మిథ్యా వాగ్దానాల ఉద్దీపనలు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కరోనా లాక్‌డౌన్ కష్టనష్టాలను భరించేందుకు అవసరమయ్యే నిధులు ఎలా సమకూరుతాయి? అదనపు ఆదాయాలు, అదనపు వనరులు ఉన్నప్పుడు మాత్రమే అదనపు వ్యయాలు సాధ్యమవుతాయి. లేని పక్షంలో 2020-–21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ. 30,42,230 కోట్ల వ్యయానికే పరిమితం కావలసివుంటుంది. అదనపు ఆదాయాలు, అదనపు వనరుల విషయమై ప్రభుత్వం పూర్తిగా మౌనం వహిస్తోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో ఇలా మౌనం వహించడం సముచితమేనా?

వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రస్తుత సంవత్సరంలో రూ.30,42,230 కోట్లు ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో సంకల్పించింది. ఆదాయంలో లోటు (రూ.7,96,337 కోట్లు)ను రుణం తీసుకోవడం ద్వారా భర్తీ చేసుకొని వ్యయాలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ యోచన. ఈ ద్రవ్యలోటు స్థూల దేశియోత్పత్తి (జీడీపీ)లో 3.5 శాతం.

ప్రభుత్వ అంచనాలన్నీ కరోనా వైరస్‌తో తలకిందులయ్యాయి. ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు తీసుకొనే రుణం రూ.7,96,337 కోట్లకు మాత్రమే పరిమితం కాదని, వాస్తవానికి అంతకంటే ఎక్కువ మొత్తాన్నే అప్పుగా తీసుకోవల్సి వుంటుందనేది ప్రతి ఆర్థిక వేత్తకూ తెలుసు. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని తొలుత అంగీకరించలేదు. అయితే మే 8న అదనంగా రూ.4.2 లక్షల కోట్లను రుణంగా తీసుకొంటున్నట్టు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో బడ్జెట్ వ్యయాలకు గాను ప్రభుత్వం తీసుకున్న రుణం రూ.12 లక్షల కోట్లకు పెరిగింది. స్థూల దేశియోత్పత్తి అంచనాలో ఎటువంటి మార్పు లేని పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.3 శాతంగా ఉండబోతుంది.

బడ్జెట్ వ్యయాలకు గాను తీసుకునే అదనంగా తీసుకొనే రుణాలను ఎలా వినియోగించాలి? పేద, నిరుపేద కుటుంబాలకు నగదు సమకూర్చడానికి, ఇతర విధాలుగా తోడ్పడేందుకు వినియోగించాలి; అలాగే పూర్తిగా స్తంభించిపోయిన ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలను పునః ప్రారంభించేందుకూ వినియోగించాలి. ఇలా వినియోగించినప్పుడు మాత్రమే అదనంగా తీసుకున్న రుణం దేశ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్య ఉద్దీపన (ఫిస్కల్ స్టిములస్) గా పరిగణించవలసివుంటుంది. అయితే అదనంగా తీసుకున్న రుణ మొత్తాన్ని పేదలను ఆదుకోవడానికి వినియోగించడం లేదని తెలుస్తోంది. ఇది ఆందోళనకరమైన విషయం. మారిన పరిస్థితులలో పన్ను రాబడులు, పెట్టుబడుల ఉపసంహరణతో సమకూరే ఆదాయాలు అంచనాలకు అనుగుణంగా ఉండక పోవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఆదాయాలలో నెలకొనే ఈ లోటు రూ.4.2 లక్షల కోట్ల మేరకు ఉంటే, అదనంగా తీసుకునే రుణాలతో ఆ లోటును భర్తీ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఇది అనివార్యం. అయితే ఆ మొత్తాన్ని, అంటే, రూ.4.2 లక్షల కోట్లను ద్రవ్య ఉద్దీపనగా పరిగణించడం తగదు.

మరి ఇతర వ్యయాలలో కోత పెట్ట నున్నారా అనే విషయం స్పష్టంగా తెలియదు. ఇంతవరకు ప్రకటించిన వ్యయ కోతలతో ప్రభుత్వానికి రూ.41,490 కోట్లు ఆదా అవనున్నాయి. కొవిడ్-19 సంబంధిత వ్యయాలకు ఆ సొమ్ము అందుబాటులో ఉంటుంది. ఆ వ్యయం కేవలం ప్రాథమిక స్థాయి వ్యయాన్ని మాత్రమే పునరుద్ధరిస్తుంది గనుక దాన్ని ద్రవ్య ఉద్దీపనగా పరిగణించడానికి వీలులేదు.

2020 మార్చి 25న ప్రభుత్వం 1.7 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని ప్రభుత్వం ద్రవ్య ఉద్దీపన గా పరిగణిస్తుందేమోనని నేను అనుమానిస్తున్నాను. నిజానికి నగదు బదిలీకి అదనంగా సమకూర్చింది రూ.60,000 కోట్లు మాత్రమే. దీనితో పాటు పేదలకు పంపిణీ చేసే ఆహార ధాన్యాల విలువ రూ.40,000 కోట్లు (ఈ అంశాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించలేదు). అంటే రూ.1 లక్ష కోట్ల ను మాత్రమే ద్రవ్య ఉద్దీపనగా పరిగణించవలసివుంది. ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ అదనపు ద్రవ్యత్వాన్ని (లిక్విడిటీ) సమకూర్చుతోంది. ఈ అదనపు ద్రవ్యత్వాన్నికూడా ద్రవ్య ఉద్దీపనగా ప్రభుత్వం పరిగణించే అవకాశమున్నదని నేను భావిస్తున్నాను. లిక్విడిటీని వ్యయంగా పరిగణించడమంటే భావనాపరమైన అయోమయమేనని చెప్పక తప్పదు. సరఫరాలను ప్రభావితం చేసేది ద్రవ్యత్వం; మార్కెట్‌లో డిమాండ్‌ను పెంపొందించడానికి ఆవశ్యకమైనది ద్రవ్య ఉద్దీపన.

ఇదలా వుంచితే రిజర్వ్ బ్యాంక్ గత మార్చి 27న ప్రభుత్వానికి అదనంగా రూ.5.24 లక్షల కోట్ల నగదును సమకూర్చింది. ఆ తేదీ నుంచి ఇంతవరకు బ్యాంకులు రిజర్వ బ్యాంక్‌లో అదనంగా జమ చేసిన మొత్తం రూ.4.14 లక్షల కోట్లు మాత్రమే! ప్రభుత్వానికి అనుకూలంగా వాదనను పొడిగిస్తే రిజర్వ్ బ్యాంక్ అదనంగా సమకూర్చిన నగదును అదనపు రుణంగా భావించవచ్చు. ఈ అదనపు రుణంపై వడ్డీరేటులో రాయితీ వుంటుంది లేదా అసలు వడ్డీ ఉండక పోవచ్చు. బహుశా వడ్డీ రాయితీ లేదా తీసివేసిన వడ్డీ మొత్తాన్ని ద్రవ్య ఉద్దీపనగా పరిగణించవచ్చు. ఇదంతా ఉహాత్మక వ్యవహారమే. దీంతో పాటు రిజర్వ్ బ్యాంక్‌కు చెల్లించవలసిన రుణం మార్చి 25న రూ.103.8 లక్షల కోట్ల నుంచి నేటికి రూ.102 లక్షల కోట్లకు తగ్గిపోయింది.

మే 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఆ ప్యాకేజీ వివరాలను ఆయన స్వయంగా వెల్లడించలేదు! మే 13 నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ ప్యాకేజీ వివరాలను వెల్లడించడం ప్రారంభించారు. అయితే వివిధ వర్గాల ప్రజలు ఆ ప్యాకేజీపై మండిపడుతున్నారు. రైతులు, వలస కూలీలు; తొలగింపబడిన కార్మికులు, అసంఘటిత రంగ శ్రామికులు, ఉద్యోగాలు కోల్పోయిన నమోదు కాని వ్యాపార సంస్థల ఉద్యోగులు, పనులు కొరవడిన స్వయం ఉపాధిపరులు; కాయకష్టంతో బతికే కూలీ కుటుంబాలు, నగదు లేకపోవడంతో అప్పులు చేయడం అనివార్యమయిన కింది స్థాయి మధ్యతరగతి కుటుంబాలు, దాదాపు 5.8 కోట్ల మంది ఎమ్ ఎస్ ఎమ్ ఇ కార్మికులు 9ఆర్థిక మంత్రి ప్రకటించిన సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్యాకేజీ పరిధిలోకి రాని సంస్థల లో పని చేసేవారు) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తాము ఆశించిన సహాయమేదీ ఈ ఆర్థిక ప్యాకేజీతో సమకూరడం లేదని వారు సహజంగానే ఆగ్రహిస్తున్నారు. వలసకూలీలకు రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలను సమకూరుస్తామని మే 14న ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ వితరణ విలువ రూ.3500 కోట్లు అని ఆమె పేర్కొన్నారు.

ఆర్థిక మంత్రి తొలిరోజు ప్రకటించిన సహాయక చర్యలకుగాను అదనంగా రూ.3,60,000 కోట్లు వ్యయం కాగలవని నేను భావిస్తున్నాను. అలాగే రెండో రోజు ప్రకటించిన సహాయక చర్యలకు గాను రూ.5000 కోట్లు అదనంగా వ్యయమయ్యే అవకాశమున్నది.

సరే, ఈ అదనపు వ్యయాలకు అవసరమయ్యే నిధులు ఎలా సమకూరుతాయి? ఇది ప్రధాన అంశం. ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి తమ ప్రకటనలలో ఈ విషయాన్ని స్పష్టం చేయలేదు. అదనపు ఆదాయాలు, అదనపు వనరులు ఉన్నప్పుడు మాత్రమే అదనపు వ్యయాలు సాధ్యమవుతాయి. లేని పక్షంలో 2020–-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.30,42,230 కోట్ల వ్యయానికే పరిమితం కావలసివుంటుంది. అదనపు ఆదాయాలు, అదనపు వనరుల విషయమై ప్రభుత్వం పూర్తిగా మౌనం వహిస్తోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో ఇలా మౌనం వహించడం సముచితమేనా?

నేనొక విషయాన్ని స్పష్టంగా చెప్పదలిచాను అదనంగా రుణాలు తీసుకోకపోతే అదనపు వ్యయాలకు ఆస్కారం లేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ద్రవ్య ఉద్దీపన అనేదే ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్య ఉద్దీపనకు అదనంగా అప్పు తీసుకోవడమనేది కీలక అంశంగా ఉన్నది. మరింతగా అప్పు చేసి, మరింతగా ఖర్చు పెట్టాలి. ఇలా అదనంగా అప్పులు తీసుకునే సౌకర్యం లేప్పుడు లోటును భర్తీ చేసేందుకు కరెన్సీని ముద్రించడమే తరుణోపాయం. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ను పెంపొందించడానికి ద్రవ్య ఉద్దీపన అవసరం. మరి అదనంగా అప్పులు తీసుకోవడం లేప్పుడు ఆర్థిక ఉద్దీపనా ఉండదు. 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ మరో జుమ్లా (తప్పుడు హామీ) మాత్రమే. మిథ్యా వాగ్దానాలతో స్వావలంబన ఎలా సాధిస్తాం?

పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates