రోజుకు ముగ్గురు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
 ఆరు సంవత్సరాల్లో 5,912  మంది బలవన్మరణం
వీరిలో  75% కౌలు రైతులే
ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానం
కౌలు రైతుకు వర్తించని ప్రభుత్వ పథకాలు
రుణం రాక.. భరోసా లేక బలవన్మరణాలు

రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున ముగ్గురు.. ఏడాదికి సగటున 1000 మంది రైతులు బలవన్మరణం పాలవుతున్నారు. 2014-19 వరకు అంటే గత ఆరేళ్లలో రాష్ట్రంలో 5,912 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో పాక్షిక కౌలు రైతులు 1,478 కాగా.. కౌలు రైతులు 4,434 మంది. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదికలోని వివరాలివి. బలవన్మరణాలకు పాల్పడిన రైతుల్లో 75 శాతం మంది కౌలు రైతులే! ఇంకా చెప్పాలంటే.. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ఉండగా.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రుణ మాఫీ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తున్నా.. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు.

హైదరాబాద్‌ : వ్యవసాయాన్ని పండుగ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, రైతన్నకు మాత్రం యవుసం గుదిబండగా మారుతోంది. సాగుబాటలో అన్నదాత అప్పుల పాలవుతున్నాడు. పాత అప్పులను తీర్చేందుకు కొత్త అప్పులు చేసి పంటలు వేయడం దీపపు పురుగు చందమే అవుతోంది! లాభాల మాట అటుంచి, పెట్టుబడి కూడా చేతికి రాక రైతన్న గుండె పగులుతోంది. ఆరేళ్లలో 5,912 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. వరుస కరువుల కారణంగా 2014, 2015ల్లోనే 2,748 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో రైతుబంధు పథకం ప్రారంభించిన తర్వాత కూడా ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడలేదు. 2016లో 645 మంది, 2018లో 908 మంది, 2019లో 760 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో  పత్తి రైతులే ఎక్కువ. రైతు స్వరాజ్య వేదిక – టాటా ఇన్‌స్టిట్యూట్‌ సర్వే ప్రకారం.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో 81.4 శాతం పత్తి రైతులున్నారు. ఆ తర్వాత వరి, మొక్కజొన్న, కంది రైతులు ఉన్నారు. సామాజికవర్గాలపరంగా చూస్తే 61 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 11 శాతం ఎస్టీలు, 11 శాతం ఇతరులు ఉన్నారు.

కౌలు రైతులపై కనికరమేది?
రాష్ట్రంలో 56 లక్షల మంది రైతులుంటే వారిలో 15 లక్షల మంది కౌలు రైతులే. వీరిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంలేదు. కౌలు రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించేది లేదని సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారు. దాంతో, వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. రైతు బంధు పథకం కూడా పట్టాదారుకే వస్తోంది. దాంతో, కౌలు రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. కౌలు డబ్బులు కూడా ముందే ఇవ్వాల్సి వస్తోంది. ప్రకృతి విపత్తులతో నష్టపోతే పంట నష్టపరిహారం యజమానుల ఖాతాల్లోనే పడుతోంది. కేంద్ర ప్రభుత్వం 2011లో ప్రత్యేకంగా కౌలు రైతుల కోసం ‘రుణ, ఇతర అర్హతల గుర్తింపు కార్డు’ (ఎల్‌ఈసీ-లోన్‌ ఎలిజిబిలిటీ కార్డు) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కార్డు ఉన్న రైతుకు బ్యాంకు లోను వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తేపరిహారం వస్తుంది. విత్తనాలు, ఇతర సబ్సిడీలు వర్తిస్తాయి. ఆత్మహత్య చేసుకున్నా రైతుగా గుర్తిస్తారు.

కానీ, ఈ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. 2015లో 44 వేల కార్డులు జారీ చేసినా.. ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. దీంతో, తమకు ఏ రకంగానూ భరోసా లేకుండాపోయిందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు పథకం వచ్చిన తర్వాత కూడా కౌలు రేట్లు తగ్గలేదని, ఎకరానికి సగటున రూ.12 వేలు కౌలు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. రైతు స్వరాజ్య వేదిక, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ 2018లో సంయుక్తంగా కౌలు రైతుల ఆత్మహత్యలపై ఓ సర్వే చేశాయి. 692 మందిపై అధ్యయనం చేస్తే.. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 75 శాతానికిపైగా అంటే 520 మంది కౌలు రైతులేనని తేలింది. వీరిలో భూమి లేని వారు 18ు, రెండున్నర ఎకరాల్లోపున్నవారు 64ు ఉన్నారు. అంతేనా, దేశవ్యాప్తంగా 2018లో 10,349 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారిలో 4,586 మంది కౌలు రైతులే!!

జీవో 194కు మంగళం
వ్యవసాయ రుణాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు ప్రత్యేక పరిహార ప్యాకేజీ పథకం ద్వారా రూ.6 లక్షలు మంజూరు చేయాలని జీవో నంబరు- 194 చెబుతోంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు, అప్పులు చెల్లించడానికి రూ.లక్ష చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేయాలి. బడ్జెట్‌ లేదనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటం లేదు. త్రిసభ్య కమిటీ, ప్రాథమిక సమాచారం, శవ పంచనామా, శవ పరీక్ష, పోలీసు వారి తుది నివేదికలన్నీ కలిపి ఆత్మహత్యగా ధ్రువీకరించి, పరిహారం మంజూరు చేసిన తర్వాత కూడా చెల్లింపులు చేయటంలేదు. 2014 నుంచి 2017 వరకు బలవన్మరణాలకు పాల్పడిన రైతులకు పరిహారం పెండింగ్‌లో ఉంది. 2018 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి నుంచి ‘రైతు బీమా’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి జీవో నంబర్‌- 194ను అమలు చేయటం లేదు. పాత బకాయిలు కూడా పెండింగ్‌లో పెట్టింది. ఈ జీవో కింద 1,149 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిలో 848 మందికి రూ.6 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. ఇంకా 301 మందికి చెల్లించలేదు.

కౌలు రైతుకు భరోసా ఏదీ!?
కౌలు రైతులను మిగిలిన రాష్ట్రాలు ఏదో ఒకరకంగా ఆదుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వం ‘రైతు భరోసా’ను కౌలు రైతులకూ అమలు చేస్తోంది. కేరళ ప్రభుత్వం ‘కుడుంబశ్రీ’, ఒడిసా ప్రభుత్వం ‘కాలియా’ పథకంతో కౌలు రైతులకు అండగా నిలుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తే మేలు జరుగుతుంది. అలాగే, ఉమ్మడి రాష్ట్రంలో 2011లో అమలులోకి తీసుకొచ్చిన భూ అధీకృత చట్టాన్ని అమలు చేయాలి. కౌలు రైతుకు ‘ఎల్‌ఈసీ’ కార్డులు పంపిణీచేయాలి.

కష్టాలు తీర్చని ప్రభుత్వ పథకాలు
‘రైతుబంధు’ పథకాన్ని రైతుల పాలిట సర్వరోగ నివారిణిగా సర్కారు భావిస్తోంది. కానీ, కౌలుదారుకు ఈ పథకం వర్తించడం లేదు. రుణమాఫీ పథకాన్ని ప్రకటించినా సక్రమంగా అమలు చేయకపోవటంతో రుణ విముక్తులు కావటం లేదు. ఈ పథకం అమలు అస్తవ్యస్తం కావడం; పావలా వడ్డీ, జీరో వడ్డీ పథకాలకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో బ్యాంకు రుణాలు రావడం లేదు. మరోవైపు, పంటలకు పెట్టుబడి ఖర్చు బాగా పెరిగిపోతోంది.

వరికి ఎకరానికి రూ.25 వేలు, పత్తికి రూ.35 వేలు, పసుపు పంటకు రూ.లక్షకుపైగా అవుతోంది. ఎక్కువ మంది ఇప్పటికీ అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. 56 లక్షల మంది రైతుల్లో బ్యాంకు రుణాలు పొందుతున్నది 15-20 లక్షల మందే! వీరికి కూడా నామమాత్రంగానే రుణాలిస్తున్నారు. దాంతో, ప్రతి కుటుంబానికి సగటున రూ.4 లక్షల వరకు ప్రైవేటు అప్పు భారం ఉంటోంది. ఎరువులు, విత్తనాల సబ్సిడీ కూడా నామమాత్రంగా ఉంది. యాంత్రీకరణకు నిధులు మంజూరు చేయటం ఆపేశారు. కూలీల కొరత వేధిస్తోంది.

కౌలు రైతులను గుర్తించాలి
కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. వారి సమస్యలు పరిష్కరిస్తే ఆత్మహత్యలకు పరిష్కారం దొరుకుతుంది. బలవన్మరణాలు జరిగిన తర్వాత గుర్తించి, బాధిత కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం చేయాలి. వాస్తవ సాగుదారులను గుర్తించి రైతుబంధు, రైతుబీమా, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలుచేయాలి. కౌలు రైతులకు ఎల్‌ఈసీ కార్డులు ఏటా పంపిణీ చేయాలి.
బి.కొండల్‌ రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి

సర్కారుదే బాధ్యత
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం. ఏదో ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రధాన సమస్యలను గాలికొదిలేస్తోంది. రైతు బంధు కంటే పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లిస్తే రైతులకు లాభం కలుగుతుంది. ఆదివాసీలు, పోడు రైతులు, చిన్న-సన్నకారు, అసైన్డు భూములున్న బలహీనవర్గాలకు చాలా అన్యాయం జరుగుతోంది.
 కిరణ్‌ కుమార్‌, రైతాంగ పోరాట సమితి జాతీయ కార్యవర్గ సభ్యుడు

భూమి అమ్మి కూతురి పెళ్లి చేశా
మాది సిద్దిపేట జిల్లా చిట్యాల. నా భర్త చెవిటి కిష్టయ్య. మాకు 3 ఎకరాలు ఉండేది. పెట్టుబడి ఖర్చులకు అరెకరం భూమి అమ్మినం. పంటల్లో నష్టం రావటంతో రూ.5 లక్షల అప్పు అయింది. కూతురుకు పెళ్లి ఎలా చేయాలనే ఆందోళనతో నా భర్త 2016లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతవరకు పరిహారం మంజూరు కాలేదు. భూమి అమ్మి నా బిడ్డ పెళ్లి చేసిన. నా కొడుకు స్వామి చదువు మానేసి హైదరాబాద్‌కు వెళ్లి మద్యం దుకాణంలో జీతం చేస్తున్నాడు.

చెవిటి బాలవ్వ, చిట్యాల, సిద్దిపేట జిల్లా

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates