హమ్మయ్య! నౌక చెర వీడింది

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 ఓడలో బందీలైన ప్రయాణికులకు విముక్తి
సిబ్బందిలో ఎవరికీ కరోనా లేదని పరీక్షల్లో వెల్లడి
చైనాలో 813కి చేరిన మృతులు
సింగపూర్‌ ఎయిర్‌ షోకు కంపెనీలు దూరం

హాంకాంగ్‌, బీజింగ్‌: ఐదు రోజుల నిరీక్షణానంతరం ఓ విహార నౌక నుంచి వేల మంది ప్రయాణికులు ఆదివారం స్వేచ్ఛగా బయటకు రాగలిగారు. చైనాలో కరోనా విజృంభణ నేపథ్యంలో ‘ది వరల్డ్‌ డ్రీమ్‌’ అనే నౌకను హాంకాంగ్‌లో నిలిపేసి, దానిలో ఉన్న సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో గత నెలలో వియత్నాం వెళ్లిన ముగ్గురు చైనా ప్రయాణికులు కరోనా బారిన పడినట్లు తెలియడంతో ముందు జాగ్రత్త చర్యగా దీనిని బుధవారం హాంకాంగ్‌లో నిలిపేశారు. ప్రయాణికుల్ని, సిబ్బందిని విడదీశారు. 1800 మంది సిబ్బందిలో ఎవరికీ కరోనా లేదని తేల్చారు. ప్రయాణికులకు విడిగా పరీక్షలు అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చారు.

స్వేచ్ఛ లేకపోవడంపై విమర్శలు
వైరస్‌ ఉద్ధృతి కారణంగా చైనాలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 813కి చేరింది. 2002-03 మధ్య సార్స్‌ విజృంభణతో 774 మంది చనిపోగా తాజా ఉత్పాతంతో మోగిన మరణ మృదంగం దానిని అధిగమించింది. కొత్తకేసుల నమోదు మాత్రం తగ్గింది. తాజా గణాంకాల ప్రకారం 37,287 మందికి ఈ వైరస్‌ సోకినట్లు తేలింది. సమస్య తీవ్రత హుబెయ్‌ ప్రావిన్సులో ఎక్కువగా ఉన్నా, చైనాలోని దాదాపు అన్ని ప్రాంతాలకూ ఇది విస్తరించింది. వైరస్‌ ఉనికిని మొట్టమొదట గుర్తించి, ఆ తర్వాత పోలీసు వేధింపులకు గురై, కరోనా ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన యువ వైద్యుని ఉదంతం చైనాలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. మొట్టమొదటి దశలో ప్రభుత్వం చేయాల్సినంత చేయలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ సంస్కరణలు తీసుకువచ్చి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కల్పించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ప్రజలకు రాజ్యాంగపరమైన హక్కులు ఇవ్వాలంటూ- అరుదైన రీతిలో మేధావులు బాహాటంగా గళం విప్పుతున్నారు. వీరు రాసిన రెండు బహిరంగ లేఖల్ని సామాజిక మాధ్యమం ‘వైబో’ ఆదివారం తొలగించేయడం గమనార్హం.

* ఆసియాలో అతిపెద్ద స్థాయిలో సింగపూర్‌లో నిర్వహించే ‘ఎయిర్‌ షో’లో పాల్గొనరాదని చైనా, అమెరికా సహా వివిధ దేశాలకు చెందిన 70 కంపెనీలు నిర్ణయించుకున్నాయి. మంగళవారం నుంచి ఆరు రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. కరోనా విస్తృతి దృష్ట్యా అనేక దేశాలకు చెందిన కంపెనీలు ఈ కార్యక్రమానికి రావడం లేదు. 8% కంపెనీలు గైర్హాజరవుతున్నా, ప్రదర్శన యథావిధిగా కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.

చైనాకు సాయం చేయడానికి సిద్ధం: ప్రధాని మోదీ
దిల్లీ:  కరోనా వైరస్‌ విస్తృతితో అల్లాడిపోతున్న చైనాకు సాయం అందించేందుకు ప్రధాని నరేంద్రమోదీ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆయనొక లేఖ రాశారు. క్లిష్ట పరిస్థితిలో ఉన్న చైనాకు, అక్కడి ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. వైరస్‌ వల్ల వందల మంది ప్రాణాలు కోల్పోవాల్సి రావడంపై విచారం వ్యక్తం చేశారు. హుబెయ్‌ ప్రావిన్సు నుంచి గతవారం సుమారు 650 మంది భారతీయుల్ని భారత్‌కు పంపించడంలో సహకరించినందుకు జిన్‌పింగ్‌ను మోదీ అభినందించారు.

భారత్‌కు ముప్పు ఎక్కువే
దిల్లీ: చైనాను వణికిస్తున్న ప్రాణాంతక కొత్త తరహా కరోనా వైరస్‌ భారత్‌కు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువేనని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. ఈ వైరస్‌ ముప్పు అధికంగా పొంచి ఉన్న 20 దేశాల జాబితాలో భారత్‌ ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలపై జర్మనీకి చెందిన హంబోల్ట్‌ విశ్వవిద్యాలయం, రాబర్ట్‌ కోచ్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. చైనా నుంచి సగటున ఎంతమంది ఏయే దేశాలకు వెళ్తుంటారనే గణాంకాలను సేకరించారు. ‘‘చైనాలోని హాంగ్‌ఝౌ విమానాశ్రయం నుంచి రాకపోకలను ఉదాహరణగా తీసుకుందాం. అక్కడి నుంచి వెయ్యి మంది ప్రయాణికులు బయలుదేరితే.. అందులో సగటున ఇద్దరు జర్మనీకి వెళ్లే అవకాశముంది. అంటే కరోనా వైరస్‌ జర్మనీకి వ్యాప్తి చెందే ముప్పు 0.2%గా ఉన్నట్లు నిర్ధారించాం’’ అని పరిశోధకులు వివరించారు. ఈ లెక్కన దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 0.066%, ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి 0.034%, కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమానాశ్రయానికి 0.024% ముప్పు ఉందని తెలిపారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోచి విమానాశ్రయాలకు కొంత ముప్పు పొంచి ఉందన్నారు. మొత్తంగా చూస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ 17వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates