కాశ్మీర్ పై కీలక అడుగు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్ము కాశ్మీర్ విషయంలో సోమవారం అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నదా? నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జమ్ము కాశ్నీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దుచేసే దిశగా మోదీ ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. జమ్ము కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మలిక్ ఆదివారం శ్రీనగర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ వదంతులు వ్యాప్తి చేసే బదులు సోమ, మంగళవారం వరకు వేచి ఉండవచ్చు కదా అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సత్యపాల్ మలిక్ ఈ వ్యాఖ్యలు చేయటం.. మరోవైపు నరేంద్ర మోదీ సోమవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఉన్నత వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించటం తెలిసిందే. ఈ పది శాతం రిజర్వేషన్లను జమ్ము కాశ్మీర్‌కు వర్తింపజేసేందుకు సంబంధించిన సవరణ బిల్లును హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రతిపాదించనున్నారు. ఈ బిల్లుతోపాటు ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు చేసేందుకు సంబంధించిన ఇతర సవరణ బిల్లులేమైనా ప్రతిపాదిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్ముకాశ్మీర్‌ను మూడు ప్రాంతాలుగా విభజించడం లేదా మూడు అటానమస్ ప్రాంతాలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జమ్ము కాశ్మీర్ విషయంలో వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి
చేసేందుకు మోదీ ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితర నాయకులు ఎంత డిమాండ్ చేసినా అధికార యంత్రాంగం నుండి ఇంతవరకు ఎలాంటి వివరణ, ప్రకటన రాకపోవటం గమనార్హం. జమ్ము కాశ్మీర్‌లో పెద్దఎత్తున పోలీసు బలగాలను దింపిన కేంద్ర ప్రభుత్వం అమర్‌నాథ్ యాత్రను రద్దు చేసి యాత్రికులను స్వరాష్ట్రాలకు పంపించివేయటంతోపాటు కాశ్మీర్‌లోని ఉన్నత విద్యా సంస్థలను మూసివేసి ఇతర రాష్ట్రాల విద్యార్థులను తమ రాష్ట్రాలకు వెళ్లిపోవలసిందిగా ఆదేశించటం తెలిసిందే. విదేశీ పర్యాటకులను కూడా రాష్ట్రం నుంచి పంపించివేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ మోదీ ప్రభుత్వం జమ్ము కాశ్మీర్ విషయంలో ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతోందనే భావన కలిగిస్తోంది.

ఇలావుండగా, హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ, ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్‌ఏడబ్ల్యు) చీఫ్ సమంత్ గోయల్, హోం శాఖ సీనియర్ అధికారులతో సమావేశమై జమ్ము కాశ్మీర్ పరిస్థితి గురించి చర్చించారు. అమిత్ షా అధ్యక్షతన సుధీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో జమ్ము కాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి, ఇతర అంశాలపై లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ ను రద్దు చేసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అమిత్ షా సీనియర్ అధికారులతో సమావేశం కావటం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెద్దఎత్తున విధ్వంసానికి పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నందుకే సీఆర్‌పీఎఫ్, ఇతర భద్రతా బలగాలను మోహరిస్తున్నామని హోం శాఖ చెప్పటం తెలిసిందే. జమ్ముకాశ్మీర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకే భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి, ఇతర రాజకీయ నాయకులు శ్రీనగర్‌లో ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్ముకాశ్మీర్‌కు సంబంధించి ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకుంటే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వారు సమాలోచనలు జరిపినట్లు తెలిసింది.

దురాక్రమణ చేస్తే తిప్పికొడతాం

భారత్ ఎలాంటి దుస్సాహసం లేదా దురాక్రమణకు పాల్పడ్డా తీవ్ర స్థాయిలో సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ హెచ్చరించారు. కాశ్మీర్ ప్రజలకు దౌత్యపరంగా, నైతికంగా, రాజకీయంగా మద్దతును కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ప్రజల ఆకాంక్షల మేరకు చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన భారత్‌కు స్పష్టం చేశారు. కాశ్మీర్‌కు సంబంధించి భారత్‌లో చకచకా సాగుతున్న పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రతా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఇమ్రాన్ అందులో తాజా పరిస్థితులపై చర్చించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రజలపై భారత్ క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తుందంటూ సైన్యం చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇమ్రాన్ ఈ సమావేశం జరిపారు. అంతర్జాతీయ ఒప్పందాలను భారత్ ఉల్లంఘిస్తోందని, భారత్ చర్యల వల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని ఇమ్రాన్ తెలిపారు. భారత భాద్యతారహిత, ఏకపక్ష ధోరణిపై దృష్టి సారించాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు, కాశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ఈ సమావేశంలో స్పష్టం చేశారు. అయితే క్లస్టర్ బాంబుల ఆరోపణలను భారత్ తిరస్కరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ భద్రతా కమిటీ సమావేశంలో రక్షణ మంత్రి విదేశాంగ మంత్రి దేశీయ వ్యవహారాల మంత్రి పాల్గొన్నారు. భారత్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఈ సమావేశం స్పష్టం చేసింది. భారత్ చర్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్న చందంగా ఉన్నాయని దుయ్యబట్టింది. ఆఫ్ఘానిస్తాన్ వివాదాన్ని పరిష్కరించడంలో పాకిస్తాన్ ప్రపంచ దేశాలు తలమునకమైన తరుణంలో భారత్, కాశ్మీర్‌పై ఈ రకంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టింది.

(Curtacy Andhrabhoomi)

RELATED ARTICLES

Latest Updates