లాటిన్‌ అమెరికాలో..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

చిలీలో నెలరోజులకుపైగా సాగిన ప్రజా ఉద్యమం సామాన్యుల సంక్షేమాన్ని కాంక్షించే కొత్త రాజ్యాంగాన్ని సాధిస్తున్న తరుణంలోనే, మరో లాటిన్‌ అమెరికా దేశమైన బొలీవియాలో మూలవాసుల నాయకుడు కార్లోస్‌ మొరేల్స్‌ అమెరికా దన్నుతో జరిగిన సైనిక కుట్రతో పదవీచ్యుతుడైనాడు. సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ, ప్రజాశ్రేయస్సుకు పెద్దపీటవేసే పెను సామాజిక రాజకీయ మార్పుకోసం చిలీ వాసులు పోరాడుతున్న దశలోనే, సంక్షేమాన్ని ఉపేక్షించి, అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు అగ్రప్రాధాన్యం ఇచ్చే సైనికపాలన బొలీవియాలో వచ్చింది.

సంక్షేమానికిస్థానంలేని రాజ్యాంగాన్ని తిరగరాయవలసిందేనని చిలీ ప్రజలు చేసిన పోరాటాలకు తలొగ్గి, ప్రభుత్వం ముందుగా ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధపడుతున్నది. ప్రస్తుత రాజ్యాంగం అమెరికా ఆశీస్సులతో దేశాన్ని ఏలిన సైనిక పాలకుడు పినోషె ముందుకాలం నాటిది. దేశ ప్రజలకు ఆరోగ్యం, విద్య ఇత్యాది బాధ్యతలు లేని ఈ రాజ్యాంగం స్థానంలో ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేసే కొత్త రాజ్యాంగం రావాలన్నది ప్రజల డిమాండ్‌. రాజ్యాంగాన్ని మార్చాలని మీరు కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నతో పాటు, కొత్త రాజ్యాంగ రచనా సంఘంలో ఎవరి ప్రాతినిథ్యం ఎంతమేరకు ఉండాలన్న రెండవ ప్రశ్నలో మూడు ప్రత్యామ్నాయాలను ఏప్రిల్‌లో జరగబోయే రెఫరెండమ్‌లో ప్రభుత్వం ప్రజల ముందు ఉంచబోతున్నది.

మెట్రో చార్జీల రేట్ల పెంపుతో కడుపుమండి, ‘మా ఉద్యమం ఈ ముప్పై పెసోలకోసం కాదు’ అని విస్పష్టంగా ప్రకటించి, ‘చిలీ మేలుకొంది’ అన్న నినాదంతో దేశరాజధాని సహా ప్రధాన నగరాలన్నింటిలో వేలాదిమంది సాగించిన మహోజ్వల పోరాట విజయం ఇది. సరళీకృత ఆర్థిక విధానాలతో సామాన్యులకు విద్య, వైద్యం దూరమై, వేతనాల్లో కోతలు, సంక్షేమ పథకాల్లో కత్తిరింపులు కొనసాగుతున్న కాలం గతించిపోవాలన్నది చిలీవాసుల కోరిక. సైనిక నియంత ఆగస్టో పినొషెను ముందుపెట్టి, ప్రజాస్వామ్యవాది ఎలెండీని అధికారంనుంచి దించివేసి, హత్యచేయించి అమెరికా తన ఆర్థిక విధానాలను రుద్దిన ఫలితంగా చిలీలో ప్రభుత్వరంగమూ, సంక్షేమమూ చావుదెబ్బతినిపోయి బహుళజాతి సంస్థలు మాత్రమే బాగుపడిన విషయం తెలిసిందే.

చిలీ ప్రజలు ఏ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారో వాటినే బొలివియాపై రుద్దేందుకు ఇప్పుడు అక్కడ సైనికకుట్ర జరిగింది. సన్నగిల్లిన సంక్షేమాన్ని తిరిగి బతికించుకొనేందుకు చిలీవాసులు ప్రయత్నిస్తుంటే, బొలీవియాలో అమలు జరుగుతున్న సంక్షేమాన్ని చిదిమేసేందుకు సైనికకుట్ర జరిగింది. చిలీ ఎలెండీ ఏ విధానాలను అమలు చేసినందుకు అమెరికా హత్యచేయించిందో, అవే కారణాలతో బొలివియా మొరేల్స్‌ను సైనికకుట్రతో అమెరికా అధికారంనుంచి దించేసింది. కార్మికోద్యమ నేతగా, మూలవాసుల నాయకుడిగా, ప్రజాసంక్షేమ సారథిగా దశాబ్దంన్నరపాటు దేశాన్ని ఏలిన మొరేల్స్‌ తన పాలనలో దేశాన్ని సామాజిక–ఆర్థికాభివృద్ధికి మంచి నమూనాగా తీర్చిదిద్దాడు. తన ముందు పాలకుడు ప్రైవేటుపరం చేసిన రవాణా, ఇంధనం ఇత్యాది రంగాలను జాతీయం చేశాడు.

గనులనూ, వనరులనూ ప్రభుత్వరంగంలోకి తెచ్చి, విద్యనూ వైద్యాన్నీ సార్వత్రికం చేశాడు. సహజవాయువును జాతీయం చేయగా సమకూరిన సొమ్మును దారిద్ర్యనిర్మూలనకు ఉపయోగించాడు. భూగోళంపై ఉన్న లీథియం నిల్వల్లో డెబ్బయ్‌శాతం బొలీవియాలో ఉన్నాయి. రానున్న విద్యుత్‌ బ్యాటరీల యుగంలో అత్యంత కీలకమైన ఈ వనరును కార్పొరేట్‌ కంపెనీలు తన్నుకుపోవడానికి ఆయన అనుమతించలేదు. ప్రభుత్వరంగ భాగస్వామ్యానికి పట్టుబడుతూ, పలు కంపెనీలను ఇప్పటికే దేశంనుంచి పంపేయడంతో అమెరికా కంపెనీలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఈ స్థితిలో ఎన్నికల్లో అన్యాయం జరిగిందన్న ఆరోపణతో మితవాదపక్షాలు, పోలీసు, మిలటరీ ఆయనపై దండెత్తాయి. ఆమెరికా ఆశీస్సులతో సాగిన ఈ సైనిక కుట్రను ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రతిఘటించడం, కార్మికులు, రైతులు, గిరిజనులు సాయుధబలగాలను ఎదిరించడం మొరెల్స్‌ ప్రజామద్దతుకు నిదర్శనం.

కాల్పులు, గృహదహనాలు, మూలవాసులపై అఘాయిత్యాలతో దేశాన్ని అగ్నిగుండంగా మార్చివేసి, చివరకు, ‘శాంతి, సుస్థిరతల స్థాపన’ సాధ్యపడాలంటే రాజీనామా చేయాల్సిందేనని సైనిక దళాల అధినేత ఒత్తిడి తేవడంతో మొరెల్స్‌ రాజీనామా చేసి మెక్సికోలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. ఈ సైనిక కుట్రని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రజాస్వామ్య చరిత్రలో మరుపురాని ఘట్టంగా అభివర్ణించి, భవిష్యత్తులో వెనెజువెలా, నికరాగ్వాల పని పడతానని హెచ్చరించాడు. చిలీ ప్రజల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యాన్నీ, సంక్షేమాన్నీ పరిరక్షించుకొనేందుకు బొలీవియన్లు పాటుపడతారని ఆశిద్దాం.

Courtesy AndhraJyothy…

RELATED ARTICLES

Latest Updates