8 కాదు.. 12 గంటల పని..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– కరోనా నేపథ్యంలో ఆరు రాష్ట్రాల నోటిఫికేషన్లు
– వేతనాల చెల్లింపులో లేని స్పష్టత

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో విధించిన రెండోవిడత లాక్‌డౌన్‌ ఆదివారం నాటితో ముగియనున్న నేపథ్యంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు అధిక పని గంటల గండాన్ని ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ఐదు రాష్ట్రాలు పనిగంటలను పెంచుతూ నోటిఫికేషన్లు జారీ చేశాయి. ప్రస్తుతం ఉన్న రోజుకు ఎనిమిది గంటల పనివిధానాన్ని 12 గంటలకు పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నాయి. ఇందుకు ప్రభుత్వాలు పలు కారణాలు చెప్పుకొస్తున్నాయి. కరోనా నేపథ్యంలో లక్ష్యాలను చేరుకునేం దుకు, తక్కువ మంది కార్మికులతో, షిఫ్ట్‌లను తగ్గించుకునేందుకు పరిశ్రమలకు అవకాశం కల్పించినట్టు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించి రాజస్థాన్‌ ప్రభుత్వం మూడు నెలల పాటు పనిగంటలను పెంచుతూ ఏప్రిల్‌ 11న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 33 శాతం తక్కువ కార్మికులతో ఆరు రోజుల రోజుల పాటు కార్యకలాపాలు కొనసాగించుకునేందుకు ఇది పరిశ్రమలకు అవకాశం కల్పిస్తుందని తెలిపింది.

వేతన చెల్లింపులో లేని స్పష్టత
ఈ విధమైన మార్గదర్శకాలు జారీ చేసిన గుజరాత్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లు ఉన్నాయి. అధిక పని గంటలకు వేతనం చెల్లిస్తారా లేదా అన్న దానిపై సరైన స్పష్టత లేదు. రాజస్థాన్‌ ప్రభుత్వం విడుదల చేసిన నియమాల్లో అదనపు నాలుగు గంటల పనిని ఓవర్‌టైమ్‌గా పరిగణిస్తారని ఉంది. ఏప్రిల్‌ 17న గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ప్రస్తుతం ఉన్న వేతనాలకు అనుగుణంగానే అదనపు పనిగంటలకు వేతనం ఉంటుందని పేర్కొంది. ఆరు గంటల తర్వాత బ్రేక్‌ ఇస్తారని తెలిపింది. వేతనాలను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఇప్పటికే లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న పలు పరిశ్రమలు ప్రకటించాయి.

కార్మిక సంఘాల ఆగ్రహం..
పనిగంటల విధానాన్ని మార్పు చేయడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నో ఉద్యమాలతో ఎనిమిది గంటల పని విధానాన్ని తెచ్చుకున్నామని, ప్రభుత్వాలు ఏకపక్షంగా మార్చలేవని పేర్కొన్నాయి. పని గంటల విధానాల్లో మార్పులు చట్టవిరుద్ధమని, కోర్టుల్లో ఛాలెంజ్‌ చేస్తామని ఢిల్లీకి చెందిన వర్కింగ్‌ పీపుల్స్‌ ఛార్టర్‌ కోఆర్డినేటర్‌ చందన్‌కుమార్‌ తెలిపారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates