షాహీన్ బాగ్ వుద్యమాన్ని ప్రత్యక్షంగా చూసిన దేవిగారి స్పందన.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 దేవి

దేవి కార్యరంగంలో, రచనా రంగంలో అనుభవం ఉన్న కార్యకర్త.  షహీన్ బాగ్ వగైరా ఉద్యమాలను ఆమె అర్థం చేసుకొని, మాతృకలో విశ్లేషించారు. ఆ యుద్ధరంగంలో ఉన్న వారికి మనం ఎలా సహకరించాలో చెబుతున్నారు.  “నేర్పాలి. జాగ్రత్తగా ఏ మాటల్ని ఎట్లా అర్ధం చేసుకోవాలో… ఏ చర్యని ఎట్లా విశ్లేషించాలో… అన్నింటికీ మించి వరద తీసేటపుడు ఎట్లా తట్టుకుని తిరిగి లేవాలో ఉద్యమానుభవాలు వీరికి నేర్పాలి. ఒక సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం చేయాలి.” అంటున్నారు.

నడుస్తున్న చరిత్రపై స్త్రీల ముద్ర

‘‘స్త్రీలు భారతదేశ చరిత్రను తిరగరాస్తారు’’ అన్నది గురజాడ సూక్తి. తిరగరాయటం మాట అటుంచితే … దేశంలో నేటి చరిత్రను రాసే పని మాత్రం స్త్రీలే భుజాన్నేసుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. దేశ రాజధాని ఢిల్లి నగరం రంగు మారుతున్న అపూర్వ దృశ్యం చూడాలంటే ఢిల్లి గల్లి గల్లి అందునా పేదలుండే ప్రాంతాల్లో తిరగాలి. ఎముకలు కొరికే చలిలో కూడా వేడెక్కుతుంది.  ఇంద్రలోక్ కాలనీ, చంద్రాపూర్, వజిరే పురా ముస్తఫా బాద్, జామియా… యిట్లా పది పన్నెండు చోట్ల తిరుక్కుంటూ షాహీన్ బాగ్ చేరాలి. అన్ని గుడారాల్లో దాదాపుగా ఒకటే దృశ్యం – వృత్తులు, పనులు, ఉద్యోగాలు ఎవరివి వారు చేసేసుకుని హడావిడిగా జనం.. తిరునాళ్లకి పోతున్నట్టు గుంపులుగా ఈ గుడారాల వైపు నడుస్తుంటారు. ప్రత్యేకించి మధ్యాహ్నం తరువాత చంటి బిడ్డల్ని రజాయిల్లో చుట్టుబెట్టుకుపోయే తల్లులు .. రగ్గులు కప్పుకుని శివరాత్రి జాగారణకు పోతున్నట్టు పోయే మధ్య వయస్కులు … జెండాలు, మూడు రంగుల జెండాల రెపరెపలతో రివ్వు రివ్వున పోయే యువత.

టార్పాలిన్ కప్పేది కొద్ది భాగమే గుడారాన్ని. మిగిలిందంతా ఓ విశాల బహిరంగ ప్రదేశం. మూడురంగుల పొడవాటి గుడ్డ ప్రహరీగోడ. దానిపై అంబేడ్కర్, గాంధీ, ఆజాద్, మౌలానా, నెహ్రూ, సరోజినీ నాయుడు భగత్ సింగ్, రాం ప్రసాద్ బిస్మిల్, అష్పదుల్లా ఖాన్… ఇట్లా అందరూ కీలక వ్యక్తులయి వుంటారు. చుట్టుపక్కలంతా రకరకాల నినాదాలు అట్టలపై, చార్టులపై, గుడ్డపై, ఫ్లెక్సీలపై.. కార్టూన్లు ప్రశ్నలు సంఘీభావాలు షాహీన్ బాగ్ దగ్గర వాకర్స్ వే మొత్తం చేగువేరాతో సహా అందరూ ఫ్లెక్సీలుగా మారి మనకేసి చూస్తుంటారు.

వాకర్స్ వే కి – గుడారానికి మధ్య ఓ మినీ యిండియా గేటు నమూనా. దాని ప్రక్కనే ఆర్టీసి ఆఫీసు లైబ్రరీగా మారిపోయింది. ఆ హైవే ప్రక్క ఉన్న చెట్లన్నీ జెండాలు, పోష్టర్లు ఆకుల్లా కప్పుకున్నాయి.

అన్ని మతాలు అన్ని తరగతులు అన్ని వర్గాలు అన్ని వర్ణాలు అన్ని వయసుల వాళ్లు వస్తుంటారు. కూర్చుంటారు. వింటారు. మాట్లాడతారు. చర్చించుకుంటారు. చాయ్ లు, మరీ ఆకలేస్తే చపాతీ రోల్సు వీధి తిండి వేడిగా.. మళ్లీ పోయి కూర్చుంటారు. తృప్తి తీరనట్టు.. మగాళ్లు రకరకాల గడ్డాలు విభిన్న

రంగుల్లో వయసుల్లో . . షోకి క్రాఫుల్లో కుర్రకారు. చుట్టూ చైనా వాల్ మాదిరి నిలబడతారు. వేదికపై

జరిగేదాన్ని రికార్డు చేస్తారు. కేరింతలు కొడతారు. మారు పలుకుతారు. ఏడ్చే పిల్లల్ని సముదాయిస్తారు. No Nrc పతంగి యిస్తారు. కాని ప్రధాన భాగం స్త్రీలే. వారికి దారి యిస్తారు. మర్యాదగా కూర్చోబెడతారు. టీలు, ఆహారం పాకెట్లు యిస్తుంటారు. కాని స్త్రీలు వాళ్ల గోల వాళ్ళదే! పిల్లల ఏడుపు కంటే ఉపన్యాసం పైనే ధ్యాస. మాటమాటకీ ప్రతిస్పందిస్తారు. ప్రతి నినాదపు పిలుపుకీ మారుపలుకుతారు.

రాళ్ళ మీద ఎత్తు చేసి నిలబెట్టిన బల్ల వేదిక నలుచదరం. దాని వెనకాలంతా పొట్టి బల్లలు ఎక్కి దిగటానికి వీలుగా. వేదికను రక్షిస్తూ ఒక రేకు పైనంతా పెద్ద బ్యానర్ NO CAA or NRC. అంబేడ్కర్, గాంధీ ఇంకో రేకు గేటు, దాని మూలన ఒక బల్ల. ఆర్గనైజర్స్ బురఖాల్లో, బురఖాల్లేకుండాను ఒక రిజిష్టరు, పెన్నులు. మాట్లాడేవాళ్ళు, కవితలు, పాటలు, గజల్స్, నజ్మా, నినాదాలు సందేశాలు. సరే పేరు యివొచ్చు. వివరాలడుగుతారు. జాబితా చూసి ఎంత సమయం వేచి చూడాలో అందాజా  ఎవరయినా సరే పేరు ఇవ్వొచ్చు. వివరాలడుగుతారు. జాబితా చూసి ఎంత సమయం వేచి చూడాలో అందాజాగా చెబుతారు. ఎవర్ని దించేయరు. కానీ మరీ ఆపకపోతే కాస్త సూచన చేస్తారు. యువ కవులకు వాహ్వా.. లు, వన్స్ మోర్ లు. ఉపన్యాసాలకు సారాన్ని బట్టి స్పందన వస్తుంది. రుచిగా లేకుంటే వక్త పాపం తనంతటతానే విరమించు కావాల్సిన స్థితి.

అంతటి గందరగోళం మధ్యన ప్రశాంతమైన ఒక ద్వీపంలా ఈ స్త్రీలు మొత్తం పర్యవేక్షణ చేస్తుంటారు. వింటారు. ఇంటర్వ్యూలు యిస్తారు. జవాబులు చెబుతారు. వేదికపై ఒక కన్నేసి వుంచుతారు. ఉడుకురక్తం వాళ్ళని కాస్త చల్లబరుస్తుంటారు. వెళ్ళిన వాళ్ళని సమ్మాళ్లిస్తారు. ప్రశ్నలడుగుతారు. ఎంతకాలం ? ఎందుకు ? స్పందించదు ప్రభుత్వం ? మీ రాష్ట్రం ఎలా ఉంది ? అని అడిగి తెలుసుకుంటారు. అర్ధం చేసుకుని వాళ్ళలో కలుపుకుంటారు ఆత్మీయంగా.

జామియామిలియా విద్యార్థుల ఆక్రందనలతో ఉలిక్కిపడ్డ ఈ షహీన్ బాగ్ స్త్రీలు వెనకా ముందు చూడకుండా వాళ్ళకోసం పరిగెత్తారు. బాష్పవాయు గోళాలతో తరిమితే తిరిగొచ్చి రోడ్డు ప్రక్క కూలబడ్డారు. యవ్వనులు తమ భవిష్యత్తు గురించి ఆలోచించ కుండా జనం అందరి కోసం బరిలోకి దిగి పాలకుల దౌర్జన్యాలకు ఎరవుతుంటే మౌనంగా ఎట్లా ఉంటాం అనుకున్నారు. యింటికి వెళితే అశాంతి నిద్రపట్టదు. తాడో పేడో తేలేదాక రోడ్డు మీద ఉందాం అనుకున్నారు. 4 గురితో మొదలయి వేల మందికి చేరింది. యింటి గడప దాటని మహిళలు జాతీయ రహదారిని ఆక్రమించి అడ్డా వేశారు.

నెమ్మది నెమ్మదిగా, నిలకడగా, నికరంగా, శాంతియుతంగా నిరంకుశత్వాన్ని సవాలు చేశారు. మొదట్లో ఏ నీడా లేదు. నెమ్మదిగా అవే సమకూరాయి. అశాంతులంతా విధానాల వ్యతిరేకులంతా ఈ నీడకి చేరి తమ గుర్తింపుని ప్రకటించుకున్నారు. షహీన్ బాగ్ ఒక స్ఫూర్తిగా మారింది. గడ్డ కట్టించే డిసెంబర్ మాసపు చలి, వానలా కురిసే మంచు. అన్నింటి కంటే రకరకాల బెదిరింపులు కిరాయి వాళ్ళంటూ, దేశ ద్రోహులంటూ ప్రచార దాడులు అన్నింటిని చెక్కుచెదరకుండా భరించారు. స్త్రీల పట్టుదల ఎంత బలంగా వుండగలదో చూపించారు. నాయకత్వ బాధ్యతల్ని అవలీలగా భుజనికెత్తుకున్నారు.

‘‘కుటుంబం అయినా దేశం అయినా సంక్షోభం వస్తే స్త్రీలకు తెగించక తప్పదు. ‘అతనికి’ కుటుంబం లేదు కాబట్టి మమ్మల్ని బజారు కీడ్చాడు’’.

‘‘ప్రజల మాట వినకపోతే అదేం ప్రజాస్వామ్యం’’.

‘‘అస్సలు మా జాతీయతనూ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమిటి ? మత రాజ్యం కావాలంటే అపుడే దేశం వదిలే వాళ్ళం గదా !’’.

‘‘మా తాత ముత్తాతల రక్తం చిందించి సాధించిన స్వరాజ్యమిది’’.

‘‘చదువు విలువ తెలియాలంటే చదువుకుని వుండాలి.’’

‘‘తప్పుడు సర్టిఫికెట్లు కాబట్టే విశ్వవిద్యాలయాలంటే అర్ధం కావటం లేదు’’.

‘‘చదువూ శాస్త్రం లేని అజ్ఞానపు కాలానికి దేశాన్ని నెడతారా? మమ్మల్ని సర్టిఫికెట్టు అడిగే వాళ్ళకి ఆ అర్హత వుందా ?’’

మా ఓటరు కార్డు తోనే గదా గద్దెనెక్కింది. అదెందుకు చెల్లదు ? ఇట్లా అనేక ప్రశ్నలు జవాబులు అన్ని వైపుల నుండి ఎవర్ని కదిపినా ఏకధారగా మాటలు

‘‘అయోధ్య అంటే పోన్లే మేం ఎక్కడ నమాజు చేస్తే అదే మక్కా మసీదని తెల్సు కాబట్టి మాట్లాడలే. కాశ్మీరంటే నిజంగానే ఏదో కలుపుకు పోక పోతారా అనుకున్నాం. ఇట్లా ఎన్నని సరి పెట్టుకోవాలి ? పౌరసత్వం అంటే ఉల్లిపాయా ఈ పూట కూరలో వద్దులే. రేపేసుకుందాం అని సరిపెట్టుకోవడానికి’’ ఒక తిరుగులేని తర్కం అంతా సామాన్యులే. రాజకీయ పార్టీల ప్రతినిధుల నెవ్వరినీ అనుమతించలేదు.

వామపక్షాలు, కాంగ్రెసు, ఆపీ, అందరికీ రావొద్దని నిక్కచ్చిగా చెప్పేశారు’’. ఇవి ఎవరి రాజకీయ ప్రయోజనం కోసం కాదు. మా కోసం, దేశం కోసం వచ్చేవాళ్ళు. రాజకీయ నాయకులు మంచి ఉద్దేశ్యంతో వచ్చినా అది తప్పు సంకేతాలు తీయవచ్చు. దీన్ని మేం అందరికీ చెందిన సమస్యగానే  వుంచ దలిచాం’’ అనేశారు స్పష్టంగా. ఉద్యమం పక్షపాత రహితంగా ఉండటం మాత్రమే సరిపోదు. ఉన్నట్టు కనబడాలి కూడా (పారదర్శకంగా).

‘‘కొంతమంది వచ్చి మీకు మా సంఘీభావం తెలుపుతున్నాం’’ అంటున్నారు. మేం వాళ్ళని అడుగుతున్నాం ‘‘స్త్రీలనా ? మైనారిటీలనా ? రెండూ అనా ? వాళ్ళకి చెబుతున్నాం ఇది మా వొక్కరి సమస్య కాదు. పేదలు ఆదివాసులు … సర్టిఫికెట్లు లేనివాళ్ళు, నిర్వాసితులు, ప్రకృతి వైపరీత్యాల్లో అన్నీ కోల్పోయిన వాళ్ళు… ఎక్కడి నుండి తెస్తారు కాగితాలు ఎట్లా నిరూపించుకుంటారు వాళ్ళ తాతల భూమి ఇదని. కోట్ల జనం ఏమన్నా రాజరికాల / సంస్థానాల వారసులా ? తరతరాల చరిత్ర రాసి వుంచడానికీ జీవిత చరిత్రలుగా రాయించుకావడానికి ?’’ వాళ్ళ ఆచరణ వాళ్ళ ఆలోచనా పరిధిని విస్తరించుకుంటూ పోతున్నారు.

నా పిల్లలకి నేను రోజూ ప్రతిజ్ఞ చేయిస్తాను. సమానత్వం, లౌకికత్వం గురించి పాతికేళ్ళుగా బోధిస్తున్నాను. వాళ్ళు ఆ విలువలకే కట్టుబడి వుండమంటే ముళ్ళ బాటన నిలువ మన్నట్టేగా ? అందుకే ప్రతీ సాయంత్రం ఇలాంటి ఒక చోటకు వెళుతున్నా.. నా పాఠాలు నిలబడతాయో లేదో తెల్సుకోవాలిగా’’ అందొక టీచరు.

‘‘నకాబ్’’ మాటు నుంచి మెరిసే కళ్ళు ఉన్నట్టుండి చురుగ్గా మారి ‘‘ఇంక్విలాబ్ జిందాబాద్’’ అని పిడికిలి ఎత్తుతాయి. అదేంటో తెలుసో.. తెలియదో.. కాని అది యిచ్చు ఉత్తేజం మాత్రం అంతే ! ఎన్నడూ వేదికేక్కని వాళ్ళు ‘‘మేం చూస్తాం, నిరంకుశ పర్వతాలు దూది పింజల్లా ఎగిరి పోయే కాలాన్ని చూస్తాం మేము…’’ అంటూ గొంతులోంచి పెయిన్ ని ఆవాహన చేస్తారు. కుర్తా పైజమా, వెయిష్టు కోటు నూనూగు మీసాల వాడు అబద్దాల సర్దారూ ఎంత కాల మింక నీ జోరూ’’ అంటూ పాడుతూ జనాన్ని ఊపిస్తాడు.

ఓ విద్యార్ధి ‘‘నేలను అడిగాను ఆజాదీ, ఆకాశం యిచ్చింది ఆజాదీ నీవూ గర్జించు మరి ఆజాదీ’’ అంటూ వయినాలుగా ఆజాదీ నినాదాల్ని కవిత్వీకరిస్తాడు. అన్ని గొంతుల్లో అది మార్మోగుతుంది.

గదర్ వీరుల గురించి, మౌలానా ఆజాద్, చంద్ర శేఖర్ ఆజాద్ ల ఉమ్మడి ఆజాదీ వారసత్వం గురించి, బేగం హజ్రత్ మెహల్, లక్ష్మిబాయిల వీరత్వం అన్నింటికి మించి స్వాతంత్ర్య సమరంలో తలపడిన కోట్ల మంది భారతీయుల ఐక్య పోరాటం గురించీ, బందగీ బలిదానం మగ్దూం స్వేచ్ఛాగానం గురించి వాళ్ళు వింటారు. హిందీ ఇంగ్లీషు ఉర్దూలలో నేరుగా మిగిలిన భాషేదయినా అనువాదంలో ..

అన్నిట నిరంతరాయ మేధోమధనం తో నేర్పడం నేర్చుకోవడం జమిలిగా సాగుతున్నాయి. రాజ్యాంగంలో ఏముందో ఎట్లా దాన్ని వ్యాఖ్యానించాలనే విషయం. దాన్ని తిరిగి వల్లించడం వారికి చాల యిష్టమయిన చర్య. చాలా స్పష్టంగా ఆచరణ అధ్యయనపు అవసరాన్ని ఎంత పెంచుతుందో కనబడుతుంది. తమను తాము తాజా పర్చుకునే ఉద్దేశ్యం గల ఉద్యమా లేవయినా ఇక్కడ నేర్చుకోవల్సింది చాల వుంది. ఒక కొత్త భాష .. ఒక నూత్న అధి వ్యక్తీకరణ ఒక సమాంతర నాయకత్వం ఒక ఆధిపత్యం లేని సమన్వయం నేర్చుకోవాలి. కొత్త పోకడలని స్వీకరించడం. అసమ్మతిని, అశాంతిని, ఉద్రేకాల్ని.. ఉద్యమంలో భాగంగా ఆమోదించి ము   వేయకుండా శాంత పడటం నేర్చుకోవాలి.

నేర్పాలి. జాగ్రత్తగా ఏ మాటల్ని ఎట్లా అర్ధం చేసుకోవాలో.. … ఏ చర్యని ఎట్లా విశ్లేషించాలో .. స్వీకరించాల్సినవి. అన్నింటికీ మించి వరద తీసేటపుడు ఎట్లా తట్టుకుని తిరిగి లేవాలో ఉద్యమానుభవాలు వీరికి నేర్పాలి. ఒక సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం చేయాలి.

వీళ్ళంతా అపుడే తొలిసారి బయటకు వచ్చిన వాళ్ళు .. కొత్త వూపు ఆవేశంలో కలబడుతున్న వాళ్ళు.. అణిచివేత ఎంత భీభత్సాన్ని సృష్టిస్తుందో దానికి జామియా, జె యన్ యు, ఆలీఘర్ విశ్వవిద్యాలయాలు ఒక చిరు ప్రారంభం మాత్రమేనని తెలియచెప్పాలి.

సైతాను ఆధిపత్యం అధికారం రూపంలో విరుచుకుపడే సందర్భంలో కదలకుండా నిలబడే నిబ్బరం సాధన చేయించాలి. ఈ లేచే పిడికిళ్ళు దించకుండా ఎత్తి ఉంచే శక్తిని సహకారాన్ని వాళ్ళకి అందించాలి. ఇది కేవలం CAA NRC లపై పోరాటం కాదు. ఇది అనేకంగా జరుగుతున్న మతోన్మాద దాడులు., దుర్మార్గాలు, దోపిడీ విధానాలపై పేరుకున్న అసంతృప్తి బ్రద్దలయిన కాలం అంతే ..

కాబట్టి తీర్ధ యాత్రలకి పోయినట్లు ఉద్యమ ఉద్వేగాలతో ఊగిపోతున్న గుడారాలని సందర్శించాలి.

ఈ జనంలో స్నానం చేసి కొత్త శక్తిని పుంజుకోవాలి. కుంటలు, కోనేర్లు, చెరువులు, సెలయేర్లు, వాగులుగా బహుళంగా జన ఆందోళన ప్రతి చోటా నిలిచేలా ప్రవహించేలా చేయాలి.

పోటుతో సముద్రంలోకి పోయే వాడే నావికుడు. షహీన్ బాగులతో ఉరికే వాళ్ళే ఉద్యమ కారులు నేడు…

రచయిత్రి  సాంస్కృతిక కార్యకర్త.

RELATED ARTICLES

Latest Updates