ఆర్థిక సారథులు రైతులే!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
యోగేంద్ర యాదవ్
(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)

కరోనా సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠంగా ఉంచి ముందుకు తీసుకుపోగల శక్తిసామర్థ్యాలు వ్యవసాయరంగానికి వున్నాయి. వ్యవసాయదారులకు ధన్యవాదాలు తెలుపవలసిన సమయమిది.పంట దిగుబడులకు సరైన గిట్టుబాటు ధర లభించేలా చూడడమే ఆ కృతజ్ఞతా నివేదన కావాలి. ఆర్థిక వ్యవస్థ మరింత శీఘ్రంగా పురోగమించేందుకు అది ఇతోధికంగా దోహదం చేస్తుంది.

కరోనా విపత్తులో అన్నదాతలు ఎలా వున్నారు? ఉత్తర భారతావనిలోని పలు రాష్ట్రాలలో రైతుల నుంచి ఆహార ధాన్యాల సేకరణ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గంగానదీ పరివాహక గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తోన్న వార్తలు చెబుతున్న దేమిటి? కరోనా వైరస్ కట్టడికి అమలవుతోన్న లాక్‌డౌన్ వ్యూహం తప్పుల తడకగా ఉన్నదని! భారతదేశపు మహా సంపదను ఈ మహా సంక్షోభ వేళ, రానున్న చాలా కాలం దాకా మనకు ఒక మహానష్టంగా మార్చివేయనున్నదని ఆ వార్తలు విశదం చేస్తున్నాయి, కాదు, హెచ్చరిస్తున్నాయి.

కొవిడ్ -19 విలయం నుంచి భారతదేశానికి రక్షణ కల్పించేది వ్యవసాయ రంగమే. గ్రామీణ భారతాన్ని కరోనా మహమ్మారి అతితక్కువగా మాత్రమే ప్రభావితం చేసింది. ఆ భయంకర అంటు వ్యాధి సోకిన పల్లె భారతవాసుల సంఖ్య, పట్టణ, నగర ప్రాంతాలలో కంటే చాలా తక్కువగా వున్నది. గ్రామీణ ప్రాంతాలలో సామాజిక దూరానికి పెద్ద అవకాశమున్నది. అదే పట్టణాలు, నగరాలలో అయితే ఇంచుమించు సమాన ఆర్థిక స్థాయి గల వ్యక్తులు తరచు గుమిగూడడం కద్దు. కార్ఖానాలలో చేసే పనుల కంటే వ్యవసాయ కార్యకలాపాలకు మరింత ఎక్కువ ప్రదేశం అవసరం. వ్యవసాయ ‘మండీ’ (మార్కెట్లు) మరే ఇతర బజారు కంటే ఎక్కువ విశాలంగా వుంటాయి. లాక్‌డౌన్ అమల్లో వున్నప్పటికీ సాపేక్షంగా తక్కువ చిక్కులతో ముందుకు సాగగల, సాగుతోన్న రంగం వ్యవసాయం మాత్రమే. ఈ రంగమే కరోనా సంక్షోభ వేళ మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద పెన్నిధి. లాక్‌డౌన్ మార్గదర్శక సూత్రాలు స్పష్టంగా అనుమతించనప్పటికీ మన రైతులు రోజూ తమ పొలాలకు ఎలాగో వెళుతూ పంట కోతల పూర్వపు, పంట నూర్పిళ్ళ కార్యకలాపాలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది వ్యవసాయరంగం పరిస్థితి సజావుగా వున్నది. కరోనా కల్లోలంలో దేశాన్ని పలు విధాల ఆదుకోగల స్థితిలో సేద్యరంగం వున్నది. అదృష్టవశాత్తు కరోనా వైరస్, ఆహార భద్రతకు ఏ విధమైన లోటు లేని తరుణంలో మనపై విరుచుకుపడింది. భారత ఆహార సంస్థ గిడ్డంగులలో 870 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల నిల్వలు వున్నాయి. దేశంలో రేషన్ కార్డు గల ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 100 కిలోల బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేసేందుకు ఆ నిల్వలు సరిపోతాయి. ఉత్తర భారతావనిలో ప్రారంభమైన గోధుమల సేకరణ కార్యక్రమం ముగిసే నాటికి ఆ నిల్వలు 25 నుంచి 30 మిలియన్ మెట్రిక్ టన్నుల మేరకు అదనంగా అధికమవుతాయి. గత ఏడాది ఋతుపవనాల అనంతరం వర్షాలు బాగా కురిసినకారణంగా ఈ రబీ సీజన్‌లో పంటలు పుష్కలంగా పండాయి. గాదెలు సమృద్ధంగా నిండాయి. మన గోధుమ నిల్వలు పుష్కలంగా పెరగడంతోపాటు చానా (శనగలు), ఆవాలు, మసూర్ పప్పు మొదలైన పప్పు ధాన్యాల దిగుబడులు కూడా సమృద్ధంగా అందుబాటులో వున్నాయి. అలాగే కూరగాయలు, పాడి ఉత్పత్తులకు కూడా కొదవ లేదు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది ఋతుపవనాలు సాధారణంగా వుంటాయని వాతావరణ శాస్త్ర వేత్తలు అంచనావేస్తున్నారు. వ్యవసాయ రంగంలో అన్నీ సానుకూల పరిస్థితులు ఉన్నందున అంతర్జాతీయ వాణిజ్యానికి ఏ మాత్రం అవకాశం లేకపోయినప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ పలు నెలల పాటు సాఫీగా, నిమ్మళంగా ముందుకు సాగగలుగుతుందనడంలో సందేహం లేదు.

ఆహార సార్వభౌమత్వ విలువను గుర్తించవలసిన సందర్భమిది. రైతులకు కృతజ్ఞత తెలుపవలసిన సమయమిది. ఈ కృతజ్ఞతా నివేదనకు మీరు రైతుల పంట దిగుబడులకు సరైన గిట్టు బాటు ధరలు లభించేలా హామీ పడితే చాలు. అది, ఆర్థిక వ్యవస్థ మరింత శీఘ్రంగా పురోగమించేందుకు దోహదం చేసే ఆర్థిక చర్య అవుతుంది. ఎలా? రైతులు తమకు లభించిన ఆదాయాన్ని ఆదా చేసుకోవడం కంటే ఖర్చు చేసేందుకే ప్రాధాన్యమిస్తారు. సగటు పట్టణ వినియోగదారుతో పోల్చితే రైతులు తమ ఆర్జనను ఎక్కువగా వ్యయపరుస్తారు. మరి రైతులు ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఎక్కువ దోహదం చేస్తారన్న సత్యాన్ని మన విధాన నిర్ణేతలు గుర్తించారా? దురదృష్టవశాత్తూ ఇంతవరకూ లేదు. దేశ ఆర్థిక రథాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో రైతులకు సహాయపడడానికి బదులు, లాక్‌డౌన్ కాలంలో రైతులకు అనవసర, ఆలోచనారహిత అవరోధాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సృష్టించింది. ఇదొక నిష్ఠుర సత్యం. గ్రామీణ భారతం దేశ ఆర్థిక వ్యవస్థ సత్వర పురోభివృద్ధికి పెద్ద ప్రతిబంధకమన్న పాత ఆలోచనలకు మన పాలకులు ఇంకా స్వస్తి చెప్పనే లేదు నిష్కర్షగా చెప్పాలంటే, మరే ఇతర ప్రభుత్వానికి కంటే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యవసాయరంగమూ, వ్యవసాయదారులూ గౌణ ప్రాధాన్యాలే. మిగతా రంగాల గురించి ఆలోచించిన తరువాతనే ఈ రంగం గురించి ప్రస్తుత పాలకులు ఆలోచిస్తుంటారు.

మార్చి 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో రైతుల గురించిన ప్రస్తావనేలేదు. అలాగే పంట కోతలు, నూర్పిళ్ళు ప్రారంభమైన తరుణంలో లాక్‌డౌన్ అమలుపరుస్తున్న వాస్తవాన్ని ఆయన పేర్కొనలేదు (ఏప్రిల్ 14 ప్రసంగంలో మాత్రం ఆయన ఈ రెండో విషయాన్ని పేర్కొన్నారు) మొదట జారీ చేసిన మార్గదర్శక సూత్రాలలో ఈ అత్యవసర వ్యవసాయక కార్యకలాపాలకు ఎటువంటి మినహాయింపులనివ్వలేదు. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు మినహాయింపునిచ్చారు గానీ వ్యవసాయ మార్కెట్లకు ఎలాంటి మినహాయింపునివ్వలేదు. మార్చి 27న, ఆ తరువాత జారీ చేసిన సవరించిన మార్గదర్శక సూత్రాలలో ఈ తప్పులను సరిదిద్దుకోవడం జరిగింది. అయితే అప్పటికే జరగాల్సిన తప్పు జరిగిపోయింది. శీఘ్రగతిన చెడిపోయే ఉత్పత్తుల (కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్లు, పాలు మొదలైనవి) సరఫరాలను అకస్మాత్తుగా నిలిపివేయడంతో రైతులకు భారీ నష్టమే కాదు, తీరని నష్టమూ జరిగింది. చికెన్లను కరోనా వైరస్ వ్యాప్తితో ముడిపెట్టిన నకిలీ వార్తల కారణంగా కోళ్ళ పెంపకందార్లు అప్పటికే సంక్షోభంలో కూరుకుపోయివున్నారు. లాక్‌డౌన్‌తో వారి పరిస్థితి మరింత విషమించింది. వ్యవసాయక ఉత్పత్తుల రవాణాపై ఆంక్షలను నిలిపివేశారు-, కాగితాలపైనే సుమా! క్షేత్రస్థాయిలో అవి యథాతథంగా అమల్లో వున్నాయి. కూరగాయల, ఆహార మండీల మూసివేత కొనసాగుతూనే వున్నది. ఫలితంగా రైతులు ద్రాక్ష పండ్లను రోడ్లపై పార వేస్తున్న, క్యాబేజీ పంటను పెకిళించివేస్తున్న, పాలను కాలువల్లో పారబోస్తున్న దృశ్యాలు మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి.

రైతుల కష్టాల కథ ఇంకా వున్నది. క్రిమిసంహారక మందుల, ఎరువుల దుకాణాలను మూసివేయడంతో కోతల, నూర్పిళ్ళ పూర్వపు కార్యకలాపాలకు అవసరమైన సరఫరాలు రైతులకు కొరవడ్డాయి. అంతర్ -రాష్ట్ర రవాణాపై నిషేధంతో హార్వెస్టర్లు ఎక్కడివి అక్కడే వుండిపోవలసివచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి హర్యానా, పంజాబ్‌కు రావలసిన హార్వెస్టర్లు రాలేకపోయాయి. దీంతో వ్యవసాయ కూలీల మీద మరింతగా ఆధారపడవలసిన పరిస్థితిఏర్పడింది. అయితే లాక్‌డౌన్‌ పుణ్యమా అని వ్యవసాయ కూలీలను తీసుకు రాలేని పరిస్థితులు! అయినప్పటికీ రైతులు పంట కోతలు, నూర్పిళ్ళను అష్టకష్టాలు పడి పూర్తిచేయగలిగారు. ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకున్నారు. వాటిని లాభసాటిగా విక్రయించుకోవడం ఎక్కడ? మార్కెటింగ్ సమస్యలు వారిని చుట్టు ముట్టాయి. గోధుమల సేకరణను తొలుత ఏప్రిల్ 14 తరువాతి వరకు జాప్యం చేశారు. పిదప ఏప్రిల్ 20 అనంతరానికి ఆలస్యం చేశారు. చాలా మంది రైతులు ఈ జాగును భరించలేకపోయారు. అయినకాడికి తమ ధాన్యాన్ని స్థానిక వర్తకులకు అమ్ముకున్నారు శనగలు, ఆవాలు, చివరకు గోధుమలను కూడా కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముకున్నారు. హర్యానా, పంజాబ్‌లలో గోధుమల సేకరణ అధికారికంగా ప్రారంభమయిన సమయంలోనే హర్యానాలో వర్తకుల సమ్మె జరిగింది. ఆ తరువాత పంజాబ్‌లో వడగళ్ల వానలతో రైతులు బాగా నష్టపోయారు. గోధుమల సంగతి ఇలా వుంటే ఇతర పంటల దిగుబడుల కొనుగోలుకైనా ప్రభుత్వానికి సరైన ప్రణాళికలు వున్నాయా? అనుమానాస్పదమే. మరి రైతుల బాగు ఎలా సాధ్యమవుతుంది?

ఆశలు నిరాశలు కావడం భారతీయ రైతులకు ఇదే మొదటిసారి కాదు. రైతుల కడగండ్ల గురించి విధాన నిర్ణేతలు ఏ మాత్రం ఆలోచించకచపోవడమూ ఇదే మొదటి సారి కాదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక సహాయ పథకం ఇతర వర్గాలకు ఎంతో కొంత ఇచ్చింది గానీ రైతులను పూర్తిగా దగా చేసింది. ఏప్రిల్‌లో ఇవ్వవలసిన కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడతను రైతులకు సహాయ చర్యగా ఆర్థిక మంత్రి రీ-ప్యాకేజ్ చేశారు! గోధుమల సేకరణలో జరిగిన ఆలస్యానికి సంబంధించి హర్యానా ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం చెల్లించేందుకు కేంద్రం ఇంతవరకు అనుమతించలేదు. రైతులకు తోడ్పడేందుకు ఇప్పటికీ సమయం మించిపోలేదు. లాక్‌డౌన్ కాలంలో నానా ఇక్కట్లకు గురవుతున్న ప్రజలను ఆదుకొనేందుకు మరో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని మోదీ ప్రభుత్వం ఎలాగూ యోచిస్తోంది కదా. మరి ఈ క్రింద సూచించిన చర్యలను చేపట్టడం ద్వారా ప్రభుత్వం రైతులకు గొప్ప ఉపశమనం కలిగించగలదని భావిస్తున్నాను.

(1) లాక్‌డౌన్ మూలంగా నష్టపోయిన కూరగాయల, పండ్ల రైతులు, పాల ఉత్పత్తిదారులు, కోళ్ళ పెంపకం దారులకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి నష్ట పరిహారం చెల్లించాలి. ప్రస్తుత నష్ట పరిహారం రేట్లను తప్పనిసరిగా సవరించాలి. (2) సరైన గిట్టుబాటు ధర లభించిక బాగా నష్టపోయిన రైతులు ‘భావాంతార్’ (ధరలోటు చెల్లింపు)కు అర్హులుగా పరిగణించాలి. స్వేచ్ఛా విపణిలో కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించిన ఇతర వ్యవసాయక ఉత్పత్తుల విషయంలో కూడా ఈ లబ్ధిని సమకూర్చాలి. (3) ఆహార ధాన్యాల సేకరణ గడువును ఈ ఏడాది విధిగా పొడిగించాలి. ముఖ్యంగా పంజాబ్, హర్యానా వెలుపలి రాష్ట్రాలలో గోధుమేతర పంటల విషయంలో ఈ ప్రయోజనాన్ని సమకూర్చాలి. లాక్‌డౌన్ సంబంధిత నష్టాలకు గాను మోదీ ప్రభుత్వం రైతులకు ప్రస్తుతమిస్తున్న కనీస మద్దతు ధరపై బోనస్‌ను సమకూర్చాలి. (4) గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదయిన లబ్ధిదారులందరికీ, లాక్‌డౌన్ మూలంగా కోల్పోయిన ఉపాధికి గాను, రెండు వారాల వేతనాన్ని నష్టపరిహారంగా చెల్లించాలి. ఈ చర్యలను తక్షణమే చేపట్టకపోతే దేశ ఆర్థిక పురోగతికి ఇతోధిక మేలు చేయగల వ్యవసాయరంగ శక్తి సామర్థ్యాలు పూర్తిగా వ్యర్థమైపోతాయి. జాతి ఆర్థికరథం పురోగమనానికి సేద్యరంగం పెద్ద అవరోధమవుతుంది. కోట్లాది వ్యవసాయ కూలీలు తమ గ్రామాలకు తిరిగి వెళ్ళుతున్నారు. వారి వద్ద ఆదా చేసుకున్న సొమ్ము ఏమీ ఉండదని మరి చెప్పనవసరం లేదు. ఈ వేసవి నెలల్లో వారికి ఉపాధి ఎక్కడ లభిస్తుంది? వారు మరింతగా ఆహార అభద్రతకు లోనవుతారు. కరోనా వైరస్‌తో వాటిల్లిన విపత్తుకంటే మరింత మహా సంక్షోభానికి ఆ దుస్తర పరిస్థితులు దారితీయవూ?

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates