మూడంచెల మతోన్మాద ప్రణాళిక

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
Image result for nrc ప్రణాళిక"– ప్రకాశ్‌ కరత్‌
అనువాదం: కొండూరి వీరయ్య,

పౌరసత్వ సవరణ చట్టం 2019, జాతీయ జనాభా రిజిష్టర్‌ రెండూ పరస్పరం సంబంధం కలిగిన జోడు గుర్రాలు. ఈ విషయాన్ని హౌం మంత్రి అమిత్‌ షా అటు పార్లమెంట్‌ వేదికగానూ, పార్లమెంట్‌ బయట కూడా పదే పదే స్పష్టం చేస్తూ వచ్చారు. పార్లమెంట్‌లో పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ ఆమోదం పొందిన తర్వాతనే జాతీయ పౌర చిట్టా తయారు చేస్తామని ప్రకటిస్తూనే వచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన పెల్లుబుకుతున్న నేపథ్యంలో జాతీయ జనాభా జాబితా తయారీ అమలు విషయంలో ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. దేశవ్యాప్తంగా జనాభా జాబితా తయారీ క్రమం ఎలా ఉంటుందన్న విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదు. దీన్ని అవకాశంగా తీసుకుని హౌంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ”దేశవ్యాప్తంగా పౌర జాబితా క్రమాన్ని చేపట్టే ఆదేశాలేవీ ఇంకా వెలువడ లేదు. కాబట్టి ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు” అని శెలవిచ్చారు. కేంద్ర ప్రభుత్వం హిందీ, ఉర్దు పత్రికల్లో ఇచ్చిన ప్రచార ప్రకటనల్లో ”జాతీయ జనాభా జాబితా తయారీ విధి విధానాలు ప్రకటించలేదు. భవిష్యత్తులో ప్రకటించినా భారతీయ పౌరులెవ్వరికీ ఇబ్బంది లేనివిధంగా విధి విధానాలు రూపొందిస్తాం” అని చెప్తోంది.

జాతీయ జనాభా రిజిష్టర్‌ – జాతీయ పౌర జాబితాల మధ్య సంబంధం
పత్రికల్లో ప్రకటనలు గానీ మంత్రి వ్యాఖ్యలు గానీ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నమే. ఈ రెండింటి మధ్య కీలకమైన సంబంధం ఉంది. జాతీయ జనాభా రిజిష్టర్‌ సిద్ధం అయిన తర్వాతనే అందులో నుంచి పౌరుల జాబితా వేరు చేసే క్రమం ప్రారంభమవుతుంది అదే ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం. జాతీయ జనాభా రిజిష్టర్‌ తయారు చేయటం ఈ క్రమంలో తొలి అడుగు. ఈ మేరకు జులై 31, 2019న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ మేరకు ఇంటింటి సర్వే అసోం మినహా దేశవ్యాప్తంగా జరుగుతుంది. స్థానిక రిజిష్ట్రార్‌ పరిధిలో ఉన్న ప్రాంతంలో నివాసితుల వివరాలు సేకరించటం ఈ సర్వే కసరత్తు సారాంశంగా ఉంటుంది. ఈ కసరత్తు 2010 ఏప్రిల్‌ 1న మొదలై 2020 సెప్టెంబరు 30 పూర్తి కావాలి.
ఈ విధంగా పౌర రిజిష్టర్‌ తయారు చేయటం జాతీయ పౌర జాబితా సిద్ధం చేయటంలో తొలి మెట్టు. అటువంటి రిజిష్టర్‌ సిద్ధమయ్యాక భారతీయుల జాబితా ఖరారు చేయటానికి తనిఖీ చేస్తారు. ఈ తనిఖీ ప్రక్రియే జాతీయ పౌర జాబితా. ”పౌరసత్వం (పౌరుల రిజిస్ట్రేషన్‌ మరియు గుర్తింపు కార్డుల జారీ) నిబంధనలు 2003” సవరణ పేరుతో విడుదలైన విధి విధానాలు వెల్లడిస్తున్న క్రమం ఇదే. అంటే ఏప్రిల్‌ 1, 2020 నుంచీ జాతీయ పౌర రిజిష్టర్‌ తయారీ క్రమం మొదలవుతుంది. దీనికోసం ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తారు. ఈ నిబంధనల ప్రకారం తనిఖీ క్రమంలో అనుమానాస్పదులుగా ఉన్న పౌరులకు పౌరసత్వ వివరాలు స్థానిక రిజిష్టర్‌లో నమోదు చేసేటప్పుడు తదుపరి విచారణకు కావల్సిన హెచ్చరికలు కూడా నమోదు చేయాలి. అటువంటి అనుమానాస్పద వ్యక్తులు, కుటుంబాలను తనిఖీ చేయటానికి ఉద్దేశించిన పత్రం ఒకటి అందచేయాలి.
ఈ విధి విధానాల్లోని నాల్గో నిబంధన, ఐదో క్లాజు (అ) ఉపక్లాజులో ”ఈ నిబంధన కిందకు వచ్చే ప్రతి వ్యక్తి, కుటుంబం, సదరు కుటుంబాన్ని జాతీయ పౌర రిజిష్టర్‌లో చేర్చాలా, వెలివేయాలా అన్న తుది నిర్ణయం తీసుకోవటానికి ముందు తాలూకా జనాభా రిజిష్టార్‌ ముందు తమ వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించాలి.”అని స్పష్టంగా చెప్తోంది.

బయో మెట్రిక్‌ వివరాలు ఉపయోగించటం గురించి
ఈ సర్వేలో భాగంగా ప్రతి కుటుంబమూ 15 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందులో పుట్టిన ఊరు, తేదీ, తల్లితండ్రుల పేర్లు వంటివి కూడా ఉంటాయి. అదనంగా ఆధార్‌ కార్డులో ఉన్న వివరాలు జతచేయబడతాయి. ఈ వివరాలన్నీ తర్వాత ఆధార్‌ సాధికార సంస్థ వద్ద ఉన్న వివరాలతో పోలుస్తారు. బయో మెట్రిక్‌ వివరాలు సరిపోతున్నాయా లేదా అన్నది సరి చూసుకుంటారు. ఈ విధంగా నాల్గో నిబంధన కిందకు వచ్చే వారికి సంబంధించిన బయో మెట్రిక్‌ వివరాలు కూడా పోల్చుకోవాలన్న ఆదేశమే అనేక సందేహాలకు తావిస్తోంది.

హౌం మంత్రి ప్రకటించిన విధంగా చొరబాటుదారులను ఏరివేసే లక్ష్యంతో ఈ రెండో దఫా తనిఖీ దశలో ప్రజలను మతవిశ్వాసాల పరంగా వర్గీకరించటం జరుగుతుంది. ఈ రెండో దఫా తనిఖీ క్రమంలోనే పౌరసత్వ చట్ట సవరణ ద్వారా వలస వచ్చిన హిందువులందరికీ పౌరసత్వం ధృవీకరించబడుతుంది. అనుమానాస్పద పౌరులుగా వర్గీకరించిన వారు మాత్రం తమ పౌరసత్వాన్ని తామే నిరూపించుకోవాల్సిన దుర్గతికి నెట్టబడతారు.

ఈ రకమైన జాతీయ పౌర జాబితా సిద్ధం చేయటానికి కొత్తగా చట్టం చేయాల్సిన అవసరమే లేదు. 1955 పౌరసత్వ చట్టానికి 2003లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన సవరణలోనే ఇది భాగంగా ఉంది. ఇప్పుడు అదనంగా ముందుకొచ్చింది కేవలం జాతీయ పౌర జాబితా ప్రతిపాదన మాత్రమే. పౌరులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వటానికి ఇటువంటి జాబితా రూపొందించనున్నారు. దీని ఆధారంగానే జాతీయ జనాభా రిజిష్టర్‌ తయారీ జరగనుంది.

ఈ గందరగోళాన్ని మరింత పెంచటానికి గాను కేంద్ర ప్రభుత్వం 2021 జనాభా లెక్కల సేకరణలో భాగంగా జాతీయ జనాభా రిజిష్టర్‌ను తాజాపర్చబోతున్నట్టు చెప్తోంది. ఈ రెండు జాబితాలు తయారు చేసేది కూడా జనగణన విభాగం అధికారులే. కానీ ఈ రెండూ వేర్వేరు. ముందు జనాభా రిజిష్టర్‌ తయారయ్యాక అందులో నుంచి అనుమానాస్పద వ్యక్తులు, కుటుంబాల వివరాలు మినహాయించి పౌర జాబితా తయారవుతుంది. ఈ రకంగా చూసుకున్నప్పుడు రెండింటికీ ఉన్న ప్రత్యక్ష సంబంధం బోధపడుతుంది.

పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ప్రజలను మతం ప్రాతిపదికన విభజించటం కేంద్ర ప్రభుత్వం కుట్రగా ఉన్నదన్న విషయం సుస్పష్టం. ఓ వైపున జాతీయ పౌర జాబితా బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ముస్లిం చొరబాటుదారులందరినీ ఏరివేస్తుందని ప్రకటిస్తూనే మరో వైపున వలస వచ్చిన హిందువులకు పౌరసత్వం ఇవ్వబోతున్నామని ప్రభుత్వం స్పష్టంగా చెప్తోంది. ఇక్కడ గందరగోళానికి తావు లేదు.

భారంగా మారనున్న గజి బిజి వ్యవహారం
భారతీయులందరికీ ఆధార్‌కార్డు అందుబాటులోకి వస్తున్న తరుణంలోనే ఈ జాతీయ పౌర జాబితా క్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఎన్నికల సంఘం వద్ద ఓటర్లందరికీ ఫొటో గుర్తింపు కార్డులు కూడా సిద్ధంగానే ఉన్నాయి. అటువంటి సమయంలో అదే వివరాలతో మరో జాబితా తయారు చేయటం అర్థం లేని వ్యవహారం. అంతేకాదు. దీని కోసం పెద్దమొత్తంలో ప్రజా ధనాన్ని కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ జాతీయ పౌర జాబితా రూపకల్పన మౌలికంగా దేశంలో నలుమూలలా నివశిస్తున్న వలస కార్మికులు, ఆదివాసీలు ఇతర జాతీయ ఆర్థిక జీవన స్రవంతి నుంచి వెలివేయబడ్డ సామాజిక తరగతుల ప్రయోజనాలకు వ్యతిరేకం అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

అందువల్లనే పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం జాతీయ పౌర జాబితాను కూడా సవాలు చేస్తోంది. ఈ రెండూ కలగలిపి అమలు జరిపినప్పుడే ప్రభుత్వం ప్రతిపాదించిన మతోన్మాద వ్యూహం అమలవుతుంది. కాబట్టి ఈ రెండింటినీ ఉమ్మడిగా వ్యతిరేకించాలి. పౌరసత్వ చట్టానికి కేంద్రం ఆమోదించిన సవరణలు సరిహద్దుల అవతలి నుంచి దేశంలోకి వస్తున్న ముస్లిమేతరులను శరణార్ధులుగానూ, ముస్లింలను చొరబాటుదారులుగానూ ముద్ర వేస్తోంది. శరణార్ధులుగా గుర్తించిన వారికి పౌరసత్వం దాఖలు పరుస్తోంది. చొరబాటుదారులుగా గుర్తించిన వారిని వెలివాడలకు తరలించనుంది. ఈ రకంగా వెలికవాడలకు పరిమితమవుతున్న వారంతా ద్వితీయ శ్రేణి పౌరులుగా మారనున్నారు. అటువంటి ద్వితీయ శ్రేణి పౌరులకుండే హక్కులు పెద్దఎత్తున కుదించబడనున్నాయి.

రాష్ట్రాల హక్కులు
బీజేపీ ప్రభుత్వం యొక్క మతోన్మాద ఎజండాను అమలు కానీయకుండా చూడటంలో విజయం సాధించటం తప్ప దేశం ముందు మరో మార్గం లేదు. దీనికోసం జాతీయ పౌరజాబితా రూపకల్పనను అడ్డుకోవాలి. ఈ దిశగా వేయాల్సిన తొలి అడుగు రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో జాతీయ జనాభా రిజిష్టర్‌ సిద్ధం కానీయకుండా అడ్డుకోవటం. అనేకమంది ముఖ్యమంత్రులు తాము జాతీయ పౌర జాబితాకు వ్యతిరేకం అని బహిరంగంగా ప్రకటించారు. చివరకు పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధించిన బీహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌లు కూడా తమ తమ రాష్ట్రాల్లో జాతీయ పౌర చిట్టా తయారీ జరగబోనీయమని స్పష్టం చేశారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయా రాష్ట్రాల్లో జాతీయ జనాభా రిజిష్టర్‌ తయారీ క్రమాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. జనాభా వివరాలు నమోదు చేయటానికి, తనిఖీ చేయటానికి కావల్సిన సిబ్బందిని అధికార యంత్రాంగాన్ని సమకూర్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు ప్రకటించటంతో తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ దారిలోనే నడవాలి. కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌర జాబితా తయారీ క్రమం మొదలు కాలేదన్న ప్రకటనకు కట్టుబడి ఉంటే జులై 31, 2019న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసుకోవాలి.

(Courtesy: NT)

 

RELATED ARTICLES

Latest Updates