బాటిల్‌ నీటి వినియోగంలో తెలుగు రాష్ట్రాలే టాప్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఆంధ్రప్రదేశ్‌ ఫస్ట్‌, తెలంగాణ సెకండ్‌
    పట్టణ ప్రాంతాల్లో తెలంగాణే టాప్‌
    జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ
    జాతీయ శాంపిల్‌ సర్వేలో వెల్లడి

దేశంలో బాటిల్‌ నీటి వినియోగంలో తెలుగు రాష్ట్రాలే ముందున్నాయి. ఒక్క డయ్యు, డామన్‌ను మినహాయిస్తే మిగతా కేంద్ర పాలిత ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అగ్రభాగాన నిలిచాయి. ఏపీ మొదటి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉన్నాయి. ఏపీలో 29.8 శాతం, తెలంగాణలో 28.7 శాతం కుటుంబాలు బాటిల్‌ నీటినే వాడుతున్నాయి.
కేవలం పట్టణాల ప్రాంతాలవారీగా చూస్తే తెలంగాణదే ప్రథమ స్థానం. తెలంగాణలో పట్టణాల్లో 31.4 శాతం, గ్రామాల్లో 26.3 శాతం, రెండుచోట్లా కలిపి చూస్తే 28.7 శాతం కుటుంబాలు బాటిల్‌ నీటినే వాడుతున్నాయి. ఏపీలో పట్టణాల్లో 28.6 శాతం, గ్రామాల్లో 30.5 శాతం, సగటున 29.8 కుటుంబాలు బాటిల్‌ నీటిని వినియోగిస్తున్నాయి. ఈ విషయాలు నేషనల్‌ శాంపిల్‌ సర్వేలో వెల్లడయ్యాయి. ఈ సర్వేను గత ఏడాది జూలైలో ప్రారంభించి డిసెంబరు వరకు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 5,378 గ్రామీణ ప్రాంతాలు, 3,614 పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుధ్యం, ఆవాస స్థితిగతులపై సర్వే కొనసాగింది. 1,06,838 కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. జాతీయ సగటుతో పోలిస్తే బాటిల్‌ వాటర్‌ వినియోగం తెలంగాణ పట్టణాల్లో చాలా ఎక్కువ. జాతీయ స్థాయిలో 6.8 శాతం ఉండగా తెలంగాణలో మాత్రం 31.4 శాతంగా తేలింది. గ్రామాల్లో పైపు లైన్‌ ద్వారా ఇళ్లకు తాగునీరు సరఫరా అవుతున్న కుటుంబాలు 4.2 శాతం మాత్రమేనని లెక్కకట్టారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికి నల్లా ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. భగీరథ ఫలాలు రెండేళ్ల క్రితం నుంచే దశలవారీగా అందుతున్నాయి. కానీ, రాష్ట్రంలో బాటిల్‌ నీరు తాగుతున్నవారి సంఖ్య గణనీయంగానే ఉంది. బాటిల్‌ నీరు ఆరోగ్యానికి హానికరమని, భగీరథ నీటినే తాగాలని అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు అవగాహన తరగతులు కూడా నిర్వహించారు.
స్నానపు గది… ఎల్‌పీజీ…
తెలంగాణలో 77.6 శాతం కుటుంబాలకు స్నానపు గది ప్రత్యేకంగా ఉంది. 13.9 శాతం కుటుంబాలు కంబైన్డ్‌ స్నానపు గదులను వాడుతున్నాయి. 8.5 శాతం కుటుంబాలకు స్నానపు గది సౌకర్యం లేదు. స్నానపు గది లేని కుటుంబాలు పల్లెలో 14.7శాతం, పట్టణాల్లో 1.3 శాతం ఉన్నాయి. 63.9 శాతం కుటుంబాలకు వంట గది ప్రత్యేకంగా ఉంది. రాష్ట్రంలో 90.7 శాతం కుటుంబాలు వంట కోసం ఎల్‌పీజీని వినియోగిస్తున్నాయి. పట్టణాల్లో 91 శాతం, పల్లెల్లో 90.4 శాతం ఎల్‌పీజీని వాడుతున్నారు.
పల్లెల్లో పట్టణాల్లో సగటు
బాటిల్‌ వాటర్‌ వినియోగం  26.3   31.4    28.7
స్నానపు గది లేని వారు    14.7     1.3     8.5
ఎల్‌పీజీ వాడకం             90.4       91     90.7

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates