యూపీలో కరోనా రోగుల పడిగాపులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఆస్పత్రి వెలుపల ఎదురుచూపులు
– జూన్‌ 30 వరకూ సమావేశాలు నిషేధం: యోగి సర్కారు
– భారత్‌లో 24 గంటల్లో 57 మరణాలు.. మొత్తం కేసులు 24,942
– ఆంధ్రప్రదేశ్‌లో వేయి దాటిన బాధితులు
– కరోనా రికవరీలో కేరళ టాప్‌
– తమిళనాడులోని ప్రధాన నగరాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌.. భయాందోళనల్లో ప్రజలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్నప్పటికీ పలు చోట్ల సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విమర్శలకు ఊతమిచ్చే మరో దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎట్టావా జిల్లాలోని సారు ఫారులో చోటు చేసుకుంది. వైద్యులు, మెడికల్‌ స్టాఫ్‌ తమను అడ్మిట్‌ చేసుకోకపోవడంతో ఏకంగా 69 మంది కరోనా వైరస్‌ రోగులు యూపీ యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆస్పత్రి గేట్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాశారు. ఆస్పత్రి వెలుపల ఉన్న ఫుట్‌ పాత్‌పై వేచి వున్నారు. కరోనా సోకిన నేపథ్యంలో వీరందరినీ ఆగ్రా నుంచి సారు ఫారుకి తరలించారు. ఓ బస్సులో వీరందరినీ ఒక ఎస్కార్ట్‌ టీమ్‌తో పాటు పంపించారు. అయితే, ఇక్కడకు వచ్చిన తర్వాత వీరిని ఆస్పత్రి సిబ్బంది, అధికారులు పట్టించుకోలేదు. ఫుట్‌పాత్‌పై వీరున్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బాధితులు ముఖానికి మాస్కు మాత్రమే ధరించారు. రక్షిత కిట్స్‌ ధరించిన ఇద్దరు పోలీసులు కొంచెం దూరం నుంచి వీరిని నియంత్రిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తున్నది. కాగా, యూపీలో ఇప్పటివరకూ 1,621 కరోనా కేసులు నమోదుకాగా, వారిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జూన్‌ 30 వరకూ ఆంక్షలను పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలు గుమిగూడటం, రాజకీయ ర్యాలీలు, ఫంక్షన్లు, పెల్లిళ్లు, సామూహిక మత ప్రార్థనలుపై నిషేధం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రంజాన్‌ సందర్భంగా ముస్లిం ప్రజలు ఇండ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సీఎం తెలిపారు.

కాగా, దేశంలో గడిచిన 24 గంటల్లో 1,429 కొత్త కేసుల నమోదుతోపాటు.. 57 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 24,942 చేరగా.. మరణాల సంఖ్య 779కి చేరింది. అయితే, బాధితుల్లో 5,210 మంది కోలుకున్నారు. కాగా, ఇప్పటివరకూ సంభవించిన 779 మరణాల్లో.. అత్యధికంగా మహారాష్ట్రలో 301 మంది, గుజరాత్‌లో 127 మంది, మధ్యప్రదేశ్‌లో 92 మంది, ఢిల్లీలో 53 మంది మృతి చెందారు. ఇక వైరస్‌ బారిన పడ్డవారి విషయంలోనూ అత్యధికంగా మహారాష్ట్రలో 6,817 మంది బాధితులుండగా.. ఒక్క ముంబయిలోనే 4,447 కేసులు నామోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది. గుజరాత్‌లో 2,815, ఢిల్లీలో 2,514, రాజస్థాన్‌లో 2,034, మధ్యప్రదేశ్‌లో 1,852 కేసులు నమోదయ్యాయి.

తమిళనాడులో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ భయాందోళనల్లో ప్రజలు !
కరోనా కట్టడి చర్యలో భాగంగా తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.పళనీస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నై, మధురై, కోయంబత్తూరు, సేలం, తిరుపూరులో మరింత కఠినంగా ఆంక్షలు కోనసాగించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైన ప్రజలు కిరాణా షాపులు, మార్కెట్లముందు సరుకులు కొనడానకి బారులు తీరారు. ఈ క్రమంలో అనేక చోట్ల లాక్‌డౌన్‌ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,755 కేసులు నమోదుకాగా, వీరిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వైద్య సేవలను మరింత విస్తృతం చేసే చర్యల్లో భాగంగా వేయికి పైగా నర్సులను, 1508 ల్యాబ్‌ టెక్నిషియన్లను, 530 మంది వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే, ప్రస్తుతం రిటైర్‌ కాబోతున్న వైద్యులు, సిబ్బంది పదవీ కాలాన్ని మరో రెండు నెలలు పెంచుతున్నట్టు సీఎం వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తున్న కరోనా
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తన ప్రభావాన్ని పెంచుకుంటూనే ఉంది. ఇప్పటి వరకూ ఒక్క కేసుకూడా నమోదు కాకుండా గ్రీన్‌ జోన్‌లో ఉన్న శ్రీకాకుళంలో తాజాగా మూడు కేసులు నమోదుకావడంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితులను సమీక్షించడానికి రాష్ట్ర మంత్రి నేడు జిల్లాలో పర్యాటించనున్నారు. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే కొత్తగా 61 కేసులు నమోదుకావడంతో.. మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 1,016కు చేరింది. వీరిలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 171 మంది కోలుకున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 275 కరోనా కేసులు నమోదుకావడంతో జిల్లావ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కర్నూలు తర్వాత అత్యధిక కరోనా కేసులు గుంటూరు (209), క్రిష్ణ (127) జిల్లాల్లో నమోదయ్యాయి.

ఆన్‌లైన్‌ విచారణ.. న్యాయవాదిపై జడ్జి ఆగ్రహం !
కరోనా కట్టడి కోసం లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో సుప్రీం కోర్టు సహా అన్ని కోర్టులు.. కేసులను ఆన్‌లైన్‌లో విచారణ చేపడుతున్నాయి. అయితే రాజస్థాన్‌ హైకోర్టు ఓ బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ విచారణ జరుపుతుండగా, న్యాయవాది సాధారణ దుస్తుల్లో దర్శనమివ్వడంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ విచారణ అయినా సరే లాయర్‌ యూనిఫాం ధరించే రావాలని స్పష్టం చేశారు. ఆ న్యాయవాది నల్లకోటు ధరించి విచారణకు హాజరు కాలేదన్న కారణంతో సదరు విచారణను వాయిదా వేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు.

ఉత్తర బెంగాల్‌లో కఠినంగా లాక్‌డౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బృందం లేఖ
ఉత్తర బెంగాల్‌లో లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలని కోవిడ్‌-19 పరిస్థితులను అంచనా వేసేందుకు అక్కడ పర్యటిస్తున్న కేంద్ర బృందం పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఉత్తర బెంగాల్‌లోని కోల్‌కతాతో పాటు సిలిగురి ప్రాంతాల్లో రెండు కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి పర్యవేక్షించేందుకు, అభిప్రాయాలను తెలియజేసేందుకు మరింతమంది క్షేత్రస్థాయి అధికారులు అవసరమని ఈ బృందాలకు నేతృత్వం వహిస్తున్న ఉన్నతాధికారి వినీత్‌ జోషి ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ సిన్హాకు లేఖ రాశారు.

కేరళలో కరోనా రికవరీ రేటు 73.5శాతం
దేశంలో మొదటి కరోనా కేసు నమోదైన కేరళలో ఎంత వేగంగా వైరస్‌ విస్తరించిందో.. అంతే వేగంగా తగ్గుముఖం పట్టింది. ప్రారంభంలో దేశంలోని రాష్ట్రాల్లో కేరళ ఫస్ట్‌ ప్లేస్‌లో కొనసాగింది. కానీ, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పకడ్బంది చర్యల కారణంగా చాలా వరకు కొత్త కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఉన్న కేసుల్లోనే మెరుగైన వైద్య చికిత్స అందించి కోలుకునేలా చేశారు. అయితే, మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళలో అత్యధికంగా రికవరీ రేటు ఉంది. శుక్రవారం వరకూ వైరస్‌ భారిన పడిన 450 మందిలో 331 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. అంటే రికవరీ రేటు 73.5 శాతంగా ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా కేవలం ముగ్గురు మాత్రమే మరణించారు. ఇలా చూసుకున్నా 0.6 శాతమే.. ఎలా చూసినా కేరళ రాష్ట్రం కరోనాను ఎదుర్కోవడంలో దేశంలోని అన్నీ రాష్ట్రాలకంటే టాప్‌ ప్లేస్‌లో ఉంది. కాగా, శనివారం మరో 7 కొత్త కేసులు నమోదైనట్టు కేరళ సర్కారు వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 457కు చేరింది.

కర్నాటకలో జర్నలిస్టుకు కరోనా
కర్నాటకలో కరోనా విస్తరిస్తూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో 22 కొత్త కేసులు నమోదు కాగా, వారిలో ఒకరు జర్నలిస్టు కూడా ఉన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. జర్నలిస్టుతో దగ్గరగ మెలిగిన వారిని క్వారంటైన్‌లో ఉంచారు. వీరిలో పలువురు పాత్రికేయులకు కరోనా ప్రబలినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. శాంపిళ్లను సేకరిం చి పరీక్షలకు పంపారు. రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకూ 500లకు పైగా పాజి టివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 18 మంది మృతి చెందారు.

నిత్యానంద.. రోమాంటిక్‌ డాన్సులతో …
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ప్రజలు హడలిపోతున్నారు. అయితే కరోనా వైరస్‌ లేని దేశంగా కైలాస దేశం పేరుతో ఇప్పుడు నిత్యానందస్వామి అలియాస్‌ నిత్యానంద మహిళా శిష్యులు తెర మీదకు వచ్చారు. నిత్యానందస్వామి సృష్టించుకున్న కైలాస దేశంలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు లేదనీ, ఒక్కరు కూడా ఆ దేశంలో మరణించే అవకాశం లేదని నిత్యానంద శిష్యులు అంటున్నారు. కరోనా లాక్‌ డౌన్‌ లో చిక్కుకుపోయి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నిత్యానంద శిష్యులు మాత్రం కైలాస దేశంలో రొమాంటిక్‌ సాంగ్స్‌తో, ఆటాపాటలతో ఎంజారు చేస్తూ చిందులు వేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వలస కార్మికులకు అండగా ఇద్దరు సోదరులు
బెంగళూరు : కరోనా లాక్‌డౌన్‌తో తినేందుకు లేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు అండగా ఉండేందుకు తమ పొలాన్ని రూ.25 లక్షలకు అమ్మేసిన అన్నదమ్ముల ఉదంతమిది. కోలార్‌ జిల్లాకు చెందిన వ్యాపారవేత్తలైన తాజమ్ముల్‌ పాషా, ముజమ్మిల్‌ పాషా అరటి సాగుతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటారు. లాక్‌డౌన్‌తో కోలార్‌లో చిక్కుకుపోయిన వలస కార్మికులు పడుతున్న కష్టాలకు చలించి, తమ భూమిని స్నేహితుడికి అమ్మేశారు. వచ్చిన నగదుతో కార్మికులకు ఆహారం అందించేందుకు తమ నివాసం పక్కనే కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. వీరు సుమారు మూడు వేల కుటుంబాలకు నిత్యావసరాలను, ఆహార ధాన్యాలను కూడా అందించారు. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో తమ బామ్మ వద్ద పెరిగామని, ఆ సమయంలో మతంతో సంబంధం లేకుండా హిందువులు, సిక్కులు, ముస్లింలు తోచిన సహాయం చేశారని తాజమ్ముల్‌ పాషా చెప్పారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates