రుణం మిథ్య!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
భారీగా తగ్గిన పంట రుణాలు
ఖరీఫ్‌లో 64 శాతం… రబీలో 39 శాతం
కొర్రీలతో కాలం గడుపుతున్న బ్యాంకులు
రుణ మాఫీఅమలు జాప్యంతో ప్రభావం
రైతు బంధు పెట్టుబడి సాయమూ కరువు
ధరణిమొరాయింపు మరో ప్రధాన కారణం
విస్తుపోయిన కేంద్ర వ్యవసాయ
పార్లమెంటరీ స్థాయీ సంఘం

నాగర్‌ కర్నూల్‌ జిల్లా పాలెం గ్రామానికి చెందిన వడ్డెర సాయిలుకు రెండెకరాలు. రుణమాఫీ ప్రకటనతో గత ఏడాది తీసుకున్న పంట రుణం బకాయి చెల్లించలేదు. అసలు, వడ్డీ కలిపి లక్ష రూపాయలకు పెరిగిపోయింది. అది చెల్లించకపోవటంతో బ్యాంకర్లు రుణం ఇస్తలేరు.

పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని ఓ రైతు కొట్టె భీమయ్య. ఇతనికి మూడెకరాల భూమి ఉంది. గత ఏడాది లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నారు. రుణమాఫీ పథకాన్ని ప్రకటించడంతో రెన్యువల్‌ చేసుకోలేదు. అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తేనే కొత్తగా లోను ఇస్తామని బ్యాంకర్లు చెప్పారు. భీమయ్య దగ్గర డబ్బులు లేకపోవటంతో వడ్డీ వ్యాపారిని ఆశ్రయించారు. రూ.3 వడ్డీ చొప్పున రూ.50 వేలు అప్పు తీసుకొని పంటలకు పెట్టుబడి పెట్టారు.

పై ఫోటోలో ఉన్నవి వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన రైతు వరంగంటి సంతోష్‌ పట్టాదారు పుస్తకం, పీఏసీఎస్‌ పాస్‌ పుస్తకాలు. ఆయనకు 8 ఎకరాల భూమి ఉంది. ఐదేండ్ల క్రితం పీఏసీఎస్‌లో సభ్యునిగా చేరారు. ఇంతవరకు ఒక్క సంవత్సరం, ఒక్క పంటకు కూడా సొసైటీలో లోను ఇవ్వలేదు. పాస్‌ పుస్తకంపై స్టేట్‌ బ్యాంక్‌ కూడా రుణం ఇవ్వలేదు.

హైదరాబాద్‌: రుణమాఫీ అస్తవ్యస్తం! రైతు బంధు అయోమయం! భూ రికార్డుల గందరగోళం! బ్యాంకర్ల నిర్లక్ష్యం! వెరసి, అన్నదాతకు శాపం! మదినిండా ఆశలు రేపుతూ కళ్ల ముందు కావాల్సినంత నీరుంది! ఈ ఏడాది మన ‘పంట పండడం’ ఖాయమన్న ధీమా ఉంది! కానీ, రైతన్నకు ఆర్థిక భరోసా కరువైంది! ‘పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం’ అన్నట్లు తయారైంది రైతు పరిస్థితి. సర్కారుకు, బ్యాంకర్లకు మధ్య ఏర్పడిన అగాథం ప్రభావం అన్నదాతలపై నేరుగా పడుతోంది. రైతుకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు సవాలక్ష కొర్రీలు వేస్తున్నారు. బ్యాంకుల సహాయ నిరాకరణ కారణంగా రుణాల మంజూరు ఏటికేడాది పడిపోతోంది.

ఆర్థిక సంవత్సరం ఆరంభంలో తయారు చేసే ప్రణాళిక చెత్తబుట్ట పాలవుతోంది. గత ఖరీ్‌ఫలో కేవలం 64ు మాత్రమే రుణ లక్ష్యాన్ని చేరుకున్న బ్యాంకర్లు.. అక్టోబరులోనే ప్రారంభమైనా.. ఈ రబీ సీజన్‌లో ఇప్పటి వరకూ 39 శాతం రుణాలే ఇచ్చారు. 2019-20 వార్షిక ప్రణాళికలో రూ.48,740 కోట్లు ప్రకటించి ఖరీఫ్‌లో రూ.18,711 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. రాష్ట్రంలో 55 లక్షల పైచిలుకు రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. 21 లక్షల మందికే ఇచ్చారు. ప్రస్తుత రబీలో రూ.19,496 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. కేవలం 7.45 లక్షల మందికి రూ.7,458 కోట్లు మాత్రమే ఇచ్చారు.

ఇదేం రుణమాఫీ!?
ప్రభుత్వం అమలు చేస్తున్న రుణ మాఫీ పథకం ఇటు రైతులకూ అటు, బ్యాంకర్లకూ భారంగానే మారింది. నిజానికి, ఈ పథకం అమలు తీరును బ్యాంకర్లు ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకులో అప్పు తీసుకునే వారికి తిరిగి చెల్లించాలనే ఆలోచన ఉండాలనేది బ్యాంకర్ల వాదన! పంటల పెట్టుబడికి రుణం తీసుకోవటం, పంట విక్రయం తర్వాత తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తే రొటేషన్‌ కరెక్టుగా జరుగుతుందనేది వారి అభిప్రాయం. రైతుకు, బ్యాంకుకు మధ్య ఉన్న అనుబంధం ఒక్కసారికే పరిమితం కాకుండా, కిస్తీలవారీగా లావాదేవీలు జరిగితే టర్నోవర్‌, రొటేషన్‌ పక్కాగా జరుగుతుందని చెబుతున్నారు. కానీ, ఎన్నికల సమయంలో పార్టీలు ‘రుణమాఫీ’ పథకాన్ని ప్రకటిస్తున్నాయి.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వనరులు సమకూర్చటంలో విఫలమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఐదు విడతలుగా బ్యాంకులకు నిధులు సర్దుబాటు చేసింది. దాంతో, అసలుకు వడ్డీ, వడ్డీకి వడ్డీ కలిపి రైతుకు తడిసి మోపెడైంది. రుణ విముక్తి కాకపోగా భారీగా వడ్డీ భారాన్ని మోశారు. ఇప్పటికీ అకౌంట్లు సెటిల్‌ కాలేదు. దీంతో రైతులకు, బ్యాంకర్లకు మధ్య సంబంధాలు చాలా దెబ్బతిన్నాయి. ఈసారి ఎన్నికల ముందు మరోసారి రుణమాఫీ పథకాన్ని ప్రకటించారు. ఏడాది దాటినా అడుగు ముందుకు పడలేదు. ఏకంగా రూ.31,824 కోట్ల రుణమాఫీ బకాయిలు పేరుకుపోవటంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. కనీసం రెన్యువల్‌ కూడా చేయకపోవటంతో బ్యాంకర్లు రైతులకు సక్రమంగా రుణాలు ఇవ్వడం లేదు. దాంతో, రుణ పంపిణీ టార్గెట్‌ పూర్తికాలేదు.
తాజాగా, రైతులు ఎవరికి వారే బ్యాంకులో అప్పు, వడ్డీ చెల్లించుకోవాలని, తాను ఇవ్వాలనుకున్నది రైతుల ఇంటికే పంపిస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ ప్రకటనతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒక పంటకు పెట్టుబడి పెట్టడమే కష్టమంటే.. పాత బకాయిలు చెల్లించడం సాధ్యం కాదంటున్నారు.
రైతులంటే చులకన భావం
రైతుల విషయంలో బ్యాంకర్లు సానుకూలంగా వ్యవహరించటం లేదు. యాక్షన్‌ ప్లాన్‌లో 55 లక్షల పైచిలుకు రైతులకు రుణాలిస్తామని బ్యాంకర్లు ప్రకటించారు. ఆచరణలో సగం మందికి కూడా ఇవ్వడం లేదు. పెద్ద పెద్ద వ్యాపారులు, బడా బాబులకు లోన్లు ఇవ్వటానికి ఆసక్తి చూపించే బ్యాంకర్లు తమను చులకనగా చూస్తున్నారని, చెప్పులరిగేలా తిరిగినా చీదరించుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారు పాస్‌ పుస్తకం సరిగా లేదని, సర్వే నంబర్లు తప్పున్నాయని, విస్తీర్ణం లెక్క కరెక్టుగా లేదని, పాత బకాయిలు ఉన్నాయని.. ఇలా రకరకాల సాకులు చెబుతూ తిప్పి పంపిస్తున్నారని నిర్వేదం చెందుతున్నారు.
కొంపముంచుతున్న ధరణి
రైతుల పేరిట ఎంత భూమి ఉందో తెలుసుకోవటానికి రెవెన్యూ శాఖ తయారు చేసిన ‘ధరణి’ పోర్టల్‌నే ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా ధరణి పోర్టల్‌ ఓపెన్‌ కావడం లేదు. దీనిని సాకుగా చూపి బ్యాంకర్లు రైతులకు రుణం ఇవ్వడం లేదు. మరోవైపు, రైతు బంధు పంపిణీ ఆలస్యమవుతోంది. కొన్నిచోట్ల ఖరీఫ్‌ నిధులనే ఇప్పటికీ పంపిణీ చేస్తున్నారు. దాంతో, సన్నకారు రైతుకు పెట్టుబడి కష్టాలు తప్పడం లేదు.

(Courtesy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates