క్షురకుడి దారుణ హత్య

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

పాట్నా: క్షవరం చేయడానికి నిరాకరించాడన్న అక్కసుతో ఓ క్షురకుడిని కాల్చిచంపిన కిరాతక ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. బాంకా జిల్లాలోని మైన్వా గ్రామంలో జరిగిన ఈ దారుణోదంతానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దినేశ్‌ ఠాకూర్‌(40) అనే వ్యక్తి క్షురకవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం లాక్‌డౌన్‌ విధించడంతో అతడు సెలూన్‌ మూసివేసి ఇంటి దగ్గరే ఉంటున్నాడు.

అయితే తమకు క్షవరం చేయాలంటూ అతడిపై గ్రామస్తులు ఒత్తిడి తెచ్చారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉన్నందున అతడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు విచక్షణ కోల్పోయి దినేశ్‌ ఠాకూర్‌ను ఊరి చివరకు ఇడ్చుకుపోయి తీవ్రంగా హింసించారు. తర్వాత తలలోకి రెండు సార్లు తుపాకీతో కాల్చి అతడిని అతి దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలంలోనే అతడు ప్రాణాలు వదిలాడు. పొరుగు గ్రామంలో చెరువు దగ్గర అతడి మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య ముసోదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొత్తం 9 మంది గ్రామస్తులపై ఆమె ఫిర్యాదు చేశారు.

‘లాక్‌డౌన్‌ ఉన్నందున తాను క్షవరం చేయబోనని గ్రామస్తులకు ఎంతో వినయంగా నా భర్త చెప్పారు. చిన్న కారణానికే ఇంత దారుణంగా నా పెనిమిటిని పొట్టన పెట్టుకుంటారని ఊహించలేద’ని ముసోదేవి కన్నీటి పర్యంతమయింది. తలకు గురిపెట్టి కాల్చడం వల్లే దినేశ్‌ ఠాకూర్‌ చనిపోయాడని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి కుమార్‌ సన్నీ తెలిపారు. ఘటనా స్థలంలో మరో రెండు తూటాలు స్వాధీనం చేసుకున్నామని, తదుపరి దర్యాప్తు సాగిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనను దేశవ్యాప్తంగా ఉన్న బార్బర్లు ముక్త కంఠంతో ఖండించారు. హంతకులను చట్టప్రకారం కఠినంగా శిక్షంచాలని డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES

Latest Updates