13 కోట్ల మంది..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఏప్రిల్‌లో భారీగా ఉద్యోగాల కోత
– చిరు వర్తకులు, అసంఘటితరంగ కార్మికులపై పెను భారం
– నష్టపోయినవారిలో 9 కోట్ల మంది వాళ్లే..
– సుమారు రెండు కోట్ల రెగ్యులర్‌ ఉద్యోగులదీ అదే పరిస్థితి : సీఎంఐఈ అంచనా

న్యూఢిల్లీ : కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌.. ఉద్యోగ, ఉపాధి రంగాల మీద మునుపెన్నడూ చూడనివిధంగా పెను ప్రభావం చూపిస్తున్నది. దీనిద్వారా ఇప్పటివరకూ దేశంలో 13 కోట్ల మంది తమ ఉపాధిని కోల్పోయారని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థ లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచీ కార్మికుల జీతాల్లో కోత, ఉద్యోగుల ఏరివేత, వలసకూలీలు, నిరుద్యోగ రేటు పెరుగుదలపై వరుసగా సర్వేలు చేపడుతున్న విషయం తెలిసిందే. తాజా అంచనాల ప్రకారం.. గతనెలలో దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని సీఎంఐఈ తెలిపింది. వీరిలో చిరువ్యాపారులు, అసంఘటితరంగ కార్మికులే 9 కోట్ల మంది ఉండటం ఆందోళనకరం.

సీఎంఐఈ తాజా అంచనాల మేరకు.. మార్చి 24న కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించగా ఆ నెల చివరి వారంలో సుమారు 80 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇక ఏప్రిల్‌ నెలలో ఇది తీవ్రస్థాయికి చేరింది. ఏకంగా 12 కోట్ల మంది కార్మికులు, వేతన జీవులు, చిరువ్యాపారులు, ఔత్సాహికుల (ఎంట్రప్రిన్యూర్స్‌) ఉద్యోగాలు ఊడాయి. జాబితాలో అత్యధికంగా 9 కోట్ల మంది చిరు వర్తకులు, అసంఘటితరంగ కార్మికుల ఉపాధి గల్లంతైంది. 1.8 కోట్ల చొప్పున ఎంట్రప్రిన్యూర్లు, వేతన జీవులు బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలిగించబడ్డారు. వేతనజీవుల్లో చాలా మంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఉండటం గమనార్హం. ఎంట్రప్రిన్యూర్లలో ఎక్కువమంది సొంత వ్యాపారాలు, ఐటీ, ఇతర సాంకేతిక రంగాల ద్వారా ఉపాధి పొందుతున్నవారు ఉన్నారు. ఆసక్తికరంగా వ్యవసాయ రంగం 58 లక్షల మందికి ఉపాధి కల్పించడం కొంత ఉపశమనం.

కాగా లాక్‌డౌన్‌ కారణంగా పట్టణాల నుంచి వలస వచ్చిన కూలీలు.. బతుకుదెరువు కోసం వ్యవసాయ పనులను ఆశ్రయించడంతో ఈ రంగంలో ఉపాధి స్వల్పంగా పెరిగింది. పంట కోతల సమయం కావడం వారికి కొంతమేర కలిసి వచ్చింది. అయితే దేశవ్యాప్తంగా కోతలు దగ్గరపడుతుండటంతో వచ్చే నెల్లో ఈ రంగంలోనూ ఉపాధి తగ్గే అవకాశం ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం..
పట్టణ ప్రాంతాల్తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య అధికంగా ఉంది. లాక్‌డౌన్‌ మొదలైనప్పట్నుంచి ఈనెల 1 దాకా పట్టణ ప్రాంతాల్లో 4.59 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా, గ్రామీణ ప్రాంతాల్లో 8.45 కోట్ల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని సీఎంఐఈ అంచనా వేసింది. దీంతో దేశంలో మార్చి చివరినాటికి 7 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. ఏప్రిల్‌ మాసాంతానికి ఏకంగా 27 శాతానికి ఎగబాకింది.

లాక్‌డౌన్‌ కాలంలో ఉద్యోగులను తీసేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూతూ మంత్రంగా ఆదేశాలు జారీ చేయగా.. యాజమాన్యాలు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా సాకు చూపి కార్మికుల వేతనాల్లో కోత విధిస్తుండగా.. పలు సంస్థలు ‘నో వర్క్‌.. నో పే’ పేరిట నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగిస్తున్నాయి. అయినా ప్రయివేటు యాజమాన్యాల మీద ప్రభుత్వాలు ఇంతవరకు తీసుకుంటున్న చర్యలు శూన్యం అని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ఓవైపు లాక్‌డౌన్‌ను దశలవారీగా పెంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఉపాధి కోల్పోయిన రంగాల కార్మికులను అన్నివిధాలా ఆదుకోవాలని కార్మిక సంఘాలు, మేధావులు, ఆర్థికవేత్తలు కోరుతున్నా ప్రభుత్వాధినేతలు మాత్రం పట్టించుకోవడం లేదు. తిండీతిప్పలు మాని, మండుటెండల్లో వేల కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకుంటున్న వలస కార్మికులు, కూలీలు, పేదలకు నెలకు తలా ఒకరికి రూ. 7,500 ఇవ్వాలని ఆర్థికవేత్తలు కోరుతున్నా… కేంద్రం దానిని పరిగణనలోకి తీసుకోలేదు. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 500 వేసి చేతులు దులుపుకుంటున్నది. ఈ సంక్షోభ సమయంలో కార్మికులకు అండగా నిలవాల్సింది పోయి.. బడా కార్పొరేట్లకు, ప్రయివేటు పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చడానికి వేగంగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates