స్వరం తగ్గని నిరసన

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for స్వరం తగ్గని నిరసన"పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ప్రదర్శనలు
అనుకూలంగా కోల్‌కతాలో భాజపా ర్యాలీ

దిల్లీ, చెన్నై, గువాహటి: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. అసోం, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో సోమవారం కూడా నిరసనలు చోటుచేసుకున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ రాజ్‌ఘాట్‌ వద్ద ‘ఐక్యత కోసం సత్యాగ్రహం’ పేరుతో కాంగ్రెస్‌ సత్యాగ్రహం నిర్వహించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సోనియా, మన్మోహన్‌, రాహుల్‌ రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. ‘‘ఈ ఉద్యమంలో అమరులైన విద్యార్థుల సాక్షిగా.. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిజ్నోర్‌వాసి ఓమ్‌రాజ్‌ సైనీ సాక్షిగా.. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని మేం తీర్మానం చేసుకుంటున్నాం. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోం’’ అని ప్రియాంక అన్నారు. విద్వేషాలను వ్యాపింపజేస్తూ దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని రాహుల్‌ విమర్శించారు.

తమిళనాడు.. కర్ణాటక.. కేరళ..
తమిళనాడు రాజధాని చెన్నైలో డీఎంకే, దాని మిత్రపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. సీఏఏను ఉపసంహరించుకోకపోతే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో 35 సంస్థలతో కూడిన ‘ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ)’ పిలుపుతో వేలమంది ముస్లింలు వీధుల్లోకి వచ్చారు. సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్‌) విభాగమైన యూత్‌ లీగ్‌ ఆధ్వర్యంలో కేరళలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చోటుచేసుకున్నాయి. దిల్లీలో 139 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసోంలో ఆందోళనలు కొనసాగాయి. భాజపా మిత్రపక్షమైన అసోం గణ పరిషద్‌ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్‌ మహంత గువాహటిలో స్వయంగా నిరసనలో పాల్గొన్నారు. సీఏఏ, జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)కు వ్యతిరేకంగా అమెరికాలోని వాషింగ్టన్‌లో పలువురు భారతీయ అమెరికన్లు నిరసన చేపట్టారు.

Image result for స్వరం తగ్గని నిరసన"దేశవ్యాప్త జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ) రూపకల్పనపై తమ ప్రభుత్వం ఎన్నడూ చర్చించలేదని ప్రధాని మోదీ ప్రకటించడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. దేశాన్ని మభ్యపెట్టడానికి భాజపా ప్రయత్నిస్తోందని, ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని ఆక్షేపించాయి.

తప్పుదోవ పట్టిస్తున్నారు: నడ్డా
సీఏఏకు మద్దతుగా కోల్‌కతాలో భాజపా నిర్వహించిన ర్యాలీకి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా హాజరై ప్రసంగించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, ఇతర ప్రత్యర్థి పార్టీలు పౌరసత్వ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు.

పోలీసుల జులుం గర్హనీయం
ఎడిటర్స్‌ గిల్డ్‌ ఖండన

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన నిరసనల సందర్భంగా పాత్రికేయులపై పోలీసుల జులుంను ‘‘ది ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా’’ సోమవారం తీవ్రంగా ఖండించింది. ఈ తరహా చర్యలు ప్రజాస్వామ్యం గొంతును నొక్కివేస్తాయని పేర్కొంది. యూపీ, కర్ణాటకల్లో సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల వార్తలను కవర్‌ చేయడానికి వెళ్లిన పలువురు పాత్రికేయులను పోలీసులు అరెస్టు చేశారు. రాజ్యాంగం ద్వారా తమకు సంక్రమించిన వార్తాసేకరణ హక్కును వినియోగించుకునేందుకు పాత్రికేయులు అక్కడికి వెళ్లిన విషయాన్ని పోలీసులు గుర్తించాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కర్ణాటక, యూపీల్లోనే కాక గత వారంరోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో మీడియా ప్రతినిధులపై పోలీసులు భౌతిక హింసకు పాల్పడం గర్హనీయమంది. ‘హిందూ’ పత్రిక కరస్పాండెంట్‌ అయిన ఒమర్‌ రషీద్‌ను లఖ్‌నవూలో అరెస్టు చేసిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించింది.  పాత్రికేయులకు రక్షణ కల్పించేలా పోలీసులకు సూచించాలంటూ కేంద్ర హోంశాఖకు ఎడిటర్స్‌ గిల్డ్‌ విజ్ఞప్తి చేసింది.

‘‘నిరసనలు జరుగుతున్న వివిధ ప్రాంతాలకు పాత్రికేయులు తమ విధినిర్వహణలో భాగంగా చేరుకున్నారు. తమతమ మీడియా వేదికల ద్వారా ఆ వివరాలను ప్రజలకు అందచేయడం వారి విధి. రాజ్యాంగం ద్వారా వారికి సంక్రమించిన బాధ్యత అది. సరైన, బాధ్యతాయుతమైన వార్తల కవరేజీ ప్రస్తుత పరిస్థితుల్లో మరింత అవసరం. అలాంటి విధినిర్వహణలో ఉన్న పాత్రికేయులపై పోలీసులు దౌర్జన్యం, భౌతిక హింసకు పాల్పడటం వంటి చర్యలకు దిగడం ప్రజాస్వామ్యం గొంతును నొక్కేయడం, పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది’’. అని ఎడిటర్స్‌ గిల్డ్‌ పేర్కొంది.

(Courtesy Eenadu)

RELATED ARTICLES

Latest Updates