ఆర్టికల్‌ 370 రద్దు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం, అందరినీ కలుపుకొని పోవడం లాంటి భావనలు ఉండే భారత దేశం కావాలని విశ్వసించే వారి నుంచి స్వీయ పరిశీలన చేసుకొనేందుకు జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న పరిస్థితి పిలుపునిచ్చింది. జమ్మూ కాశ్మీర్‌కు, మిగిలిన భారతదేశానికి మధ్య, ఇంతకు ముందు ఉన్న రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల, వివిధ సంఘాల ప్రజల మధ్య ఉన్న విభేదాలు తొలగించేందుకు చాలా వారధులు అవసరం. ఈ వారధులను నిర్మించడానికి వ్యవస్థీకతమైన వికేంద్రీకరణ, జమ్మూ కాశ్మీర్‌ ప్రజల ప్రజాస్వామిక హక్కుల పట్ల గౌరవం అవసరం. ఈ విషయంలో ఆగస్ట్‌ 5,2019న సంభవించిన పరిణామాలు ఈ రెండింటికీ విరుద్ధంగా జరిగాయి.

జమ్మూ కాశ్మీర్‌కు భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో ఉన్న సంబంధాన్ని నిర్వచించే ఆర్టికల్‌ 370 తలక్రిందులై, గత సంవత్సరం కొత్త నియమ నిబంధనలు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో రాజకీయ కార్యాకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.

గత సంవత్సరం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ దేశంలోని ఇతర ప్రాంతాలతో జమ్మూ కాశ్మీర్‌కు ఏకీకతం ఏర్పడుతుందన్న కారణంతో ఆ పునర్వ్యవస్థీకరణను సమర్ధించారు. ఒక ప్రజాస్వామ్యంలో ఏకీకత భావం బహుముఖ దృష్టి కోణాల్లో అంచనా వేయాల్సి ఉంటుంది. ఆ బహుముఖ దృష్టి కోణాల్లో భావోద్వేగాల దిశ కూడా ఇమిడి ఉంటుంది. ఆ దిశగా ఆలోచించినప్పుడు ఆగస్ట్‌ 5, 2019న చేసిన విపత్కరమైన మార్పు వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపడం విచారించాల్సిన విషయం. జమ్మూ కాశ్మీర్‌ ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఇరుక్కుపోనున్నట్టు కనిపిస్తున్నది.

రాజకీయ ఖైదీలను, ముఖ్యంగా భారతరాజ్యాంగంపైన ప్రమాణం చేసి చట్టసభల్లో ప్రజా ప్రతినిధులుగా కొనసాగు తున్న వారిని నిరంతరం నిర్బంధంలో ఉంచడం అంటే, ఇండియన్‌ యూనియన్‌ తరపున గొంతెత్తుతున్న వారికి ప్రజాస్వామిక హక్కులు కూడా అందుబాటులో లేవని అర్థం చేసుకోవాలి. ఆ ప్రజాస్వామిక హక్కులను అనుభవించ డానికి సామాన్య ప్రజానీకం ఏ విధంగా ఆలోచించగలరు? జమ్మూ కాశ్మీర్‌పై మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, బలరాజు పూరీ పుట్టినరోజైన ఆగస్ట్‌ 5నే అకస్మాత్తుగా ఈ మార్పును ప్రవేశపెట్టారు. ఆయన 2014లో మరణించాడు.

ఆయన నిరంతరం వాదించే రెండు ప్రధానమైన భావనలలో మొదటిది, జమ్మూ కాశ్మీర్‌ ప్రజల ప్రజాస్వామిక హక్కులకు గౌరవం లభిస్తుందన్న హామీ లేకుండా జమ్మూ కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం ఏర్పడదు. రెండవది, ఆ హామీ ఇవ్వాలంటే రాష్ట్రంలో ఖచ్చితంగా సమాఖ్య ఉనికి (ఫెడరలిజం) కోసం ప్రయత్నం చేయడమే ప్రధానం. ప్రస్తుత తరుణంలో ఈ రెండు చర్యలు మాత్రమే ముఖ్యమైన పరిష్కారాలు.

1990లలో ప్రచురించబడిన తన ప్రసిద్ధమైన రచన ”కాశ్మీర్‌ టూవర్డ్స్‌ ఇన్సర్జెన్సీ”లో బలరాజు పూరీ, కాశ్మీర్‌కు ప్రజాస్వామిక హక్కును నిరాకరించే విధానం గతంలో కొనసాగిందని ముందు చూపుతో పేర్కొన్నారు. ఎన్నికలలో తారుమారు చేసే విధానం ద్వారా రాష్ట్రంలో ఒక పార్టీ పాలన విధించబడింది. ప్రతిపక్ష పార్టీలు ఎదగకుండా అడ్డుకున్నారు. ప్రాథమిక పౌర స్వేచ్ఛ, మానవ హక్కులు ప్రజలకు నిరాకరించారు. ”భారత ప్రజాస్వామిక చట్రంలో కాశ్మీర్‌ను ఏకీకతం చేయడానికి ఈ నిరాకరణ, కాశ్మీర్‌ భావోద్వేగపూరిత రాజకీయ సమైక్యత ప్రక్రియకు భారతదేశంలో మిగిలిన ఏకైక గొప్ప ప్రాంతంగా రుజువు చేసింది.” రాజకీయ శూన్యత ద్వారా తీవ్రమైన నిరాశా భావన, అస్థిత్వ ముప్పు తీవ్రవాద బీజాలకు కారణభూతమవుతాయని ఆయన పదే పదే చెప్పారు. కాశ్మీర్‌ మిగతా భారతదేశంతో ఏకీకతం కావడానికి, దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఏ రాజ్యాంగబద్ధమైన సంరక్షణా చర్యలు, ప్రజాస్వామిక హక్కులు అనుభవిస్తున్నారో అవే హక్కులు కాశ్మీర్‌ ప్రజలు అనుభవించ వచ్చు అనే హామీని వారికి ఇవ్వాలని ఆయన నొక్కి చెప్పాడు.

జమ్మూ కాశ్మీర్‌లో గడిచిన ఏడు దశాబ్దాల కాలంలో నేర్చుకున్న పాఠాలు చాలా స్పటిక స్పష్టంగా ఉన్నాయి. మనం జమ్మూ కాశ్మీర్‌ ప్రజలకు ఎంతగా ప్రజాస్వామిక హక్కులు ఇస్తే, వారు అంతగా ఈ ఇండియన్‌ యూనియన్‌లో భాగంగా భావిస్తారు. ప్రస్తుత రాజకీయ నిద్రాణదశ, నాకు 90వ దశకం మొదట్లో కాశ్మీర్‌లోయ నిరంతరం కర్ఫ్యూలో ఉన్న పరిస్థితులను గుర్తు చేస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరికీ అన్ని రకాల సమాచార మార్గాలు అందుబాటులో ఉన్న కారణంగా మాత్రమే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క శక్తి సామర్థ్యాలు బహిర్గతం అయ్యాయి. మానవ హక్కుల పట్ల గౌరవం మాత్రమే కాశ్మీర్‌ విధానంలో ప్రధానమైన భాగంగా గుర్తించారు. సాధారణ కాశ్మీర్‌ ప్రజలు, భద్రతా సిబ్బందితో పాటు అనేక మంది ప్రాణ త్యాగాలతో, అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ పాఠాలను నేర్చుకున్నారు.

అసమానత – సమాఖ్య వాదం
ఈ రాజ్యాంగ మార్పు భారతదేశ సమాఖ్యపై దాడిగా పరిగణిస్తూ గత సంవత్సరం దేశం మొత్తం ఆందోళన చెందింది. ఆర్టికల్‌ 370 ఇండియన్‌ యూనియన్‌ను బలహీన పరుస్తోంది అనేది తప్పుడు భావన. ఆ భావన భారతదేశ సమాఖ్య ప్రయోగాల నుంచి నేర్చుకున్న పాఠాలకు, ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక అవగాహనకు పూర్తిగా విరుద్ధమైనది. ఇండియన్‌ యూనియన్‌లో భాగంగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక జెండా, రాజ్యాంగాలు అసమానతను సూచిస్తాయి. ఈ అసమానత భారతదేశ సమాఖ్య అనుభవానికి ముఖ్యమైన భాగం. ఇండియన్‌ యూనియన్‌లో ఉదారమైన, అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచనలలో విశాలమైన పరిధిలో అస్థిత్వాన్ని గుర్తించాలన్న బలమైన కోరిక నేపథ్యంలోనే దీనిని చూడాలి.

ఇండియన్‌ యూనియన్‌ను బలోపేతం చేసి, మంచి విధానాలను అమలు చేసి, రాజకీయ ప్రక్రియలలో భాగస్వామ్యం కావడానికి ఈ అసమానతే దారి తీసిందని చెప్పడానికి అనేక రుజువులున్నాయి. ఈ విషయంలో అనేక ప్రాంతాల, ప్రత్యేకమైన, భిన్నమైన సంస్కృతీ, సాంప్రదాయాలు కలిగిన జమ్మూ కాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి కోసం పడిన తపనను మూడు ప్రాంతాల రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారత కోసం అనే విశాలమైన దృష్టితో చూడాలి. భారతదేశ భిన్నత్వంలో జమ్మూ కాశ్మీర్‌ ఒక సూక్ష్మ ప్రపంచంగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్‌ అపరిమితమైన భౌగోళిక, సంస్కృతుల, మతాల భిన్నత్వాలే బలోపేతానికి వనరుగా ఉండాలి.

కేంద్రం నుంచి జమ్మూ కాశ్మీర్‌కు సంక్రమించే రాజకీయ అధికారం ఒక ప్రాంతం లేదా రాజకీయ పార్టీ యొక్క రాజకీయ ఆధిపత్యానికి దారితీయకూడదు అని బలరాజు పూరీ వాదనను నేను ఎప్పుడూ సమర్ధిస్తూ వచ్చాను. ఆ రాజకీయ అధికారం, అంతకు ముందు ఉన్న రాష్ట్రం యొక్క భిన్న ప్రాంతాల, సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించే జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలోని అధికార సంక్రమణలకు తోడుగా ఉండాలి. ఈ భిన్నమైన వైవిధ్యాల మధ్య సంస్థాగతమైన సయోధ్య కుదిరేట్లు చేయడం, జమ్మూ కాశ్మీర్‌ సంక్లిష్టమైన పరిస్థితులకు సామరస్య పూర్వకమైన పరిష్కాలలో ప్రధానమైన భాగం. జవాబూదారీతనం, బాధ్యతలు విజయవంతమైన సమాఖ్య ప్రజాస్వామిక వ్యవస్థకు గుండెకాయ లాంటివి కాబట్టి, ఏ అధికార సంక్రమణకైనా తగిన విధంగా సమాఖ్య నిరోధసమతౌల్యాలు (షష్ట్రవషసర అస శ్రీఅషవర) ఉండాలి.

ఆగస్ట్‌ 5న భారత పార్లమెంట్‌ చేసిన నిర్ణయం, విడిపోయిన లఢఖ్‌లోని కార్గిల్‌ ప్రజలతో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతీ ఒక్కరినీ అసంతృప్తికి గురిచేసింది. ఆ నిర్ణయం, జమ్మూ కాశ్మీర్‌, మిగిలిన భారతదేశానికి మధ్య విభేదాలను మరింత పెంచింది. జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ వర్గాలకు చెందిన మేము ఎంతో ఓపికగా కొన్ని దశాబ్దాలుగా అనేక భీకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ, జీవితాలను ఫణంగా పెట్టి విభేదాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం.

ఈ కొత్త రాజ్యాంగ మార్పు జరిగి ఒక సంవత్సర కాలం అయింది కాబట్టి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం, అందరినీ కలుపుకొని పోవడం లాంటి భావనలు ఉండే భారత దేశం కావాలని విశ్వసించే వారి నుంచి స్వీయ పరిశీలన చేసుకొనేందుకు జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న పరిస్థితి పిలుపునిచ్చింది. జమ్మూ కాశ్మీర్‌కు, మిగిలిన భారతదేశానికి మధ్య, ఇంతకు ముందు ఉన్న రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల, వివిధ సంఘాల ప్రజల మధ్య ఉన్న విభేదాలు తొలగించేందుకు చాలా వారధులు అవసరం. ఈ వారధులను నిర్మించడానికి వ్యవస్థీకతమైన వికేంద్రీకరణ, జమ్మూ కాశ్మీర్‌ ప్రజల ప్రజాస్వామిక హక్కుల పట్ల గౌరవం అవసరం. ఈ విషయంలో ఆగస్ట్‌ 5,2019న సంభవించిన పరిణామాలు ఈ రెండింటికీ విరుద్ధంగా జరిగాయి.

యం.వై. తరిగామి
”ది హిందూ” సౌజన్యంతో

అనువాదం: బోడపట్ల రవీందర్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates