భజరంగ్‌దళ్‌ కార్యకర్త అరెస్ట్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

పట్నా: బిహార్‌లో ముస్లిం కుటుంబంపై సోషల్‌ మీడియాలో విష ప్రచారం చేసిన భజరంగ్‌దళ్‌ కార్యకర్తను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. మంగేర్‌ నగరంలోని తారాపూర్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం ఢిల్లీలోకి తబ్లిగీ జమాత్‌కు హాజరైందని, ఈ కుటుంబంలోని వ్యక్తి కోవిడ్‌-19 బారిన పడ్డాడని అసత్య ప్రచారం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగేర్‌ నుంచి ఎవరూ తబ్లిగీ జమాత్‌కు వెళ్లలేదని పోలీసులు, వైద్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారం చేసినందుకు తారాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బిహ్మా గ్రామానికి చెందిన గౌతమ్‌ సింగ్‌ కుష్వాహను అరెస్ట్‌ చేసినట్టు మంగేర్‌ డీఐజీ మను మహరాజ్‌ తెలిపారు. ముస్లిం కుటుంబంలోని వ్యక్తి కరోనా బారిన పడ్డారని విషప్రచారం చేసినందుకు అతడిని అరెస్ట్‌ చేసినట్టు చెప్పారు. భజరంగ్‌దళ్‌ జిల్లా స్థాయి కోశాధికారిగా గౌతమ్‌ సింగ్‌ వ్యవహరిస్తున్నాడు. తారాపూర్‌ మార్కెట్‌లో మెడికల్‌, చెప్పుల దుకాణాలు నిర్వహిస్తున్న ముస్లిం కుటుంబం ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్‌ మీడియాలో విద్వేష ప్రచారం సాగించాడు. అతడు చేసిన నిర్వాకంతో ముస్లిం కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు తారాపూర్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో పోలీసులు బలవంతంగా వైద్య పరీక్షలు చేయించారు. అంతేకాదు హోమ్‌ క్వారెంటైన్‌లో ఉండాలని సూచించారు.

RELATED ARTICLES

Latest Updates