తలసరి వేతనం రూ. 100

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 – బతుకీడుస్తున్న 88 శాతం జనాభా
కొండూరి వీరయ్య

దేశంలో పని చేస్తున్న శ్రామికులు, కార్మికుల సగటు నెలసరి వేతనం 10వేల రూపాయల కంటే తక్కువగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఓ నివేదిక స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల మంత్రిత్వశాఖ 2017 జులై-2018 జూన్‌ ఏడాదిలో నిర్వహించిన శ్రామిక సర్వే వివరాలు 2019 మేలో వెల్లడించింది. గణాంకాల మంత్రిత్వశాఖ ఆధీనంలో జాతీయ నమూనా సర్వే సంస్థ గత సంవత్సరం వరకు దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన సామర్థ్యం, నిరుద్యోగం గురించి సర్వే చేసి నివేదిక ఇస్తూ వచ్చేది. నిరుద్యోగం గత నాలుగు దశాబ్దాల కంటే మోడీ హయాంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నదని ఈ సర్వేలో వెల్లడైంది. దాంతో సర్వే నివేదికను తారుమారు చేయటం, వివరాలు తొక్కి పెట్టడం వంటి చర్యలకు ప్రభుత్వం పూనుకున్నది. ఈ వివాదాన్ని దారి మళ్లించటానికి ఉపాధి కల్పన సామర్థ్యం, నిరుద్యోగ స్థితి గురించి జరిపే సర్వే ను రద్దు చేస్తూ దాని స్థానంలో నిర్దిష్ట సమయంలో శ్రమశక్తి సర్వే అనే శీర్షికన సర్వే నిర్వహించి దాని ఫలితాలు వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ ఆర్థికవేత్త అమితాబ్‌ కుందు రూపొందించిన సర్వే విధి విధానాల ఆధారంగా ఈ సర్వే జరిగింది.

ఈ సర్వేలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 12వేల నివాస ప్రాంతాల్లో లక్ష కుటుంబాలను సర్వే చేసింది. గ్రామీణ ప్రాంతంలో 52 శాతం మంది స్వయం ఉపాధి మీద ఆధారపడి (వ్యవసాయం, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులతో సహా) జీవనం సాగిస్తుంటే ఇందులో 25 శాతం మంది కాజువల్‌ కార్మికులుగానూ, 12.7 శాతం రెగ్యులర్‌ వేతన కార్మికులుగానూ పని చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి మీద ఆధారపడిన కుటుంబాలు 32.4 శాతం కాగా ఇందులో రెగ్యులర్‌ వేతన కార్మికులు 41.4 శాతం మాత్రమే ఉన్నారు. దేశవ్యాప్తంగా పనిచేయగలిగిన జనాభాలో 35 శాతం మాత్రమే కార్మికులుగా ఉన్నారు. అంటే 65 శాతం పని చేయగలిగిన జనాభాకు రెగ్యులర్‌ పని లేకుండా ఉంది. ఆ మేరకు వారి శ్రమశక్తిని ఉపయోగించి జాతీయ సంపదను పెంచేందుకు అవకాశం ఉన్నా ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం ఈ అవకాశాన్ని వినియోగించుకోలేపోతోంది. వేతన కార్మికులుగా నమోదైన వారిలో కూడా 28 శాతం కాజువల్‌ కార్మికులుగా ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో 55 శాతం మంది పురుషులు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనోపాధి సంపాదించుకుంటున్నారు. శ్రామికులుగా నమోదు చేసుకున్న మహిళల్లో 77 శాతం వ్యవసాయ రంగంలోనే పని చేస్తున్నారు. గ్రామీణ శ్రామికుల్లో 14.5 శాతం మంది పురుషులు భవననిర్మాణ కార్మికులుగా ఉంటే ఐదు శాతం మంది మహిళలు ఈ రంగంలో పని చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలో పని చేస్తున్న కార్మికుల్లో 25 శాతం హౌటళ్లు, ఇతర సేవారంగ పరిశ్రమల్లో పని చేస్తున్నట్టు ఈ సర్వే అంచనా వేయగా మరో 22 శాతం వస్తూత్పత్తి రంగంలోనూ, 21 శాతం ఇతర రంగాల్లోనూ పని చేస్తున్నట్టు సర్వే అంచనా వేసింది.
పట్టణ ప్రాంతాల్లో వ్వసాయేతర రంగాల్లో పని చేస్తున్న కార్మికుల్లో 71 శాతం మంది ఎటువంటి వేతన ఒప్పందాలు లేకుండానే పని చేస్తున్నారు. 54.2 శాతం మంది కార్మికులు వేతన సెలవులు పొందే హక్కు కూడా లేకుండా పని చేస్తున్నారు. వ్యవసాయేతర రంగాల్లో పని చేస్తున్న రెగ్యులర్‌ కార్మికుల్లో యాభై శాతం మందికి ఎటువంటి సామాజిక భద్రత చట్టాలు అమలు కావటం లేదని సర్వే నిర్ధారించింది.

గ్రామీణ ప్రాంతాల్లో నెలమొత్తం పని చేస్తున్న పురుష కార్మికులు 13 వేల రూపాయల వేతనం పొందుతుంటే మహిళా కార్మికుల వేతనాలకు ఎనిమిదిన్నర వేలకు మించి లేవు. పట్టణ ప్రాంతాల్లో నెలంతా పని చేస్తున్న పురుష కార్మికుని సగటు నెలసరి వేతనం 17 వేల రూపాయలుంటే మహిళా కార్మికుల వేతనాలు 14వేలు. గ్రామీణ ప్రాంతంలో పని చేసే కాజువల్‌ కార్మికుల్లో పురుషులకు దినసరి వేతనం 253 రూపాయలు ఉంటే మహిళలకు దినసరి వేతనం 166 రూపాయలు. ఉపాధి కార్మికుల్లో స్త్రీపురుషుల వేతనాల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది. ఉపాధికార్మికులుగా ఉన్న పురుషులకు సగటు దినసరి వేతనం 141 రూపాయలుంటే స్త్రీలకు 131 రూపాయలుంది. గ్రామీణ ప్రాంతంలో పని చేసే కాజువల్‌ పురుష కార్మికుల సగటు నెలసరి వేతనం 8500-9700గా ఉంటే మహిళా కార్మికుల నెలసరి వేతనం రు.3900 – 4300 మాత్రమే ఉంది. పట్టణ ప్రాంత కాజువల్‌ కార్మికుల్లో పురుష కార్మికుల నెలసరి వేతనం రు.16వేలుగా నమోదైతే మహిళా కార్మికుల వేతనాలు ఆరున్నర వేలకు మించటం లేదు. వ్యవసాయ రంగం కంటే వ్యవసాయేతర కార్మికుల్లో స్త్రీ పురుష వేతనాల మధ్య వ్యత్యాసం 40 శాతం ఉంది.

అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం నలుగురు కుటుంబ సభ్యులున్న గ్రామీణ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు శ్రామికులుగా ఉన్నారనుకుంటే ఆ కుటుంబానికి వచ్చే సగటు నెలసరి ఆదాయం (నెలంతా పని దొరికితే) 21వేల రూపాయలు. కుటుంబ సగటు తలసరి ఆదాయం రు.175 రూపాయలు మాత్రమే. పైన చెప్పుకున్నట్టు గ్రామీణ ప్రాంతంలో 12 శాతం మాత్రమే రెగ్యుల్‌ కార్మికులుగా ఉన్నారు. అంటే కేవలం 70 శాతంగా ఉన్న గ్రామీణ (సుమారు 100 కోట్లు) జనాభాలో యాభై కోట్ల మంది శ్రామికులుగా ఉన్నారు. వీరిలో 12 శాతం మందికి (6 కోట్ల మందికి) దినసరి తలసరి ఆదాయం 175 రూపాయలుగా ఉంది. మిగిలిన 88 శాతం మంది అంటే 44 కోట్లమంది (కాజువల్‌ కార్మికులు)కి సగటు దినసరి వేతనం వంద రూపాయలు మాత్రమే. ఈ వేతనాలు కుటుంబ పోషణకు సరిపోవటం లేదు కాబట్టే కనీసం పది శాతం మంది కార్మికులు తాము ఓవర్‌ టైం పని చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నామనీ, పని దొరకటం లేదని చెప్పారు. సగటు నిరుద్యోగిత శాతం 8.8 శాతంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులు 15 శాతం వరకు ఉన్నారని సర్వే అంచనా వేసింది.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates