రాజధాని తరలింపు నిర్ణయంపై హైకోర్టు తీవ్ర హెచ్చరిక

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • కార్యాలయాలు తీసుకెళ్లవద్దు
  • తరలింపుపై తదుపరి చర్యలొద్దు
  • కాదని తరలిస్తే తగిన మూల్యం
  • మాకు అధికారాలు లేవనుకోవద్దు
  • తరలించినవి వెనక్కి రప్పిస్తాం
  • బాధ్యుల నుంచే ఖర్చు వసూలు
  • త్రిసభ్య ధర్మాసనం హెచ్చరిక
  • సర్కారుకు స్పష్టమైన ఆదేశాలు
  • కమిటీల నివేదికలు పిటిషనర్లకు
  • విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా

ఆ రెండు బిల్లుల విషయంలో శాసన మండలి సెలెక్ట్‌ కమిటీ ఏం చేస్తుందో చూద్దాం! తదుపరి విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేస్తున్నాం. ఈలోపు ప్రభుత్వం కార్యాలయాల తరలింపు విషయంలో తదుపరి చర్యలకు దిగితే… అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మాకు అధికారాలు లేవనుకోవద్దు! ఒకవేళ మా మాటను ధిక్కరించి కార్యాలయాలను తరలిస్తే… వాటిని వెనక్కి రప్పిస్తాం. ఇందుకయ్యే ఖర్చును బాధ్యులైన వారి నుంచి వసూలు చేయిస్తాం!

హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అమరావతి, జనవరి 23 : రాజధాని మార్పు పేరిట ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై తదుపరి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ ఆదేశాలను అతిక్రమిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. తమ మాటను ధిక్కరిస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని… బాధ్యులైన వారి నుంచి ఖర్చు వసూలు చేయిస్తామని తేల్చిచెప్పింది. పాలనా వికేంద్రీకరణ – సమగ్రాభివృద్ధి, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అంతేగాక శాసనసభ, శాసనమండలి బిజినెస్‌ రూల్స్‌ను కూడా తమ ముందుంచాలని తెలిపింది. ‘మూడు రాజధానుల’ నిర్ణయంలో కీలకమైన నిపుణుల కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, హైపవర్‌ కమిటీల నివేదికలను పిటిషనర్లకు అందజేయాలని సూచించింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్‌డీఏ చట్టం రద్దు, పాలనా వికేంద్రీకరణ – సమగ్రాభివృద్ధి బిల్లులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లతోపాటు రాజధాని తరలింపు ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలను వ్యతిరేకిస్తూ దాఖలైన మొత్తం 8 పిటిషన్లపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. బిల్లులు శాసన మండలిలో ఏ స్థాయిలో ఉన్నాయని ధర్మాసనం అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరాంను ప్రశ్నించింది. ఈ బిల్లుల్ని మండలి చైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపించారని ఆయన తెలిపారు.

కమిటీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ… ‘‘సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం వెలువడేంత వరకు వేచి చూడాలి. విచారణ కోసం తొందరపడడమెందుకు?’’ అని పిటిషనర్లతో వ్యాఖ్యానించింది. దీనిపై పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ స్పందిస్తూ… రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే ప్రజలు ఓపిక పట్టేటట్లుగా లేదని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు వచ్చిన మాజీ అటార్నీ జనరల్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహిత్గీ జోక్యం చేసుకుంటూ.. బిల్లులు ఇంకా చట్టరూపం దాల్చలేదని, పిటిషన్లు అపరిపక్వ దశలోనే ఉన్నందున వాటిపై విచారణ జరపడం సరికాదని, విచారణను వాయిదా వేయాలని అభ్యర్థించారు.

పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అశోక్‌భాన్‌ వాదనలు వినిపిస్తూ.. పైన పేర్కొన్న రెండు బిల్లుల్ని అధికరణ 207 కింద సాధారణ బిల్లులుగా బుధవారం నాటి వాదనల్లో ఏజీ చెప్పారని పేర్కొన్నారు. ఇందుకు ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ రెండూ సాధారణ బిల్లులు అని మాత్రమే ఏజీ చెప్పారని గుర్తు చేసింది.

రూల్స్‌ ఏమంటున్నాయి? : సెలెక్ట్‌ కమిటీ అధికారాలు, విధి విధానాలపై అసెంబ్లీ బిజినెస్‌ రూల్స్‌ ఏం చెబుతున్నాయని ధర్మాసనం ప్రశ్నించగా… సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలల వరకు గడువు ఉంటుందని ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు. బిల్లులు చట్టరూపం దాల్చకుండానే విచారణ జరపడం సరికాదని, వాయిదా వేయాలని మరోమారు అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనతో ధర్మాసనం ఏకీభవించింది. ఈ సందర్భంగా అశోక్‌ భాన్‌ జోక్యం చేసుకుంటూ… పిటిషన్లపై విచారణ జరపాలంటూ ఆ అవసరాన్ని వివరించారు.

ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను విశాఖకు తరలించాలని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం కోర్టు విచారణలో ఉండగానే తరలింపు జరిగిపోతుంది. అందువల్ల కార్యాలయాలను తరలించకుండా అడ్డుకోవాలి’’ అని అభ్యర్థించారు. న్యాయవాదులు ఆనంద్‌శేషు, పీవీ కృష్ణయ్య తదితరులు లేవనెత్తిన అంశాలపైనా స్పందించిన ధర్మాసనం… ఆ వ్యవహారాన్ని తాము చూసుకుంటామంటూ సర్కారుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ‘‘కార్యాలయాల తరలింపుపై ఎలాంటి తదుపరి చర్యలకు దిగరాదు.

మా ఆదేశాలను అతిక్రమిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకయ్యే ఖర్చు బాధ్యులైన వారి నుంచే రాబడతాం అని హెచ్చరించింది. ప్రభుత్వం తదుపరి చర్యలకు దిగితే ఎప్పుడైనా తాము జోక్యం చేసుకుంటామని కూడా స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోపు ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

కిక్కిరిసిన కోర్టు హాలు : రాజధాని వ్యవహారంపై విచారణ సందర్భంగా కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. న్యాయవాదులు, పిటిషనర్లు భారీగా తరలివచ్చారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, టీడీపీ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని తదితరులు కూడా స్వయంగా కోర్టుకు హాజరై వాదనలు ఆలకించారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates