యాంటీభయోత్పాతం..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • విచ్చలవిడి వాడకంతో అనర్థాలు
  • విఫలమవుతున్న యాంటీబయాటిక్స్‌
  • తెలుగు రాష్ట్రాల్లో ఏటా రూ.4 వేల కోట్లకుపైగా ఈ మందుల వినియోగం
  • నియంత్రణ అనివార్యమంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • 24 వరకూ అవగాహనా వారోత్సవాలు

ఇప్పటికే మందులకు లొంగని బ్యాక్టీరియాల బారినపడి దేశంలో ఏటా దాదాపు 7 లక్షల మందికిపైగానే మృత్యువాతపడుతున్నారు. మొండి బ్యాక్టీరియాను నియంత్రించకపోతే.. 2050 నాటికి ప్రపంచ దేశాల్లో ఏటా సుమారు కోటిమందికిపైగా ప్రజలు మృతిచెందే ముప్పు పొంచిఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ
హైదరాబాద్‌: ఒంట్లోకి ప్రమాదకర సూక్ష్మక్రిములు ప్రవేశించినప్పుడు.. వాటిని నాశనం చేయడానికి వినియోగించే ‘బ్రహ్మాస్త్రాలు’ క్రమేణా వీగిపోతున్నాయి. ఆరోగ్యానికి ఆసరాగా నిలవాల్సిన యాంటీబయాటిక్‌ ఔషధాలు విఫలమవుతున్నాయి. నానాటికీ సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్‌ నిరోధకత పెంచుకొని మొండిఘటాల్లా తయారవుతున్నాయి. దీంతో అత్యవసర ఔషధాలు కూడా పనిచేయని దుస్థితి నెలకొంది. విచ్చలవిడి వాడకం ఫలితంగానే ఈ విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) దీన్ని తీవ్ర ఉపద్రవంగా గుర్తించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు చిన్నాచితకా జబ్బులకు కూడా మందులు పనిచేయని రోజులొస్తాయని హెచ్చరించింది. వీటి వాడకంలో నియంత్రణ అనివార్యమని సూచించింది. డబ్ల్యూహెచ్‌వో ఈ నెల 18 నుంచి 24 వరకూ ప్రపంచవ్యాప్తంగా ‘యాంటీబయాటిక్స్‌ అవగాహనా వారోత్సవాలను’ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం..

సాధారణ వ్యాధులూ తీవ్రం
జలుబు, దగ్గు, నీరసం, ఏదైనా యాంటీబయాటిక్స్‌ వాడకం ఇప్పుడు సర్వసాధారణమైంది. చివరకు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు కూడా వీటినే వినియోగిస్తున్నారు. అవసరం లేకున్నా వీటిని వాడడంతో దుష్ఫలితాలు రావడం ఒక ఎత్తయితే.. అసలా మందులే పనిచేయకపోవడం ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ప్రస్తుత యాంటీబయాటిక్స్‌కు సూక్ష్మక్రిములు నిరోధకత పెంచుకోవడం వల్ల క్షయ, మలేరియా, గనేరియా, నిమోనియా, మూత్రనాళ, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు చికిత్స సవాల్‌గా మారింది. ఫలితంగా చిట్టచివరి అస్త్రాలుగా వినియోగించాల్సిన మందులను తొలిదశలోనే వాడేయాల్సి వస్తోంది.

మనదేశంలో పరిస్థితి..
* యాంటీబయాటిక్స్‌ అధిక వాడకంలో ప్రపంచంలోనే మన దేశం నాలుగో స్థానంలో ఉంది.
* తెలంగాణలో ఏటా రూ.1,832 కోట్లు, ఏపీలో రూ.2,550 కోట్ల విలువైన యాంటీబయాటిక్స్‌ ఔషధాలను వినియోగిస్తున్నట్లుగా అంచనా.

పరిశోధనలను ప్రోత్సహించాలి
యాంటీబయాటిక్స్‌ వాడుతున్నట్లుగా ఓ సైన్స్‌ పత్రిక అధ్యయనం వెల్లడించింది. వైద్యులు రాస్తున్న యాంటీబయాటిక్స్‌లో 64 శాతం ఔషధాలకు కేంద్ర ఔషధ నియంత్రణ ప్రమాణాల సంస్థ అనుమతి లేదని క్వీన్‌మేరీ వర్సిటీ ఆఫ్‌ లండన్‌ పరిశోధనలో తేలింది. ఔషధ అమ్మకాలపై నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేయాలి.

ఆకుల సంజయ్‌రెడ్డి, తెలంగాణ ఔషధ మండలి సభ్యులు

RELATED ARTICLES

Latest Updates