కమ్ముకుంటున్న కరోనా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • 26కు మృతుల సంఖ్య..
  • బాధితులు 900 మంది..
  • వూహాన్‌ సహా 14 నగరాల అష్టదిగ్బంధం
  • ఆ నగరాల్లో చిక్కుకున్న 39మంది భారతీయులు
  • 6 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం

బీజింగ్‌, న్యూఢిల్లీ: చైనాలోని వూహన్‌ నగరంలో ప్రబలిన కొత్తరకం కరోనా వైరస్‌ నానాటికీ మరింతమందికి వ్యాపిస్తూ వణుకు పుట్టిస్తోంది. ఈ వైర్‌సబారిన పడినవారిలో ఇప్పటివరకూ 26 మంది చనిపోగా.. 900 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిజానికి ఈ సంఖ్య వేలల్లో ఉండొచ్చని, ఇది ఆస్పత్రులకు వచ్చినవారి సంఖ్య మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్‌ ప్రమాదకరంగా విస్తరిస్తోందని, ఇది ఇలాగే కొనసాగితే ఫిబ్రవరి 4వ తేదీ నాటికి ఒక్క వూహాన్‌లోనే మూడున్నర లక్షల మందికి వ్యాపించే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చైనీయుల కాలమానం ప్రకారం శనివారం (జనవరి 25) వారికి కొత్త సంవత్సరం. కానీ.. వణికిస్తున్న వైరస్‌ ముప్పు నేపథ్యంలో చైనావ్యాప్తంగా వేడుకలన్నింటినీ రద్దు చేశారు. వూహాన్‌ ఆ చుట్టుపక్కల ఉన్న 14 నగరాలను అధికారులు దిగ్బంధించారు. ఆయా నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థలను, విమానాశ్రయాలను పూర్తిగా మూసివేశారు. బయటివారు ఆయా నగరాల్లోకి ప్రవేశించకుండా టోల్‌గేట్లు మూసేశారు. ఇలా దిగ్బంధించిన కొన్ని నగరాల్లో ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనా కూడా ఉండడం గమనార్హం. అయితే, ఈ దిగ్బంధం వల్ల వూహాన్‌ నగరంలో 25 మంది భారతీయులు.. మనదేశానికి తిరిగొచ్చే అవకాశం లేక చిక్కుకు పోయారు.

వారిలో 20 మంది కేరళకు చెందినవారని సమాచారం. మరో 14 మంది భారతీయులు ఇంచాంగ్‌ నగరంలో చిక్కుకుపోయారు. వూహాన్‌లో ఈ వైరస్‌ బారిన పడి ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడంతో కేవలం వారికి చికిత్స చేయడం కోసం ఆరు రోజుల్లోగా 1000 పడకల భారీ ఆస్పత్రి నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 3 నాటికి ఈ ఆస్పత్రిని వైరస్‌ బాధితులకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు వివరించారు. తక్షణ ఉపశమనానికి మిలటరీ వైద్యులను రంగంలోకి దించారు. మరోవైపు.. పలు అంతర్జాతీయ ఆహార, వస్త్ర దుకాణాలు చైనాలోని తమ శాఖలను తాత్కాలికంగా మూసేస్తున్నాయి.

షాంఘైలోని డిస్నీలాండ్‌ మూతపడింది. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం.. జనవరి 26న తలపెట్టిన గణతంత్ర వేడుకలను కూడా రద్దు చేసుకుంది. ఇక.. కేరళకు చెందిన ఒక నర్సు సౌదీలో కరోనా వైరస్‌ బారిన పడినట్టు వచ్చిన వార్తలపై జెడ్డాలోని భారత కాన్సులేట్‌ స్పందించింది. ఆమె కరోనా వైరస్‌ బారిన పడిన మాట నిజమేగానీ.. అది చైనాలో ప్రబలుతున్న రకం కాదని స్పష్టం చేసింది. అలాగే చైనాలోని షెంజెన్‌లో ఉంటున్న ప్రీతి మహేశ్వరి అనే ఉపాధ్యాయురాలు కూడా కరోనా వైరస్‌ బారిన పడ్డారని వార్తలు వచ్చాయి.

కానీ, ఆమె స్ట్రెప్టోకోకల్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు అధికారులు తెలిపారు. చైనా నుంచి ముంబైకి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను ముంబైలోని ఒక ఆస్పత్రిలో పరిశీలనలో ఉంచారు. అటు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రి కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ కేసుల చికిత్స కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates