కలెక్టరేట్లకు కాసుల్లేవు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 సిరిసిల్లలో నూతన కలెక్టరేట్‌ నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకూ రూ.30 కోట్ల పనులు పూర్తయ్యాయి. వీటిలో రూ.5 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి. భవన నిర్మాణం కూడా 90 శాతం పూర్తయింది.

భూపాలపల్లిలో కలెక్టరేట్‌ నిర్మాణానికి తొలుత రూ.32 కోట్లు మంజూరయ్యాయి. అంచనాలు పెరగడంతో మరో రూ.9.84 కోట్లు కూడా అదనంగా మంజూరు చేశారు. మొత్తం రూ.41.84 కోట్లలో ఇప్పటి వరకూ ఖర్చు చేసింది కేవలం రూ.1.85 కోట్లు! ఇందులో ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ.50 లక్షలు మాత్రమే!! 2017 అక్టోబరు 11న శంకుస్థాపన చేసిన ఇక్కడి భవన నిర్మాణం ఇంకా పిల్లర్ల స్థాయిలోనే ఉంది.

నాలుగేళ్లు కావస్తున్నా పూర్తికాని కొత్త భవనాలు
90 శాతం పూర్తయిన ఐదు భవన నిర్మాణాలు
జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డిల్లో దాదాపు పూర్తి
మరో ఐదారుచోట్ల మూడొంతుల వరకూ..
సగం జిల్లాల్లో నత్తనడక.. కొన్నిచోట్ల పిల్లర్లలోనే
అంచనా వ్యయం 960 కోట్లు.. అందులో సగమే ఖర్చు
దాదాపు రూ.100 కోట్ల వరకూ పెండింగ్‌ బకాయిలు
చాలా జిల్లాల్లో మధ్యలోనే ఆగిన నిర్మాణాలు

హౖదరాబాద్‌ : రాష్ట్రంలో కొత్త జిల్లాలను ప్రకటించి నాలుగేళ్లు కావస్తోంది. కొత్త జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ల భవన సముదాయాలను నిర్మించాలని నిర్ణయించి మూడేళ్లు కావస్తోంది. అయినా, ఇప్పటి వరకూ ఒక్క కలెక్టరేట్‌ భవనమూ పూర్తి కాలేదు. సగం కలెక్టరేట్లు 75 శాతానికిపైగా పూర్తయితే.. మరికొన్ని పిల్లర్ల దశలో ఉన్నాయి. నిధుల కొరత కారణంగా పలు జిల్లాల్లో నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఒప్పందం ప్రకారం ఇప్పటికే పూర్తి కావాల్సిన నిర్మాణాలను కూడా ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. కేటాయించిన నిధుల్లో ఇంకా సగం కూడా ఖర్చు చేయలేదు. దాదాపు రూ.100 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. నిధులు విడుదల చేయకపోవడంతో భవనాల అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2016 జూన్‌లో కొత్త జిల్లాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిలో 26 జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్‌ భవనాల నిర్మాణానికి 2017 మే 1న ఉత్తర్వులు జారీ చేసింది.

కలెక్టరేట్‌ భవనాలతో పాటు జిల్లా స్థాయి అధికారులకు నివాసాలను కూడా నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు సుమారు రూ.960 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. వీటిలో ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ అర్బన్‌, సిద్దిపేట, కొత్తగూడెం, మేడ్చల్‌, రంగారెడ్డి, కామారెడ్డిల్లో ఒక్కొక్కటి 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు రూ.318.50 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసింది. జనగామ, సూర్యాపేట, మెదక్‌, నాగర్‌ కర్నూల్‌, పెద్దపల్లి, వనపర్తి, జగిత్యాల, యాదాద్రి, వరంగల్‌ రూరల్‌, మంచిర్యాల, గద్వాల, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, భూపాలపల్లి, సిరిసిల్లల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందుకు రూ.525 కోట్ల వ్యయం కానుంది. ఉన్నతాధికారులు ఉండడానికి వీలుగా 21 జిల్లాల్లో 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో; అధికారులకు 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మరికొన్ని భవనాల నిర్మాణానికి రూ.118.50 కోట్లు ఖర్చు కానుంది. వీటిని పూర్తి చేయడానికి మొత్తం రూ.960 కోట్లవుతుందని అంచనా వేశారు.

ఇప్పటికి రూ.400 కోట్లకుపైగా ఖర్చు చేశారు. వీటిలో కేవలం 18 జిల్లాల్లోనే ఇంకా రూ.91 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది. బకాయిల కారణంగా కొన్ని జిల్లాల్లో పనులు నిలిచిపోయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. భువనగిరి కలెక్టరేట్‌ పనులను 2017 అక్టోబరు 11న ప్రారంభించారు. సివిల్‌ పనులే పూర్తయ్యాయి. ఇంకా ఫ్లోరింగ్‌, ఎలివేషన్‌ వంటి పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. రూ.9కోట్ల బిల్లులు పెండింగ్‌ ఉన్నట్టు సమాచారం. నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌కు రూ.38కోట్లతో డిజైన్లు ఖరారు చేశారు. మూడేళ్లు గడుస్తున్నా 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. మెదక్‌ కలెక్టరేట్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ 2018 మే 9న శంకుస్థాపన చేశారు. 2019 డిసెంబరు 31 కల్లా పూర్తి కావాలి. కానీ, 60ు పనులే పూర్తయ్యాయి. నిర్మల్‌లో నిర్మాణాలు శ్లాబ్‌ లెవల్‌లోనే ఉన్నాయి.

రూ.40 కోట్లను వ్యయం చేయాల్సి ఉండగా, రూ.3 కోట్లే ఖర్చు చేశారు. కాగా, కొన్ని జిల్లాల్లో మాత్రం నిర్మాణాలు పూర్తి దశకు చేరుకున్నాయి. సిద్దిపేటలో ఉగాది రోజున కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నట్టు మంత్రి హరీశ్‌ ప్రకటించారు. జగిత్యాల, వికారాబాద్‌ , సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో భవనాలు 90ు పూర్తయ్యాయి. మంచిర్యాల, మేడ్చల్‌, జనగాం, ఆసిఫాబాద్‌, యాదాద్రి, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లోనూ 75 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి.

కన్సల్టెన్సీకి కాసులు
జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయాల నిర్మాణాలకు జారీ చేసిన ఉత్తర్వులన్నింటినీ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. భవనాల నిర్మాణాల ఉత్తర్వులతో పాటు వాటికయ్యే వ్యయం వివరాల ఉత్తర్వులను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచలేదు. ఈ భవనాల ఆర్కిటెక్చర్‌ ఉషా రెడ్డికి చెల్లించే ఫీజులకు సంబంధించిన ఉత్తర్వులు కూడా బహిరంగపరచలేదు. ఆర్టీఐ కింద ఆ వివరాలను శ్రీనివాసరావు అనే వ్యక్తి తీసుకోగలిగారు.

కలెక్టరేట్ల భవనాలకు డిజైన్లు, ఇతర సాంకేతిక సహకారాన్ని అందిస్తున్న సంస్థకు రూ.28.86 కోట్లను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా, మొత్తం అంచనా వ్యయంలో 3 శాతాన్ని ఫీజుగా ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే ఒక శాతం నిధులను ఉషారెడ్డికి చెల్లించారు. నిజానికి, ప్రభుత్వ భవనాల నిర్మాణంలో మొత్తం వ్యయంలో కన్సల్టెన్సీలకు కనిష్ఠంగా అర శాతం నుంచి చెల్లిస్తారు. భారీ నిర్మాణాలకు గరిష్ఠంగా 1.5- 2 శాతం ఇస్తారు. కానీ, ఇక్కడ ఏకంగా 3 శాతాన్ని ఆర్కిటెక్చర్‌ కన్సల్టెంట్‌కు కట్టబెట్టడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates