కేంద్ర సర్కారు కీలక నిర్ణయం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో కీలకపాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను కేంద్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్‌ తేవాలని నిర్ణయించింది. లోక్ కల్యాణ్ మార్గ్‌‌ 7లోని ప్రధాని నివాసంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు.

వైద్య సిబ్బందిపై దాడులకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని, నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్లు జారీ చేస్తామని హెచ్చరించారు. చట్టప్రకారం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా 1897 ఎపిడెమిక్‌ చట్టంలో సవరణలు చేయనున్నట్టు వెల్లడించారు. దోషులకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల జరిమానా విధిస్తామన్నారు. ఆస్పత్రి ఆస్తులు ధ్వంసం చేస్తే మార్కెట్‌ విలువకు రెట్టింపు జరిమానా వసూలు చేస్తామన్నారు. వైద్యులు, ఆశావర్కర్లు, సిబ్బందికి రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి జవదేకర్‌ తెలిపారు. వైద్యులకు అన్నిరకాలు రక్షణ కల్పిస్తున్నామని.. 50 లక్షల మాస్క్‌లకు ఆర్డరిచ్చామని, వైద్య పరికరాల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు.

కాగా, అంతకుముందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతో హోం మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. వైద్య సిబ్బందికి భద్రత కల్పిస్తామని, గురువారం తలపెట్టిన ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. అమిత్‌ షా హామీతో వైద్యులు శాంతించారు. ఆర్డినెన్స్‌ తేవాలన్న కేంద్ర నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వాగతించింది.

RELATED ARTICLES

Latest Updates