కరోనా టెస్టులకు పోతలేరు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

లక్షణాలుంటే ఇంట్లోనే..
సామాజిక వెలి భయం
కొన్నాళ్లపాటు సొంత వైద్యం
తర్వాత యాంటీబాడీ పరీక్షలు
తెలంగాణలో నయా ట్రెండ్‌

హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌కు చెందిన రవికుమార్‌ నాలుగు రోజుల నుంచి జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. విరేచనాలతో పాటు గొంతులో గరగర కూడా ఉంది. కొంచెం నలతగా అనిపించిన రోజు నుంచే వేరే రూమ్‌లో ఉంటున్నారు. తనకు తెలిసిన డాక్టర్‌ను సంప్రదిస్తే కరోనా అనుమానిత లక్షణాలేనని, వీలైతే పరీక్ష చేయించుకోమని సలహా ఇచ్చారు. కానీ టెస్టుల కోసం రెండు రోజులు, వాటి ఫలితాల కోసం మరో రెండు రోజులు వేచి ఉండడం ఇష్టం లేక.. తమ వైద్యుడి సలహాతో మందులు వాడుతూ ఇంట్లోనే (హోం ఐసోలేషన్‌) ఉండిపోయారాయన.

మాదాపూర్‌కు చెందిన కిషన్‌కు కరోనా అనుమానిత లక్షణాలున్నా టెస్టులు చేయించుకోలేదు. చేయించుకున్న తర్వాత పాజిటివ్‌ వస్తే అపార్ట్‌మెంట్‌వాసుల నుంచి ఎటువంటి వేధింపులు వస్తాయోనని పరీక్షలకే వెళ్లలేదు. వైద్యుడికి ఫోన్‌ చేస్తే… లక్షణాలను బట్టి వైరస్‌ అయివుంటుందని, ఇంట్లోనే 14 రోజుల పాటు విడిగా ఉండాలని సూచించారు. ఏ మందులు వాడాలో, ఎలాంటి ఆహారం తినాలో ఫోన్‌లోనే చెప్పారు. కిషన్‌ ఆ సలహాలను పాటిస్తూ ఇంట్లోనే ఉండిపోయారు.

ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న ట్రెండ్‌ ఇది. చాలామందికి లక్షణాలున్నా ఇళ్ల నుంచి బయటకు రావట్లేదు. టెస్టులు చేయించుకోవట్లేదు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తే హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నారు.

కారణాలు అనేకం…
ప్రస్తుతం ప్రైవేటు ల్యాబ్‌లలో టెస్టులు చేయించుకోవాలంటే 48 గంటల ముందు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. సమయానికి వెళ్లి నమూనా ఇవ్వాలి. వాటి ఫలితాల కోసం 24-48 గంటలపాటు ఎదురుచూడాలి. ఇందుకు కనీసం 4 రోజుల సమయం పడుతుంది. నమూనాలివ్వడానికి వెళ్లినప్పుడు పాజిటివ్‌ వల్ల వైరస్‌ సోకుతుందన్న భయం కూడా కొందరిని వెంటాడుతోంది. పోనీ ఇంటిదగ్గరే నమూనాలిద్దామంటే.. శాంపిళ్ల కోసం వచ్చేవారు పీపీఈ కిట్లతో వస్తే చుట్టుపక్కలవారు తమను కరోనా పేషంట్లుగా భావించి, ఎక్కడ వేధింపులకు గురిచేస్తారోనన్న భయాందోళనలు చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. పరీక్షలు చేయించుకున్నా.. ఫలితాలు వచ్చే వరకూ తీవ్ర ఉత్కంఠ. ఒకవేళ పాజిటివ్‌ వస్తే.. చుట్టుపక్కలవారికి ఆ విషయం తెలిస్తే తమను ఎక్కడ వెలివేసినట్టు చూస్తారోనన్న భయం. వీటన్నిటి నేపథ్యంలో.. తీవ్ర లక్షణాలు లేనివారు ఇంటికే పరిమితం అవుతున్నారు.

ఉండొద్దని వేధింపులు
వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని తెలిస్తే.. చుట్టుపక్కల ఉన్నవారిలో కొందరు వారిని ఈసడింపుగా చూస్తున్నారు. పాజిటివ్‌ వచ్చినవారినే కాక.. మిగ తా కుటుంబ సభ్యులనూ ఇంటినుంచి బయటకు రానివ్వట్లేదు. దీంతో తాము సామాజిక బహిష్కరణకు గురి అవుతున్నట్లు ఉందని కొంద రు పాజిటివ్‌ రోగులు చెబుతున్నా రు. ఇందువల్లే కొందరు పాజిటివ్‌ వచ్చినా.. పక్కింటివారికీ తెలియకుండా గుంభనంగా ఉంటున్నారు.

లక్షణాలు తగ్గాక..
హోమ్‌ ఐసోలేషన్‌లో కొన్నిరోజులపాటు ఉండి, లక్షణాలు తగ్గాక.. యాంటీ బాడీస్‌ పరీక్షలు చేయించుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి అటువంటి పరీక్షలకు ఇన్నాళ్లూ ప్రభుత్వం అనుమతించలేదు. కానీ, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో యాంటీ బాడీస్‌ టెస్టులు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం కూడా యాంటీ బాడీస్‌ పరీక్షలు చేస్తామని ప్రకటించింది.

టెస్టులు చేయించుకోకుండా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటే..
కరోనా అనుమానిత లక్షణాలతో హోం ఐసోలేషన్‌లోనే ఉండేవారికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటంటే..

హోం ఐసోలేషన్‌లో ఉండేవారు వైద్యుల సిఫారసుతోనే మందులు వాడాలి.
ఎక్కువ రోజులపాటు జ్వరం, ఇతరత్రా తీవ్రమైన లక్షణాలు కనపడితే వెంటనే టోల్‌ఫ్రీ నెంబరు 104కు కాల్‌ చేయాలి.
కుటుంబ సభ్యులకు దూరంగా వేరే గదిలో ప్రత్యేకంగా ఉండాలి. వారితో మాట్లాడేటప్పుడు మాస్కు ధరించాలి.
మానసిక ఆందోళన చెందవద్దు.
ఎలాంటి లక్షణాలూ లేకపోతే మందులు వాడవద్దు.
ఒళ్లునొప్పులు ఉంటే వైద్యులకు తెలిపి వారి సూచనలు పాటించాలి తప్ప .. పెయిన్‌ కిల్లర్స్‌ (నొప్పి నివారణమందులు) ఎట్టిపరిస్థితుల్లోనూ వాడొద్దు. కరోనా సోకిన వారు ఆ మందులు వాడితే తీవ్ర దుష్ప్రభావాలు ఉండే ప్రమాదం ఉంది.

డబ్ల్యూహెచ్‌వోదీ ఇదే మాట
కరోనా అనుమానిత లక్షణాలుండి పరీక్షలు చేయించుకోనివారు.. 14 రోజులు, లక్షణాలు లేకపోతే 9 రోజుల పాటు ఇంట్లో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచించింది. టెస్టులు చేయించుకోకుండా అనుమానిత లక్షణాలతో ఇంట్లో ఉండేవారిని ప్రొత్సహించాలి. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి తగ్గుతుంది. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు మానసిక ఆందోళనకు గురికావొద్దు. సొంత వైద్యం చేసుకోవద్దు. వైద్యులను సంప్రదించి వారి సూచనలను పాటించాలి.
– డాక్టర్‌ మాదల కిరణ్‌, హెచ్‌వోడీ క్రిటికల్‌ కేర్‌, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్‌

Courtesy AndhraJyothy

RELATED ARTICLES

Latest Updates