విప్లవ కార్యాచరణే నిర్ణయిస్తుంది

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉదారవాద విధానాల దారిలోనే ఇంకా నడవడం అంటే, ఆ విధానాలు ఇక ముందుకు కొనసాగలేని పరిస్థితి వచ్చిందన్న వాస్తవాన్ని చూడలేకపోవడం. అంటే, అక్కడే ఇరుక్కుపోవడం అన్నమాట. అంటే మరింతగా ఫాసిస్టు, నియంతత్వ పోకడలను ఈ ప్రభుత్వం ప్రదర్శించబోతున్నదని అర్ధం చేసుకోవాలి. మరింత జుగుప్సాకరమైన రీతిలో మత విద్వేష రాజకీయాలను ముందుకు తెస్తుంది. ఈ యావత్తు దాడినీ తిప్పికొట్టి దేశాన్ని నయా ఉదారవాద ఊబి నుండి బైటకు తీసుకువచ్చే పోరాటాన్ని శ్రామిక వర్గం చేపట్టాలి.

బూర్జువా ప్రపంచం బాగా గౌరవించే పత్రికలలో లండన్‌ నుంచి వచ్చే ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ ఒకటి. ఇప్పుడు ఈ పత్రిక సైతం వామపక్షాలు ఎప్పటి నుంచో చెప్తున్న విషయాన్ని గుర్తించింది. 2020 ఏప్రిల్‌ 3న తన సంపాదకీయంలో ఆ పత్రిక ఈ విధంగా రాసింది. ”గత నాలుగు దశాబ్దాలుగా అమలులో ఉన్న విధానాలను పూర్తిగా తిరగ రాసే విప్లవాత్మక సంస్కరణలు ఇప్పుడు ముందుకు రావాలి. ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థలో మరింత చురుకుగా జోక్యం కల్పించుకోవాలి. ప్రజా సర్వీసులను ఒక భారంగా భావించకుండా ఒక పెట్టుబడిగా పరిగణించాలి. కార్మికులకు అభద్రత పోగొట్టాలి. సంపద పునఃపంపిణీ అంశం మళ్ళీ చర్చనీయాంశం అయింది. కనీసవేతనాన్ని గ్యారంటీ చేయడం, సంపద పన్ను వంటి ప్రతిపాదనలను తలతిక్క ప్రతిపాదన లుగా పరిగణిస్తూ ఇన్నాళ్ళూ వాటిని కొట్టిపారేస్తూ వచ్చాం. కాని కొత్త విధానాలలో అవి అంతర్భాగంగా ఉండాలి”.

‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక చెప్తున్న ఈ విధానాలకు పూర్తి వ్యతిరేక దిశలో ప్రస్తుతం మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. బీజేపీ-పాలిత రాష్ట్రాలలో కార్మిక చట్టాలను రద్దు చేశారు. ఇది మోడీ ఆమోదం లేకుండా జరిగిందనుకోలేం. ఈ రద్దు వలన కార్మికులకు ఉన్న అభద్రత మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. సంపన్నుల నుంచి మరింతగా పన్నులను రాబట్టాలని ప్రతిపాదించినందుకు కొందరు ఐఆర్‌ఎస్‌ అధికారులు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొనవలసి వచ్చింది. అంటే నాలుగు దశాబ్దాల క్రితం సంపన్న, ఆధిపత్య వర్గాల మేధావుల నోళ్ళ నుంచి జారిపడ్డ భావాలనే ఈ మతిమాలిన మోడీ సర్కారు ఇంకా, ఇన్ని దుష్పరిణామాల అనంతరం కూడా అతి జాగ్రత్తగా ఏరుకుంటోంది.

‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ ప్రస్తావించిన ”గత నాలుగు దశాబ్దాల విధానాలు” అంటే ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో అమలు జరుగుతున్న నయా ఉదారవాద విధానాలు. వీటిని మొత్తం వెనక్కి తీసుకోవాలని ఆ పత్రిక చెప్తోంది. అంటే నాలుగు దశాబ్దాల ఉదారవాద ప్రపంచీకరణ ఇంకెంత మాత్రమూ ముందుకు సాగలేదని, దాని దారులు అన్నీ మూసుకుపోయాయని అర్థం. ఈ వ్యవస్థను నిలుపుకోవాలంటే ఉదారవాద విధానాలను విడిచి పెట్టాలని బూర్జువా మేధావులు చెప్తున్నారు. అయితే ప్రస్తుత ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగడానికి కూడా ముందు దారులు మూసుకుపోయాయి.

మే 8న రాసిన మరో సంపాదకీయంలో అదే ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక ప్రస్తావించిన విషయం కూడా ఆసక్తికరంగా ఉంది. ”ఈ నాటి పరిస్థితి 1930 నాటి పరిస్థితిని పోలి ఉంది. ఆనాడు అమెరికన్‌ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డిలానో రూజ్‌వెల్ట్‌, బ్రిటిష్‌ ఆర్థికవేత్త జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ వంటి మధ్యేవాద ఉదారవాదులు పెట్టుబడిదారీ విధానం ఉదార, ప్రజాతంత్ర స్వభావంతో తన మనుగడ కొనసాగించాలంటే అందరికీ ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుందని వాదించారు. ఈ వాదనలు పైచేయి సాధించి నందువల్లనే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాలలో పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ విధానం విజయం సాధించింది. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా పెట్టుబడిదారీ వ్యవస్థను ఏమీ మార్చనవసరం లేదు. కేవలం మరమ్మతు చేస్తే సరిపోతుంది”. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆ పశ్చిమ దేశాలలో పెరిగిన ప్రభుత్వ ఆర్థిక జోక్యం నేపథ్యంలో ఈ సంపాదకీయం రాశారు. అయితే దాని లోని భావం మాత్రం స్పష్టం. 1930 నాటి మాదిరిగానే ఇప్పుడు కూడా పెట్టుబడిదారీ విధానం ముందున్న దారులు అన్నీ మూసుకు పోయాయి.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ”సంక్షేమ రాజ్యం” విధానాల పునరుద్ధరణ గానీ, మరింకేదైనా విధానం గానీ, ప్రస్తుత పెట్టుబడిదారీ విధానంలో గనుక మార్పులు చేయడమంటే అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడికి ప్రస్తుతం ఉన్న ఆధిపత్యాన్ని బలహీన పరచడమే అవుతుంది. అందుచేత అటువంటి మార్పులను వేటినైనా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడున్న విధానాలను మార్చవలసిన అవసరం ఉందని బూర్జువా మేధావులు చెప్పినంత మాత్రాన తన ఆధిపత్యాన్ని అది స్వచ్ఛందంగా ఒదులుకుంటుందని భావించకూడదు.

1929లోనే కీన్స్‌ తన విధానాన్ని ముందుకు తెచ్చాడు. అప్పటికే బ్రిటిష్‌ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోయి వుంది. దాని నుంచి బైట పడడానికి ఉద్యోగాలను పెద్దఎత్తున కల్పించాలని ఆయన వాదించాడు. కీన్స్‌ లిబరల్‌ పార్టీ సభ్యుడు. అప్పటి లిబరల్‌ పార్టీ నాయకుడు లాయడ్‌ జార్జి, కీన్స్‌ వాదనలను బలపరుస్తూ ప్రభుత్వమే పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి తద్వారా ఉద్యోగాలు కల్పించాలని, అందుకు అనుగుణంగా ద్రవ్యలోటును పెంచాలని, అంటే ప్రభుత్వ వ్యయం పెంచాలని ప్రతిపాదించాడు. అయితే అప్పట్లో దీనిని ఇతరులు వ్యతిరేకించారు. ద్రవ్యలోటు పెంచడమంటే ప్రయివేటు పెట్టుబడికి అవకాశాలు లేకుండా చేయడమని, అలాగనుక చేస్తే కొత్త ఉద్యోగాలు రావని బొత్తిగా పసలేని వాదనలతో వారు కీన్స్‌ ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రస్తుతం కూడా ఇటువంటి పనికిమాలిన వాదనలనే మనం వింటున్నాం. ఈ వాదనల డొల్లతనాన్ని ఎండగడుతూ కీన్స్‌ 1936లో తన ప్రసిద్ధి చెందిన సిద్ధాంతాన్ని ప్రచురించాడు. అయినా ఆ వాదన అప్పట్లో ఆమోదం పొందలేదు. 1930 దశకం అంతా ఉపాధి కల్పన కోసం ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలన్న కీన్స్‌ వాదనను బ్రిటన్‌ తిరస్కరిస్తూనే వచ్చింది.

రూజ్‌వెల్ట్‌ అమలు చేసిన ‘న్యూడీల్‌’ ద్వారా అమెరికాలో నిరుద్యోగం తగ్గింది. కానీ అమెరికన్‌ ద్రవ్యపెట్టుబడి దీనిని అంగీకరించకుండా రూజ్‌వెల్ట్‌పై ఒత్తిడి తెచ్చి వెనక్కు తగ్గేలా చేసింది. దీని ఫలితంగా వెంటనే, 1937లో అమెరికాలో మరో మాంద్యం వచ్చిపడింది. రెండవ ప్రపంచ యుద్ధానికి సమాయత్తం అవడం కోసం ఆయుధాల ఉత్పత్తి పెద్ద ఎత్తున ప్రారంభించి నప్పుడు మాత్రమే, ఆ క్రమంలో ప్రభుత్వ వ్యయం పెరిగి ఉపాధి కల్పన జరిగినందు వల్ల, ఆ దేశం మాంద్యం నుంచి కోలుకుంది. ఉపాధి కల్పన పెద్ద ఎత్తున చేపట్టి తద్వారా డిమాండును పెంచుకోవడమనే పరిష్కారాన్ని ఒక ప్రభుత్వ విధానంగా యుద్ధానంతరం మాత్రమే అంగీకరించారు. యుద్ధానంతర కాలంలో సంపన్న దేశాలలో కార్మికవర్గ బలం పెరిగింది. బ్రిటన్‌లో లేబర్‌పార్టీ గెలిచింది. ఫ్రాన్స్‌లో, ఇటలీలో కమ్యూనిస్టుల బలం గణనీయంగా పెరిగింది. సోవియట్‌ ఎర్రసైన్యం తన విజయ యాత్రను పశ్చిమ దేశాల ముంగిటి దాకా సాగించింది. దాంతో ఇక అంతా కమ్యూనిస్టుల వశమైపోతుందన్న భయం పెట్టుబడిదారీ వర్గానికి పట్టుకుంది. ఈ నేపథ్యంలో మాత్రమే ద్రవ్యపెట్టుబడి దిగి వచ్చి అంతవరకూ తాను ఆమోదించని కీన్స్‌ ప్రతిపాదనను అంగీకరించింది. పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడుకోవడానికి కొన్నిసార్లు ఇటువంటి రాయితీలను ఇవ్వక తప్పదని బూర్జువా మేధావులు చెప్పినా అందుకు ద్రవ్యపెట్టుబడి మాత్రం స్వచ్ఛందంగా అంగీకరించదు. కీన్స్‌ తన భావాలు సరైనవి అయినందు వలన వాటిని ఈ పెట్టుబడిదారీ వర్గం ఆటోమేటిక్‌గా ఆమోదిస్తుందని అమాయకంగా అనుకున్నాడు. కాని అలా జరగలేదు. వాస్తవ జీవితంలో జరిగే వర్గ పోరాటమే ప్రపంచం ఏ దిశలో నడవాలన్నది నిర్ణయిస్తుంది.

అందుచేత వర్తమాన పెట్టుబడిదారీ విధానాన్ని ‘సంక్షేమ రాజ్యం’ దిశగా మళ్ళించాలన్నా అందుకు వర్గపోరాటం తప్పనిసరి. దానిని అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి ప్రతిఘటిస్తుంది. అందువలన తీవ్ర వర్గపోరాటం అనివార్యం. ఆ వర్గపోరాటం జరిగే తీరును బట్టి ‘సంక్షేమరాజ్య పునరుద్ధరణ’ దగ్గరే ఆగిపోతామా లేక ఆ పోరాట క్రమంలో పెట్టుబడిదారీ వ్యవస్థనే కూలదోసి సోషలిస్టు ప్రత్యామ్నాయం వైపుగా సాగిపోతామా అన్నది తేలుతుంది. ప్రస్తుత వ్యవస్థను ఇప్పుడున్న రూపంలో భరించడానికి అంగీకరించక దానిని మార్చడానికి వర్గపోరాటం చేపట్టినప్పుడు, ఆ పోరాటం ఊపందుకున్నప్పుడు ఇప్పుడున్న వ్యవస్థ పరిధి లోనే ఆగిపోతామా లేక దీనిని కూలదోసి ఇంకా ముందుకు పోతామా అన్నది విప్లవ కార్యాచరణే నిర్ణయిస్తుంది.

అయితే మన పాలకవర్గం మాత్రం ప్రపంచం మొత్తం మీద పరిస్థితి ఏ తీరుగా ఉన్నదో గమనించగలిగే పరిస్థితిలో లేదు. బూర్జువా మేధావులు సైతం స్పష్టంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు ముందు దారి మూసుకు పోయిందని చెపుతున్నా మన హిందుత్వ దళాలకి మాత్రం ఇంకా నయా ఉదారవాద విధానాలే పరమ సత్యాలుగా గోచరిస్తున్నాయి. ఇంత తీవ్రంగా మానవజాతి మనుగడకు కరోనా మహమ్మారి ముప్పును తెచ్చి పెట్టిన సందర్భంలో కూడా ఆ ఉదారవాద విధానాలనే మరింతవేగంగా అమలు చేస్తూ తన మతిలేనితనాన్ని ప్రదర్శిస్తోంది.

‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ తన మే8వ తేదీ సంపాదకీయంలో ఇంకా ఇలా రాసింది ”గత రెండు నెలలుగా కార్మికుల విషయం లోగాని, రుణ సదుపాయం కల్పించడం గాని, సరుకుల మార్పిడిలో గాని, సేవారంగంలో గాని చాలా త్వరగాను, లోతుగాను ప్రభుత్వాలు మార్కెట్‌లో జోక్యం చేసుకున్న తీరు చూస్తే అటువంటిది సాధారణ పరిస్థితుల్లో ఒక కమ్యూనిస్టు విప్లవం వచ్చిన దేశాల్లో మాత్రమే జరుగుతుంది. రాత్రికి రాత్రే లక్షల సంఖ్యలో ప్రయివేటు రంగంలోని ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాల చెక్కులు అందడం మొదలైంది. మార్కెట్‌లోకి కేంద్ర బ్యాంకుల నుంచి నిధుల వరద పారింది”.

మన ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఆ పెట్టుబడిదారీ దేశాలతో పోల్చితే ఎంత తేడాగా ఉందో చూడండి. ప్రభుత్వం తన బడ్జెట్‌ నుంచి ప్రయివేట్‌రంగ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం మాట అటుంచి కోట్లాది మంది కార్మికులకు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది. ఇందులో 14 కోట్ల మంది వలస కార్మికులు. వారికెవరికీ ఆదాయాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉండేందుకు ఇండ్లు లేవు, పైసా నష్టపరిహారం కూడా లేదు. మోడీ ప్రభుత్వానికి మానవత్వం లేదని చెప్పడానికి ఇది చాలు. అంతే కాదు, ఈ ప్రభుత్వం ద్రవ్య పెట్టుబడికి దాసోహం అన్న తీరుకి ఇది సంకేతం. ఆ ద్రవ్యపెట్టుబడి ఆధిపత్యం కొసాగిం చడం కోసమే ఈ ప్రభుత్వం పౌర హక్కుల పైన, ప్రజాతంత్ర హక్కుల పైన దాడి చేస్తోంది. అందుకోసమే ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించే మతతత్వ ఎజండాను అమలు చేస్తోంది.

ఇలా నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉదారవాద విధానాల దారిలోనే ఇంకా నడవడం అంటే, ఆ విధానాలు ఇక ముందుకు కొనసాగలేని పరిస్థితి వచ్చిందన్న వాస్తవాన్ని చూడలేకపోవడం. అంటే, అక్కడే ఇరుక్కుపోవడం అన్నమాట. అంటే మరింతగా ఫాసిస్టు, నియంతృత్వ పోకడలను ఈ ప్రభుత్వం ప్రదర్శించబోతున్నదని అర్ధం చేసుకోవాలి. మరింత జుగుప్సాకరమైన రీతిలో మత విద్వేష రాజకీయాలను ముందుకు తెస్తుంది. ఈ యావత్తు దాడినీ తిప్పికొట్టి దేశాన్ని నయా ఉదారవాద ఊబి నుంచి బైటకు తీసుకువచ్చే పోరాటాన్ని శ్రామిక వర్గం చేపట్టాలి.

ప్రభాత్‌ పట్నాయక్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates