నగరాల్లో నిరుద్యోగం పైపైకి..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– జులై మొదటివారానికి 11.26 శాతానికి : సీఎంఐఈ
– లాక్‌డౌన్‌ నిబంధనలతో పూర్తిస్థాయిలో తెరుచుకోని సంస్థలు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న లాక్‌డౌన్ల కారణంగా నగరాల్లో ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ఈ నెల మొదటివారానికి (జులై 5 నాటికి) నగరాల్లో నిరుద్యోగిత రేటు 11.26 శాతానికి చేరింది. అంతకుముందు వారంలో ఇది 10.69 శాతంగా ఉండేదని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెలువరించిన తాజా నివేదికలో వెల్లడైంది. జూన్‌ నాటికి అన్‌లాక్‌ – 1 పేరిట కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినప్పటికీ పలు రాష్ట్రాల రాజధానుల్లో కరోనా విలయ తాండవం దృష్ట్యా పలు నగరాల్లో మళ్ళీ లాక్‌డౌన్‌ లు విధిస్తున్నారు. ఈ నేపథ్యం లో పట్టణప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరుగుతుందని సీఎంఐఈ తెలిపింది.

కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్‌, అసోమ్‌, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో అక్కడ తిరిగి లాకౌడౌన్లు విధించిన విషయం విదితమే. దీంతో అక్కడ ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న పరిశ్రమలు మళ్ళీ మూతబడుతున్నాయి. అంతకుముందే మార్చి 24 న కేంద్రం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఫలితంగా కోట్లాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. దీంతో నగరాలలో ఉండే వలస కార్మికులు గ్రామాల బాట పట్టారు. నగరాలలో సంఘటిత, అసంఘటిత రంగాలు ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో తెరుచుకుని పనులు ప్రారంభించే స్థితిలో లేవు. ఈ నేపథ్యం లో పట్టణాల్లో ఉద్యోగ కల్పన అనేదానిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దాదాపు అన్ని రంగాల్లోనూ ఉద్యోగులను బయటికి గెంటి వేయడమో లేక సెలవుల పేరు మీద ఖాళీగా ఇంట్లో కూర్చోబెట్టడమో జరుగుతున్నది. పనులు చేయించుకున్నా చాలీచాలని జీతాలనే సరిపెడుతున్నారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు పనులు ప్రారంభిస్తున్నా అదీ నామమాత్రంగానే ఉంది. దీంతో నగరాల్లో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దీనిపై జంషెడ్‌పూర్‌ లో ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న ప్రముఖ ఆర్థికవేత్త కె ఆర్‌ శ్యామసుందర్‌ మాట్లాడుతూ.. ‘ఉద్యోగాలు, ఆదాయాలు కోల్పోవడంతో నగరాల్లో వేతనజీవులు చాలా ఒత్తిడి లో ఉన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థపై స్వల్ప, దీర్ఘకాసిక ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు. ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీ లో 85 శాతం మంది ఉద్యోగులు తమ ఆదాయాన్ని కోల్పోయారని నివేదికలు వస్తున్నాయి. ఇదే నిజమైతే దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీదా పడుతుంది’ అని అన్నారు. అయితే ఉద్యోగాలను కల్పనను వేగవంతం చేయడానికి మార్కెట్‌ లో డిమాండ్‌ ఎక్కడుంది..? అని ఆయన ప్రశ్నించారు.

ఇదే విషయమై ఆలిండియా మ్యానుఫ్యాక్చరర్స్‌ ఆర్గనైజేషన్‌ మాజీ అధ్యక్షుడు కె.ఈ.రఘునాధన్‌ స్పందిస్తూ.. ‘నగరాల్లో సంఘటిత రంగాల్లో ఉద్యోగాలు కల్పించడానికి ఇంకా చాలా టైం పడుతుంది. పరిశ్రమల్లో పూర్తిస్థాయి పనులు మొదలవలేదు. కార్మికుల కొరత, వైరస్‌ వ్యాప్తి కారణంగా సంస్థలు కూడా ఉపాధి కల్పనకు వెనకాడుతున్నాయి. నగరాల్లో పరిస్థితి నెమ్మదిగా కుదుటపడుతుంది’ అని అన్నారు. వలస కార్మికులు నగరాలకు తిరిగి రావడానికి కనీసం ఆరు నెలలైనా పట్టొచ్చనీ, అప్పటిదాకా ఇది ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే.. వేతన జీవులకు ఉద్యోగాల పునరుద్ధరణ ప్రక్రియ కూడా ఆశించిన మేర జరగడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ లో లాక్‌డౌన్‌ ఫలితంగా 1.7 కోట్ల మంది (శాలరీడ్‌ ఎంప్లాయిస్‌) ఉద్యోగాలు కోల్పోగా.. ఇది మే నాటికి 1.8 కోట్లకు చేరింది. అయితే జూన్‌ లో ఉద్యోగాల పునరుద్ధణలో భాగంగా 39 లక్షల ఉద్యోగులకే పని కల్పించినట్టు సీఎంఐఈ మరో నివేదిక లో పేర్కొంది. ఇక గ్రామాల్లో వ్యవసాయ, ‘నరేగా’ పనులు ఊపందుకోవడం, అసంఘటిత రంగాల్లోనూ అక్కడక్కడ పనులు మొదలవడంతో.. ఈ రంగాల్లో కొంత పురోగతి కనిపిస్తున్నదని సీఎంఐఈ వెల్లడించింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates