భాగ్యనగరికి కరోనా భయం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • అనుమానిత కేసులతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తం
  • నోడల్‌ ఆస్పత్రులుగా గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ హాస్పిటల్స్‌
  • రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం
  • రాష్ట్ర అధికారులతో కేంద్ర వైద్య,
  • ఆరోగ్య శాఖ సంప్రదింపులు
  • పుణెకు పంపిన ఇద్దరు బాధితుల
  • రక్తనమూనాలు నెగెటివ్‌
  • ప్రపంచమంతా వ్యాపించే
  • ముప్పు ఎక్కువ: డబ్ల్యూహెచ్‌వో
  • వూహాన్‌ నుంచి భారతీయుల
  • తరలింపునకు కేంద్రం నిర్ణయం

వ్యాధి వ్యాప్తి ఇలా.. : కరోనా కేవలం జంతువుల నుంచి మాత్రమే వ్యాపిస్తుందని మొదట్లో అనుకున్నారు. కానీ.. ఇది మనుషుల నుంచి మనుషులకు కూడా.. అంటే తుమ్ము, దగ్గు ద్వారా కూడా వ్యాపిస్తుందని తేలింది. లాలాజలం, కన్నీటి ద్వారా కూడా వ్యాపిస్తుందని అంచనా. కాబట్టి.. ఈ వ్యాధి ఉన్నవారికి దగ్గరగా ఉండడం, ముద్దాడటం, వారు తిన్న పాత్రలను వాడటం ప్రమాదకరం.

హైదరాబాద్‌: చైనాలో చిన్నగా మొదలై ప్రపంచంలోని పలు దేశాలకు పాకుతున్న కరోనా వైరస్‌.. భారత్‌ను, ముఖ్యంగా నాలుగు అనుమానిత కేసులతో మన భాగ్యనగరాన్ని భయపెడుతోంది. అయితే, ఆ నలుగురిలో ఇద్దరి రక్తనమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ ఊపిరి పీల్చుకుంది. అయినా.. పలు విమానాల్లో చైనా నుంచి ప్రయాణికులు వస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా.. గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రులను నోడల్‌ ఆస్పత్రులుగా ప్రకటించింది. గాంఽఽధీలో 40 పడక లు, ఫీవర్‌లో 40, ఛాతీ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను కరోనా వైరస్‌ లక్షణాలున్న వారి కోసం అధికారులు ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రిలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌తో పాటు ఐసీయూను ఏర్పాటు చేశారు.

ఈ ఐసోలేషన్‌ వార్డులలో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మరోవైపు.. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ముగ్గురు సభ్యుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది. ఆ బృందంలో ఒక మైక్రో బయాలజిస్టు, ఒక వైద్యుడు, ప్రజారోగ్య నిపుణుడు ఉన్నారు. ఈ బృందం మంగళవారం గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రులను సందర్శించనుంది. అలాగే.. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ప్రీతి సూడాన్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనాపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా, నేపాల్‌లో ఒకరు కరోనావైరస్‌ బారిన పడిన నేపథ్యంలో.. ఆ దేశ సరిహద్దుల్లోని గ్రామాల్లో కేంద్రం ముందు జా గ్రత్త చర్యలను తీసుకుంది.

చైనాలో విశ్వరూపం.. : చైనాలో కరోనా మృతుల సంఖ్య 80కి చేరింది. 2744 మంది బాధితులు ఉన్నట్టు అధికారికంగా ధ్రువీకరించారు. మరో 5794 మందికి ఈ వైరస్‌ సోకినట్టు అనుమానిస్తున్నారు. అయితే.. వైరస్‌ సోకినవారిలో 51 మంది కోలుకోవడం ఉపశమనం కలిగించే విషయం. కాగా.. ఈ వైరస్‌ వ్యాపించే ముప్పు అధికమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది.

అధిక ఉష్ణోగ్రతలో కష్టమే! : సాధారణంగా స్వైన్‌ ఫ్లూ, కరోనాలాంటి వైర్‌సలు చలి వాతావరణంలో తీవ్రంగా విజృంభిస్తుంటాయి. బాగా వేడి వాతావరణంలో ఇలాంటి వైర్‌సలు మనుగడ సాగించలేవని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. చైనాలో ప్రస్తుతం 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో సగటున 31.5 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదు అవుతోంది. కాబట్టి భయం లేదని భరోసా ఇస్తున్నారు.

ఇదుగిదుగో కరోనా… : ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్తరకం కరోనా వైరస్‌ మైక్రోస్కోపిక్‌ చిత్రాలను చైనా ‘నేషనల్‌ మైక్రోబయాలజీ డేటా సెంటర్‌’ అధికారులు విడుదల చేశారు. 2003లో వందలాది మందిని బలిగొన్న సార్స్‌ నుంచి మెర్స్‌ దాకా కరోనా కుటుంబంలో రకరకాల వైర్‌సలు ఉన్నాయి. వాటన్నిటి చిత్రాలూ ఉన్నాయిగానీ.. కొత్తరకమైన ‘2019-ఎన్‌సీవోవీ’ వైరస్‌ చిత్రాలు ఇప్పటిదాకా లేవు. ఈ వైరస్‌ బారిన పడిన ఒక వ్యక్తి నుంచి సేకరించిన రక్తనమూనాలను పరీక్షించి ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

ఇదీ చికిత్స : కరోనా వైర్‌సకు ప్రస్తుతానికి మందు లేదు. యాంటీబయాటిక్స్‌ దీనిపై పని చేయవు. జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారికి వైద్యులు ప్రస్తుతం జ్వరం, నొప్పి నివారణ మందులు ఇస్తున్నారు. వైరస్‌ బారిన పడినవారు వీలైనంత ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. వీలైనంత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి.

మనవాళ్లని తీసుకొచ్చేద్దాం : న్యూఢిల్లీ : చైనాలోని వూహాన్‌లో ఉంటున్న భారతీయులను ఇక్కడికి తీసుకొచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా నేతృత్వంలో సమావేశమైన ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు చైనా ప్రభుత్వానికి విదేశాంగ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తారని వారు వివరించారు. కరోనా వైర్‌సకు కేంద్రస్థానమైన వూహాన్‌లో దాదాపు 300 మంది దాకా భారతీయులున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా సర్కారు వూహాన్‌ సహా పలు నగరాలను అష్టదిగ్బంధనం చేసిన సంగతి తెలిసిందే. విమానాశ్రాయలను మూసేసి రాకపోకలను సైతం నిషేధించడంతో.. మనవాళ్లంతా అక్కడ చిక్కుకుపోయారు. వూహాన్‌లోని అమెరికన్లందరినీ శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలించేందు కు అమెరికా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయగా.. ఎయిరిండియా కూడా ఒక విమానాన్ని ప్రత్యేకంగా ఉంచి కేంద్రం నిర్ణయం కోసం వేచిచూస్తోంది.

షాంఘైలో మేం బాగానే ఉన్నాం : షాంఘైలోని జోంగి వర్సిటీలో 10 మంది తెలుగువాళ్లం ఎంబీబీఎస్‌ చదువుతున్నాం. ఇక్కడ భారతీయులు 50 మంది ఉన్నారు. నెల రోజులుగా కరోనా వైరస్‌ ప్రభావంతో ఎటూ వెళ్లలేకపోతున్నాం. కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో గదుల్లోనే ఉంటున్నాం. ముక్కుకు మాస్క్‌ ధరించిన తర్వాతనే బయటకు వెళ్తున్నాం. ఇంటికి వచ్చాక సబ్బుతో చేతులను శుభ్రంగా కడుగుతున్నాం. కరోనా వైరస్‌ పరిస్థితిపై, వ్యాధిగ్రస్తులకు అందించే వైద్యంపై ఇటీవలే భారత రాయబారిని 20 మంది విద్యార్థులం కలిశాం. షాంఘైలో ఉంటున్న భారతీయులకు ప్రస్తుతం ఇబ్బంది లేదు. నేను క్షేమంగానే ఉన్నాను. అఖిల్‌, హన్మకొండ వాసి 

ఏమిటీ కరోనా వైరస్‌? : జంతువులకు, మనుషులకు తీవ్ర అనారోగ్యం కలిగించే వైరస్‌ ఈ కరోనా వైరస్‌. ఇదో ఆర్‌ఎన్‌ఏ (రైబో న్యూక్లియిక్‌ యాసిడ్‌) వైరస్‌. అంటే.. ఈ వైరస్‌ వేరే జీవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కలుగా మారిపోతుంది. ఆ ముక్కల సాయంతో ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. లాటిన్‌ భాషలో కరోనా అంటే కిరీటం అని అర్థం. సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు అది కిరీటం ఆకృతిలో, సూర్యగ్రహణం సమయంలో కనపడే కరోనా వలయంలా కనపడుతుంది. అందుకే ఈ పేరు పెట్టారు. కరోనా వైరస్‌ కొత్తదేం కాదు.

ఆ కుటుంబంలో చాలా వైర్‌సలున్నాయి. అందులో ఆరు రకాలు మాత్రమే మనుషులకు సోకి అనారోగ్యం కలిగిస్తాయి. అందులో నాలుగు రకాల వల్ల కేవలం జలుబు చేస్తుందంతే. మిగతా రెండూ.. సార్స్‌ (సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌), మెర్స్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌)కు కారణమవుతాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్‌.. గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్‌.. పాములో ఉండే కరోనా వైరస్‌ రకాల కలయితో ఏర్పడినట్టు శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది కేవలం అనుమానం మాత్రమే. ఈ కొత్త వైర్‌సకువారు 2019-ఎన్‌సీవోవీ అని పేరు పెట్టారు.

ఇవీ లక్షణాలు : జలుబు, ముక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి, అధిక జ్వరం.. ఇవీ ప్రాథమిక లక్షణాలు. కొంతమందికి ఈ లక్షణాలు ముదిరి న్యూమోనియాకు, కిడ్నీ వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉంది. అయితే, వైరస్‌ సోకిన తర్వాత లక్షణాలు బయటపడటానికి రెండు నుంచి 14 రోజులు పడుతుంది. ఆ సమయంలో వారిలో వ్యాధి లక్షణాలు కనపడకపోవచ్చుగానీ.. వారి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ బారిన పడినవారిలో 97ు మంది ఎలాంటి వైద్యసహాయం అవసరం లేకుండానే కోలుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వృద్ధుల్లో ఈ వైరస్‌ న్యూమోనియాకు కారణమవుతుంది. అది ప్రాణాంతకంగా మారుతోంది.

ఎంత ప్రాణాంతకం? : కరోనా వైరస్‌ అందరికీ ప్రాణాంతకం కాదు. ఈ వైరస్‌ బారిన పడిన ప్రతి 100 మందిలో సగటున ఇద్దరు మరణిస్తున్నట్టు అంచనా (సాధారణ ఫ్లూకేసుల్లో అయితే ప్రతి వెయ్యి మందికి మరణాల రేటు ఒకటి కన్నా తక్కువే ఉంటుంది). అంతేకాదు.. చైనాలో ఈ వైరస్‌ బారిన పడినవారిలో 51 మంది కోలుకున్నట్టు అధికారికంగానే ప్రకటించారు కాబట్టి అంతగా భయపడాల్సిన పని లేదు.

ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? : కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే.. శ్వాస కోశ సమస్యలున్నవారికి, దగ్గు, జలుబుతో బాధపడుతున్నవారికి దూరంగా ఉండాలి. అలాంటివారిని ముట్టుకుంటే చేతులను కనీసం 20 సెకన్లపాటు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates