ఆశా వర్కర్ల మహాధర్నా భగ్నం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 భారీగా కోఠి చేరుకున్న వర్కర్లు
ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
చిన్న పిల్లలతో సహా తల్లుల అరెస్ట్‌
నేటి అసెంబ్లీ ముట్టడికీ చెక్‌
రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు నిర్బంధాలు
టీచర్ల ‘చలో అసెంబ్లీ’పై ఉక్కుపాదం
స్కూళ్లలోకి వెళ్లి మరీ అరెస్టులు
నెలాఖరు వరకు సెలవులు రద్దు

హైదరాబాద్‌/ఆబిడ్స్‌ : ఆశా వర్కర్లు తలపెట్టిన మహాధర్నాను పోలీసులు భగ్నం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ కోఠిలోని డీఎంహెచ్‌ఎ్‌స ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. ఇందుకోసం వందల సంఖ్యలో ఆశా వర్కర్లు కోఠికి చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలను రప్పించి కార్యాలయం చుట్టూ మోహరించారు. డీఎంహెచ్‌ఎ్‌స కార్యాలయంలోకి వెళ్లకుండా అన్ని గేట్లనూ మూసివేశారు. మహాధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన 875 మంది ఆశా వర్కర్లను రోడ్డుపైనే అదుపులోకి తీసుకుని పోలీ్‌సస్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కొందరి సెల్‌ఫోన్లు పగిలిపోయాయి. కొందరు ఆశా వర్కర్లు ‘మమ్మల్ని వదలండి.. వేతనాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం పట్టించుకోనందున నిరసన తెలపడానికి వచ్చాం’ అంటూ విలపించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల ప్రతినిధులు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్లుగానే తెలంగాణలోనూ రూ.10వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేయాలన్నారు. ఏఎన్‌ఎం నియామకాల్లో 10 శాతం వెయిటేజీ ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం గత ఏడాది పీహెచ్‌సీలు, మండల కేంద్రాలు, కలెక్టర్‌ కార్యాలయాల ముందు ధర్నాలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే మహాధర్నా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. తాము ఏ పని చేయాలనే విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదని, గత 12 ఏళ్లుగా ఏఎన్‌ఎం నియామకాల్లో ఆశాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా తమను మోసగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి కూడా పిలుపునివ్వడంతో పోలీసులు గురువారమే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆశా కార్యకర్తలను గృహనిర్బంధం చేశారు. పలుచోట్ల వారిని పోలీసు స్టేషన్లలో ఉంచారు.

ఎక్కడికక్కడ ఉపాధ్యాయుల అరెస్టులు.. నిర్బంధాలు
ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకి తరలించారు. ముఖ్యంగా పాఠశాలల్లోకి వెళ్లి విధుల్లో ఉన్న టీచర్లను అరెస్టు చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యమా…? లేక నియంతృత్వమా..? అని ఐక్య వేదిక నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ‘చలో అసెంబ్లీ’ జరిపి తీరుతామని చావ రవి, సదానందగౌడ్‌, మైస శ్రీనివాసులు స్పష్టం చేశారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. మరోవైపు పోలీసులు ఆయా సంఘాల్లో కీలకంగా ఉన్న నేతలను స్కూళ్లకు వెళ్లి మరీ అరెస్టు చేశారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు ఈ నెలాఖరు వరకు అన్ని రకాల సెలవులను రద్దు చేస్తూ పాఠశాల విద్యా కమిషనర్‌ చిత్రా రామచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నెల మొత్తం విద్యార్థులకు పరీక్షలుండడంతో ఉపాధ్యాయులందరూ అందుబాటులో ఉండాలనే సెలవులను రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే చలో అసెంబ్లీని అడ్డుకునేందుకే ఇలా చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates