రోజుకు 31 మంది అన్నదాతల ఆత్మహత్యలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– మూడేండ్లు ఆలస్యంగా రిపోర్టు
– రైతు ఆత్మహత్యల గణాంకాలను విడుదల చేసిన కేంద్రం
– మహారాష్ట్ర అగ్రస్థానం : ఎన్సీఆర్బీ

జై జవాన్‌.. జై కిసాన్‌ అని నినదించిన రోజులనుంచి… పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం అన్నదాత రోడ్డుకెక్కే స్థితికి చేరుకున్నాడు. పెట్టిన పెట్టుబడి కూడా రాక… అప్పుల ఊబిలో కూరుకుపోయి… రైతన్న అర్థంతరంగా తనువు చాలిస్తున్నాడు. కష్టాల నుంచి గట్టెక్కే మార్గం కనపడక.. మనోస్థైర్యాన్ని కోల్పోయి కర్షకులెందరో నూరేండ్ల జీవితాన్ని అర్ధంతరంగా, బలవంతంగా ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తున్నారు. రైతుల ఆత్మహత్యల వివరాలను తొక్కి పెట్టిన మోడీ సర్కార్‌ ఎట్టకేలకు ఆ రిపోర్టును మూడేండ్లు ఆలస్యంగా విడుదల చేసింది. అయితే ఎన్సీఆర్బీ నివేదికలో ఉన్న ఆత్మహత్యల సంఖ్య కన్నా.. రికార్డులకెక్కని సంఖ్య భారీగా ఉంటుందని రైతుసంఘాల నాయకులు అంటున్నారు.
న్యూఢిల్లీ : రైతే దేశానికి వెన్నుముక అంటారు. ఆ వెన్నెముకే విరిగిపోతే.. మనుగడ సాధ్యమా? వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ విధానాలు వెరసి దిక్కుతోచని స్థితిలో అన్నదాత ఉరికంబాలనెక్కుతున్నారు. అప్పు… దళారులు.. ఇలా ఎన్నో కష్టాలు.. నష్టాల్లో ఉన్న రైతులను గట్టెక్కించే చర్యలు తీసుకోకుండా లైట్‌ తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానంటూ వాగ్దానం చేసిన ప్రధాని మోడీ 2014లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వారి సమస్యలను పట్టించుకోలేదు. నష్టపరిహారం చెల్లించాలనీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలుచేయాలనీ, గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాత ఆందోళనలకు దిగారు. ఢిల్లీ వేదికగా వారిపై లాఠీలకు పనిచెప్పిన సందర్భాలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో అన్నదాతల ఆత్మహత్యల గణాంకాలను కూడా కేంద్ర సర్కారు వెల్లడించకుండా నొక్కిపెట్టింది. ఎట్టకేలకు మూడేండ్లు ఆలస్యంగా 2016కు సంబంధించిన ఎన్సీఆర్బీ గణాంకాలను విడుదల చేసింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం… 2016లో 11,379 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంటే రోజుకు 31 మంది అన్నదాతలు చనిపోయారు. కాగా, రైతుల ఆత్మహత్యలకుగల కారణాలను మాత్రం ఎన్సీఆర్బీ పేర్కొనకపోవటం గమనార్హం. 2016లో దేశంలో 11,370 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని 2018 జులైలో లోక్‌సభకు ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ డేటా తాత్కాలికమనీ, ఎన్సీఆర్బీ ఇంకా తుది నివేదికను ఇవ్వాల్సి వున్నదని పేర్కొంది. అన్నదాతల ఆత్మహత్యల నివేదికను చివరిసారిగా 2015లో విడుదలవటం గమనార్హం.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం రైతు ఆత్మహత్యల సంఖ్య తగ్గింది. ఇది 2016లో 11,379 కాగా, 2014లో 12,360, 2015లో 12,602 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో అత్యధిక మంది పురుషులుకాగా, మహిళా రైతులు 8.6శాతంగా పేర్కొంది. పొలాల్లో పనిచేసేవారిలో మహిళల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ, వారికి భూ హక్కులు లేకపోవటంతో వారిని రైతులుగా వర్గీకరించకపోవటం ఇందుకు ప్రధాన కారణం.

మహారాష్ట్రలోనే అధికం
3,661 మంది రైతు ఆత్మహత్యలతో బీజేపీ పాలిత మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది. 2014, 2015లో ఈ సంఖ్య వరుసగా 4,004, 4,291గా నమోదైంది. 2016లో 2,079 మంది ఆత్మహత్యలతో కర్నాటక రెండో స్థానంలో ఉంది. 2015లో ఈ రాష్ట్రంలో 1,569 మంది రైతులు చనిపోయారు. తమ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవంటూ పశ్చిమబెంగాల్‌ ఎన్సీఆర్బీకి నివేదిక ఇచ్చింది. దీంతో 2015, 2016లో రాష్ట్రంలో ఆత్మహత్యల సంఖ్య సున్నాగా ఆ రాష్ట్రం పేర్కొంది. 2014లో రాష్ట్రంలో 230 ఆత్మహత్యలు జరిగాయి. బీహార్‌లో కూడా తమ రాష్ట్రంలో అన్నదాతల మరణాలు లేవని పేర్కొంది. కాగా, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ నుంచి రైతు ఆత్మహత్యలపై అనేక వార్తా నివేదికలు వెలువడ్డాయి.
1995 నుంచి 3,33,407 మంది రైతుల ఆత్మహత్య
1995 నుంచి ఎన్సీఆర్బీ రైతు ఆత్మహత్యల గణాంకాలను ప్రచురించటం ప్రారంభించింది. ఆనాటి నుంచి 2016 గణాంకాలను కూడా కలుపుకుని… దేశంలో మొత్తం 3,33,407 మంది రైతులు తనువు చాలించారు. ఈ గణాంకాల్లో వాస్తవంలేదనీ… నిజానికి ఆత్మహత్యలకు పాల్పడినవారి సంఖ్య ఇందుకు రెట్టింపు ఉంటుందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం కావాలనే లెక్కలను తక్కువ చేసి చూపిందని విమర్శిస్తున్నాయి.

Courtesy Navatelangana..

RELATED ARTICLES

Latest Updates