కరోనా టీకా తయారీలో భారత్‌ బయో ముందడుగు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

క్లినికల్‌ పరీక్షలకు డీసీజీఐ అనుమతి
వచ్చే నెలలోనే ప్రారంభిస్తాం: సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల

హైదరాబాద్‌: ‘కరోనా’ వైరస్‌కి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాపై మరో ముందడుగు పడింది. మొదటి- రెండో దశ క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. ప్రీ-క్లినికల్‌ అధ్యయనాలకు సంబంధించి.. తాము పంపిన సమాచారం ఆధారంగా పరీక్షలకు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది.  మొదటి-రెండో దశ క్లినికల్‌ పరీక్షలను వచ్చే నెలలోనే మనుషులపై నిర్వహిస్తామని పేర్కొంది. ‘కొవాగ్జిన్‌’ టీకాను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సార్స్‌- కోవ్‌- 2 వైరస్‌ స్ట్రెయిన్‌ను ఎన్‌ఐవీ.. భారత్‌ బయోటెక్‌కు బదిలీ చేసింది తదనంతరం హైదరాబాద్‌ సమీపంలోని భారత్‌ బయోటెక్‌కు చెందిన బయో సేఫ్టీ లెవల్‌ – 3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు.

త్వరలో అందుబాటులోకి తెస్తాం
‘కొవాగ్జిన్‌’ అభివృద్ధిపై భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల సంతోషం వెలిబుచ్చారు. ప్రభుత్వ సంస్థల సహకారంతో పాటు భారత్‌ బయోటెక్‌లోని పరిశోధన- అభివృద్ధి విభాగం, తయారీ విభాగాల్లోని సిబ్బంది శ్రమ ఫలితంగా టీకా రూపుదిద్దుకున్నట్లు పేర్కొన్నారు. ఇది తమకు ఎంతో గర్వించదగ్గ సందర్భమని వివరించారు. వచ్చే నెలలోనే మొదటి-రెండో దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభిస్తామని తెలిపారు. టీకాను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నట్లు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. ‘వీరో సెల్‌ కల్చర్‌ ప్లాట్‌ఫామ్‌ టెక్నాలజీస్‌’ ను ఆవిష్కరించటంలో భారత్‌ బయోటెక్‌కు ఎంతో అనుభవం ఉన్న విషయం తెలిసిందే. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటి వరకూ పోలియో, రేబిస్‌, రొటావైరస్‌, జేఈ (జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌), చికున్‌గున్యా, జికా టీకాలను ఆవిష్కరించారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates