మారని కార్పొ ‘రేటు’!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

బిల్లు ఇవ్వకుండా తెల్లకాగితాలపై లెక్కలు!
కార్డు వద్దు.. డబ్బు కట్టాల్సిందే
మంత్రి హెచ్చరించినా ఫలితం శూన్యం
బుధవారం కొత్తగా 24 ఫిర్యాదులు

హైదరాబాద్‌, ఆగస్టు 5 : కరోనా చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల తీరు ఏ మాత్రం మారడం లేదు. వైర్‌సతో రోగులు వణికిపోతుండగా.. ప్రైవేటు ఆస్పత్రులు వేస్తున్న బిల్లులు చూసి వారి కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు ప్రభుత్వ హెచ్చరికలనూ బేఖాతరు చేస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే రెండు ఆస్పత్రులకు కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసినా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరికలు జారీ చేసినా.. కార్పొరేట్‌ ఆస్పత్రుల వైఖరిలో మార్పు రావడం లేదు. తమదైన శైలిలో యథావిధిగా రోగుల్ని పీడిస్తూనే ఉన్నాయి. బుధవారం ప్రైవేటు ఆస్పత్రులపై కొత్తగా మరో 24 ఫిర్యాదులు వైద్య ఆరోగ్యశాఖకు అందాయి. ఇప్పటివరకు మొత్తం 951 ఫిర్యాదులు వచ్చాయి.

ఇంత కడితేనే.. 
సనత్‌నగర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రి అయితే ఏకంగా తమ ఆస్పత్రిలో చేరాలంటే ఎంత అడ్వాన్స్‌ కట్టాలో తెలియజేస్తూ ఓ పేపర్‌నే రోగుల కుటుంబ సభ్యులకు ఇస్తోంది. అడ్మిషన్‌ సమయంలో రూ.3 లక్షలు, వెంటిలేటర్‌ అయితే రూ.5 లక్షలు, పీపీఈ కిట్లకు రోజుకు రూ.14300, కొవిడ్‌ టెస్టుకు రూ.3500, వెంటిలేటర్‌పై రోజుకు రూ.1.05 లక్షలు, ఆక్సిజన్‌ లేకుండా డీలక్స్‌ రూమ్‌లో అయితే రోజుకు రూ.70 వేలు, ఆక్సిజన్‌తో అయితే రూ.83వేలు అని మెనూ కార్డులాగా వచ్చేవారికి ఇస్తోంది. ఇప్పుడది సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఉన్నత స్థాయి పైరవీలు..
ప్రైవేటు ఆస్పత్రులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో ప్రభుత్వం వాటిపై విచారణ జరుపుతోంది. కొన్ని ప్రముఖ ఆస్పత్రులకు కూడా నోటీసులు అందాయి. దీంతో ఆస్పత్రుల యాజమాన్యాలు పైరవీలు ప్రారంభించాయి. తమపై చర్యలు చేపట్టకుండా వైద్య ఆరోగ్యశాఖలో కీలక వ్యక్తులతో లాబీయింగ్‌ నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే కొన్ని ఆస్పత్రులపై తీవ్రమైన ఫిర్యాదులు వచ్చినా.. నోటీసులు తప్ప చర్యలేం తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తెల్ల కాగితాలపైనే బిల్లులు
అడ్డగోలు చార్జీలపై బాధితులు వైద్యఆరోగ్యశాఖకు ఫిర్యాదులు చేస్తుండడంతో ప్రైవేటు ఆస్పత్రులు రూటు మార్చాయి. ఇప్పటి దాకా ఆస్పత్రి నుంచి రోగి డిశ్చార్జి అయితే సమ్మరీ ఇచ్చేవారు. అందులో బిల్లు ఎంత వేశారో తెలిపేవారు. వైద్యానికి, డాక్టర్‌ కన్సల్టేషన్‌, నర్సింగ్‌ చార్జీలు, బెడ్‌, మందుల చార్జీల వివరాలను పొందుపరిచేవారు. చాలా బిల్లుల్లో వైద్యానికంటే పీపీఈ కిట్లు, ఇన్వెస్టిగేషన్స్‌, బెడ్‌, నర్సింగ్‌ చార్జీలే ఎక్కువగా ఉంటున్నాయి. మందులకు చాలా తక్కువ బిల్లు వేస్తున్నారు. చాలామంది ఆ బిల్లులతోనే వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నంబరుకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు అడ్డంగా దొరికిపోతున్నాయి. దీన్ని గుర్తించిన ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పుడు బిల్లులు ఇవ్వడం మానేసినట్లు తెలిసింది. కరోనా రోగులకు కేవలం తెల్ల కాగితంపైనే బిల్లు వేసి చూపిస్తున్నాయి. అవి కూడా చేతికి ఇవ్వడం లేదని సమాచారం. తెల్ల కాగితంలో కేవలం మొత్తం బిల్లు ఎంత అయిందో రాసి చూపుతున్నారని, వివరాలు కూడా పొందుపరచడం లేదని బాధితులు చెబుతున్నారు. అలా ఇష్టమైతేనే చికిత్సకు రావాలని ఆస్పత్రులు చెబుతున్నాయి. నగదు చెల్లిస్తేనే వైద్యం చేస్తామని, కార్డు వాడడానికి వీల్లేదని కొన్ని ఆస్పత్రులు చెబుతున్నాయి. రీయింబర్స్‌మెంట్‌కు బిల్లు ఇవ్వాలని అడిగినా ఇవ్వట్లేదని బాఽధితులు చెబుతున్నారు. అలాగే అడ్వాన్స్‌ కడితేనే పడకలు కేటాయిస్తామని తేగేసి చెబుతున్నాయి.

ఎల్బీనగర్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడి తండ్రికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అదే ఆస్పత్రిలో ఆయన్ని చేర్చించేందుకు తీసుకెళ్లగా.. డబ్బు కడితేనే అడ్మిట్‌ చేసుకుంటామని యాజమాన్యం చెప్పింది. అదీ రూ.4 లక్షల అడ్వాన్స్‌. తన డెబిట్‌ కార్డ్‌ వాడుకోండని ఆ వైద్యుడు కోరగా.. యాజమాన్యం అంగీకరించలేదు. చివరికి రూ.2 లక్షలు చెల్లించి, మరో 2 లక్షలు రెండు రోజుల్లో సర్దుబాటు చేస్తామని చెబితే ఆస్పత్రిలో చేర్చుకున్నారు.

కోరుట్లకు చెందిన ఓ పేద కుటుంబం. తమ కుటుంబ సభ్యుడికి కిడ్నీ సమస్య ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటివరకు రూ.4 లక్షలు కట్టగా, మరో రూ.5 లక్షలు కడితేనే రోగిని చూపిస్తామని యాజమాన్యం చెప్పింది.రోగికి కరోనా సోకిందని, డబ్బు కడితేనే చూపిస్తామని తేల్చిచెప్పింది. చేసేదేం లేక వారు ఆస్పత్రి ఎదుటే ఆందోళనకు దిగారు. ఈ విషయం బుధవారం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. ఇదీ ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీ తీరు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates