దేశ ప్రజలకు ఆనంద్ తేల్తుంబ్డే లేఖ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఏప్రిల్‌ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. కరోనావైరస్ వల్ల బహిరంగంగా జయంతి ఉత్సవాలు జరిగే అవకాశం లేకపోయినా, ఎవరికి వారు బాబాసాహెబ్ ను తలచుకుంటున్న సమయానికి బాబాసాహెబ్ మనవడు (మనవరాలు రమ సహచరుడు), బహుగ్రంథ రచయిత, ప్రజా మేధావి ప్రొ. ఆనంద్ తేల్తుంబ్డే అబద్ధపు సాక్ష్యాధారాల మీద ఆధారపడిన ఒక తప్పుడు కేసులో నిందితుడిగా కోర్టులో సరెండర్ కానున్నాడు. జైలుకు వెళ్లడానికి కొద్ది గంటల ముందు దేశప్రజలను ఉద్దేశించి ఆనంద్ ఒక బహిరంగ లేఖ రాశాడు. ఇంటర్నెట్ మీద పెట్టిన ఆ ఇంగ్లిష్ లేఖకు తెలుగు అనువాదం చూడండి:

జైలుకు వెళ్లేముందు ఆనంద్ తేల్తుంబ్డే రాసిన లేఖ
బిజెపి – ఆర్ ఎస్ ఎస్ కూటమి, దానికి ఊడిగం చేస్తున్న ప్రచారసాధనాలు సాగిస్తున్న ఉద్దేశపూర్వక రణగొణధ్వనిలో నా ఈ లేఖ పూర్తిగా మునిగిపోతుందని నాకు తెలుసు. అయినా నాకు మరొక అవకాశం దొరుకుతుందో లేదో తెలియని స్థితిలో మీతో మాట్లాడడం అవసరమనే అనుకుంటున్నాను.

ఆగస్ట్ 2018లో గోవా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ అధ్యాపకుల గృహసముదాయంలో ఉన్న నా ఇంటి మీద పోలీసులు దాడి చేసినప్పటి నుంచి నా ప్రపంచం పూర్తిగా తలకిందులైపోయింది. నా జీవితంలో ఇటువంటి ఘటనలు జరుగుతాయని నేను నా అతి ఘోరమైన పీడకలలో కూడ ఊహించలేదు. నా ప్రసంగాల నిర్వాహకులను, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలను, పోలీసులు ప్రశ్నిస్తున్నారని, నాగురించి దర్యాప్తు చేస్తూ బెదిరిస్తున్నారని నాకు అప్పటికే తెలిసినప్పటికీ, వాళ్లు నా సోదరుడి గురించి వెతుకుతూ పొరపాటున నా వెంట పడుతున్నారని అనుకున్నాను. నా సోదరుడు ఎన్నో సంవత్సరాల కిందనే మా కుటుంబం వదిలి వెళ్లిపోయాడు. నేను ఖరగ్ పూర్ ఐఐటి లో అధ్యాపకుడిగా ఉన్నప్పుడు ఒక బిఎస్ఎన్ఎల్ అధికారి నాకు ఫోన్ చేసి నా అభిమానిననీ, శ్రేయోభిలాషిననీ పరిచయం చేసుకుని, నా ఫోన్ మీద నిఘా ఉందని తెలియజేశాడు. నేనాయనకు కృతజ్ఞతలు చెప్పాను గాని దాని గురించి ఏమీ చేయలేదు. చివరికి నా సిమ్ కార్డ్ కూడ మార్చలేదు. ఈ చొరబాట్ల గురించి నేను ఆందోళనపడ్డాను గాని ఎన్ని దర్యాప్తులు చేసుకున్నా నేను ఒక సాధారణ వ్యక్తిననీ, నా ప్రవర్తనలో చట్టవ్యతిరేకత ఏమీ లేదనీ పోలీసులే అర్థం చేసుకుంటారని అనుకుని ఊరుకున్నాను. పౌరహక్కుల కార్యకర్తలు పోలీసులను ప్రశ్నిస్తారు గనుక సాధారణంగాపౌరహక్కుల కార్యకర్తల పట్ల పోలీసులు కన్నెర్ర వహిస్తారని, నేను కూడ ఎంతో కొంత పౌరహక్కుల కృషిలో ఉన్నందువల్ల పోలీసులు ఇలా చేస్తున్నారని నేననుకున్నాను. అయితే నా ఉద్యోగ విధుల్లోనే కాలమంతా కరిగిపోతుండడం వల్ల నేను ఆ పౌరహక్కుల పని కూడ సరిగ్గా చేయడం లేదని పోలీసులు తెలుసుకుంటారులే అనుకుని సంతృప్తి పడ్డాను.

కాని ఒకరోజు పొద్దున్నే మా ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి పోలీసులు క్యాంపస్ మీద దాడి చేశారని, నాకోసం వెతుకుతున్నారని చెప్పినప్పుడు కొన్ని క్షణాలపాటు నేను అవాక్కయ్యాను. కొద్ది గంటల కిందనే అధికారిక కార్యక్రమం మీదనే నేను ముంబాయి వచ్చాను. నా భార్య అంతకుముందే ముంబాయి వచ్చి ఉంది. ఆ రోజే కొందరు వ్యక్తుల ఇళ్ల మీద దాడులు జరిగాయని, వారిని అరెస్టు చేశారని నాకు తెలిసినప్పుడు, నేను వెంట్రుక వాసిలో అరెస్టు తప్పించుకున్నానని తెలిసి వణికిపోయాను. పోలీసులకు నేను ఎక్కడున్నానో తెలుసు, నన్ను కూడ అరెస్టు చేయగలిగి ఉండేవారే, కాని కారణాలేమిటో వాళ్లకే తెలియాలి గాని ఆ పని చేయలేదు. పోలీసులు మా యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డ్ దగ్గరినుంచి బలవంతాన డుప్లికేట్ తాళం చెవి తీసుకుని మా ఇల్లు తెరిచారు. లోపల వీడియో రికార్డ్ చేసి మళ్లీ తాళం వేశామంటున్నారు. ఇక అప్పటినుంచి మా ఇక్కట్లు మొదలయ్యాయి. మా న్యాయవాదుల సలహా మేరకు, నా భార్య వెంటనే గోవా వెళ్లి మేం ఇంట్లో లేని సమయంలో పోలీసులు మా ఇంటి తాళం తెరిచి లోపలికి వెళ్లారని, వారు లోపల ఏవైనా వస్తువులు పెట్టి ఉంటే మేము బాధ్యత వహించబోమని గోవాలోని బిచోలిం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేసింది. పోలీసులు దర్యాప్తు జరపదలచుకుంటే మాకు ఫోన్ చేయవచ్చునని మా ఫోన్ నంబర్లు ఇచ్చి వచ్చింది.

ఆశ్చర్యకరంగా, పోలీసులు ఆ వెంటనే పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి, మావోయిస్టులతో సంబంధాల కథలు చెప్పడం మొదలుపెట్టారు. తాము చెప్పిందల్లా రాసే, వినిపించే ప్రచార సాధనాల సహాయంతో నాకూ, ఇతర నిర్బంధితులకూ వ్యతిరేకంగా ప్రజల్లో దుష్ప్రచారం సాగించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారనేది స్పష్టమయింది. 2018 ఆగస్ట్ 31న అటువంటి ఒక పత్రికా సమావేశంలో ఒక పోలీసు అధికారి ఒక ఉత్తరం చదివి వినిపించాడు. అది అంతకు ముందు నిర్బంధించినవారిలో ఒకరి కంప్యూటర్ లో దొరికిందని అన్నారు. ఆ ఉత్తరాన్ని నా మీద సాక్ష్యంగా చెప్పారు. అడ్డగోలుగా రాయబడిన ఆ ఉత్తరంలో నేను హాజరైన ఒక అంతర్జాతీయ విద్యాసంబంధమైన సదస్సు ప్రస్తావన ఉంది. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ పారిస్ వెబ్ సైట్ మీద ఆ సదస్సు సమాచారమంతా ఉంటుంది. ఆ తప్పుడు ఆరోపణ విని మొదట నేను నవ్వేశాను. కాని ఆ తర్వాత ఆ పోలీసు అధికారి మీద సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావా వేయడానికి నిర్ణయించుకుని, ఆ దావా వేయడానికి అనుమతించవలసిందిగా 2018 సెప్టెంబర్ 5న మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాను. అది చట్టబద్ధ పద్ధతి. కాని ఇవాళ్టివరకూ ప్రభుత్వం నుంచి నాకు జవాబే రాలేదు. అయితే ఈలోగా హైకోర్టు పోలీసులను అభిశంసించడంతో పత్రికా సమావేశాలు ఆగిపోయాయి.

ఈ మొత్తం వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ హస్తం బహిరంగంగానే ఉంది. ఆర్ఎస్ఎస్ నాయకులలో ఒకరైన రమేశ్ పతంగే, వారి అధికారపత్రిక పాంచజన్యలో 2015 ఏప్రిల్ లోనే నేరుగా నన్ను లక్ష్యంగా చేసుకుని ఒక వ్యాసం రాశాడని నా మరాఠీ మిత్రులు చెప్పారు. ఆ వ్యాసంలో ఆయన నన్ను అరుంధతీ రాయ్, గెయిల్ ఆంవెడ్ట్ లతో కలిపి ‘మాయావి అంబేద్కర్ వాది’ అని ప్రస్తావించాడు. హిందూ పురాణాలలో మాయావి అంటే చంపవలసిన రాక్షసుడు. నేను సుప్రీంకోర్టు రక్షణలో ఉన్నప్పటికీ నన్ను చట్టవ్యతిరేకంగా పుణె పోలీసులు అరెస్టు చేసినప్పుడు హిందుత్వ సైబర్ ముఠా నా వికిమీడియా పేజిలో చొరబడి దాన్ని ధ్వంసం చేసింది. అది బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉండే పేజి. అది ఉందని కూడ ఎన్నో సంవత్సరాలు నాకు తెలియదు. ఈ మూక మొదట ఆ పేజిలో ఉండే సమాచారాన్నంతా తొలగించి “ఇతను ఒక మావోయిస్టుకు సోదరుడు…. ఇతని ఇంటిని పోలీసులు సోదాచేశారు… మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఇతణ్ని అరెస్టు చేశారు” వగైరా వాక్యాలు అక్కడ రాసిపెట్టారు. ఈ రాతలను తొలగించి అసలు పేజిని పునరుద్ధరించడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఆ మూక వెంటనే చొరబడి, అసలు పేజిని తొలగించి, ఈ నిందాపూర్వకమైన మాటలతో నింపారని నా విద్యార్థులు ఆ తర్వాత చెప్పారు. చివరికి వికీమీడియా యాజమాన్యం జోక్యంతో పేజిని స్థిరీకరించడం జరిగింది గాని ఇప్పటికీ వారు పెట్టిన వ్యతిరేక సమాచారం అలాగే ఉంది.

మరొకవైపు నక్సల్ వ్యవహారాల నిపుణులు అనబడే ఆర్ఎస్ఎస్ వారి ద్వారా అనేక అబద్ధాలను ప్రచారసాధనాలలో హోరెత్తించారు. ఆ ఛానళ్ల మీద నా ఫిర్యాదులకూ, చివరికి ఇండియా బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ కు చేసిన ఫిర్యాదులకూ ఎటువంటి జవాబూ లేదు. ఆ తర్వాత నాతో సహా, ఎంతో మంది ఫోన్లలో ప్రభుత్వమే ప్రమాదకరమైన స్పైవేర్ ను ప్రవేశపెట్టిందని పెగాసస్ కథనం 2019 అక్టోబర్ లో బైటపడింది. పత్రికలలో కొద్ది రోజులపాటు గగ్గోలు వినబడింది గాని అంత తీవ్రమైన విషయం కూడ అర్ధాంతరంగా ముగిసి పోయింది.

నేనొక మామూలు మనిషిని. తన భుక్తి తాను నిజాయితీగా సంపాదించుకునే మనిషిని. తన జ్ఞానంతో రచనల ద్వారా ప్రజలకు వీలైనంతవరకు సహాయం చేయాలనుకునే మనిషిని. కార్పొరేట్ ప్రపంచంలో, అధ్యాపకుడిగా, పౌరహక్కుల కార్యకర్తగా, ప్రజా మేధావిగా అనేక రకాలుగా ఈ దేశానికి దాదాపు ఐదు దశాబ్దాలుగా సేవ చేస్తున్న మచ్చలేని చరిత్ర ఉన్న వ్యక్తిని. ముప్పైకి పైగా పుస్తకాలు, అంతర్జాతీయంగా అచ్చయిన లెక్కలేనన్ని పత్రాలు, వ్యాసాలు, వ్యాఖ్యలు, శీర్షికలు, ఇంటర్వ్యూలు కలిసిన నా అపారమైన రచనలలో హింసనూ, ఏదైనా విధ్వంసక ఉద్యమాన్నీ సమర్థించే ఒక్క సూచనైనా దొరకదు. కాని నా జీవితపు చివరి రోజుల్లో నామీద భయానకమైన యుఎపిఎ చట్టం కింద ఘోరమైన నేరాలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వమూ, దానికి విధేయంగా ఉన్న ప్రచారసాధనాలూ చేసే ఉధృత ప్రచారాన్ని నా వంటి వ్యక్తి ఎదిరించడం సాధ్యం కాదు. ఈ కేసు వివరాలు ఇంటర్నెట్ మీద ఎక్కడైనా దొరుకుతాయి. అది ఒక గందరగోళపు, హింసాతత్వపు కల్పన అని ఎవరికైనా అర్థమవుతుంది. ఆ కేసు గురించి సంక్షిప్త వివరణ ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ వెబ్ సైట్ మీద ఉంది. దాని సారాంశం ఇక్కడ ఇస్తాను:

ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు వ్యక్తుల కంప్యూటర్లలో దొరికాయని పోలీసులు చెపుతున్న 13 ఉత్తరాల్లో ఐదు ఉత్తరాల ఆధారంగా నన్ను ఈ కేసులో ఇరికించారు. నా దగ్గర దొరికిన ఆధారమేదీ లేదు. ఆ ఉత్తరంలో “ఆనంద్” అనే పేరు ఉంది. భారతదేశంలో ఆ పేరు అతి సాధారణమైన పేరు. కాని పోలీసులు మాత్రం ఎటువంటి సందేహాలు లేకుండా అది నాదే అంటున్నారు. ఆ ఉత్తరాలను ఇప్పటికే ఎందరో నిపుణులు, చివరికి ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి కూడ కొట్టివేశారు. మొత్తం న్యాయవ్యవస్థలో ఇప్పటివరకూ సాక్ష్యాధారాల స్వభావం గురించి మాట్లాడిన ఏకైక న్యాయమూర్తి ఆయనే. సరే, ఆ ఉత్తరాల రూపమూ సారమూ ఎలా ఉన్నప్పటికీ, వాటిలో ఉన్న విషయాలేవీ కూడ అతి మామూలు నేరం అనబడేదానికి సుదూరంగా కూడ రావు. కాని ఒక వ్యక్తికి ఎటువంటి రక్షణ కల్పించని, నిస్సహాయుడిగా మార్చే యుఎపిఎ చట్టంలోని అతి భయంకరమైన నిబంధనల సహాయంతో నన్ను జైలు పాలు చేస్తున్నారు.

మీకు సులభంగా అర్థం అయ్యేందుకు ఈ కేసును వివరిస్తాను: హఠాత్తుగా ఒక పోలీసు బలగం మీ ఇంటి మీద పడుతుంది. ఎటువంటి వారంట్ చూపకుండానే మీ ఇంటిని చిందర వందర చేస్తారు. చివరికి మిమ్మల్ని అరెస్టు చేసి ఒక లాకప్ లో పడేస్తారు. తర్వాత, ఫలానా స్థలంలో ఒక దొంగతనం కేసునో, మరేదో ఫిర్యాదునో పరిశోధిస్తున్నప్పుడు పోలీసులకు ఫలానా వ్యక్తి దగ్గర ఒక పెన్ డ్రైవో, కంప్యూటరో దొరికిందనీ, దానిలో ఏదో ఒక నిషిద్ధ సంస్థకు చెందినవాడని భావించబడుతున్న ఫలానా వ్యక్తి రాసిన ఉత్తరాలు దొరికాయనీ, అందులో ఫలానా వ్యక్తి పేరు ఉందనీ, ఆ ఫలానా వ్యక్తి మీరేననీ పోలీసులు కోర్టుకు చెపుతారు. ఒక బ్రహ్మాండమైన కుట్రలో ఒకానొక భాగంగా మిమ్మల్ని చూపుతారు. హఠాత్తుగా మీ ప్రపంచమంతా తలకిందులైపోతుంది. మీ ఉద్యోగం పోతుంది. కుటుంబానికి నిలువనీడ పోతుంది. ప్రచారసాధనాలలో మీ మీద దుష్ప్రచారం సాగుతుంది. మీరు వాటికి జవాబు చెప్పుకునే అవకాశం కూడ ఉండదు. మీమీద ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయనీ, అందువల్ల మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించవలసి ఉన్నదనీ జడ్జిలను ఒప్పించడానికి పోలీసులు “సీల్డ్ కవర్లు” సమర్పిస్తారు. అసలు సాక్ష్యాధారాలే లేవనీ, ఉన్నవి కల్పితమైనవనీ మీరు వాదించినా జడ్జిలు ఆ మాట వినరు. అదంతా విచారణ సమయంలో చూడవచ్చునంటారు. కస్టడీలో ఇంటరాగేషన్ తర్వాత మిమ్మల్ని జైలుకు పంపుతారు. మీరు బెయిల్ కోరుతూ దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టుకుంటారు. కాని కోర్టులు వాటిని నిరాకరిస్తాయి. ఇటువంటి నిందితులకు బెయిల్ రావడానికో, కేసు కొట్టుడుబోయి బైటికి రావడానికో సగటున 4 నుంచి 10 సంవత్సరాలు పడుతుందని ఇప్పటికి ఉన్న సమాచారం. ఇది అక్షరాలా ఎవరి విషయంలోనైనా జరగగల వ్యవహారం.

అమాయకమైన వ్యక్తుల స్వేచ్ఛలను, రాజ్యాంగ హక్కులను ఈ రకంగా కొల్లగొట్టే భయానకమైన చట్టాలను ‘దేశం’ పేరు మీద రాజ్యాంగ బద్ధమైనవిగా తీసుకువస్తున్నారు. భిన్నాభిప్రాయాన్ని ధ్వంసం చేయడానికి, ప్రజలను చీల్చడానికి రాజకీయ వర్గం దేశం, దేశభక్తి అనే పదాలను దురహంకారపూరిత ఆయుధాలుగా వాడుకుంటున్నది. ఈ మూక మనస్తత్వం హేతుబద్ధ ఆలోచనను సంపూర్ణంగా రద్దు చేసింది. సాధారణ పదాల అర్థాలను తలకిందులుగా మార్చివేసింది. ఇప్పుడిక దేశాన్ని ధ్వంసం చేస్తున్నవాళ్లు దేశభక్తులుగా పిలవబడుతున్నారు. నిస్వార్థమైన ప్రజా సేవకులు దేశద్రోహులుగా పిలవబడుతున్నారు. నా భారతదేశం ఇలా విధ్వంసం పాలవుతుండగా చూస్తున్న నేను ఈ విచారకర సమయాన ఒక బలహీనమైన ఆశతో మీకీ ఉత్తరం రాస్తున్నాను. సరే, నేనిక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కస్టడీకి వెళుతున్నాను. ఎప్పటికి మళ్లీ మీతో మాట్లాడగలనో తెలియదు. కాని, మీ వంతు రాకముందే మీరు మాట్లాడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

  • ఆనంద్ తేల్తుంబ్డే

(Basith MA ఎఫ్‌బీవాల్ నుంచి)

RELATED ARTICLES

Latest Updates