ట్రంప్‌ డిమాండ్‌కు చైనా నో

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

బీజింగ్‌: కరోనా వైరస్‌ పుట్టుకపై దర్యాప్తునకు తమ దేశ బృందాలను అనుమతించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన డిమాండ్‌ను చైనా తోసిపుచ్చింది. తాము కరోనా బాధితులమేగానీ, నేరస్తులం కాదని స్పష్టం చేసింది. వూహాన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పినా ఆ దేశం నుంచి స్పందన లేదని అంతకుముందు ట్రంప్‌ వ్యాఖ్యానించడం తెల్సిందే. కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ నుంచి తప్పించుకుందా? అనే కోణంలో అమెరికా విచారణ ప్రారంభించింది.

ఈ పరిణామాలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ స్పందిస్తూ.. ‘వైరస్‌ మానవాళి మొత్తానికి శత్రువు. అది ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రత్యక్షం కావచ్చు. ఏ దేశంపైనైనా విరుచుకు పడవచ్చు. మేమూ బాధితులమే. నేరస్తులం కాదు. ఈ వైరస్‌ను తయారు చేసిన వాళ్లలో మేము లేమ’ని పేర్కొన్నారు. సరైన సమయంలో వైరస్‌ సమాచారం ఇవ్వని చైనాపై చర్యలు తీసుకోవాలని అమెరికా నేతలు డిమాండ్‌ చేయడంపై గెంగ్‌ మాట్లాడుతూ.. ‘వూహాన్‌లో తొలిసారి వైరస్‌ను గుర్తించింది మొదలు ఇప్పటివరకూ చైనా అన్ని అంశాలను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తోంది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటోంద’ని అన్నారు. వైరస్‌ కట్టడికి సంబంధించి ప్రపంచానికి
చైనా విలువైన సమాచారాన్ని ఇచ్చిందని తెలిపారు.

అంతర్జాతీయ మరణాలకు చైనాపై దావా వేయాలన్న అమెరికా నేతల మాటలకు స్పందిస్తూ.. ఇలాంటి ఘటన ఏదీ గతంలో జరగలేదని, 2009లో హెచ్‌1ఎన్‌1 అమెరికాలో బయటపడిందని, హెచ్‌ఐవీ/ఎయిడ్స్, 2008 నాటి ఆర్థిక సంక్షోభం అమెరికాలో మొదలై ప్రపంచాన్ని కుదేలు చేశాయని గెంగ్‌ గుర్తు చేశారు. అప్పట్లో ఎవరైనా అమెరికా బాధ్యత ఏమిటని అడిగారా? అని ప్రశ్నించారు. కరోనా వైరస్‌పై చైనాలో అంతర్జాతీయ బృందం దర్యాప్తు చేయాలన్న ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలమంత్రి మరైస్‌ పేన్‌ పిలుపును గెంగ్‌ తోసిపుచ్చారు.

RELATED ARTICLES

Latest Updates