సంఘటనలు.  వీటిల్లో మరింత ఆందోళనకరమైన అంశమేమిటంటే తాము చేస్తున్న చట్టవ్యతిరేక వ్యవహారాలు సీసీ కెమెరాల్లో దొరక కుండా ఉండటానికి పోలీసులే అనేక చోట్ల సీసీ కెమెరాలను పగలగొట్టడం, పని చేయకుండా కరెంట్ సప్లై ఆప్ వంటి చర్యలకు పాల్పడటం.  ఈ మూడు రకాల పరిణామాలు స్పందనలు పరిశీలించిన తర్వాత  భారతీయులందరూ కంకణం కట్టుకుంటే తప్ప భారత ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించే అవకాశం లేదని స్పష్టమవుతోంది.  బిజెపి ప్రభుత్వాన్ని ఇదేవిధంగా పూర్తి మెజారిటీతో కూర్చోబెడితే ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ప్రజలపై ఈ రకమైన పోలీసు కాల్పులు తప్పవని  తాజా అనుభవం హెచ్చరిస్తోంది. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తేవాల్సిన తక్షణ అవసరాన్ని ఈ ఘటనలు ముందుకు తెస్తున్నాయి.

RELATED ARTICLES

Latest Updates