గుదిబండలా ఎన్నార్సీ ప్రక్రియ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– అసోంలో తిరస్కరణకు గురైన 19 లక్షలమంది భవిష్యత్‌ ప్రశ్నార్థకం 
– ట్రిబ్యునళ్ల విశిష్ట అధికారాలతో జాబితాలో కొందరికి చోటు 
– మరికొన్ని వేలమందికి తప్పని వేధింపులు 

గువహతి: అసోంలో నిజమైన స్థానికుల్ని గుర్తించేందుకు చేపట్టిన భారీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 31న విడుదల చేసిన జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లో 3 కోట్ల 11 లక్షల 21 వేల 4 మందికి చోటు దక్కగా, 19 లక్షల 6 వేల 657 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరణకు గురైనవారిలో చాలామంది నిజమైన దేశ పౌరులున్నారని వామపక్షాలుసహా పలు సామాజిక సంస్థల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎన్‌ఆర్‌సీలో చోటు లభించనివారు విదేశీ ట్రిబ్యునళ్లకు(ఎఫ్‌టీలకు) అభ్యర్థనలు పంపడానికి 120 రోజుల సమయమిచ్చారు. పౌరసత్వాన్ని నిర్ధారించేందుకు(అభ్యర్థనలపై తుది తీర్పు ఇవ్వడానికి) ఎఫ్‌టీలకు స్వతంత్ర నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు. అభ్యర్థనలపై తీర్పులిచ్చేందుకు మొత్తం 300 ఎఫ్‌టీలను ఏర్పాటు చేస్తున్నట్టు అసోం ప్రభుత్వం ప్రకటించింది. ఎఫ్‌టీలలో వెల్లడైన తీర్పులపై పునర్‌ విచారణకు మరో యంత్రాంగమంటూ ఏమీ లేదు.

ఎన్నార్సీ జాబితాను గతేడాది(2018) జులై 30న వెల్లడించినపుడు అభ్యంతరాలు రావడంతో మరో అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించిన విషయం తెలిసిందే. ఎన్నార్సీ ప్రక్రియ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతోంది. గతేడాది జాబితాలో 2 కోట్ల 89 లక్షల 83వేల 677మందికి చోటు కల్పించి, 40 లక్షల 7 వేల 707మంది దరఖాస్తుల్ని తిరస్కరించారు. ఆ తర్వాత రెండు రకాల అభ్యర్థనలకూ అవకాశం కల్పించారు. తొలగింపును ప్రశ్నించే దరఖాస్తులతోపాటు జాబితాలో ఉన్నవారిపై విదేశీయులంటూ ఆరోపించే అభ్యంతరాలకూ అవకాశమిచ్చారు. దాంతో, గతేడాది డిసెంబర్‌ 31 వరకు 2 లక్షలకుపైగా జాబితాలో ఉన్నవారిని తొలగించాలంటూ అభ్యర్థనలొచ్చాయి.

వీటిలో చివరి రోజున వచ్చినవే అత్యధికమని గౌహతీకి చెందిన న్యాయవాది అమన్‌ వదూద్‌ తెలిపారు. అంతకు ఓ రోజు ముందు వరకూ వచ్చిన అభ్యంతరాలు 800కన్నా తక్కువేనని ఆయన తెలిపారు. అభ్యంతరాలు వచ్చినవారిలో ఐదేండ్ల చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఉన్నారని ఆయన తెలిపారు. అయితే, అభ్యంతరాలు వచ్చినప్పటికీ చాలమందికి ఎన్నార్సీ తుది జాబితాలో చోటు కల్పించారు. అభ్యంతరాలు వ్యక్తం చేసినవారు విచారణకు హాజరు కానందున అలా చేశారు. కాగా, జాబితాలో చోటు కల్పించినప్పటికీ అభ్యంతరాలు వచ్చినవారు విదేశీయులు అవునో, కాదో నిర్ణయం చేయాలంటూ వారి వివరాలను ఎఫ్‌టీలకు పంపే అధికారం జిల్లా కలెక్టర్లకున్నది. అంటే.. జాబితాలో ఉన్న కొందరిపై కలెక్టర్ల నుంచి నివేదికలు వెళ్తే వారికి మరోసారి పరీక్ష తప్పదన్నమాట. ఈ రకమైన వేధింపుల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందంటూ వదూద్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మే 30న ఎఫ్‌టీలపై ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విదేశీయుల( ట్రిబ్యునళ్ల) సవరణ ఆదేశం, 2019 పేరుతో ఇది విడుదలైంది. ఇందులోని ప్యారా 3ఏ, క్లాజ్‌(17) ప్రకారం ట్రిబ్యునల్‌ తన సొంత పద్ధతిలో విచారణ జరపవచ్చునంటూ అధికారం కల్పించింది. న్యాయస్థానాలు పౌర విచారణ స్మృతి(సీపీసీ), నేర విచారణ స్మృతి(సీఆర్‌పీసీ)ని అనుసరిస్తూ విచారణ జరుపుతాయి. పౌరసత్వానికి సంబంధించిన కీలక విచారణ జరిపే ట్రిబ్యునళ్లు ఏ ఆధారమూ లేకుండా విచారణ జరపడమేమిటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ట్రిబ్యునళ్లకు విచారణాధికారులను ఎంపిక చేసే విధానంలోనూ పారదర్శకత లోపించిందన్న విమర్శలున్నాయి. ట్రిబ్యునల్‌ సభ్యులను గువహతి హైకోర్టు ఎంపిక చేస్తుంది. కానీ, వారికి నియామకాలు ఇచ్చేది మాత్రం అసోం రాష్ట్ర హౌంశాఖ. 2017లో ఎఫ్‌టీలలోని 19మంది సభ్యులను సమర్థవంతంగా పని చేయలేదన్న సాకుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. వారిలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చిన సమాధానమేమంటే.. తొలగింపునకు గురైనవారు విదేశీయులను తక్కువ శాతం గుర్తించారని. అంటే..ఎక్కువమందిని విదేశీయులుగా తేల్చి చెప్పినవాళ్లే సమర్థులన్న అర్థం అందులో ఉన్నది. దాంతో, ట్రిబ్యునల్‌ సభ్యులు తాము కొనసాగాలంటే ఎక్కువమందిని విదేశీయులుగా తేల్చాలన్న అభిప్రాయానికొచ్చే ప్రమాదమున్నది. ట్రిబ్యునల్‌ ద్వారా విదేశీయులుగా తేల్చబడినవారికున్న మరో అవకాశం గౌహతి హైకోర్టును ఆశ్రయించడమే. అక్కడా వారికి న్యాయం జరగలేదని భావిస్తే చివరి అవకాశం సుప్రీంకోర్టు. అక్కడ కూడా వారు తమ స్థానికతను రుజువు చేసుకోలేనపుడు విదేశీయులుగా తేల్చబడ్తారు. ఆపై వారిని అరెస్ట్‌చేసి నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారు.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates