భారత్‌–ఇండియా–కరోనా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సి.వి.ఎల్‌.ఎన్‌. ప్రసాద్‌

రెండు వారాల క్రితం ఒక మిత్రుడు– హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళానికి వెళ్లిన 180మంది ఆదివాసీ వలస కార్మికుల యాత్ర గురించి చెప్పాడు. పిల్ల, పెద్ద–తట్టా, బుట్టలు సర్దుకొని కాలినడకన వెళ్తుంటే.. వారికి ఎదురయిన చేదు అనుభవాలు.. ల్యాండ్‌ మాఫియా బెదిరింపులు.. తిండి లేని పరిస్థితులు– అన్నీ వింటుంటే బతకటం అంత కష్టమా అనిపించింది. కరోనా అందరికీ ఎదురయిన తొలిసారి అనుభవమే కదా.. పెద్ద కష్టం, చిన్న కష్టం.. ఒక్కొక్కరిదీ ఒకో రకం అనుకున్నా. రాజస్థాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన విద్యార్థులను (వీరందరూ ఐఐటీ కోచింగ్‌ కోసం వెళ్లినవారు) తీసుకురావటానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రెండు వందల బస్సులు ఏర్పాటు చేయటం.. కాశీలో ఒక కార్యక్రమం కోసం వెళ్లి చిక్కుకుపోయిన 800మంది తెలుగువారిని తీసుకురావటానికి ఇద్దరు ఎంపీలు, ఒక పీఠాధిపతి పూనుకోవటం చూస్తుంటే– భారత్‌ వేరు.. ఇండియా వేరు అనే ఆలోచన మరో సారి బలంగా చొచ్చుకువచ్చింది.

వాస్తవానికి మన చుట్టూ అనేక సమాజాలుంటాయి. ఒక సమాజంలో వారు మరొక సమాజంలోకి తొంగిచూడరు. పొరపాటున చూసినా– అవతల వారి జీవనవిధానం, భావోద్వేగాలు, అవసరాలు అర్థం కావు. జాగ్రత్తగా చూస్తే– హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్‌లో అందమైన విల్లాల పక్కనే మురికివాడలు ఉంటాయి. ఎవరి సమాజం వారిది. ఎవరి ఆర్థిక వ్యవస్థ వారిది. జూబ్లీ హిల్స్‌ ఇళ్లలో పనివారు ఈ మురికివాడల నుంచే వస్తుంటారు. వీరిద్దరి మధ్య ఉన్నది– యజమాని, పనివాళ్ల సంబంధం మాత్రమే! దీనిని మన వ్యవస్థలో లోపం సరిపెట్టుకున్నా– అది అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంటుంది. కరోనా ఆ కోణాన్ని మరోసారి ఎత్తి చూపించింది. హైదరాబాద్‌ పని కోసం వచ్చిన ఆదివాసీ కష్టాలను టీవీలలో చూసిన వారికి.. పత్రికల్లో, ఫేస్‌బుక్‌లో చదివిన వారికి అపారమైన సానుభూతి కలుగుతుంది. అయ్యో అనిపిస్తుంది. కష్టకాలం కాబట్టి సానుభూతితో సాయం చేయాలనిపిస్తుంది. మనం ఎంతో కొంత సంపాదిస్తున్నాం కాబట్టి లేనివారికి కనీసం ఒక పూటైనా భోజనం పెట్టాలనిపిస్తుంది. కానీ అదే మధ్యతరగతి వారికి కష్టం వస్తే– భయం వేస్తుంది. మన పిల్లలే కోటాలో చదువుకుంటుంటే వారికి ఎంత కష్టం అనే ఆలోచన మనను భయపెడుతుంది.

లండన్‌లో హిత్రూ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఎగువ మధ్యతరగతి పిల్లలను చూస్తే– ‘అధికారులు వెంటనే స్పందించి వాళ్లకు ఇళ్లకు తీసుకువచ్చేస్తే’ బావుండుననిపిస్తుంది. వాళ్లను ప్రత్యేక విమానంలో తీసుకువచ్చేస్తే ‘హమ్మయ్యా’ అనిపిస్తుంది. ఎందుకంటే వారు మన సామాజికులు. మనలో ఒకరు. కానీ వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్లటానికి బస్సులు ఏర్పాటు చేయలేని రాష్ట్ర ప్రభుత్వాలను.. ముంబాయి నుంచి వారి స్వస్థలాలకు తీసుకువెళ్లటానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయలేని కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే మాత్రం కోపం రాదు. వందల మంది ఒకే రైలు ఎక్కితే కరోనా వ్యాపిస్తుంది కదా.. వాళ్లకు సోషల్‌ డిస్టెన్సింగ్‌ తెలియదు కదా.. మార్గమధ్యంలో వాళ్లలో కొందరు ఎక్కడైనా దిగిపోయి.. అక్కడ వారికి కరోనా అంటించేస్తే ఎంత ప్రమాదం.. అని కూడా అనిపిస్తుంది. మన ఈ ఆలోచనలకు– చుట్టు పక్కల ఉన్న వ్యవస్థలు ఊతమిస్తాయి. మన ఆలోచనలు తప్పు కాదని భరోసానిస్తూ ఉంటాయి. ప్రైవేట్‌ స్కూళ్ల యజమాన్యాలు ఫీజులు పుచ్చుకుంటే ఊరుకోం.. అని హుంకరించే ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లోను.. మురికివాడల్లోను ఉండే చిన్న చిన్న పాఠశాలల పరిస్థితిని పట్టించుకోవు. ఇంటి అద్దెలు తీసుకుంటే ఊరుకోం అని కోప్పడే మంత్రులు వలస కార్మికుల ఆవాసాలు ఎలా ఉన్నాయి.. చిన్న చిన్న బస్తీల్లో అతి చిన్న ఇళ్లలో నివసించే ప్రజల బతుకు తెరువు ఎలా ఉందనే విషయాలను మాట్లాడరు.

ఎందుకంటే వారి సమాజం వేరు. ఒపీనియన్‌ మేకర్స్‌ కేటగిరిలోకి వారు రారు. జాగ్రత్తగా ఆలోచించండి. మధ్యతరగతి గురించి విన్నప్పుడు బాధపడతాం. దిగువ మధ్యతరగతి గురించి విన్నప్పుడు జాలిపడతాం. చివరగా ఒక్క విషయాన్ని మనమందరం గుర్తు పెట్టుకోవాలి. హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళానికి నడిచి వెళ్లిన ఆదివాసీ– ఆ అనుభవాన్ని తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోడు. తనకు అలాంటి దుర్భరపరిస్థితి ఎందుకొచ్చిందనే విషయాన్ని తప్పకుండా ఆలోచిస్తాడు. ఆ ఆలోచన వెంటనే రాకపోవచ్చు. పరిస్థితులు సద్దుమణిగాక ఆలోచించవచ్చు. కానీ తప్పకుండా ఆలోచిస్తాడు. కొన్ని కోట్లమందికి అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మన సమాజాలలో కుదుపులు ఏర్పడటం తథ్యం!

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates