ముంగిసను మింగేస్తున్న బ్రష్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఏడాదికి లక్ష మూగజీవాలు బలి
మానవుడి కోసం ప్రకృతిలోని మూగజీవాలు బలవుతున్నాయి. సౌందర్యానికి వాడే వస్తువులు మొదలుకుని మరెన్నో పదార్ధాల తయారీలో జీవాలను హతమారుస్తున్నారు. నెమలి ఈకల నుంచి.. బ్రష్‌లు తయారీ వరకు జంతుజీవ సంపద అంతరించిపోతున్నది. ప్రకృతి సమతుల్యతకు అవసరమైన జంతుజాలం కనుమరగవుతున్నతీరుపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుంచెనుంచి జాలువారే అందాల వెనుక ముంగిస మృత్యునాదం వినిపిస్తున్నదన్న కఠోరవాస్తవాలు బయటకు వస్తున్నాయి. అయితే వీటిని కాపాడేదిశగా చేస్తున్న చర్యలు అంతంతమాత్రమేనని స్పష్టమవుతున్నది.
న్యూఢిల్లీ: పాము..ముంగిస గురించి వినిఉంటాం. చూసి ఉంటాం. వాటి మధ్య జరిగే కొట్లాటను కండ్లారా వీక్షించిఉంటాం. ఇప్పటికే పాము చర్మాలను వలిచి వ్యాపారం చేస్తుంటే.. ముంగిసను చంపి బ్రష్‌లను తయారీకి వినియోగిస్తున్నారు. ముంగిసల వెంట్రుకల అక్రమ వ్యాపారం రోజురోజుకూ కోట్లాది రూపాయల పరిశ్రమగా విస్తరిస్తున్నది. దీని ఫలితంగా ప్రతి నెలా వేలాది ముంగిసలు మృత్యువాతపడుతున్నాయి.
ముంగిసలకు ప్రాణసంకటం
ఇండ్లకు వేసే పెయింట్స్‌.. కాన్వాస్‌పై వేసే అందమైన బొమ్మల్ని వాV్‌ా అని అంటాం. కానీ ఈ పెయింటింగ్‌ల వెనుక మూగజీవులకు ప్రాణసంకటంగా మారింది. ‘బ్రష్‌లలో ఉపయోగించే ఒక కిలోగ్రాము జుట్టుకు దాదాపు 50 ముంగిసలు బలవుతున్నాయి. అంటే ప్రతీ ఒక్క ముంగిస నుంచి 20 గ్రాముల జుట్టు మాత్రమే వస్తుంది’ అని ఈ ఆపరేషన్‌లో భాగమైన వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్‌ హెచ్‌ వి గిరిషా చెప్పారు. మూగజీవులను కాపాడేందుకు మా వంతు కృషి చేస్తున్నామనీ, డిమాండ్‌ ఉన్నంతవరకూ.. వెంట్రుకల కోసం ముంగిసలను చంపే వ్యక్తులు ఉంటారని ఆయన వాదన.
ముంగిసను కాపాడే చర్యలేవి..?
లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వీటికి సంబంధించిన దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని బహుళ కర్మాగారాలు, గిడ్డంగుల్లో ఇటీవల తనిఖీలు చేపట్టారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. ముంగిస జుట్టుతో తయారుచేసిన దాదాపు 54,352 పెయింట్‌ బ్రష్‌లు, 113 కిలోల ముంగిసల ముడి జుట్టును పోలీసులు, అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 43 మందిని అదుపులోకి తీసుకున్నారు. ముంగిసల వెంట్రుకలపై అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి వైల్డ్‌లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో గత రెండు దశాబ్దాల్లో చేసిన 28వ ఆపరేషన్‌ ఇది.
2019లో జరిపిన సోదాల్లో 49 మందిని అరెస్టు చేయడంతోపాటు, మొత్తం 54,352 బ్రష్‌లు, 113 కిలోల ముంగిసలకు చెందిన ముడి జుట్టును స్వాధీనం చేసుకున్నామనీ, ఉత్తర ప్రదేశ్‌, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని మొత్తం 27 దాడులు జరిగాయని చెప్పారు.
చిన్న జీవాలు పట్టించుకునేదెవరు..?
పులి, ఆసియా ఏనుగు, ఖడ్గ మృగాల వంటి ప్రధాన జాతుల పరిరక్షణకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు, పరిరక్షణకారులు చర్యలు తీసుకుంటున్నారు. ముంగిసల వంటి అనేక ఇతర మూగజీవాలను పట్టించుకోవు. వాటి ఉనికే ప్రమాదంలో పడినట్టు కూడా పరిగణించటంలేదు. ‘ఇటీవలి కాలంలో జంతువుల అక్రమ వాణిజ్య దృష్టికోణంతో చూడాలని మేం నిర్ణయించాం. అందులో భాగంగానే పాంగోలిన్‌ స్కేల్స్‌, మానిటర్‌ బల్లుల అక్రమ వ్యాపారం, ఇప్పుడు ముంగిసల వ్యాపారం బహిర్గతమవుతున్నది’ అని గిరీషా చెప్పారు
ప్రపంచంలో అత్యధికంగా అక్రమరవాణాకు గురవుతున్న జంతువులు అలుగు (పాంగోలిన్‌)లు. అంతరించిపోతున్న ఈ జంతువులకు మనదేశం ఒక ముఖ్యమైన వనరు. మానిటర్‌ బల్లులలో అక్రమ వ్యాపారం లో ఇది రెండోది.
‘2000ల సంవత్సరం ప్రారంభం నుంచి ముంగిసలను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇటీవలి కాలంలో మా ప్రయత్నాలను వేగవంతం చేసాం. మా ప్రయత్నాలు కొంతమేర మంచి ఫలితాలనిస్తున్నది. చాలా మందిని ఈ వ్యాపారం నుంచి నిరోధించగలిగాం’ అని అన్నారు. కానీ అధికారుల వాదనకు భిన్నంగా ముంగిసలు బలవుతూనే ఉన్నాయని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదికి లక్ష…
దేశవ్యాప్తంగా వివిధ ఆవాసాలలో ముంగిసలు కనిపిస్తాయి. తమిళనాడులోని నరికురువాస్‌, కర్నాటకలోని హక్కి పక్కీ, ఆంధ్రప్రదేశ్‌లోని గోండ్స్‌, కర్నాటక, గులియాస్‌, సెపెరాస్‌, మధ్య-ఉత్తర భారతదేశంలోని నాథ్‌ వంటి తెగలు ముంగిసల సంప్రదాయ వేటలో ఉన్నారు.
మనదేశంలో ఆరురకాల ముంగిస జాతులు కనిపిస్తాయి. సాధారణంగా మనకు కనిపించేవి బూడిదరంగు జాతివి. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని షెర్కోట్‌ పట్టణంలో బ్రష్‌ల ఉత్పత్తి అధికం. రాజస్థాన్‌, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌లో వీటి సరఫరా గొలుసుకట్టును అధికారులు అడ్డుకున్నారు. ఈ అక్రమ వ్యాపారం మూగజీవుల జనాభాపై తీవ్ర పరిణామాలను కలిగిస్తున్నదని వన్యప్రాణి నిపుణులు భావిస్తున్నారు.
‘ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యాపారం. ముంగిస వేటగాళ్ళు వాటిని పట్టుకోవటం, దాని మాంసాన్ని తినటం, తర్వాత వాటి జుట్టును అమ్మడం… చేస్తున్నారు. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం, ముంగిస్‌ జుట్టుతో చేసిన బ్రష్‌లు ఇతర బ్రష్‌ల కంటే ఐదు రెట్లు ఎక్కువ’ అని నిపుణులు చెబుతున్నారు. తుది కొనుగోలుదారుకు చేరేసరికి ఒక కిలోల స్వచ్ఛమైన ముంగిస్‌ జుట్టుకు విలువ రూ. 1,00,000 ఉంటుందని అంచనా. ‘ప్రతి నెలా కనీసం 150 కిలోగ్రాముల ఉత్పత్తి అవుతుందని మేము నమ్ముతున్నాం, కాబట్టి దీనర్థం వాటి జుట్టు కోసం ప్రతి సంవత్సరం లక్ష ముంగిసల వరకూ చంపుతున్నారు’ అని పేర్కొన్నారు.
భారతదేశ వైల్డ్‌ లైఫ్‌ (ప్రొటెక్షన్‌) చట్టం, 1972లోని 2 వ షెడ్యూల్‌ కింద ముంగిసలను ఆ జాబితాలో చేర్చారు. ఈ చట్టం ప్రకారం వాటి వేట, రవాణా, వ్యాపారం నేరం. వాణిజ్యం నేరం. ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో శిక్షించబడుతుంది. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అక్రమ వ్యాపారం కొనసాగుతున్నది.
ఈ బ్రష్‌లను ఉపయోగించటానికి కారణం.. వాటితో తయారుచేసిన బ్రష్‌తో స్ట్రోక్‌ బాగా వస్తుందనీ, అవి మన్నికగా ఉంటుందని కళాకారులు నమ్ముతారు’ అని చెన్నైకి చెందిన ఫైన్‌ ఆర్ట్స్‌లో పట్టభద్రుడైన సిపి కష్ణప్రియ అభిప్రాయపడ్డారు. ఆ బ్రష్‌లకు దూరంగా వున్న చాలా మంది కళాకారులను నేను చూస్తున్నాను. ఇటువంటి బ్రష్‌ల లభ్యత చెన్నైలో కొంత తగ్గింది’ అన్నారు.
వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో ఇప్పుడు ఈ బ్రష్‌ల డిమాండ్‌ను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నది. ఈ వ్యాపారంలో సాంప్రదాయ వర్గాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి వనరులను అందించటం ద్వారా దీనిని తగ్గించవచ్చునని వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో అదనపు డైరెక్టర్‌ తిలోటమ వర్మ అన్నారు. ప్రభుత్వాలు మేల్కొని చర్యలు తీసుకునేలోపు ముంగిస సంపద అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Courtesy Navatelangana…

RELATED ARTICLES

Latest Updates