కమిటీ చెప్పినచోటే రాజధాని!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
స్టార్టప్‌ ఏరియా నుంచి తప్పుకొంటామని సింగపూర్‌ కన్సార్షియం స్వీయ ప్రతిపాదన!
అమరావతిలో ఇప్పటిదాకా చేపట్టిన ప్రతి నిర్మాణం నిబంధనలకు విరుద్ధమే అని పీటర్‌ కమిటీ ‘నిర్ధారణ’?

‘రాజధాని ఎక్కడ ఉండాలో’ సిఫారసు చేసేందుకు నియమించిన కమిటీ తొలి భేటీ! అన్నింటికీ మించి… కమిటీ ఎక్కడ చెబితే అక్కడే రాజధాని ఉంటుందంటూ సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన!వెరసి… నవ్యాంధ్ర రాజధాని కథ మళ్లీ మొదటికొచ్చినట్లేనా? కొత్త కమిటీ సిఫారసు చేస్తే తప్ప రాజధానిగా ‘అమరావతి’ కొనసాగే అవకాశాలు దాదాపుగా లేనట్లేనా!

  • ఆరు వారాల్లో నివేదిక ఇస్తుంది.. దేశంలోనే మేటి రాజధాని నిర్మిస్తాం
  • 33 వేల ఎకరాలకే బాబు గొప్పలు.. ప్రజలు లక్ష ఎకరాలైనా ఇస్తారు!
  • అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువ.. పునాదులకు వంద అడుగులు తవ్వాలి
  • తండ్రీ కొడుకుల గగ్గోలు ఎందుకు?.. ‘బినామీ’ భూములు పోతాయనేనా?
  • మంత్రి బొత్స మండిపాటు.. పవన్‌కు అవగాహన లేదని వ్యాఖ్య

విశాఖపట్నం: ‘‘అది అమరావతి కావచ్చు! హైమావతి కావొచ్చు… ఇంకేదైనా వతి కావచ్చు! రాష్ట్ర రాజధాని ఏపీ ప్రజలందరి రాజధానిగా, 13 జిల్లాల ప్రజల ఆశలు తీర్చేలా ఉండాలి. దేశంలోనే మేటి రాజధానిని నిర్మిస్తాం’’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఎక్కడ అనుకూలమని సిఫారసు చేస్తే అక్కడే రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీ సభ్యులు రాష్ట్రమంతా పర్యటించి, ప్రజల అభిప్రాయాలను సేకరించి… పని ప్రారంభించిన ఆరు వారాల్లో నివేదికను అందిస్తారని ప్రకటించారు. బుధవారం ఆయన విశాఖలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు పక్కనపెట్టారు. నారాయణ కమిటీ వేసి మరీ అమరావతిని ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా భవనం కట్టాలంటే పునాదికి ఐదు నుంచి పది అడుగుల లోతు తవ్వితే సరిపోతుంది. అమరావతిలో మాత్రం వంద అడుగులు తవ్వాలి’’ అని బొత్స పేర్కొన్నారు. రాజధాని ఏర్పాటుకు 33 వేల ఎకరాలు సమీకరించామంటూ చంద్రబాబు గొప్పగా చెబుతున్నారని… లక్ష ఎకరాలు ఇచ్చేందుకు కూడా ప్రజలు ముందుకువస్తారని వ్యాఖ్యానించారు. భూము లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రయోజనాలు ఒక్కటే కారణం కాదని, తమ తర్వాతి తరాలకు లబ్ధి చేకూరుతుందనే వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఉంటాయని చెప్పారు.

బాబులో పరివర్తన లేదు..
తనకు పేరు వస్తుందనే అమరావతిని పక్కన పెట్టారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ఆయనలో ఇంకా పరివర్తన రాలేదనిపిస్తోందని విమర్శించారు. ‘‘ఐదేళ్లపాటు పరిపాలించిన చంద్రబాబు రూ.1.65 లక్షల కోట్లు అప్పు చేశారు. అధికారం నుంచి దిగేసరికి రూ.50 వేల కోట్ల బిల్లుల బకాయిలు వదిలేశారు. ఇంత ఖర్చు పెట్టిన చంద్రబాబు అమరావతిలో శాశ్వత భవనం ఒక్కటైనా ఎందుకు కట్టలేదు? రాజధానికి రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ అని చెప్పి కేవలం ఐదు వేల కోట్లే ఖర్చు పెట్టి మిగతా డబ్బును ఏం చేశారు?’’ అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే… చంద్రబాబు ఐదేళ్లపాలన వల్ల ఏపీకి జరిగిన నష్టమే పూడ్చలేనిదన్నారు.
ఎందుకు గగ్గోలు…
‘మీరు కట్టిన రాజధాని నగరాన్ని లేదా గ్రాఫిక్‌ సీడీని ఎవరైనా ఎత్తుకెళ్లిపోయారా? రూ.రెండు లక్షల కోట్ల ఆదాయం సృష్టించానంటున్నావ్‌. ఏదీ…అదెక్కడుంది? ఎందుకు ఈ గగ్గోలు’’ అని చంద్రబాబుపై బొత్స మండిపడ్డారు. తండ్రీకొడుకుల ఆక్రోశం చూస్తుంటే వియ్యంకుడికి, తోడల్లుడికి, బంధువులకు ఇచ్చిన భూములన్నీ పోతాయనే బాధ కనిపిస్తోందన్నారు. రాజధాని ఏర్పాటుపై తమ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఉందని… తండ్రీ కొడుకులకే లేదని విమర్శించారు. ‘‘మీకు ఏం క్లారిటీ కావాలి? అమరావతి మీదా? లేకపోతే మీ బంధువులు, సామాజికవర్గం పొందిన భూములు ఉంటాయా, ఉండవా? అనే దానిపైనా?’’ అని ప్రశ్నించారు. ‘‘మీ విధానాలను ప్రజలు తిరస్కరించారు, వాటిని మేము పాటించాలంటారేమిటి? మీ పాలన మాయ, మోసం, దగాలతో సాగితే… జగన్‌ పాలన జనరంజకంగా సాగుతోంది. అన్ని హామీలను నెరవేర్చుతూ, ఒక పద్ధతిలో వెళుతుంటే దాన్ని భరించలేక పోలీసుల మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు’’ అని విమర్శించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదు కాబట్టి కోడికత్తి కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారని, ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసును ఎందుకు సీబీఐకి అప్పగించలేదని విలేకరులు ప్రశ్నించగా… రాష్ట్ర పోలీసులు సమర్థులే అని, చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టే సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశామని బొత్స బదులిచ్చారు. సీబీఐ కేసులున్న వ్యక్తి సీఎం కావడంతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టుపెడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా… ‘‘ఆయనకు అవగాహన లేదు. కేంద్రం వద్ద ఏ ప్రయోజనాలను తాకట్టుపెట్టారో చెప్పాలి’’ అని సవాల్‌ విసిరారు.
జీఎన్‌ రావు కమిటీ తొలి భేటీ
రాజధాని ఎంపికతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులను సమీక్షించి, తగు ప్రణాళికల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జీఎన్‌ రావు (రిటైర్డ్‌ ఐఏఎస్‌) కమిటీ మొట్టమొదటిసారి బుధవారం భేటీ అయ్యింది. ఈ కమిటీ పని ప్రారంభించిన ఆరు వారాల్లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అమరావతితోపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరిపిన అనంతరం… అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందేందుకు ఉపకరించే సలహాలు, సూచనలను కమిటీ అందజేయనుంది.
Courtesy Andhra jyothy

RELATED ARTICLES

Latest Updates