లక్షణాలున్నా నెగెటివ్‌!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో ఫాల్స్ నెగెటివ్‌లు.. మళ్లీ మళ్లీ చేసినా ఫలితమదే
  • పరిస్థితి విషమించాక పాజిటివ్‌.. పట్టించుకోకుంటే ప్రాణాలమీదకు
  • సకాలంలో చికిత్స తీసుకోకుంటే ప్రమాదమంటున్న నిపుణులు

హైదరాబాద్‌లో ఓ ఏఎస్‌ఐకి.. కరోనా లక్షణాలున్నా ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో రెండుసార్లు నెగెటివ్‌ వచ్చింది! కానీ, రోజులు గడిచేకొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆఖరు క్షణాల్లో పలు ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఎవ్వరూ చేర్చుకోలేదు! చివరికి ఒక ఆస్పత్రిలో చేర్చుకుని పరీక్ష చేయగా.. మళ్లీ నెగెటివ్‌ వచ్చింది! అప్పటికే కిడ్నీలు దెబ్బతిన్నాయి. నాలుగోసారి టెస్టు చేశారు. ఆయన మరణించిన తర్వాత వచ్చిన రిపోర్టులో పాజిటివ్‌ అని తేలింది!

నార్సింగ్‌కు చెందిన ఓ 74 సంవత్సరాల వృద్దురాలు విరేచనాలతో బాధపడింది. కరోనా లక్షణాలు కూడా కొద్దిగా కనిపించాయి. వెంటనే పరీక్ష చేయించుకోగా నెగిటివ్‌ వచ్చింది. మందులు వాడాక కూడా తగ్గకపోవడంతో ఆవిడ మరోమారు టెస్టులు చేయించుకున్నారు. మళ్లీ నెగెటివే వచ్చింది. గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటే.. పాజిటివ్‌ వచ్చింది. ఇలా 9 రోజుల వ్యవధిలో రెండుసార్లు నెగెటివ్‌ వచ్చి.. మూడోసారి  పాజిటివ్‌ రావడం గమనార్హం.

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కొత్తది కావడం, దాని స్వరూపం పూర్తిగా అర్థం కాకపోవడంతో ఇప్పటికే పలు సమస్యలు ఎదురవుతున్నాయి! ఇప్పుడు వాటికి తోడు.. కరోనా నిర్ధారణలో పరమ ప్రమాణం (గోల్డెన్‌ స్టాండర్డ్‌) అనదగ్గ ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో సైతం తప్పుడు నెగెటివ్‌లు రావడం ఆందోళన కలిగిస్తోంది. అదీ ఒకసారి కాదు.. కొందరి విషయంలో లక్షణాలు ఉండీ 2-3సార్లు ఇలా ఫాల్స్‌ నెగెటివ్‌లు రావడం గమనార్హం. నెగెటివ్‌ వచ్చినా.. లక్షణాలు ఉండడంతో చాలా ఆస్పత్రుల్లో వారిని చేర్చుకోవడానికి భయపడుతున్నారు. దీనివల్ల ఒక ఆస్పత్రి నుంచి మరొక ఆస్పత్రికి తిరిగే క్రమంలో సమయం మించిపోతోంది. సకాలం (గోల్డెన్‌ అవర్‌)లో వైద్యం అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు! కరోనా సోకినా లేకున్నా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని అబ్జర్వేషన్‌లో పెట్టి, చికిత్స చేయాలి. కానీ, ఎక్కడా అలా జరగట్లేదు.

ఒకటికి రెండుసార్లు నెగిటివ్‌ వచ్చినా.. కరోనా అనుమానిత లక్షణాలుంటే పూర్తిగా నెగెటివ్‌ కింద పరిగణించి, ఆశ్రద్ధ చేయవద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని, అప్పుడు వారు రోగులను నేరుగా పరీక్షించి, వారికున్న లక్షణాలు, సమస్యల ఆధారంగా చికిత్స చేస్తారని చెబుతున్నారు. ఉదాహరణకు.. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన 65 సంవత్సరాల చుక్కమ్మ అనే వృద్ధురాలికి తొలుత నెగిటివ్‌ వచ్చినా.. ఆమెకు అనుమానిత లక్షణాలు ఉండడంతో వైద్యులు ఆమెకు సి.టి.స్కాన్‌ చేశారు. ఆమె ఊపిరితిత్తుల్లో బాగా ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించి.. కొవిడ్‌ చికిత్స అందిస్తున్నారు. నెగిటివ్‌గానే భావించి వదిలేస్తే ఆమె ప్రాణాలు కోల్పోవాల్సివచ్చేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

ఎందుకిలా?
ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో కచ్చితత్వంతో పొల్చుకుంటే  సున్నితత్వం తక్కువగా ఉండటం వల్ల ఫాల్స్‌ నెగెటివ్‌ వచ్చే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి, వైద్యపరీక్షలో నెగెటివ్‌ వచ్చినా, కరోనా లక్షణాలున్న వారు..
అశ్రద్ధ చేయకుండా వెంటనే ఇంట్లోవారికి దూరంగా (సెల్ఫ్‌ క్వారంటైన్‌) ఉండాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత వైద్యం చేసుకోవద్దు.
లక్షణాలను బట్టి అవసరమైతే మరో 2-3సార్లు టెస్టులు చేయించుకోవాలి.
ఆస్తమా రోగులు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. రోజూ తీసుకునే మందులను ఎల్లప్పు డూ అందుబాటులో ఉంచుకోవాలి.  ఆయాసం వస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. తమకు వైద్యం చేసే వైద్యుడి వద్ద ఎప్పటికప్పుడు సూచనలు తీసుకోవాలి.

గోల్డెన్‌ అవర్స్‌ మిస్‌ అవుతున్నారు
హైదరాబాద్‌కు చెందిన ఓ సంవత్సరాల వ్యక్తికి ఒకరోజు 101 డిగ్రీల జ్వరం వచ్చింది. తనకు ఓ స్పెషలిస్టు వైద్యుడు కూడా దగ్గరి స్నేహితుడు. ఆ వైద్యుడు టెస్టులు చేయించుకోమని సలహా ఇచ్చారు. కానీ నిర్లక్ష్యం చేశాడు. అతడికి బీపీ, షుగర్‌ కూడా ఉంది. పది రోజులు తర్వాత ఆరోగ్యం బాగా విషమించింది. అప్పుడు టెస్టులు చేయించగా… పాజిటివ్‌ అని తేలింది. ఆ వ్యక్తి మరణించాడు. వైరస్‌ సోకిన తర్వాత ఐదురోజుల్లోగా యాంటీవైరల్‌ డ్రగ్స్‌ ఇస్తే ప్రభావవంతంగా పనిజేస్తాయని వైద్యులు చెబుతున్నారు. గోల్డెన్‌ అవర్స్‌ మిస్‌ కావొద్దని అంటున్నారు.

ఈ లక్షణాలుంటే తక్షణం ఆస్పత్రికి!
కరోనా నెగెటివ్‌ వచ్చినా.. ఈ కింది లక్షణాలుంటే జాగ్రత్తగా ఉండాలని, వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
ఆక్సిజన్‌ శాతం తగ్గిపోవడం (పల్స్‌ ఆక్సీమీటర్‌ సాయంతో ఇంట్లోనే చూసుకోవచ్చు)
కరోనా వైరస్‌ మెదడుపై, నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాబట్టి.. అయోమయం, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.
ఛాతీ నొప్పి. కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లోని మ్యూకోసాల్‌ లైనింగ్స్‌ను దెబ్బతీస్తుంది. దీనివల్ల ఛాతీ నొప్పి వస్తుంది.
పెదవులు నీలంగా అయిపోవడం. ఇది శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతున్నాయనడానికి సూచన.

వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి..భాస్కరరావు, ఎండీ, కిమ్స్‌ ఆస్పత్రి, హైదరాబాద్‌
చాలా మంది లక్షణాలు లేకపోయినా అనవసరంగా టెస్టులు చేయించుకుంటున్నారు. లక్షణాలుంటే ముందుగా వైద్యుణ్ని సంప్రదించాలి. ఆ తర్వాతే టెస్టు చేయించుకోవాలి. లక్షణాలున్న నాన్‌ కొవిడ్‌ రోగులను ప్రైవేట్‌ ఆస్పత్రులు తీసుకోవడం లేదనడం సరికాదు. అటువంటి వారు నిరంభ్యతరంగా కిమ్స్‌కు రావొచ్చు.   – డాక్టర్‌ బొల్లినేని

నెగెటివ్‌ వస్తే సీటీస్కాన్‌..- డాక్టర్‌ సుధీర్‌, పల్మనాలజిస్టు, హైదరాబాద్‌
రెండుసార్లు నెగెటివ్‌ వచ్చి మూడోసారి పాజిటివ్‌ వచ్చిన కేసులను కూడా చూశాను. లక్షణాలుండి నెగెటివ్‌ వచ్చిన రోగులకు సీటీస్కాన్‌ చేస్తున్నాం. అందులో కొందరి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్‌ను గమనించాం.

10-20% మిస్‌ అవుతుంటాయి.. డాక్టర్‌ మాదల కిరణ్‌, ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్‌
ఆర్టీపీసీఆర్‌ టెస్టులో 10-20 కేసులు మిస్‌ అవుతుంటాయి. కొవిడ్‌ లక్షణాలున్న వారు జనరల్‌ ఫిజిషీయన్‌ ద్వారా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. వైరస్‌ సోకిన వారం తర్వాత లోడ్‌ తగ్గుతుంది. అప్పుడు టెస్టు చేస్తే నెగెటివ్‌ రావచ్చు. కానీ, కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం లేకపోలేదు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates