నోళ్లు నొక్కుతున్నారు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మహావీర్‌ నర్వాల్‌, తన కుమార్తె నటాషా బెయిల్‌కు అవసరమైన పూచీకతు డబ్బును డిపాజిట్‌ చేసేందుకు ఢిల్లీ లోని కర్కర్‌డూమా కోర్టు ప్రాంగణంలో వేచి వున్నారు. ఆ తర్వాత నగరంలో మరో మూలనున్న పాటియాలా హౌస్‌ కోర్టుకు చేరుకుని.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మెజిస్ట్రేట్‌ ముందు హాజరు కానున్న తన 32 సంవత్సరాల కుమార్తెను ఒకసారి చూడాలన్నది ఆయన ఆశ. మహావీర్‌ నర్వాల్‌ ‘హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం’లో సీనియర్‌ శాస్త్రవేత్త. కుమార్తె మీద చేసిన ఆరోపణలన్నీ (హత్య, కుట్ర) నిరాధారమైనవనీ, ఇదంతా ముగిసేసరికి ఆమె దృఢంగా తయారవుతుందనీ అంటారాయన.

నటాషా నర్వాల్‌, ఆమె స్నేహితురాలు దేవాంగన కలిత… ఇద్దరూ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు. స్త్రీవాద సమ్మేళనం ‘పింజారా తోడ్‌’ వ్యవస్థాపక సభ్యులు కూడా. ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాకాండతో సంబంధం వుందన్న ఆరోపణల మీద వారిని మే 23న అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని ‘ఎస్‌ఎఫ్‌ఐ, సర్వ్‌ కర్మచారీ సంఘ్‌, ఐద్వా, సిఐటియు, కిసాన్‌ సభ, నాగరిక్‌ మంచ్‌’ రోహ‌ాతక్‌లో డిమాండ్‌ చేశాయి. ‘ఉపా’ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కింద నటాషా పై చేసిన అభియోగాలను విరమించుకోవాలని, ఇరువురినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రపతికి మెమొరాండం పంపాయి. తమ లేఖకు సానుకూల స్పందన లభిస్తుందని ఐద్వా నేత జగ్మతి సంగ్వాన్‌ భావిస్తున్నారు. మండోలీ జైలు వెలుపల నటాషా, దేవాంగనను కలిశాక స్పందిస్తూ ”వారిపై మోపిన అభియోగాలు నిరాధారమూ కుట్రపూరితమైనవి. అవన్నీ తప్పుడు ఆరోపణలు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి)కు వ్యతిరేకంగా ‘పింజారా తోడ్‌’ శాంతియుత నిరసనలు తెలిపింది. కఠిన చట్టాల కింద వారిపై నేరారోపణలు చేసేందుకు ఎటువంటి ఆధారమూ లేదు” అన్నారామె.

దేవాంగన సొంత రాష్ట్రమైన అసోంలో కూడా ఇటువంటి స్పందనలే వెలువడ్డాయి. యువతులను వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోరు లేఖ రాశారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించిందని, విద్యార్థులు తమ ప్రాథమిక హక్కును శాంతియుతంగా వినియోగించుకున్నారని అంతకుమించి వారు ఎలాంటి నేరాలకు-హింసకు పాల్పడలేదన్నారాయన. ”రాజ్యాంగాన్ని, అస్సాం ఒప్పందాన్ని ఉల్లంఘించే సి.ఎ.ఎ కి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదంతా కేవలం కక్ష సాధింపు రాజకీయాలు మినహా మరొకటి కాదు. ప్రాథమిక హక్కులను అణచివేయడమే’ అన్నారాయన. అసోం ప్రతిపక్షనేత దేబబ్రత సైకియా స్పందిస్తూ ”ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ఒకప్పుడు అసోం విద్యార్థి నాయకుడు. ఎన్నో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇవాళ ఒక అసోం విద్యార్థినిని అరెస్టు చేస్తే నోరు మెదపడంలేదు. ఈ విషయంలో జోక్యం చేసుకుని వారిని విడుదల చేసేందుకవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను” అన్నారు.

ఆ ఇద్దరు యువతులను అరెస్టు చేయడానికి ముందు వారి ఇళ్లల్లోనే ‘ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌’ మూడు గంటల పాటు ప్రశ్నించింది. వారి లాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుంది. దాంతో ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండకు సంబంధించి అరెస్టు చేసిన మహిళల సుదీర్ఘ జాబితాలో వీరూ చేరిపోయారు. ఎంబిఎ విద్యార్థిని గుల్ఫిషా ను దేశద్రోహం కేసు కింద ఏప్రిల్‌ 9 నుంచి జైల్లో పెట్టారు. జామియా కోఆర్డినేషన్‌ కమిటీ సభ్యురాలు సఫూరా గర్భవతి అని కూడా చూడకుండా గత 45 రోజులుగా ఆమెను తీహార్‌ జైల్లో బంధించారు. కాంగ్రెస్‌ మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఇశ్రాత్‌ జహాన్‌ను ‘ఉపా’ చట్టం కింద అరెస్టు చేశారు. జూన్‌ 12న ఆమె వివాహం వుండడంతో 2వ తేదీన బెయిల్‌ మంజూరు చేశారు.
జఫారాబాద్‌ మెట్రో స్టేషన్‌ ఫ్లైఓవర్‌ కింద సిఎఎ/ఎన్‌ఆర్‌సి కి వ్యతిరేకంగా చేసిన ధర్నాలో ‘పింజారా తోడ్‌’ కూడా పాల్గొంది. ఈశాన్య ఢిల్లీలో కనీసం మూడు చోట్ల కొన్ని నెలలపాటు ధర్నాలు సాగాయి. జఫారాబాద్‌ పోలీసులు ఫిబ్రవరి 23న రూపొందించిన ఎఫ్‌ఐఆర్‌ మేరకు ఇద్దరు ‘పింజారా తోడ్‌’ విద్యార్థినులను అరెస్టు చేశారు. దీనికి ముందు రోజు…పోలీసులు నిరసనకారులను చెదరగొడతారా సరి. లేకపోతే తామే ఆ పని చేస్తామని బిజెపి నేత కపిల్‌ మిశ్రా హెచ్చరికలు చేయడాన్ని విస్మరించకూడదు. ఐపిసి186, 341, 353 (ప్రభుత్వ ఉద్యోగిని విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం, దాడులకు దిగడం)తో పాటుగా 147, 188, 283, 34 సెక్షన్ల కింద విద్యార్థినులపై అభియోగాలు మోపారు.

మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ అజీత్‌ నారాయణ్‌ మే 24న వారికి బెయిల్‌ మంజూరు చేస్తూ…నిందితులు కేవలం ఎన్‌ఆర్‌సి/సిఎఎ కి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారుగాని వారు ఎటువంటి హింసలోనూ పాల్గొనలేదని పేర్కొన్నారు. అయితే ఈ తీర్పు అనంతరం, సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇద్దరు మహిళలపై మరింత తీవ్ర నేరారోపణలు చేస్తూ రెండవ ఎఫ్‌ఐఆర్‌ (ఫిబ్రవరి 26వ తేదీ కింద నమోదు చేసినది)ను కోర్టుకు అందించింది. ఈసారి వారి మీద సెక్షన్‌ 302 (హత్య), 332, 307 (హత్యా యత్నం), 427, 120 బి (నేరపూరిత కుట్ర), ఐపిసి 188తో పాటుగా, ఆయుధాల చట్టం, ప్రజా ఆస్తుల నష్ట నివారణా చట్టం (పిడిపిపిఎ) కింద తీవ్ర నేరారోపణలు చేశారు. దాంతో వారిని రెండు రోజులు కస్టడీ లోకి తీసుకోవడానికి కోర్టు అనుమతించింది. ఆ గడువు పొడిగించడంతో వారు అప్పటి నుంచి జుడిషియల్‌ కస్టడీ కింద తీహార్‌ జైల్లో మగ్గిపోతున్నారు. వీటికి తోడు, నటాషా నర్వాల్‌ మీద ‘ఉపా’ చట్టం కింద అభియోగాలు మోపారు. దేవాంగన మీద దర్యాగంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో మూడవ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే అందులో ఆమెకు బెయిల్‌ లభించింది.

ఈశాన్య ఢిల్లీ హింసాకాండకు సంబంధించిన ఇతర కేసులలో మాదిరిగానే బెయిల్‌ లభించకుండా వీరి మీద కూడా అనేక కేసులు బనాయించారు. జాఫ్రాబాద్‌ ఆందోళన కేసులో సఫూరా జర్గార్‌కు బెయిల్‌ లభించినప్పటికీ, ‘అల్లర్లకు కుట్ర కేసు’లో ఆమెను తిరిగి అరెస్టు చేశారు. అల్లర్లలో ఆమె పాత్ర ఏమిటనే విషయమై స్పష్టత లేదని…బెయిల్‌కు సంబంధించిన విచారణ సందర్భంగా జడ్జి అన్నప్పుడు, ఆమెపై ‘ఉపా’ కింద అభియోగాలు మోపారు. ఇశ్రాత్‌ జహాన్‌కు మార్చి 21న అదనపు సెషన్సు జడ్జి (ఎఎస్‌జె) బెయిల్‌ మంజూరు చేసినప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. అదే రోజున ఆమె మీద ఐపిసి, ఉపా, ఆయుధాల చట్టం, పి.డి.పి.పి.ఎ కింద మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’ సభ్యులు పర్వేజ్‌ అలమ్‌, మహ్మద్‌ ఇల్యాస్‌, మహ్మద్‌ డానిష్‌ కేసులో కూడా సరిగ్గా ఇదే జరిగింది. వారికి ఒక చోట బెయిల్‌ మంజూరయినప్పటికీ వెంటనే మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు, మరోసారి అరెస్టులు జరిగిపోయాయి.

ఈ కేసులు, అరెస్టులకు సంబంధించి తమ దర్యాప్తుల వివరాలను పోలీసులు ఏమాత్రం వెల్లడించరు. అయితే, హోం మంత్రిత్వ శాఖకు నివేదికలు సమర్పించిన రెండు స్వచ్ఛంద సంస్థలు (కాల్‌ ఫర్‌ జస్టిస్‌, గ్రూప్‌ ఆఫ్‌ ఇంటలెక్చువల్స్‌ అండ్‌ అకడమీషియన్స్‌) మాత్రం తాము ఏ దిశగా పనిచేసిందీ సంకేతాలు ఇస్తుంటాయి. ఇలా వుండగా, ఎన్‌జిఓ ల నివేదికలకు అనుగుణంగా దర్యాప్తు జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ”సమాజానికి సందేశం పంపడం” కోసం ఒక వ్యక్తికి బెయిల్‌ నిరాకరించకూదని, అలాగే దర్యాప్తుకు నిందితులు అవసరం లేదని కోర్టు భావించినప్పుడు వారిని జుడిషిల్‌ కస్టడీలో వుంచనక్కర్లేదని ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ అనుప్‌ జైరామ్‌ భంభానీ అంటారు.

ఇకపోతే, విద్యార్థులు హింసాకాండకు సంబంధించిన కుట్రకు పాల్పడినట్లు పోలీసులు చేస్తున్న ఆరోపణల విషయం పరిశీలిద్దాం. ”ప్రస్తుతానికి ఇది కేవలం పోలీసు సిద్ధాంతం. కుట్ర నుండి నేరం జరిగే వరకు వున్న సాక్ష్యాలను వారు సమర్పించాలి. అయితే ఈ విషయమై తమ దగ్గర ”రహస్య సమాచారం” ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ రహస్య సమాచారం ఏమిటో వెల్లడించనేలేదు. కేసు కేవలం ఒక సిద్ధాంతం మీద ఆధారపడి ఉండదు. పైగా, ప్రేరే పించారంటూ కేసును ఎంతవరకు సాగదీస్తారు? ఇలాగైతే దేశంలో జరిగిన మూక దాడులకు సంబంధించిన అన్ని కేసు లను తిరిగి పరిశీలించాల్సి ఉంటుంది” అంటారు జామియా విద్యార్థి మీరన్‌ హైదర్‌ తరపు న్యాయవాది సరిమ్‌ నవేద్‌.

వేలాది మందిపై ఆరోపణలు
ఫిబ్రవరిలో చోటుచేసుకున్న హింసాకాండకు సంబం ధించి 3,304 మంది మీద నేరారోపణలు మోపబడ్డాయి. ఈ హింసాకాండలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, 226 ఇళ్లు, 487 దుకాణాలు దెబ్బతిన్నాయి. మొత్తం 763 కేసులు (వీటిలో ఆయుధాల చట్టం కింద 51) నమోదయ్యా యని హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి చెప్పారు. లాక్‌డౌన్‌లో మరో 800 మందిని తీసుకెళ్లారని ప్రజాసంఘాల అంచనా. 36 సంఘాలు (ఐసా, ఎస్‌ఎఫ్‌ఐ, భీమ్‌ ఆర్మీ, రిహారు మంచ్‌, సహేలి, విమెన్‌ ఎగెనెస్ట్‌ సెక్సువల్‌ వయొలెన్స్‌ అండ్‌ స్టేట్‌ రిప్రెషన్‌…) ఈ అరెస్టులను ఖండించడమే గాక, రాజ్య అణచివేతను వ్యతిరేకించాయి. నిరసన తెలిపే హక్కును నేరమయం చేయడంపై అభ్యంతరం తెలిపాయి.

విద్యార్థుల వరుస అరెస్టులపై దళిత కార్యకర్త, గుజరాత్‌ ఎం.ఎల్‌.ఎ జిగేష్‌ మేవాని స్పందిస్తూ ‘పాలకులను విమర్శించేవారి నోరు మూయించేందుకు ‘ప్రభుత్వం పన్నుతున్న కుట్ర’ ఇదని, అంతా ‘కక్ష సాధింపు రాజకీయ’మని అన్నారు. ఖలీద్‌ సైఫీ, కఫీల్‌ ఖాన్‌, గౌతమ్‌ నవలఖ, ఆనంద్‌ తెల్తుందే, అఖిల్‌ గొగోరు వంటి వారి కోసం చేసే సంయుక్త పోరాటమిదని పేర్కొన్నారు. మనమంతా కలిసి కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాడుతుండగా, ప్రభుత్వం యువత-విద్యార్థులపై దాడికి దిగడం అత్యంత దురదృష్టకరమని జెఎన్‌యు విద్యార్థి సంఘం పూర్వ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ అన్నారు. ”ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి బెయిల్‌ ఇస్తూ, విద్యార్థులపై ఆరోపణలు గుప్పించి, వారిని కటకటాల వెనక్కి నెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని కన్నయ్య ప్రశ్నిస్తున్నారు.

– దివ్య త్రివేది
(ఫ్రంట్‌లైన్‌ సౌజన్యంతో)

Courtesy Prajasakti

RELATED ARTICLES

Latest Updates