పేదలకు కరోనా పరీక్ష

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఆకలిచావులు..సామాజిక అశాంతికి అవకాశం
– బడుగుల బతుకులపై ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేలో ఉన్నదేంటీ..?

ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు.. మన దేశం కూడా కరోనా కల్లోలంతో అల్లాడుతున్నది. వైరస్‌ నేపథ్యంలో మే 3 వరకు కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. మొదటిదఫా లాక్‌డౌన్‌ ఈ నెల 14తో ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బలహీనవర్గాలకు ఆహారం, ఆహార పదార్థాలను అందించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తమ తమ స్థాయిల్లో సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఎలాంటి సహాయం అందని పేదలు లక్షల్లో వున్నారు. మూడో వారంలో కూడా వారికి సహాయం అందకపోతే ఆ కుటుంబాలు ఆకలితో అలమటించే పరిస్థితి ఉంటుందనటంలో ఎలాంటి సందేహంలేదు. ఇలాంటి ఆకలిబాధల్ని తట్టుకోలేక సామాజిక అశాంతికి ఉరికొల్పే చర్యల వైపు బడుగులు అడుగులు వేసే అవకాశాలూ లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్‌, మహారాష్ట్రలోని ముంబయిలో వలస కూలీలు ఆకలిని తట్టుకోలేక రోడ్డెక్కారు. తమను ఊర్లను పంపించాలని కోరుతున్నారు. వారిపై పోలీసులు లాఠీచార్జీ చేస్తున్నారు.

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ పొడిగించడంతో బడుగులు తమ జీవితాలను ఎలా నెట్టుకుని రావాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అందుబాటులో వున్న నేషనల్‌ శాంపిల్‌ సర్వే సంస్థ 2018-19లో (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) యూనిట్‌ స్థాయి వినియోగ వ్యయ సర్వే గణాంకాలను బట్టీ.. దేశంలో గ్రామీణ జనాభాలో దిగువ 5శాతం మంది నెలవారీ తలసరి వినియోగ సగటు వ్యయం రూ.687, పట్టణ భారత సగటు రూ.920. దిగువన 6 నుంచి 10 శాతం జనాభా విషయానికొస్తే.. నెలవారీ తలసరి సగటు వినియోగ వ్యయాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వరుసగా రూ.868, రూ.1,186 మాత్రమే.

దేశంలోని దిగువ ఉన్న జనాభాను పరిశీలిస్తే.. వారు వారి మొత్తం వినియోగ వ్యయంలో ఆహార పదార్థాల కోసం 60శాతం, దుస్తులు, ఆశ్రయం, విద్య, ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్‌ వంటి ఇతర అవసరాల కోసం 40శాతం కన్నా తక్కువ ఖర్చు చేస్తున్నారు. గ్రామీణ పేదల్లోని దిగువ 10శాతం మంది ఆహారం కోసం చేసే మొత్తం ఖర్చులో 35శాతం తృణధాన్యాలపైనే ఖర్చుచేస్తారు. పట్టణ పేదల్లో ఇది 30శాతం. తృణధాన్యాలతోపాటు కూరగాయలు, పానీయాలు, నూనె, పప్పుధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి ఈ తరగతి జనాభా వినియోగ జాబితాలో ఉన్నాయి. ఆహారేతర వ్యయంలో 30 నుంచి 40 శాతం ఇంధనం, విద్యుత్‌కు ఖర్చుచేస్తున్నారు.

2018-19 ధరలతో పోలిస్తే… గ్రామీణ దిగువ 5శాతం మంది రోజుకు వినియోగ వ్యయ సగటు రూ.23 మాత్రమే. ఇది పట్టణ పేదల్లో రూ.31. అలాగే దిగువన 5 నుంచి 10శాతం మంది గ్రామీణ, పట్టణ పేదల రోజువారీ ఖర్చు వరుసగా రూ.29, రూ.40.

ఆహారం కోసం రోజువారీ తలసరి వ్యయం గ్రామీణ దిగువ 5శాతం, 5 నుంచి 10శాతం మంది ఖర్చుచేసేది రూ.14, రూ.18. అలాగే పట్టణ దిగువ 5శాతం, 5 నుంచి 10శాతం వరుసగా రూ. 18, రూ. 23. రోజుకు రూ.18 లేదా రూ.23తో లభించే ఆహారం వారికి రోగనిరోధక శక్తే మాట కాదుకదా… తగినంత పోషకాహారాన్ని కూడా అందించదు. లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు వారాల ఆదాయాన్ని ఈ నిరుపేదలు కోల్పోయారు. మన దేశ మొత్తం జనాభా 130 కోట్లలో.. ఈ జనాభా సంఖ్య 13 కోట్లు. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 2011-12 అంచనాల ప్రకారం, ఈ జనాభాలో 40శాతం పట్టణ ప్రాంతాల్లో, 60శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ విభాగంలో కేవలం ఒక్క శాతం ఆకలితో ఉన్నారంటేనే… దీనర్థం 13 లక్షలకుపైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నట్టే.

నేడు నెలకొన్న తీవ్ర అనిశ్చితి పరిస్థితి పేద ప్రజలపై తీవ్ర ప్రభావమే చూపుతున్నది. ఆదాయ వనరులు మూసుకుపోయాయి. ప్రభుత్వ సహాయ చర్యలు వెంటనే వారికి చేరకపోతే.. తీవ్ర పరిణామాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆకలి మరణాలు, ఆత్మహత్యల కేసులకు దారితీస్తాయని కూడా హెచ్చరిస్తున్నారు. దేశంలోని ప్రతి మూలకూ ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో ప్రభుత్వం చేరుకోవాల్సిన అవసరం ఉంది. అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునే చర్యలను మరింత వేగవంతంగా ముందుకెళ్ళాల్సిన అత్యవసర పరిస్థితి ఇది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates