కరోనాకు వెరవకుండా కెమెరాతో రోడ్డెక్కింది!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 ఒకవైపు కరోనా కరాళనృత్యం చేస్తుంటే… దేశవ్యాప్తంగా లక్షలాది  వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు కాలినడకన వెళ్తుంటే… వారి యాతనను ప్రపంచానికి తెలిపేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోడ్డెక్కింది. ఒకటి కాదు రెండు కాదు… 74 రోజులు… 8 రాష్ట్రాలు… 14 వేల కిలోమీటర్లు…  తన బృందంతో కలిసి చేసిన ప్రయాణంలో వలస కార్మికుల వెతలను వెలికితీసింది. ‘‘కరోనా సంక్షోభం కన్నా నాకు వలస కార్మికుల సంక్షోభం పెద్దదిగా అనిపించింది’’ అంటున్న ప్రముఖ మహిళా జర్నలిస్ట్‌, న్యూస్‌కాస్టర్‌ బర్ఖాదత్‌ సాహసోపేతమైన రిపోర్టింగ్‌ దృశ్యమిది…

కరోనా వేళ… కాలు బయటపెడితే ఏం జరుగుతుందో తెలుసు. కానీ జర్నలిస్ట్‌గా బర్ఖాదత్‌కు ప్రమాదాలతో పోరాడటం బాగా తెలుసు. బాంబుల వర్షం కురుస్తున్న కార్గిల్‌ యుద్ధక్షేత్రాన్ని ఎన్డీటీవీ జర్నలిస్ట్‌గా అప్పట్లో లైవ్‌లో చూపిన సాహసి ఆమె. ఆ తర్వాత కూడా జర్నలిస్టుగా బర్ఖా అనేక సంక్షోభ సమయాల్లో కార్యక్షేత్రంలోకి దూకింది. ఇప్పుడు కూడా అంతే. లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుని, నానా అవస్థలు పడుతున్న లక్షలాది మంది వలస కార్మికులను చూసి చలించిపోయిన బర్ఖా ఒక బ్యాగులో బట్టలు సర్దుకుని కారులో తన బృందంతో బరిలోకి దిగింది. తొలుత దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌ దాకా ప్రయాణించి వలస కార్మికుల కష్టాలను అందరికీ తెలియపరిచింది. ఆ తర్వాత జైపూర్‌, అహ్మదాబాద్‌, సూరత్‌, ముంబయ్‌, పుణే, హైదరాబాద్‌ వైపు ప్రయాణాన్ని సాగించింది. ఈలోపు ముంబయ్‌లో ‘కొవిడ్‌ 19’ విజృంభిస్తోందని తెలిసి తిరిగి ముంబయ్‌కి చేరుకుని అక్కడి నుంచి రిపోర్ట్‌ చేసింది. అక్కడి నుంచి కర్ణాటక, కేరళ… ఇలా 74 రోజుల పాటు రోడ్డు మార్గంలో 14 వేల కిలోమీటర్లు తిరిగి, కరోనా పరిస్థితులతో పాటు, వలస కార్మికుల కష్టాలను రిపోర్ట్‌ చేసింది. ‘‘నా వరకు నాకు కరోనా వైరస్‌ కన్నా వలస కార్మికుల బాధలు అతి పెద్ద సంక్షోభంగా కనిపించాయి. ఒక్కొక్కరి బాధ తెలుసుకుంటుంటే దేశంలో పేదరికం పొరలు పొరలుగా ఎంత భీకరంగా ఉందో అర్థమయ్యింది. దీన్ని (బర్ఖా చేసిన రిపోర్టింగ్‌) ఒకరకంగా ‘పావర్టీ ఛేజింగ్‌ జర్నలిజం’ అనాలేమో’’ అన్నారు బర్ఖా.

కొన్ని వీడియోలు ట్విట్టర్‌లో…
మొదట్లో బర్ఖాదత్‌ ఢిల్లీ నుంచి రిపోర్టింగ్‌ చేయాలనుకున్నారు. దేశమంతా హోటల్స్‌ మూసేసి ఉండటం, ‘కొవిడ్‌ 19’ ఇన్‌ఫెక్షన్‌ విస్తరించడంతో రోజంతా రిపోర్టింగ్‌ చేసి రాత్రికి ఢిల్లీకి చేరుకోవాలని భావించారు. అయితే రాష్ట్రాలన్నీ సరిహద్దులను మూసేయడంతో అది సాధ్యం కాదని గ్రహించి, పరిస్థితులకు ఎదురీదుతూ ముందుకు సాగాలనుకున్నారు. వలస కార్మికులతో పాటు ట్రక్కుల్లో ప్రయాణించడం, రైళ్లలో వారిని కలిసి మాట్లాడటం… ఇండోర్‌లో ‘కొవిడ్‌ 19’ ఆస్పత్రిలోని శవాగారంలోకి పీపీఈ కిట్‌ ధరించి వెళ్లడం… అన్నీ సాహసాలే. ‘‘మారుతీ కంపెనీలో పనిచేసే ఒక వలస కార్మికుడితో నడుస్తూ (అతడు ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్నాడు) మాట్లాడుతుంటే అతడు ఒక మాటన్నాడు. ‘ఈ దేశంలో పేదలు మాత్రమే చనిపోతారు. ఒక్క రాజకీయనాయకుడి పిల్లలు చనిపోరు. మేము మా సొంత ఊళ్లకు వెళ్లడానికి కనీసం ఒక్క బస్సు కూడా ఏర్పాటుచేయరు’ అంటూ తన ఆవేదనను తెలిపాడు. ఆ వీడియో క్లిప్‌ను నేను ట్విట్టర్లో పెడితే లక్షలాది మంది చూశారు’’ అని గుర్తుచేసుకున్నారు బర్ఖా.

ప్రయాణం ఆగదు…
వెళ్లిన ప్రతీ చోటా అక్కడి పరిస్థితులను వివరిస్తూ 100 నుంచి 200 క్లిప్స్‌ రికార్డు చేసేవారు బర్ఖా. వాటి నిడివి 5 నిమిషాల నుంచి 45 నిమిషాలదాకా ఉండేవి. దేశవ్యాప్తంగా రోడ్డు మార్గంలో తిరుగుతూ వలస కార్మికుల కష్టాలను రిపోర్టు చేసే క్రమంలో ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాననే భావన ఉన్నప్పటికీ ఆమె ఎక్కడా వెనుకంజ వేయలేదు. ‘‘నేను ఒక ట్రక్‌ ఎక్కితే అందులో వందమంది దాకా వలస కార్మికులు ఉండేవారు. ట్రక్కులోనైనా, రైళ్లోనైనా, బస్తీలోనైనా ఇదే వరుస. చేతులు కడుక్కోవడం, గ్లౌజులు ఉపయోగించడం నా చేతుల్లో ఉండేదిగానీ భౌతికదూరం కష్టమయ్యేది. ప్రజలతో ఉన్నప్పుడు అది సాధ్యం కాదు కూడా’’ అన్నారామె. దీనితో పాటు వెళ్లినచోట రాత్రిపూట బస చేయడం ఆమె బృందానికి కష్టమైంది. హోటళ్లు మూసి ఉండటంతో తెలిసిన స్నేహితులకు ఫోన్‌ చేసి, ఆ ప్రాంతంలో వారి స్నేహితుల ఇళ్లలో బస చేసేవారు. కొన్ని చోట్ల పొలాల్లో కూడా ఉన్నారు. అయితే ఈ ఉపద్రవానికి (వలస కార్మికుల కష్టాలు) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే తప్పంటారామె. లాక్‌డౌన్‌కు ముందే వలస కార్మికుల విషయంలో ఆలోచించి, జాగ్రత్తగా వారి వారి స్వస్థలాలకు పంపిస్తే ఈ కష్టాలు ఉండేవి కాదంటారు. ‘‘దేశ విభజన తర్వాత జరిగిన అతి పెద్ద వలసలు ఇవే. దీన్ని దృష్టిలో పెట్టుకుని వలస కార్మికుల విషయంలో ఒక పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది’’ అన్నారు బర్ఖా. ఆమె తన సుదీర్ఘ ప్రయాణంలో కేరళలో మాత్రమే ఆశావహ పరిస్థిలను చూశారు. అక్కడ బర్ఖాదత్‌ కేరళ ఆరోగ్యమంత్రి శైలజతో పాటు కేవలం రెండు నెలల్లో 540 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసిన కసర్‌గడ్‌ జిల్లా కలెక్టర్‌ను కూడా ఇంటర్వ్యూ చేశారు. తుఫాను కారణంగా కొన్ని ప్రాంతాలకు వెళ్లలేకపోయానంటున్న బర్ఖా తన ప్రయాణం ఇక్కడితోనే ఆగిపోలేదని అంటోంది. ‘‘కరోనా మహమ్మారి దెబ్బతో తమ తమ సొంత ఊళ్లకు తిరిగి వెళ్లిన వలస కార్మికులు అక్కడ ఎలా ఉన్నారో చూపించాలనుకుంటున్నా’’ అంటున్న బర్ఖాదత్‌ ఈసారి దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల గ్రామాలకు కూడా తన బృందంతో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates